మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

లైవ్ , ఏపీ నుంచి బయల్దేరే విమానాలపై మురసు ప్రభావం- గన్నవరంలో పది సర్వీసులు రద్దు

పశ్చిమ మధ్యబంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ప్రభావం విమాన సర్వీసులపై పడింది. గన్నవరం, భోగాపురం, రాజమండ్రి, తిరుపతి విమానాశ్రయాల నుంచి బయల్దేరే సర్వీసులపై తుపాను ప్రభావం ఉంటుందని ఇండింగోసంస్థ ప్రకటించింది.

సారాంశం

  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను తీవ్ర తుపానుగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.
  • మురసు ప్రభావంతో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
  • ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
  • నెల్లూరు-న‌రసాపురం మ‌ధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటవచ్చని అధికారులు చెబుతున్నారు.
  • కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు (నవంబరు 2) హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన 'మహా పాదయాత్ర' కార్యక్రమంలో పాల్గొంటారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మీడియాకుచెప్పారు.
  • అమిత్ షా.. మధ్యాహ్నం ఒంటి గంటకు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 4 గంటలకు బషీర్‌బాగ్‌లోని డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్దకు చేరుకుని.. ఎంజె మార్కెట్ పాదయాత్ర నిర్వహిస్తారు. అనంతరం అక్కడ జరిగే పబ్లిక్ మీటింగ్‌లో అమిత్ షా మాట్లాడతారని బీజేపీ తెలంగాణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. నెల్లూరు: సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారులను రక్షించిన అధికారులు

    నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం జువ్వలదిన్నె సమీప సముద్రంలో చేపల వేటకు వెళ్లి బోటు ఇంజన్ చెడిపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నారు ఏడుగురు మత్స్యకారులు.

    వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.

    మత్స్యశాఖ అధికారులు, మెరైన్ పోలీసులు, స్థానిక మత్స్యకారులు సమన్వయంతో రక్షణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

    ‘వీళ్లంతా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లారు. నెల్లూరు సముద్ర తీరానికి చేరుకునేసరికి వాతావరణ మార్పులు గమనించి తిరిగి వచ్చేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారి బోటు ఇంజన్ పాడైపోయింది. దీంతో హార్బర్ మౌత్ పాయింట్‌కు సుమారు అర కిలోమీటరు దూరంలోనే ఉండేపోవాల్సి వచ్చింది.

    వారిని గుర్తించిన సర్వైలెన్స్ సిబ్బంది విషయాన్ని సంబంధిత అధికారులకు చేరవేసి రక్షణ చర్యలు ప్రారంభించారు. అలల ఎగసిపడుతుండటంతో తొలుత బోటు వద్దకు చేరుకోవడం కష్టతరంగా మారింది. లంగరు తెగిపోవడంతో ఆ బోటు పాతకడపాలెం గ్రామం వైపు కొట్టుకుపోయింది. ఆ బోటును అధికారులు అనుసరిస్తూ రక్షణ చర్యలు కొనసాగించారు. చివరకు బోటును పాతకడపాలెం తీరానికి సురక్షితంగా చేర్చి అందులో ఉన్న ఏడుగురిని బయటకు తీసుకొచ్చారు’ అని కలెక్టర్ చెప్పారు.

  2. నెల్లూరులో కనిపిస్తున్న మురసు తుపాను ప్రభావం- ఎగసిపడుతున్న అలలు, బలంగా వీస్తున్న గాలులు

    పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ప్రభావం నెల్లూరు జిల్లాపై కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను ఏఎన్ఐరిపోర్ట్ చేసింది.

    తుపాను కారణంగా నెల్లూరులో బలమైన గాలులు వీస్తున్నాయని తెలిపింది సముద్ర కూడా పోటుమీద ఉందని, అలలు భారీగా ఎగసిపడుతున్నట్టు పేర్కొంది.

    నెల్లూరు- నర్సాపురం మధ్యే అర్థరాత్రి తీరం దాటుతుందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. అందుకే ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తన్నారు.

