మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

లైవ్ , మురసు: ఒంగోలు సమీపంలో తీరం దాటిన తీవ్ర తుపాను

తీవ్ర తుపానుగా మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ వైపు దూసుకొచ్చిన మురసు తుపాను మంగళవారం తెల్లవారుజామున తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, నర్సాపురం మధ్య ఒంగోలు సమీపంలో ఈ తీవ్ర తుపాను తీరం దాటింది.

సారాంశం

  • మురసు తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
  • తుపాను తీరం దాటిన సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని తెలిపింది.
  • ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది.
  • మురసు తుపాను కారణంగా ప్రకాశం, బాపట్లలో కౌంటింగ్ ఆలస్యమైంది.
  • ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌంటింగ్.. 11:30 గంటలకు వాయిదా
  • భారీ వర్షాలు, ఈదురుగాలులతో రాకపోకలకు అంతరాయం
  • కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు కేంద్రాలకు చేరుకోవడంలో ఇబ్బందులు
  • ఉదయం 10:30 గంటలకు పరిస్థితిని సమీక్షించనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం
  • వర్షాలు తగ్గకపోతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఎస్‌ఈసీ ప్రకటన
  • ఈ మార్పు ప్రకాశం, బాపట్ల జిల్లాలకే పరిమితం
  • మిగతా జిల్లాల్లో ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభం
  • భద్రతా జాగ్రత్తలతో కౌంటింగ్ నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు
  • విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మల్కాపురం, శ్రీహరిపురం పారిశ్రామిక ప్రాంతాల పరిసరాల్లో ఈ ఘటనతో ఆందోళన నెలకొంది.
  • హెచ్‌పీసీఎల్‌ వర్గాల ప్రాథమిక సమాచారం ప్రకారం... ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదు.
  • దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో మురాసు తుపాను తీరం దాటింది. ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం బీచ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండగా, అత్యంత వేగవంతమైన గాలులు వీస్తున్నాయి.
  • ప్రకాశం జిల్లా నాగులుప్పాడులో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం మధ్య అత్యధికంగా 198 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.\

లైవ్ కవరేజీ

  1. ఒంగోలులో భీకర గాలులు, వర్షం

    దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో మురసు తుపాను తీరం దాటింది. ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం బీచ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండగా, అత్యంత వేగవంతమైన గాలులు వీస్తున్నాయి. తుపాను తీరం దాటుతున్న తరుణంలో తీర ప్రాంతమంతటా బలమైన గాలులు వీస్తున్నాయి.

    సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు

    నాగులుప్పలపాడు(ప్రకాశం)లో 198.01 మి.మీ

    కొత్తపట్నం(ప్రకాశం)లో 182.25 మి.మీ

    బాపట్ల(ప్రకాశం)లో 128.53 మి.మీ

    చీరాల(ప్రకాశం)లో 124.10 మి.మీ

    త్రోవగుంట(ప్రకాశం)లో 116.93 మి.మీ

    ఒంగోలు అర్బన్(ప్రకాశం) 106.97 మి.మీ

    చిలకపాడు(ప్రకాశం)లో 104.50 మి.మీ

    సంతనూతలపాడు (ప్రకాశం)98.7మి.మీ

    మొగల్తూరు(పశ్చిమగోదావరి)లో 96 మి.మీ

    మలికిపురం(కోనసీమ) 93.7 మి.మీ వర్షపాతం నమోదు అయినట్టు ప్రఖర్ జైన్ తెలిపారు.

  2. పులివెందుల పోలింగ్‌పై వైసీపీ వేసిన పిటిషన్ కొట్టివేత- కౌంటింగ్‌కు లైన్ క్లియర్

    పులివెందుల మున్సిపాలిటీలో రీపోలింగ్ కోసం వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేయడంతో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది.

    పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ హైకోర్టులో పిటిషన్ వేసింది.

    మున్సిపాలిటీలో రీపోలింగ్ నిర్వహించాలని అభ్యర్థించింది. దీన్ని విచారించిన హైకోర్టు నిర్ణయాన్ని ఇవాళ్టికి వాయిదా వేసింది.

    ఉదయం 7.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును వెల్లడించింది. వైసీపీ నేతలు ప్రమీలమ్మ, వైఎస్ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్లు కొట్టివేసింది.

    పులివెందుల మున్సిపాలిటీ కౌంటింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

  3. మురసు తుపాను ప్రభావంతో ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కౌంటింగ్ ఆలస్యం, గరికిపాటి ఉమాకాంత్, బీబీసీ కోసం

    మురసు తుపాను ప్రభావం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పై కనిపించింది. రెండు జిల్లాల్లో లెక్కింపు ఆలస్యం కానుందని అధికారులు ప్రకటించారు.

    ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయం మార్పులు చేశారు.

    ఈ రెండు జిల్లాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌంటింగ్ 11.30 గంటలకు వాయిదా వేసినట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. మిగిలిన జిల్లాల్లో కౌంటింగ్ యథావిధిగా సాగుతుందన్నారు.

    భారీ వర్షాలు, ఈదురుగాలులతో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

    కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు కేంద్రాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రహించిన ఎన్నికల అధికారులు అందుకు తగట్టుగా చర్యలు తీసుకున్నారు.

    అందుకే ఉదయం 10.30 గంటలకు మరోసారి పరిస్థితి సమీక్షించనుంది. వర్షాలు తగ్గకపోతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.

    ఈ నిర్ణయం కేవలం ప్రకాశం, బాపట్ల జిల్లాలకే పరిమితమని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. మిగతా జిల్లాల్లో ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమైందని కూడా వెల్లడించింది. పటిష్టమైన భద్రత మధ్య కౌంటింగ్ నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశించింది.

  4. ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, గరికిపాటి ఉమాకాంత్, బీబీసీ కోసం

    ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలట్లు లెక్కిస్తున్నారు.

    ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభించనున్నారు.

    జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల్లో యథావిధిగా లెక్కింపు ప్రారంభించామన్నారు.

    మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పై తుపాను ప్రభావం ఉంది.

    విజయవాడలో రాత్రి నుంచి ఎడతెరపి లేని వర్షం కారణంగా కొన్నిచోట్ల కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బంది పూర్తిగా చేరుకోలేదని అధికారులు చెప్పారు. కొందరికి ఆర్డర్‌ కాపీలు కూడా అందడంలోనూ ఆలస్యమైందని చెబుతున్నారు.

  5. ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను

    తీవ్ర తుపాను మురసు బంగాళాఖాతంలో ఉత్తర-వాయవ్య దిశగా పయనించి ఒంగోలు సమీపంలో తీరం దాటింది.

    మంగళవారం ఉదయం 3.30 నుంచి 5.30 గంటల మధ్య నెల్లూరు- నర్సాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటిందని ఐఎండీ ప్రకటించింది.

    ఈ సమయంలో గాలి వేగం గంటకు 100–110 కిలోమీటర్లుగా ఉందని, గాలి తీవ్రత ఒక్కసారిగా పెరిగినప్పుడు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిందని వెల్లడించింది.

  6. విశాఖ హెచ్‌పీసీఎల్‌లో అగ్ని ప్రమాదం, భారీ ఎత్తున ఎగసిన మంటలు, లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం

    విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మల్కాపురం, శ్రీహరిపురం పారిశ్రామిక ప్రాంతాల పరిసరాల్లో ఈ ఘటనతో ఆందోళన నెలకొంది.

    రిఫైనరీలో రఫ్ పిచ్ ఆయిల్‌ (తారు) నిల్వ ఉన్న ట్యాంకు సమీపంలో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడటంతో పక్కనే ఉన్న రహదారులపై ప్రయాణిస్తున్నవారు వాటిని గమనించారు. పలువురు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.

    దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు. కొందరు మంటలు వ్యాప్తిని చూసి ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. హెచ్పీసీఎల్ గాజువాక నడిబొడ్డున ఉంటుంది. దీని చుట్టూ వేలాది నివాసాలు ఉంటాయి.

    ప్రమాదానికి కారణాలపై ఆరా

    హెచ్‌పీసీఎల్‌ వర్గాల ప్రాథమిక సమాచారం ప్రకారం... ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    ఆయిల్‌ ట్యాంకు పేలిపోయిందంటూ పారిశ్రామిక ప్రాంతంలో వదంతులు వ్యాపించాయి.

    ఇందులో వాస్తవం లేదని చెప్పారు.

    ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు పరిశీలన చేపట్టారు.

    రఫ్ పిచ్ ఆయిల్ అంటే ఏమిటి?

    రఫ్ పిచ్ ఆయిల్ అనేది బిటుమెన్‌ (తారు) తయారీలో ఉపయోగించే మధ్యంతర ఉత్పత్తి.

    తారు ముడి చమురు శుద్ధి ప్రక్రియలో లభించే లేదా సహజంగా లభించే నల్లటి, చిక్కటి, జిగటగా ఉండే హైడ్రోకార్బన్‌ పదార్థం.

    దీనిని వేడి చేసినప్పుడు మెత్తబడి, ప్రవహించే స్వభావం పెరుగుతుంది. అలాగే మండేటప్పుడు వెలువడే ఆవిరి, ఉష్ణోగ్రతను బట్టి అగ్ని ప్రమాద తీవ్రత ఆధారపడి ఉంటుంది.

    దీనిని రోడ్ల నిర్మాణం, వాటర్‌ప్రూఫింగ్‌, రూఫింగ్‌ వంటి పనులకు ఉపయోగిస్తారు.

    స్థానిక పోలీసులు ఏమన్నారంటే...

    ఈ ప్రమాదంతో గాజువాక పారిశ్రామిక ప్రాంతం కావడంతో అందరిలోనూ అందోళన నెలకొంది.

    సోషల్ మీడియాలో వైరల్ అయిన దృశ్యాలతో పెద్ద ప్రమాదాన్ని తలపించాయి. దీనిపై మల్కాపురం సీఐ నర్సింహరావు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

    “పెట్రోల్ తయారు చేసే క్రమంలో ఉత్పత్తయ్యే వ్యర్థ ఉత్పత్తిని నిల్వ చేసే ట్యాంకర్‌లో మంటలు వ్యాపించాయి.

    ఈ మంటలను హెచ్పీసీఎల్ ఫైర్ ట్యాంకులు అదుపు చేస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.” అని సీఐ నర్సింగరావు తెలిపారు.

    ఆందోళన అవసరం లేదు: ఎమ్మెల్యే గణబాబు

    విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు(గణబాబు) HPCL యాజమాన్యంతో మాట్లాడినట్లు ‘ఎక్స్’ లో పేర్కొన్నారు.

    “హెచ్పీసీఎల్ అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం…”సల్ఫర్ ప్లాంట్‌లో ట్రయల్ రన్ సమయంలో భారీగా మంటలు బయటకు రావడం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలను అదుపు చేసేందుకు చుట్టుపక్కల పరిశ్రమల సహాయం తీసుకున్నారు. గత రెండు గంటలుగా పలువురు పరిశ్రమల యాజమాన్యంతో పాటు అగ్నిమాపక, పోలీసు శాఖల అధికారులతో మాట్లాడడం జరిగింది. ప్రజలు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు.” అని పోస్ట్ చేశారు.

  7. మురసు: ఒంగోలు, మచిలీపట్నం మధ్య తీరం దాటుతున్న తీవ్ర తుపాను

    బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మురసు ఆంధ్రప్రదేశ్‌లో తీరం దాటుతోంది. తీవ్ర తుపానుగా మారిన తరువాత ఇది మంగళవారం తెల్లవారుజాము నుంచి ఒంగోలు, మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకి, దాటుతోందని భారత వాతాావరణ శాఖ(ఐఎండీ) నవంబరు 3న ఉదయం 5 గంటలకు జారీ చేసిన బులెటిన్‌లో వెల్లడించింది.

    ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో రెండు గంటల సమయం పడుతుందని వెల్లడించింది.

    తుపాను ముందుభాగంలోని ప్రధానమైన వాల్ క్లౌడ్ ఎక్కువ భాగం భూభాగంలోకి ప్రవేశించిందని తెలిపింది. సైక్లోన్ ఐ మాత్రం ఇంకా తీర ప్రాంతంలోకి ప్రవేశించే ప్రక్రియ కొనసాగుతున్నట్టు వెల్లడించింది.

    మురసు తుపాను గ‌డ‌చిన 6 గంట‌ల్లో గంట‌కు 9 కిలోమీటర్ల వేగంతో క‌దిలింది.

    తీవ్ర తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.

  8. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన అప్‌డేట్స్ మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి