అండర్ వరల్డ్ అంటే బాలీవుడ్ వణికిన ఆ రోజులు ఎలా ఉండేవంటే..

బాలీవుడ్
ఫొటో క్యాప్షన్, ఒకప్పుడు బాలీవుడ్‌పై గ్యాంగ్‌స్టర్ల ప్రభావం తీవ్రంగా ఉండేది.(ప్రతీకాత్మక చిత్రం)
    • రచయిత, అమృతా కదమ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 10 నిమిషాలు

అది 1997 ఆగస్టు 12వ తేదీ ఉదయం.

టి-సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ ఎప్పటిలానే దర్శనం కోసం అంధేరిలోని ఒక గుడికి వెళ్లారు.

దైవ దర్శనం పూర్తిచేసుకుని బయటకు రాగానే ఆయనపై కాల్పులు జరిగాయి.

ప్రాణభయంతో పారిపోయి దగ్గరలోని పబ్లిక్ టాయ్‌లెట్‌లోకి వెళ్లారు. దుండగులు ఆయన్ను వెంబడించారు.. ఆయనపై 15 రౌండ్లు కాల్పులు జరిపారు.

మొత్తంగా గుల్షన్ కుమార్‌పై 16 రౌండ్లు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కాల్పులు జరుగుతున్న సమయంలో దాడి చేసిన వ్యక్తి మొబైల్ ఫోన్ ఆన్‌లోనే ఉంది. ఫోన్‌కాల్‌లో అవతలి వ్యక్తి అక్కడ జరుగుతున్నదంతా వినగలిగారు. అలా వినగలిగేలా ఫోన్‌ను ఆన్‌లో ఉంచాలని దాడి చేసిన వ్యక్తికి ముందే ఆదేశాలొచ్చాయి. ఈ ఆదేశాలు జారీ చేసిన వ్యక్తి గ్యాంగ్‌స్టర్ అబూ సలేం.

ఈ సంఘటనలన్నీ హుస్సేన్ జైదీ రాసిన 'డోంగ్రీ టు దుబాయ్' అనే పుస్తకంలో సవివరంగా ప్రస్తావించారు.

సుమారు 15 నుంచి 20 నిమిషాల పాటు సాగిన ఈ థ్రిల్లర్ లాంటి సంఘటన ముంబైతోపాటు, సినిమా ఇండస్ట్రీని కూడా కుదిపేసింది. డబ్బులు ఇవ్వాలన్న డిమాండ్‌ను తిరస్కరించినందుకు జరిగిన ఈ హత్య సినీ పరిశ్రమకు దిగ్భ్రాంతికి గురిచేసింది. పరిశ్రమలో భయాందోళనలు సృష్టించింది.

ముంబై, అండర్ వరల్డ్, దాడులు, హత్యలు, బాలీవుడ్, నేరాలు, టైగర్ షాఫ్, సల్మాన్ ఖాన్
ఫొటో క్యాప్షన్, 1997లో పట్టపగలు గుల్షన్ కుమార్ హత్య జరిగింది.

‘నేరప్రపంచానికి బాలీవుడ్‌పై బిజినెస్ ఇంట్రెస్ట్’

1997 మార్చిలో నిర్మాత ముకేశ్ దుగ్గల్ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు కూడా అండర్‌ వరల్డ్‌తో సంబంధాలు ఉన్నట్టు తేలింది.

నేరప్రపంచానికి చెందిన వ్యక్తులు బాలీవుడ్‌పై వ్యాపారపరమైన ఆసక్తి చూపించడం మొదలుపెట్టిన కాలమది. అప్పటినుంచే సినీపరిశ్రమను భయభ్రాంతులకు గురిచేసే బెదిరింపులు, దాడుల పరంపర మొదలయింది.

నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటన తర్వాత, సినీ పరిశ్రమలో నెలకొన్న ఈ భయాందోళన మరోసారి వార్తల్లోకి వచ్చింది.

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై గత ఆదివారం (అక్టోబర్ 18)న జుహూ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనపై అనేక వార్తలొస్తున్నాయి.

ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు పదిమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు లేదా అరెస్టు చేశారు.

ఆయుధాలను అక్రమంగా పలు రాష్ట్రాలకు ఎలా తరలించారనే ఆరోపణలపై, అలాగే దాడి చేసినవారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు జరుగుతోంది .

భారత్‌లో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్లలో ఒకరైన లారెన్స్ బిష్ణోయ్ పేరు ఈ కేసుతో మరోసారి వార్తల్లోకి వచ్చింది. దాడి జరిగిన వెంటనే సోషల్ మీడియాలో ఓ స్క్రీన్ షాట్ వైరల్ అయింది.

బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవ్యక్తిగా భావిస్తున్న ఒకరు ఆ పోస్ట్ పెట్టారని, దాడికి తామే బాధ్యులమని ప్రకటించారని ప్రచారం జరిగింది.

ఒక ఆడియో రికార్డింగ్ కూడా బయటకు వచ్చింది. అందులో అనిల్ పండిట్ అని తనను తాను పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి ఈ దాడికి తామే బాధ్యులమని అన్నారు. నటుడు సల్మాన్ ఖాన్‌తో ఉన్న సంబంధం కారణంగానే టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకున్నామని కూడా ఆయన చెప్పారు.

అయితే ఈ ఆరోపణలను ముంబై పోలీసులు ధ్రువీకరించలేదు. ఈ కాల్పుల యత్నం వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ ఉందా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.

ఈ దాడికి ఎవరు ఆదేశాలిచ్చారు, దాని వెనుక ఉద్దేశం ఏంటి అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

టైగర్ ష్రాఫ్‌కు ముందు కూడా బాలీవుడ్ ప్రముఖులకు బెదిరింపులు, వారిపై దాడులు జరిగిన సందర్భాలున్నాయి.

2024లో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు జరిగాయి. దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి బయట కూడా ఈ ఏడాది ఆరంభంలో కాల్పులు జరిగాయి.

సినీ పరిశ్రమపై వ్యవస్థీకృత నేరముఠాల ప్రాబల్యం ఎంత ఉందనేదానిపై ఈ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దాంతో పాటు ముంబై నేర చరిత్రలోని ఒక చీకటికాలంనాటి జ్ఞాపకాలను కూడా ఈ ఘటనలు మళ్లీ గుర్తుచేశాయి.

ముంబై, అండర్ వరల్డ్, దాడులు, హత్యలు, బాలీవుడ్, నేరాలు, టైగర్ ష్రాఫ్, సల్మాన్ ఖాన్
ఫొటో క్యాప్షన్, హాజీ మస్తాన్‌కు చాలా మంది బాలీవుడ్ ప్రముఖులతో మంచి సంబంధాలున్నాయి.

గ్యాంగ్‌స్టర్లకు బాలీవుడ్‌తో ఉన్న సంబంధం ఏంటి?

బాలీవుడ్‌కు, అండర్‌వరల్డ్‌కు మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి చర్చ వస్తే హాజీ మస్తాన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

బాలీవుడ్‌పై హాజీ మస్తాన్‌కు చాలా ఆసక్తి ఉండేది. ఆయన అనేక సినిమాలను నిర్మించడమే కాకుండా, కెరీర్‌లో నిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తున్న ఒక నటిని వివాహం కూడా చేసుకున్నారు.

"మస్తాన్ తన యవ్వనంలో మధుబాలకు వీరాభిమాని. ఆమెను పెళ్లిచేసుకోవాలని కోరుకునేవాడు. కానీ మధుబాల చిన్నవయసులోనే మరణించారు. ఒకవేళ ఆమె బతికి ఉన్నా కూడా మస్తాన్‌కు ఆమెను పెళ్లిచేసుకోవడం సాధ్యమయ్యేదికాదు'' అని జర్నలిస్ట్, రచయిత అయిన హుస్సేన్ జైదీ అన్నారు.

ఆ సమయంలో మధుబాలలా కనిపించే ఒక నటి ముంబైలో ఉండేది. ఆమె పేరు వీణా శర్మ అలియాస్ సోనా. మస్తాన్ ఆమెకు పెళ్లి ప్రతిపాదన చేయగా, ఆమె వెంటనే అంగీకరించింది. సోనా కోసం మస్తాన్ జుహూలో ఒక ఇల్లు కొని, ఆమెతో కలిసి అక్కడే నివసించడం మొదలుపెట్టారు.

క్రమంగా ముంబైలోని వీఐపీ వర్గాల్లో మస్తాన్‌కు పలుకుబడి పెరిగింది. గతంలో ఆయన స్మగ్లర్ అన్న విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోయారు.

హాజీ మస్తాన్‌కు తన మొదటి భార్య ద్వారా ముగ్గురు కూతుళ్లున్నారు. తర్వాత ఆయన సుందర్ శేఖర్ అనే కుమారుడిని దత్తత తీసుకున్నారు.

"చిత్ర పరిశ్రమలో చాలామంది ఆయనకు సన్నిహితంగా ఉండేవారు. వారిలో రాజ్‌కపూర్, దిలీప్ కుమార్ సంజీవ్ కుమార్ ముఖ్యులు. 'దీవార్' సినిమా షూటింగ్ సమయంలో పాత్రలను మరింత లోతుగా అర్ధం చేసుకోవడానికి ఆ చిత్ర రచయిత సలీమ్, అమితాబ్ బచ్చన్ తరచూ బాబాను కలవడానికి వచ్చేవారు. బాబా ఎప్పుడూ తన జుట్టును వెనక్కి దువ్వుకునేవారు.

ఎవరైనా ఆయనతో ఇంగ్లీషులో మాట్లాడటం మొదలుపెడితే ఆయన పదేపదే 'యా-యా' అని అనేవారు" అని సుందర్ శేఖర్ చెప్పారు.

హాజీ మస్తాన్‌కు సినిమా ప్రపంచం అంటే ఆకర్షణ ఉండేది.

1990ల తర్వాత అండర్ వరల్డ్ ముఠాలు సినిమాలను వ్యాపారపరంగా చూడడం మొదలుపెట్టాయి. సినిమా వ్యాపారంలో డబ్బు సంపాదించే అవకాశం ఉండటంతో చాలా మంది గ్యాంగ్‌స్టర్లు ఈ రంగంవైపు ఆకర్షితులయ్యారు.

ముంబై, అండర్ వరల్డ్, దాడులు, హత్యలు, బాలీవుడ్, నేరాలు, టైగర్ ష్రాఫ్, సల్మాన్ ఖాన్
ఫొటో క్యాప్షన్, ది బ్రహ్మాస్త్ర అన్‌లీష్డ్ పుస్తకంలో మాఫియాతో బాలీవుడ్ సంబంధాలగురించి వివరించారు.

‘చోరీ చోరీ చుప్కే చుప్కే’ సినిమా వెనక...

1999లో ఒక స్పాట్‌బాయ్ సినిమా నిర్మాతగా మారాడు.

ఆ చిత్రంలో అప్పటి సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించాడు.

ఆ స్పాట్‌బాయ్ పేరు నజీం రిజ్వీ. ఆయన పరారీలో ఉన్న భారత గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడైన చోటా షకీల్‌కు ముఖ్య అనుచరుడు. ఆ సినిమా పేరు "చోరీ చోరీ చుప్కే చుప్కే".

మహారాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ అయిన డి.శివానందన్ ఈ కేసు మొత్తాన్ని దర్యాప్తు చేశారు. ఆయన తన 'ది బ్రహ్మాస్త్ర అన్‌లీష్డ్' అనే పుస్తకంలో దీని గురించి వివరించారు.

1999లో శివానందన్‌కు తన సోర్సెస్ నుంచి ఓ సమాచారం అందింది.

"ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా సంపాదించిన డబ్బుతో షకీల్ ఒక హిందీ సినిమా తీయాలనుకున్నారు. ఈ డబ్బును హవాలామార్గంలో ఒక కోటీశ్వరుడైన వజ్రాల వ్యాపారికి, పారిశ్రామికవేత్తకు బదిలీ చేయాలనుకున్నారు. డబ్బును ఆ పారిశ్రామికవేత్త సినిమా నిర్మాతలకు అందజేయాల్సి ఉంది. ఆ పారిశ్రామికవేత్తే భరత్ షా"

ఈ సమాచారం అందిన వెంటనే శివానందన్ అప్పటి హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శిని కలిసి రిజ్వీ ఫోన్‌ కాల్స్‌ను ట్యాప్ చేయడానికి అనుమతి కోరారు. ఆయనకు అనుమతి లభించింది.

షకీల్ ప్రతిరోజూ రిజ్వీతో మాట్లాడేవారు. ఈ ఫోన్ కాల్స్‌ ద్వారా మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా బయటపడ్డాయి.

షకీల్ కోరిన డబ్బును ఇచ్చేందుకు ఒప్పుకోని నిర్మాత-దర్శకుడు రాకేశ్ రోషన్‌పై దాడి చేయాలనే ప్రణాళిక కూడా అందులో ఉంది.

షకీల్, రిజ్వీ తమ సినిమా ప్రమోషన్, విడుదల ప్రణాళికల గురించి కూడా చర్చించేవారు.

ఈ వ్యవహారాలన్నింటిపై 2000వ సంవత్సరంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎఫ్ఐఆర్‌ నమోదు చేసింది. నజీం రిజ్వీ, అబ్దుల్ రహీమ్ ఖాన్‌లను అరెస్టు చేశారు. 2001 జనవరిలో భరత్ షాను కూడా అరెస్టు చేశారు.

ఈ కేసులో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం, భారత శిక్షా స్మృతి, భారత ఆయుధాల చట్టంలోని సెక్షన్ల కింద రెండుకుపైగా చార్జిషీట్లు దాఖలయ్యాయి.

విచారణ సమయంలో మొత్తం 76 మంది సాక్షులను ప్రశ్నించగా వారిలో 14 మంది బాలీవుడ్ నటులున్నారు. కానీ ప్రీతీ జింటా మినహా మిగతా వారందరూ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారని శివానందన్ తన పుస్తకంలో రాశారు.

విచారణ రెండు సంవత్సరాల పాటు కొనసాగింది. భరత్ షాను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఏపీ బంగ్లే దోషిగా నిర్ధరించారు. నజీం రిజ్వీ, అబ్దుల్ రహీమ్‌లకు ఆరేళ్ల జైలు శిక్ష విధించారు.

ముంబై, అండర్ వరల్డ్, దాడులు, హత్యలు, బాలీవుడ్, నేరాలు, టైగర్ ష్రాఫ్, సల్మాన్ ఖాన్
ఫొటో క్యాప్షన్, అబూ సలేం

‘సంజయ్ గాంధీ, అబూ సలేం ఎందుకు కలిశారంటే...’

ఈ కథనం ప్రారంభంలో ప్రస్తావించిన గుల్షన్ కుమార్ హత్య సినిమా పరిశ్రమలో భయోత్పాతం సృష్టించడానికి చేసిన ఒక తీవ్రమైన ప్రయత్నం.

ఈ దాడి వెనక ఉన్న వ్యక్తి పేరు అబూ సలేం అని బయటకొచ్చింది.

ఉత్తర ప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందిన సలేం 1993 బాంబు పేలుళ్లకు ముందు దావూద్ ఇబ్రహీం సోదరుడైన అనీస్ ఇబ్రహీం దగ్గర డ్రైవర్‌గా, డెలివరీ డ్రైవర్‌గా పనిచేశారు.

అనీస్ అప్పుడప్పుడు ఫోన్‌లో అబూ సలేంకు సలహాలు ఇచ్చేవారు. అబూ సలేంకు దావూద్‌తో నేరుగా సంబంధం లేనప్పటికీ అబూ సలేం తెలివిగా వ్యవహరించడం నేర్చుకుంటున్నాడని అనీస్ భావించారు.

1993లో హీరో సంజయ్ దత్ అనీస్‌కు ఫోన్ చేశాడు. తనకు బెదిరింపులు వస్తున్నాయని, తన భద్రత కోసం కొన్ని తుపాకులు అవసరమని చెప్పాడు.

అప్పుడు అనీస్ అబూ సలేంకు ఫోన్ చేసి "వెళ్లి సంజూకి ఆ మెషిన్ గన్‌ ఇచ్చిరా" అని చెప్పారు. అబూ సలేం తన జీవితంలో ఒక సినీ నటుడిని నేరుగా కలవడం అదే మొదటిసారి.

ముంబై బాంబు దాడుల తర్వాత ఇచ్చిన ఓ వాంగ్యూలంలో సంజయ్‌దత్‌ను ప్రత్యక్షంగా చూసి తాను ఆశ్చ్యపోయాయనని అబు సలేం చెప్పారు. సంజయ్ దత్‌ను మూడుసార్లు కౌగిలించుకున్నారు.

అన్ని తుపాకులు తనకు అవసరం లేదని, ఒకటి సరిపోతుందని సంజయ్ దత్ తర్వాత చెప్పాడు. దాంతో సలేం తుపాకిని తిరిగి తీసుకుని వెళ్లాల్సొచ్చింది.

మీడియా ఆయనకు "డాన్" అని పేరు పెట్టింది. కానీ ఆ సమయంలో ఆయనకు పెద్ద నేర చరిత్ర ఏమీ లేదు. ఆయన చేసిన అత్యంత తీవ్రమైన నేరం ఆయుధాలను సరఫరా చేయడమే. అయితే దుబాయ్‌కి వెళ్లి అనీస్ దగ్గర పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఫోన్‌లో వ్యక్తులను బెదిరించడం ప్రారంభించారు. దీంతో ఆయన్ను డాన్‌గా భావించడం మొదలుపెట్టారు.

ఆ తర్వాత అబూ సలేం సినీ నిర్మాత గుల్షన్ కుమార్ హత్యకు కుట్ర పన్ని దానిని అమలు చేశారు. ఈ హత్య తర్వాత అబూ సలేం కరుడుగట్టిన నేరస్తుడన్న పేరు వచ్చింది.

ముంబై, అండర్ వరల్డ్, దాడులు, హత్యలు, బాలీవుడ్, నేరాలు, టైగర్ ష్రాఫ్, సల్మాన్ ఖాన్
ఫొటో క్యాప్షన్, హృతిక్ రోషన్, రాకేశ్ రోషన్.

‘గుల్షన్ కుమార్ హత్యపై ముంబై పోలీసులకు సమాచారం’

గుల్షన్ కుమార్ హత్య వార్తను సీనియర్ జర్నలిస్ట్ చంద్రమోహన్ పుప్పాల కవర్ చేశారు.

"ఇలాంటి ఘటన జరిగే అవకాశముందని ముంబై పోలీసులకు ముందే సమాచారం అందింది. ఆ సమయంలో నేరస్థులు న్యూస్ పేపర్ల కార్యాలయాలకు ఫోన్ చేసేవారు. తమ అభిప్రాయాలను లేదా ప్రకటనలను జర్నలిస్టుల ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నించేవారు" అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రమోహన్ పుప్పాల చెప్పారు.

నేర వార్తలను కవర్ చేసే జర్నలిస్టులకు పోలీసు అధికారులతో పాటు నేర ప్రపంచంలో సమాచారం అందించే వ్యక్తులతో కూడా పరిచయాలు ఉండేవి. వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా వాళ్లు వార్తలు రాసేవారు.

గుల్షన్ కుమార్‌కు బెదిరింపులు వస్తున్నాయనే సమాచారం అప్పటికే బయటకు వచ్చిందని చంద్రమోహన్ అన్నారు.

ఆ సమయంలో కొంతమంది ఈ బెదిరింపులను తీవ్రంగా పరిగణించి భద్రతాఏర్పాట్లు చేసుకున్నారు. అప్పట్లో నేరస్థులు ఎవరిపైనైనా దాడి చేసి ప్రజల్లో భయాన్ని సృష్టించడం ద్వారా ఆధిపత్యాన్ని చాటుకోడానికి ప్రయత్నించేవారు.

నిర్మాత-దర్శకుడు, నటుడు హృతిక్ రోషన్ తండ్రి రాకేశ్ రోషన్‌పై 2000వ సంవత్సరం జనవరి 21న దాడి జరిగింది. ఒక గ్యాంగ్‌స్టర్ అడిగిన డబ్బులు ఇచ్చేందుకు ఆయన నిరాకరించడంతో ఈ దాడి జరిగింది.

'గుప్త్' వంటి విజయవంతమైన సినిమాల దర్శకుడైన రాజీవ్ రాయ్‌పై కూడా 1997లో దాడి జరిగింది. అబూ సలేం గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురు వ్యక్తులు రాజీవ్ రాయ్‌పై సెంట్రల్ ముంబైలో దాడి చేశారు.

రాజీవ్‌ రాయ్‌కు అంతకుముందు కూడా బెదిరింపులొచ్చాయి.

దీంతో ఆయనకు భద్రత కల్పించడంతోపాటు వ్యక్తిగత భద్రతాసిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. దాడి చేసిన వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటనలో జరిగిన ఎదురు కాల్పుల్లో దాడి చేసినవారిలో ఒకరు గాయపడినట్టు చెబుతారు.

ముంబై, అండర్ వరల్డ్, దాడులు, హత్యలు, బాలీవుడ్, నేరాలు, సల్మాన్ ఖాన్, టైగర్ ష్రాఫ్
ఫొటో క్యాప్షన్, లారెన్స్ బిష్ణోయ్

గ్యాంగ్‌స్టర్లకు సినిమా పరిశ్రమపై ఆసక్తి ఎందుకు?

సినీ పరిశ్రమలో అండర్‌వరల్డ్ గ్యాంగ్‌లు ఆర్థిక లావాదేవీలు జరిపినట్టు వచ్చిన ఆరోపణలను చంద్రమోహన్ పుప్పాల విశ్లేషించారు. సినిమాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఉందని గ్యాంగ్‌స్టర్లు భావించారని, తమ దగ్గరున్నడబ్బును సినిమాల్లో పెట్టుబడిగా పెట్టి లాభాలు ఆర్జించవచ్చని గ్యాంగ్‌స్టర్లు అనుకున్నారని చంద్రమోహన్ అభిప్రాయపడ్డారు.

సినీ తారలతో పరిచయాలు పెంచుకోవడం కూడా నేరస్థులకు ఒక ఆకర్షణగా ఉండేదని ఆయన అన్నారు.

ఒక సెలబ్రిటీతో తమకు సన్నిహిత సంబంధాలున్నట్టు చూపించడం వల్ల తమ గుర్తింపు పెరుగుతుందని, నేర ప్రపంచంలో తమ స్థానం, పలుకుబడి బలపడతాయని కూడా వారు భావించేవారన్నారు.

కొంతమంది గ్యాంగ్‌స్టర్లు సినిమా నటులను పార్టీలకు, ఇతర కార్యక్రమాలకు ఆహ్వానించేవారని, సినిమాల్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా వారు ప్రయత్నించేవారని చంద్రమోహన్ తెలిపారు.

అబూ సలేం అందుకు ఒక ఉదాహరణగా ఆయన ప్రస్తావించారు.

ఆ సమయంలో సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టడం, రక్షణ కల్పిస్తామని చెప్పడం, వివిధ డిమాండ్లకు సంబంధించిన వ్యవహారాల్లో తమ ప్రభావాన్ని చూపించడం వంటి ప్రయత్నాలు జరిగాయని చంద్రమోహన్ అన్నారు.

సినీ పరిశ్రమలో పెట్టుబడులు లేదా భద్రతకు సంబంధించిన వ్యవహారాలను తాము చూసుకోగలమని కొందరు గ్యాంగ్‌స్టర్లు చెప్పుకునేవారని, అలా తమ పలుకుబడిని ప్రదర్శించడానికి కూడా ప్రయత్నించేవారని తెలిపారు.

ముంబై, అండర్ వరల్డ్, దాడులు, హత్యలు, బాలీవుడ్, నేరాలు, టైగర్ ష్రాఫ్, సల్మాన్‌ఖాన్
ఫొటో క్యాప్షన్, టైగర్ ష్రాఫ్ కారుపై ముంబైలో కాల్పులు జరిగాయి.

మరోసారి అండర్‌వరల్డ్ భయాల నీడలో బాలీవుడ్

టైగర్ ష్రాఫ్‌పై దాడి తర్వాత, బాలీవుడ్‌లో మరోసారి భయానక వాతావరణం నెలకొంటోందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

చంద్రమోహన్ పుప్పాలను బీబీసీ అదే ప్రశ్న అడిగింది.

"ఇది మళ్లీ మొదలైందని చెప్పడం సరైనది కాదు. ఎప్పటికప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతుండడాన్ని మనం చూస్తున్నాం'' అని ఆయన సమాధానమిచ్చారు.

జుహులో దర్శకుడు రోహిత్ శెట్టి ఇంటి సమీపంలో 2026 ఫిబ్రవరిలో కాల్పులు జరిగాయి.

ఈ దాడిని శుభం లోంకర్ గ్యాంగ్ చేసిందని పోలీసులు తెలిపారు.

డబ్బు వసూలు చేయడం, భయాందోళనలు సృష్టించడమే ఈ దాడి లక్ష్యమని కూడా పోలీసులు చెప్పారు.

2025 సెప్టెంబర్‌లో, ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో నటి దిశా పటానీ తండ్రి జగదీశ్ పటానీ ఇంటి బయట గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.

గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా గ్యాంగ్ ఈ దాడికి తామే బాధ్యులమని సోషల్ మీడియాలో ప్రకటించింది.

అయితే, బాలీవుడ్‌లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయనడం సరికాదని శివానందన్ అభిప్రాయపడ్డారు. ఆ భయానక రోజులు తిరిగి రాలేదన్నారు.

దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్, అరుణ్ గవ్లీ వంటి ఇతర నేరస్థులపై దర్యాప్తు చేసి, వారిని పట్టుకునేందుకు ప్రయత్నించానని శివానందన్ చెప్పారు. ఈ గ్యాంగ్‌స్టర్లు విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహించినప్పటికీ, వారి అనుచరులు ముంబైలోని నేర ముఠాలతో లోతైన సంబంధాలుండేవని తెలిపారు.

గత 60 ఏళ్లలో మనం ముంబైలో చూసిన మాఫియా గ్యాంగ్‌లు ఇవి కావు. ఇవి పూర్తిగా భిన్నమైనవి.

లారెన్స్ బిష్ణోయ్ పేరు ఈ కొత్త నేర ప్రపంచంతో ముడిపడి ఉంది.

ఉత్తర భారతదేశంలోని ఒక గ్రామానికి చెందిన బిష్ణోయ్ చాలా ఏళ్లగా జైలులో ఉన్నారు.

జానపదకథల్లో కనిపించే ప్రతినాయకుడిలాంటి పేరు, గుర్తింపు ఆయనకు ఏర్పడింది.

వివిధ దేశాల్లో దాడి చేసేవారికి జైలు నుంచే ఆదేశాలు ఇస్తున్నారని చెబుతారు.

ఇలాంటి ప్రకటనలు, ఆరోపణలు తరచూ ఆన్‌లైన్‌లో వ్యాపిస్తుంటాయి.

కృష్ణజింకల వేట కేసుకు సంబంధించి సల్మాన్‌ఖాన్‌ను లారెన్స్ బిష్ణోయ్ బహిరంగంగా బెదిరించారు. 1998లో ఒక కృష్ణజింకను సల్మాన్ ఖాన్ వేటాడినట్లు ఆరోపణలొచ్చాయి. బిష్ణోయ్ కమ్యూనిటీలో కృష్ణజింకను పవిత్రమైనదిగా భావిస్తారు.

సల్మాన్‌ఖాన్‌ ముంబైలోని ఇంటి బయట 2024 ఏప్రిల్‌లో ఐదురౌండ్ల కాల్పులు జరిగాయి.

సల్మాన్‌ఖాన్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులకు సన్నిహితుడిగా భావించే రాజకీయ నాయకుడు బాబా సిద్ధిఖీ ఆరునెలల తర్వాత హత్యకు గురయ్యారు.

ఈ రెండు ఘటనలకూ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉందని ముంబై పోలీసులు తేల్చారు. అయితే సిద్ధిఖీ హత్యలో లారెన్స్ బిష్ణోయ్ వ్యక్తిగత ప్రమేయం ఇంకా రుజువవలేదు.

బిష్ణోయ్ గ్యాంగ్‌కు సంబంధించిన కొన్ని ఆరోపణలపై పోలీసుల దర్యాప్తు జరుగుతోంది.. అయితే ఈ గ్యాంగ్ నిజంగా చేసిన నేరాలకూ, ఈ గ్యాంగ్ పేరుతో ఇతరులు చేస్తున్న ప్రకటనలకు మధ్య తేడా ఉండడంపై అస్పష్టత నెలకొంది. అందుకే ఈ కొత్త గ్యాంగ్ అంటే భయం రోజురోజుకీ పెరుగుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)