పుతిన్‌తో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ సమావేశం

ఫొటో సోర్స్, IRNA
రష్యాలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసిన అనంతరం, ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మేజర్ జనరల్ మొహ్సెన్ రెజాయీ మీడియాతో మాట్లాడారు.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సందేశాన్ని అందించడానికి ఆయన మాస్కో వెళ్లారు.
బీబీసీ పర్షియన్ కథనం ప్రకారం.. సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియేల ఉన్నత సైనికాధికారులు టెహ్రాన్‌లో నిర్వహించిన నాలుగు దేశాల సమావేశాన్ని రష్యా అధ్యక్షుడు స్వాగతించారని రెజాయీ విలేకరులతో అన్నారు.
ఈ ప్రాంతంలో యుద్ధాన్ని ముగించడానికి చేసే ఏ ప్రయత్నానికైనా క్రెమ్లిన్ సిద్ధంగా ఉందని అధ్యక్షుడు పుతిన్ చెప్పినట్లు రెజాయీ కూడా తెలిపారు.
గురువారం పుతిన్‌తో సమావేశమైన అనంతరం, తమ ఏడు షరతులు నెరవేరేంత వరకు అమెరికాతో ఎలాంటి కొత్త చర్చలు జరపబోమని, హార్ముజ్ జలసంధిని తెరవబోమని రెజాయీ పునరుద్ఘాటించారు.
"పుతిన్‌తో జరిగిన సమావేశంలో, ఇరాన్ తన గ్యాస్ కొరతను అధిగమించి, రష్యా గ్యాస్‌ను పొరుగు దేశాలకు విక్రయించుకునేందుకు వీలుగా, రష్యా నుండి ఇరాన్‌కు గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం గురించి చర్చించాం" అని రెజాయీ చెప్పారు.



