మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

లైవ్, తీవ్ర తుపానుగా మారిన అర్నబ్.. విశాఖకు 300 కి.మీ. దూరంలో కేంద్రీకృతం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

సారాంశం

  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నబ్' తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
  • ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
  • కోస్తా తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.
  • ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుపాను సహాయ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 జిల్లాలకు రూ.27 కోట్ల నిధులు విడుదల చేసింది.
  • బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు.
  • శ్రీకాకుళం, మార్కాపురం, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి, పోలవరం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీసత్యసాయి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేశారు.

లైవ్ కవరేజీ

  1. సెర్బియా: విద్యార్థుల ఉద్యమానికి తలవంచిన అధ్యక్షుడు వుచిచ్.. ఓటమిని అంగీకరిస్తున్నానంటూ ప్రకటన

    సెర్బియాలో సుదీర్ఘ కాలంగా పదవిలో ఉన్న అధ్యక్షుడు అలెక్సాండర్ వుచిచ్ ఎన్నికల్లో తన ఓటమినిఅంగీకరించారు.

    కొద్దికాలంగా సాగుతున్న విద్యార్థుల ఉద్యమానికి ఆయన తలవంచారు.

    ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాజధాని బెల్‌గ్రేడ్, నోవి సాడ్ సహా పలు నగరాల్లో ప్రజలు భారీగా వీధుల్లోకి వచ్చి విజయోత్సవాలు చేసుకున్నారు.

    అవినీతి, పరిపాలన నిర్లక్ష్యానికి నిరసనగా రెండేళ్ల క్రితం ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం ఈ ఎన్నికల్లో వివిధ వర్గాలకు చెందిన అభ్యర్థులతో బరిలోకి దిగి సంచలన విజయం నమోదు చేసింది.

    ఈఎన్నికల్లో ఓడిపోయామని స్పష్టంగా తెలుస్తోందని రైట్ వింగ్ నాయకుడు వుచిచ్ తన ఓటమిని అంగీకరించారు.

    97 శాతం పోలింగ్ కేంద్రాల ఓట్ల లెక్కింపు పూర్తికాగా.. విద్యార్థులకు 22 లక్షల 50 వేల ఓట్లు లభించాయని, అధికార పార్టీకి 16 లక్షల 70 వేల ఓట్లు వచ్చినట్టు సెర్బియా ఎన్నికల కమిషన్ తెలిపింది.

    ప్రాథమిక ఫలితాల ప్రకారం విద్యార్థుల నేతృత్వంలోని నిరసన ఉద్యమం 52.7 శాతం ఓట్లు సాధించగా, వుచిచ్‌కు చెందిన సెర్బియన్ ప్రోగ్రెసివ్ పార్టీ 39.2 శాతం ఓట్లు మాత్రమే సాధించింది.

    వుచిచ్ ఇప్పటికే రెండు సార్లు అధ్యక్షుడిగా పని చేశారు. రాజ్యాంగ పరిమితుల కారణంగా మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు వీలు లేకపోవడంతో 2017లో విడిచిపెట్టిన ప్రధానమంత్రి పదవిని తిరిగి దక్కించుకోవాలన్న లక్ష్యంతో తన పార్టీకి నాయకత్వం వహించారు.

  2. తీవ్ర తుపానుగా మారిన అర్నబ్.. విశాఖకు 300 కి.మీ. దూరంలో కేంద్రీకృతం

    పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

    అర్నబ్ తుపాను గంటకు 25 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

    మంగళవారం వేకువజామున విడుదల చేసిన బులెటిన్‌లో.. విశాఖకు 300 కి.మీ., కాకినాడకు 360 కి.మీ., మచిలీపట్నానికి 460, బాపట్లకు 530 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపారు.

    సాయంత్రం వరకు పశ్చిమ-వాయువ్య దిశగా కొనసాగి, ఆ తర్వాత వాయువ్య దిశగా పయనమవుతుందని బులెటిన్‌లో వెల్లడించారు.

    బుధవారం ఉదయం బాపట్ల -విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు.

    అర్నబ్ తుపాను ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని జైన్ తెలిపారు. అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు ఉంటాయని కూడా అంచనా వేశారు. కోస్తా తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు.

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    అర్నబ్ తుపాను కదలికలపై భారత వాతావరణ శాఖ కూడా వేకువజామున 3 గంటలకు ఒక బులెటిన్ విడుదల చేసింది.

    ఈ తుపాను మరింత బలపడి అత్యంత తీవ్రమైన తుపానుగా మారిందని పేర్కొంది. ఈ తుపాను తీరం దాటేటప్పుడు గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా వెల్లడించింది.

    ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతం, ఒడిశాలోని దక్షిణ తీర ప్రాంతంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.

  3. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి