లైవ్, ఆత్మగౌరవ భావన ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది – ప్రధాని మోదీ

‘‘ఇది విజయానికి ప్రతీక అయిన పండుగ. గెలుపును వేడుకగా జరుపుకునే సందర్భం. శత్రువు ఎంత శక్తిమంతుడైనా సరే.. మనం సత్యం,మానవత్వంవైపు నిలబడితే చివరికి విజయం సాధిస్తామనే ధైర్యాన్ని ఈ పండుగ ఇస్తుంది’’ అని ప్రధాని అన్నారు.

సారాంశం

  • ఆత్మగౌరవ భావన ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. దిల్లీ ఐపీ ఎక్స్‌టెన్షన్‌లోని డీడీఏ గ్రౌండ్‌లో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు.
  • దేశంలో పాలన మార్పు ఉండదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు.
  • ఆస్ట్రేలియా ఎంపీ హెలెన్ హెయిన్స్‌ను కారు ఢీకొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ప్రకటించారు.

లైవ్ కవరేజీ

  1. ఆత్మగౌరవ భావన ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది – ప్రధాని మోదీ

    ప్రధాని మోదీ, దసరా, సంస్కృతి
    ఫొటో క్యాప్షన్, దిల్లీలో రావణ దహనం కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

    దిల్లీ ఐపీ ఎక్స్‌టెన్షన్‌లోని డీడీఏ గ్రౌండ్‌లో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

    ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశ ప్రజల్లో ఆత్మగౌరవ భావన ఉండాలని ప్రధాని మోదీ అన్నారు.

    ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో దేశ వారసత్వ సంపద కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

    వారసత్వాన్ని, గుర్తింపును పరిరక్షించుకోవడానికి భారత్ ప్రస్తుతం అంకితభావంతో పనిచేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు.

    "శతాబ్దాలుగా మన వారసత్వ సంపదను దోచుకుని విదేశాలకు తరలించారు. కానీ ఇప్పుడు వాటిని తిరిగి మనదేశానికి తీసుకొస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.

    12 ఏళ్లలో 650కి పైగా పురాతన విగ్రహాలను భారత్‌కు తిరిగి తీసుకొచ్చినట్టు ప్రధాని తెలిపారు.

    "భారత్‌లోని సాంస్కృతిక కేంద్రాలకు ప్రపంచవ్యాప్తంగా కొత్త గుర్తింపు తీసుకొస్తున్నాం. గత కొన్నేళ్లలో దేశంలోని అనేక ప్రదేశాలకు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు లభించింది’’ అని ఆయన అన్నారు.

    గతేడాది దీపావళికి కూడా యునెస్కో మానవాళి అమూర్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు లభించిందని చెప్పారు.

    "ఇది కోట్లాది మంది భారతీయుల సమష్టి సంకల్పానికి ఫలితం" అని మోదీ అభివర్ణించారు. ఇదే నిబద్ధతతో దేశం భవిష్యత్తులోనూ ముందుకు సాగాలని అన్నారు.

    ‘‘ఇది విజయానికి ప్రతీక అయిన పండుగ. గెలుపును వేడుకగా జరుపుకునే సందర్భం’’ అని మోదీ పేర్కొన్నారు.

    శత్రువు ఎంత శక్తిమంతుడైనా సరే.. మనం సత్యం,మానవత్వంవైపు నిలబడితే చివరికి విజయం సాధిస్తామనే ధైర్యాన్ని ఈ పండుగ ఇస్తుందని అన్నారు.

    విజయదశమి అందించే ఈ సందేశం ఎప్పటినుంచో భారత మౌలిక భావనల్లో అంతర్భాగంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు.

  2. ఉచిత ప్రచారానికి ధన్యవాదాలు: అభిజిత్ దీప్కే

    కాక్రోచ్ జనతాపార్టీ, దసరా, రావణ దహనం
    ఫొటో క్యాప్షన్, పీతాంపురలో రావణుడు, కుంభకర్ణుడుతో పాటు కాక్రోచ్ దిష్టిబొమ్మ

    రావణునితో పాటు కాక్రోచ్ దిష్టిబొమ్మను దహనం చేస్తామనడంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే స్పందించారు.

    దిల్లీ పీతంపురాలోని నేతాజీ సుభాష్ ప్యాలెస్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కాక్రోచ్ దిష్టిబొమ్మ ఫోటోను అభిజిత్ దీప్కే ‘ఎక్స్’లో షేర్ చేశారు. "ఉచిత ప్రచారానికి ధన్యవాదాలు" అని రాశారు.

    రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుని దిష్టిబొమ్మలతో పాటు30 అడుగుల ఎత్తైన కాక్రోచ్ దిష్టిబొమ్మను కూడా శ్రీ కృష్ణ రామలీలా కమిటీ దహనం చేయబోతోంది.

    "ఈ దేశంలో ఏదైనా సరే... నాటకాలు ఆడించండి చాలు" అని అభిజిత్ దీప్కే వ్యాఖ్యానించారు.

    "దసరా సందర్భంగా కాక్రోచ్ దిష్టిబొమ్మను దహనం చేయడం చూస్తుంటే అధికారంలో ఉన్న పార్టీ ఎంత భయపడుతోందో అర్ధమవుతోంది. మీరు మాకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. మమ్మల్ని మీకు పోటీగా చూస్తున్నారంటే మేం మీపై ఇంత ప్రభావం చూపిస్తున్నామని తెలుసుకోవడం బాగుంది’’ అని దీప్కే తరఫున స్పందించిన రత్నాసింగ్ అన్నారు.

    తాము సరైనదారిలోనే వెళ్తున్నామని దీనివల్ల అర్ధమవుతోందన్నారు.

  3. పంజాబ్‌లో కుటుంబాన్ని తుపాకీతో కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్న పోలీస్

    పంజాబ్, మాన్సా
    ఫొటో క్యాప్షన్, పంజాబ్‌లో కుటుంబాన్ని తుపాకీతో కాల్చి తాను ఆత్మహత్య చేసుకున్న పోలీస్

    పంజాబ్‌లోని మాన్సాలో పోలీసు కానిస్టేబుల్ కుటుంబంపై కాల్పులు జరిపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

    ఈ కాల్పుల్లో ఒక కుమారుడు చనిపోగా, భార్య, మరో కుమారుడు గాయపడినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

    గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

    ఈ ఘటన ఉదయం 7గంటల ప్రాంతంలో జరిగిందని మాన్సా ఎస్ఎస్సీ చెప్పారు.

    కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు ఆయన పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత మరిన్ని వివరాలు తెలిస్తాయని వెల్లడించారు.

    సర్వీస్ తుపాకీతోనే కాల్పులు జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు.

    మన్సా డిప్యూటీ కమిషనర్ వద్ద సెక్యూరిటీ గార్డుగా ఆయన పని చేస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.

    (ఆత్మహత్య అనేది ఒక తీవ్రమైన మానసిక, సామాజిక సమస్య. మీరు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లయితే, భారత ప్రభుత్వానికి చెందిన 'జీవన్ ఆస్థా' (Jeevan Aastha) హెల్ప్‌లైన్ నంబర్ 18002333330 ద్వారా సహాయం పొందవచ్చు. అలాగే, మీ స్నేహితులు, బంధువులతో కూడా మాట్లాడండి.)

  4. ఫ్రాన్స్‌లోని పరిస్థితికి వలసదారులే కారణమని ట్రంప్ ఆరోపణ

    ఫ్రాన్స్, డోనల్డ్ ట్రంప్, అమెరికా, పారిస్, యూరప్,
    ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్‌లోని పరిస్థితికి వలసదారులే కారణమని ట్రంప్ ఆరోపించారు

    ఫ్రాన్స్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణలకు వలసదారులు, జిహాదీలు, కమ్యూనిస్టులే కారణమని ట్రంప్ ఆరోపించారు.

    కాన్సాస్‌లోని విచిటాలో జరిగిన ఒక ప్రచార సభలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న ఘర్షణల గురించి ప్రస్తావించారు. రాబోయే మధ్యంతర ఎన్నికల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. అమెరికాలో అలాంటి పరిస్థితులు రాకుండా నివారించాలని మద్దతుదారులకు సూచించారు.

    ఐరోపా వామపక్ష నాయకులు "పాశ్చాత్య విలువలను దెబ్బతీసే" వలస విధానాలను అనుసరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఐరోపాలో జరిగిన తప్పులు జరగొద్దని అన్నారు.

    "పశ్చిమ దేశాలతో ఏమాత్రం సంబంధం లేని మూడో ప్రపంచ దేశాల వలసదారులను ప్రపంచ వామపక్షం ఐరోపాకు తీసుకువస్తోంది. వారు ఫ్రాన్స్‌లోని ప్రతి విషయాన్నీ ద్వేషిస్తారు. వారు ఆ దేశాన్ని నాశనం చేస్తున్నారు. మన దేశానికి అలా జరగనివ్వం," అని ట్రంప్ అన్నారు.

    విలేకరులతో మాట్లాడుతూ, దేశ సరిహద్దులను మూసివేయడం గురించి తాను ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఇప్పటికే హెచ్చరించినట్లు ట్రంప్ చెప్పారు.

    "ఫ్రాన్స్‌లో జరుగుతున్నది పాఠశాలల వల్లనో లేదా మరే ఇతర కారణం వల్లనో కాదు. అది వలసల వల్లే," అని ట్రంప్ అన్నారు.

  5. దేశంలో పాలనా మార్పు ఉండదు : ఆర్ఎస్ఎస్ చీఫ్

    దసరా, విజయదశమి, ఆర్ఎస్ఎస్, మోహన్ భగవత్
    ఫొటో క్యాప్షన్, విజయదశమి ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భగవత్ ఏమన్నారు?

    దేశంలో పాలన మార్పు ఉండదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు.

    ఫ్రాన్స్, అల్బేనియా, బంగ్లాదేశ్‌లోని అశాంతిని ప్రస్తావిస్తూ, సమస్యలకు పరిష్కారం కనుగొనడమే ఉద్యమాల లక్ష్యంగా ఉండాలని అన్నారు.

    “పాశ్చాత్యంలో పుట్టిన ఈ తుపాను అన్నిరకాల వ్యవస్థలను వ్యతిరేకిస్తోంది” అని ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు.

    భారత్ వైవిధ్యాన్ని, ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న పరపతిని ఆయన ప్రశంసించారు.

    "భారత్, హిందువులు, ఆర్ఎస్ఎస్‌పై ప్రజల నమ్మకం పెరుగుతోంది" అని అన్నారు.

    సంఘ్ స్థాపించి 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా విజయదశమి వేళ మాట్లాడుతూ "మనం విడిపోయి బలహీనపడ్డాం. అందుకే బానిసత్వంలో మగ్గాల్సి వచ్చింది. ఎందరో మహానుభావుల కృషితో స్వాతంత్య్రం సాధించాం. మన మధ్య ఉన్న అనుబంధాలను మరోసారి గుర్తించాలి" అని అన్నారు.

    “మన దేశంలో ప్రకృతి, మతాలు, కులాలు, ఆహారపు అలవాట్లు ఇలా ఎన్నో విషయాల్లో వైవిధ్యం ఉంది. వీటన్నింటినీ అంగీకరించి, గౌరవించే ఆలోచనా విధానం మనకు అవసరం. మన సనాతన సంప్రదాయం కూడా ఇదే చెబుతోంది” అన్నారు.

  6. పారిస్‌ సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ

    ఫ్రాన్స్, పారిస్,
    ఫొటో క్యాప్షన్, అల్లర్లు చెలరేగిన పారిస్‌ సహా పలు ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధింపు

    ఫ్రాన్స్‌లో అల్లర్లు చెలరేగిన పారిస్‌తోపాటు పలు ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూను విధించారు.

    దేశవ్యాప్తంగా శని, ఆదివారాల్లో జరిగిన అల్లర్లు, దోపిడీల కారణంగా ఫ్రాన్స్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. పారిస్‌లోని కొన్ని ప్రాంతాలతోపాటు ఇతర నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.

    వారాంతంలో నిరసనకారులు గుమిగూడిన ప్లేస్ డి లా రిపబ్లిక్, లెస్ హాల్స్ షాపింగ్ ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పారిస్ పోలీసులు తెలిపారు.

    ప్రజలు అనధికారిక సమావేశాలపై నిషేధం విధించారు. దక్షిణాన ఉన్న మార్సెయిల్, బోర్డో, నైస్, లియోన్ నగరాలతోపాటు ఉత్తరాన ఉన్న లిల్లే, ఇతర పట్టణాల్లో యువత కదలికలు, సమావేశాలపై ఆంక్షలు విధిస్తూ పాక్షిక కర్ఫ్యూలను ప్రకటించారు.

  7. ఆస్ట్రేలియా: ఎంపీని కారుతో గుద్ది హత్యాయత్నం

    ఆస్ట్రేలియా, ఎంపీ హెలెన్ హెయిన్స్‌, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి, ఆంథోనీ అల్బనీస్
    ఫొటో క్యాప్షన్, కారుతో ఢీకొట్టి ఆస్ట్రేలియా ఎంపీపై హత్యాయత్నం

    ఆస్ట్రేలియా ఎంపీ హెలెన్ హెయిన్స్‌ను కారు ఢీకొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్ట్రేలియా ప్రధాని ప్రకటించారు.

    విక్టోరియాలోని వాంగరట్టాలో తన కార్యాలయం బయట పార్కింగ్‌లో ఉండగా, సోమవారం మధ్యాహ్నం కారు ఢీకొనడంతో హెలెన్ హెయిన్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందని ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. అయితే దాడి వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం స్పష్టంగా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

    హెయిన్స్‌ను ఢీకొట్టడానికి కారు డ్రైవర్ యూ టర్న్ తీసుకు వచ్చినట్టు కనిపిస్తోందని అల్బనీస్ అన్నారు. కారు నడుపుతున్న 43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

    హెలెన్ హెయిన్స్ ఆగ్నేయ ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో గల ఇండి డివిజన్‌కు చెందిన 65 ఏళ్ల స్వతంత్ర ఎంపీ.

    ఆమె 2019లో తొలిసారిగా ఆస్ట్రేలియన్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నికయ్యారు. 2022, 2025లలో తిరిగి ఎన్నికయ్యారు.

    రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు ఆమె నర్సుగా, ప్రజారోగ్య పరిశోధకురాలిగా పనిచేశారు.

  8. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.