  3. రాప్తాడు బాలిక హెల్త్ అప్‌డేట్: సాయంత్రానికి వెంటిలేటర్ సపోర్టు తొలగించి చికిత్స అందిస్తారు - నారా లోకేశ్ ప్రకటన

    బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాలిక కోలుకుంటున్నట్టు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.

    రాప్తాడులో రంపం దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్యంపై సోషల్ మీడియా వేదికగా ఆయన వివరాలు వెల్లడించారు.

    “మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై శుభవార్త: ఆమె చికిత్సలో స్థిరమైన పురోగతిని ఉందని వైద్యుల బృందం గమనించింది. చిన్నారి స్పృహలో ఉంది, ఆమె తల్లి కూడా పరామర్శించారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో, ఈ సాయంత్రం వెంటిలేటర్ సపోర్టు తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. ఆమె పూర్తిగా కోలుకోవాలని ప్రార్థిస్తూనే ఉంటాము” అని లోకేశ్ పోస్టు పెట్టారు.

    మరోవైపు బాలికను కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని గురించి కూడా లోకేశ్ ట్వీట్ చేశారు. “ఒక వ్యక్తి చైన్‌సాతో వారి పాఠశాలలోకి ప్రవేశించినప్పుడు, లక్ష్మి పారిపోలేదు. ఆమె ముందుకు అడుగు వేసి తన స్నేహితురాలిని కాపాడటానికి ప్రయత్నించింది, ఆ క్రమంలో తీవ్రంగా గాయపడింది. ఆమె తనను తాను కాపాడుకోగలిగేది, కానీ తన స్నేహితురాలికి అండగా నిలబడాలని నిర్ణయించుకుంది.

    ఈ రోజు ఇద్దరు బాలికలు ఆసుపత్రిలో ఉన్నారు. లక్ష్మి తన గాయాలకు చికిత్స పొందుతోంది. ఆమె చర్యలు స్నేహం, ధైర్యం నిజమైన అర్థం ఏంటో మనకు గుర్తు చేస్తాయి. మా ప్రభుత్వం రెండు కుటుంబాలకు అండగా నిలుస్తుంది. వారికి సాధ్యమైనంత ఉత్తమమైన వైద్య సంరక్షణ అందేలా చూస్తాము. ఆంధ్రప్రదేశ్‌లో ఏ బిడ్డ కూడా తరగతి గదిలో అభద్రతకు గురికాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.

  4. రష్యా, యుక్రెయిన్ దేశాల అత్యవసర హెచ్చరిక వ్యవస్థపై సైబర్ దాడి

    హ్యాకర్లు రెండు దేశాల పౌరులకు రేడియేషన్ ప్రమాదాలు, అణు దాడుల గురించి నకిలీ హెచ్చరికలు పంపి, కాసేపు భయాందోళనలు సృష్టించారు.

    హెచ్చరిక యాప్‌పై భారీ స్థాయిలో సైబర్ దాడి జరిగిందని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ దాడి వల్ల హ్యాకర్లు తప్పుడు సమాచారం పంపడానికి అవకాశం ఏర్పడి ఉండవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

    అయితే, ప్రస్తుతానికి ప్రజా హెచ్చరిక వ్యవస్థ సాధారణ స్థితికి వచ్చినట్టు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

    అదే సమయంలో, యుక్రెయిన్ వైమానిక దాడి హెచ్చరిక యాప్‌పై కూడా సైబర్ దాడి జరిగినట్లు ఆరోపణలు రావడంతో, దాని నుంచి నకిలీ హెచ్చరికలు పంపినట్లు వెలుగులోకి వచ్చింది.

    ఈ సైబర్ దాడికి రష్యానే కారణమని యుక్రెయిన్ వ్యూహాత్మక సమాచార కేంద్రం ఆరోపించింది.

    ఈ సంస్థ, యుక్రెయిన్ వైమానిక దాడి యాప్‌లో కనిపిస్తున్న కొన్ని హెచ్చరికల చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసింది.

  5. ఉత్తరప్రదేశ్‌లో వ్యాన్, ట్రైలర్ ట్రక్కు ఢీ- ఆరుగురు మృతి

    ఉత్తర ప్రదేశ్‌లోని కుషినగర్‌లోని థారువా దీహ్ ప్రాంతం సమీపంలో ఆదివారం రాత్రి ఓమ్ని వ్యాన్, ట్రైలర్ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు.

    ఇద్దరు గాయపడగా, వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

    అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిద్ధార్థ్ వర్మ మాట్లాడుతూ, "ప్రమాదం జరిగిన సమయంలో ఓమ్ని వ్యాన్‌లో మొత్తం 8 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, గాయపడిన ఇద్దరిని చికిత్స ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదానికి గల కారణాలను కూడా తెలుసుకుంటాం" అని తెలిపారు.

    కుషినగర్‌లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేయాలని ఆదేశించారని పీటీఐవార్తా సంస్థ పేర్కొంది.

    అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవాలని, సహాయక, రెస్క్యూ కార్యకలాపాలను వేగవంతం చేయాలని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయం అందించాలని ఆయన ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

  6. ఏపీ నుంచి బయల్దేరే విమానాలపై మురసు ప్రభావం- గన్నవరంలో పది సర్వీసులు రద్దు

    పశ్చిమ మధ్యబంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ప్రభావం విమాన సర్వీసులపై పడింది. గన్నవరం, భోగాపురం, రాజమండ్రి, తిరుపతి విమానాశ్రయాల నుంచి బయల్దేరే సర్వీసులపై తుపాను ప్రభావం ఉంటుందని ఇండింగోసంస్థ ప్రకటించింది.

    తుపాను కారణంగా గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరాల్సిన పది సర్వీస్‌లు రద్దు చేసినట్టు విజయవాడ విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు.

    విమానాశ్రయ అధికారులు చెప్పినట్టు ఏఎన్ఐ వార్తాసంస్థ కూడా ఒక పోస్టు సోషల్ మీడియాలో పెట్టింది. మురసు ప్రభావంతో గన్నవరం నుంచి బయల్దేరాల్సిన సర్వీస్‌లను రద్దు చేసినట్టు తెలిపింది.

    విమానాశ్రయానికి చేరుకోక ముందే ప్రయాణికులు తమ విమానాల స్టేటస్ తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

    తుపాను ముప్పు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విమానయాన సంస్థ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది విమానాశ్రయ అధికారులు వెల్లడించినట్టు వివరించింది.

    ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలో విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడిందని ఇండిగో సంస్థప్రకటించింది.

    టేకాఫ్, ల్యాండింగ్‌కు ఎక్కువ సమయం తీసుకోవచ్చని, కొన్ని రద్దు కూడా కావచ్చని వెల్లడించింది. దీని వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలగవచ్చని తెలిపింది.

  7. మురసు: ‘22 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుపాను’

    పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మురసు గురించి ఆంధ్రప్రదేశ్ విపత్తుల కేంద్రం, ఆర్టీజీఎస్ మరో అప్‌డేట్ ఇచ్చాయి. పది గంటలకు విడుదలైన బులెటిన్‌లో ఒంగోలుకు 210 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైనట్టు పేర్కొన్నారు.

    పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా మారిన మురసు గ‌డ‌చిన 6 గంట‌ల్లో గంట‌కు 22 కిలోమీటర్ల వేగంతో క‌దులుతున్నట్టు తెలిపాయి.

    ఇవాళ అర్ధరాత్రి - తెల్లవారుజాము సమయంలో నెల్లూరు-న‌రసాపురం మ‌ధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం ఉందని వివరించారు.

    తుపాను గమనాన్ని ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    ప్రస్తుతం ఈ తుపాను నెల్లూరుకు 160 కిలోమీటర్లు, చెన్నైకి 180 కి.మీ, కావలికు 180 కి.మీ., ఒంగోలుకు 210 కిలోమీటర్ల దూరంలో, మ‌చిలీప‌ట్నానికి 240 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ ‘బీబీసీ’తో చెప్పారు.

  8. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వానలు పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ

    హైదరాబాద్‌కు సంబంధించిన వాతావరణ పరిస్థితులపై అధికారులు తాజాగా బులెటిన్ విడుల చేశారు. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు.

    హైదరాబాద్‌లో ఇవాళంతా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

    హైదరాబాద్‌లో గరిష్టంగా 33 డిగ్రీల ష్ణోగ్రత నమోదు అయితే కనిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుందని కూడా చెప్పింది.

  9. కడప, జమ్మలమడుగు, పులివెందుల మున్సిపాలిటీల్లో 8 కేంద్రాల్లో రీపోలింగ్

    ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో పలు ప్రాంతల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కడప జిల్లాలో 8 కేంద్రాల్లో రీపోలింగ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ నిర్వహిస్తోంది.

    ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కడప జిల్లాలోని కడప నగరపాలక సంస్థ, జమ్మలమడుగు, పులివెందుల మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 8 పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ (సోమవారం (నవంబర్ 2) రీపోలింగ్ జరుగుతున్నట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీధర్ చెరుకూరి తెలిపారు.

    కడప నగరపాలక సంస్థలోని 15వ వార్డు పరిధిలో పోలింగ్ కేంద్రం నంబర్ 15/2లో, జమ్మలమడుగు మున్సిపాలిటీలోని 3వ, 17వ, 29వ వార్డులకు చెందిన 3/2, 17/1, 29/1 పోలింగ్ కేంద్రాల్లో, పులివెందుల మున్సిపాలిటీలోని 1, 3, 7, 8వ వార్డులకు చెందిన 1/1, 3/1, 7/1, 8/1 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేపట్టారు.

  10. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర నేడు, అమరేంద్ర యార్లగడ్డ, బీబీసీ ప్రతినిధి

    కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు (నవంబరు 2) హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘మహా పాదయాత్ర’ కార్యక్రమంలో పాల్గొంటారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మీడియాకుచెప్పారు.

    ‘సర్’ ప్రక్రియపై కాంగ్రెస్ సహా పలు విపక్షాలు ఆందోళనలు చేస్తున్న వేళ బీజేపీ ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని పారదోలండి’’ నినాదంతో పాదయాత్ర చేస్తున్నారు.

    మొదట అమిత్ షా.. మధ్యాహ్నం ఒంటి గంటకు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 4 గంటలకు బషీర్‌బాగ్‌లోని డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్దకు చేరుకుని.. ఎంజె మార్కెట్ వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. అనంతరం అక్కడ జరిగే పబ్లిక్ మీటింగ్‌లో అమిత్ షా మాట్లాడతారని బీజేపీ తెలంగాణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

    మరోవైపు అమిత్ షా పర్యటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.

    ‘‘తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు, తెలంగాణ అమరవీరుల విషయంలో అమిత్ షా గతంలో అవమానకరంగా మాట్లాడారు. హైదరాబాద్ రావడానికి ముందుగానే తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణలు చెప్పాలి. క్షమాపణలు చెప్పాక హైదరాబాద్ కు రావాలి.’’ అని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్అన్నారు.

  11. ఆంధ్రప్రదేశ్‌కు మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, మురసు తుపాను కోసం ముందస్తు చర్యలు

    తీవ్ర మురసు తుపాను ఈ అర్థరాత్రికి తీరం దాటనుందని ఐఎండీ అంచనా వేసింది.

    ముందస్తు చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎస్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్‌లను అధికారులు మోహరిస్తున్నారు.

    ఇందులో భాగంగానే మూడు ఎన్డీఆర్ఎస్ టీమ్‌లు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రానున్నాయి.

    తమిళనాడులోని రాణిపేట్ జిల్లా, అరక్కోణం సమీపంలో ఉన్న నగరికుప్పం నుంచి ఈ బృందాలు బయల్దేరాయి.

    మురసు తుపాను ఈ అర్థరాత్రి ఒంగోలుకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

  12. మురసు తుపాను: తమిళనాడు సీఎం విజయ్‌కు ఫోన్ చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

    మురసు తుపాను ముంచుకొస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

    సన్నద్ధతలో భాగంగా విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణకు తమిళనాడు ప్రభుత్వ సహాయం కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు.

    మురసు తుపాను వల్ల పెద్ద ఎత్తున విద్యుత్ పోల్స్ దెబ్బ తింటాయని, పునరుద్ధరణకు సిబ్బందిని, యంత్రాలను పంపాలని కోరారు.

    దీనికి తమిళనాడు సీఎం దీనికి సానుకూలంగా స్పందించారని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’లో పేర్కొంది.

    ఇటీవలే విధ్వంసం సృష్టించిన అర్నబ్ తుపాను సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ సహాయం తీసుకుంది.

    విద్యుత్ పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం సిబ్బందిని, సామగ్రిని పంపించింది. ఇప్పుడు తమిళనాడు సహాయం తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.

  13. మురసు: ‘గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం’

    బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను సోమవారం అర్ధరాత్రి తరువాత ఒంగోలు వద్ద తీరం దాటనుందని ఐఎండీ పేర్కొంది.

    "పశ్చిమ-మధ్య, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను, గత 6 గంటలుగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా పయనిస్తూ, తీవ్ర తుపానుగా బలపడింది’ అని భారత వాతావరణ శాఖ తన ఎక్స్‌ ఖాతాలోపేర్కొంది.

    ‘నవంబర్ 2, 2026న తెల్లవారుజామున 2.30 గంటల సమయానికి, ఇది 13.6° ఉత్తర అక్షాంశం, 82.5° తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది చెన్నైకి (తమిళనాడు) తూర్పు-ఈశాన్యంగా సుమారు 260 కి.మీ, నెల్లూరుకు (ఆంధ్రప్రదేశ్) తూర్పు-ఆగ్నేయంగా 290 కి.మీ, మచిలీపట్నానికి (ఆంధ్రప్రదేశ్) దక్షిణ-ఆగ్నేయంగా 320 కి.మీ, కావలికి (ఆంధ్రప్రదేశ్) తూర్పు-ఆగ్నేయంగా 310 కి.మీ, ఒంగోలుకు (ఆంధ్రప్రదేశ్) ఆగ్నేయంగా 330 కి.మీ. విశాఖపట్నానికి (ఆంధ్రప్రదేశ్) దక్షిణంగా 470 కి.మీ దూరంలో ఉంది’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

    ఇది మరింతగా వాయువ్య దిశగా పయనించి, నవంబర్ 2 అర్ధరాత్రి (11.30 గంటలకు) నుంచి నవంబర్ 3 తెల్లవారుజామున (4గంటల) మధ్య, నెల్లూరు, నర్సాపురం మధ్య ముఖ్యంగా ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.

    ఈ సమయంలో గాలి వేగం గంటకు 100 నుంచి 110 కి.మీ వరకు ఉండి, గరిష్ఠంగా 120 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

  14. తీవ్ర తుపానుగా మారిన మురసు... కోస్తా, రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచన

    పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను తీవ్ర తుపానుగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది.

    మురసు ప్రభావంతో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.

    ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.

    మురసు ప్ర‌స్తుతం చెన్నైకి 260 కి.మీ, నెల్లూరుకు 290 కి.మీ, మ‌చిలీప‌ట్నానికి 320 కి.మీ, కావలికి 310 కి.మీ, ఒంగోలుకు 330 కి.మీ, విశాఖ‌ప‌ట్నానికి 470 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

    ఈ తుపాను నవంబర్ 3న తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

    నెల్లూరు-న‌రసాపురం మ‌ధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటవచ్చని అధికారులు చెబుతున్నారు.

  15. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి