మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
క్రిస్టాపైక్: రెండు విషపు ఇంజెక్షన్లను తట్టుకున్న నిందితురాలు ఇప్పుడు కోలుకుని మాట్లాడుతున్నారు, ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదంటున్న జర్నలిస్ట్
- రచయిత, సెరీన్ హబేషియన్, క్వాసి జ్యాంఫి అసీదు, షీలా ఫ్లిన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
అమెరికాలో గతవారం మరణశిక్ష నుంచి ప్రాణాలతో బయటపడిన ఖైదీ క్రిస్టా పైక్ "స్పృహలోకి వచ్చి మాట్లాడుతున్నారు" అని ఆమె న్యాయవాదులు తెలిపారు.
ఆసుపత్రిలో కూడా చేతులకు సంకేళ్లు వేసి నిరంతరంగా చికిత్స అందిస్తున్నారని ఆమె తరఫున న్యాయవాదులు మంగళవారం ప్రకటించారు.
ఓ హత్య కేసులో పైక్‌కు మరణ శిక్ష విధించారు. ఆ శిక్ష అమలులో భాగంగా ఆమెకు గత బుధవారం టెన్నెస్సీలో రెండు విషపు ఇంజెక్షన్లు ఇచ్చారు. అయితే అనుకోకుండా ప్రాణాలతో బయటపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె శరీరంలోని విషపదార్థ ప్రభావాన్ని తగ్గించే చికిత్స చేసినంత వరకు అపస్మారక స్థితిలో ఉన్నారు.
ఆమె కోలుకోవడం అరుదైన విషయమని నిపుణులు, ఆమె న్యాయ బృందం చెబుతోంది. విషపు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఇలా ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తిగా భావిస్తున్నారు.
"వైద్యపరిభాషలో ఇది అసాధారణమైంది" అని ఆమె తరఫున న్యాయవాదులు అభివర్ణించారు. ఆమె ఆరోగ్యం ఎలా ఉంటుందనేది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, "కనీసం, ఆమె పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది" అని వారు భావిస్తున్నారు.
పైక్ స్పృహలో ఉండటం, మాట్లాడుతుండటం చూసి తాను " పూర్తిగా ఆశ్చర్యపోయాన"ని ఫోర్డ్హామ్ లా స్కూల్లో ప్రొఫెసర్, నేర పరిశోధకురాలైన డెబోరా డెన్నో అంటున్నారు.
మరణ శిక్షలు అమలు చేసిన తర్వాత ఖైదీలు బతికి బయటపడి ఘటనలు మరో ఏడు ఉన్నాయి. అయితే ఆ సందర్భాల్లో అమలు చేసిన వ్యక్తులు ఖైదీల నరాల్లోకి విషాన్ని సరిగా ఎక్కించలేకపోయారని డెన్నో బీబీసీతో చెప్పారు.
"ఏదో ఒక రకమైన విష పదార్థాన్ని ఎక్కించిన వ్యక్తి పైక్ మాత్రమే" అని ఆమె తెలిపారు.
తర్వాత ఏం చేయబోతున్నారు?
‘‘ శిక్ష అమలు ప్రక్రియలో భాగంగా వారు చేయాల్సిన ప్రతి పనిని చేశారు. అయినా అది సరిగా పని చేయలేదు, ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ఎదురుకాలేదు’’ అని డెన్నో చెప్పారు. " అన్నారు.
పైక్ను మళ్లీ మరణశిక్ష అమలు చేయడానికి మరోసారి ప్రయత్నిస్తారా లేదా అనే విషయంపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే, ఆమెకు పెంటోబార్బిటాల్ అనే రసాయనాన్ని ఇంజెక్ట్ చేసిన తర్వాత ఏం తప్పు జరిగిందనే దానిపైనా వారు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్ర గవర్నర్ బిల్ లీ ఈ ఏడాదిలో మిగిలిన కాలంలో అమలు చేయాల్సిన మరణ శిక్షల అమలు నిలిపివేశారు. అలాగే రాష్ట్ర జైళ్ల శాఖ చీఫ్ కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
ఇబ్బందుల్లో ఉన్న యువత కోసం నిర్వహించిన ఉద్యోగ శిక్షణా శిబిరంలో పరిచయమైన 19 ఏళ్ల స్లెమ్మర్‌ను పైక్ తన అప్పటి ప్రియుడు టాడరిల్తో కలిసి దారుణంగా కొట్టి చంపేశారు. అప్పటికి ఆమె వయసు 18 ఏళ్లు.
ఇది సాధారణ విషయం కాదంటున్న వైద్యులు
పైక్ తరఫు న్యాయబృందానికి సహకరిస్తున్న మత్తుమందుల నిపుణుడు డాక్టర్ జోయెల్ జైవట్ మంగళవారం బీబీసీతో మాట్లాడారు. "ప్రాణాలు తీసే ఇంజెక్షన్ తీసుకున్న చాలా మంది మరణించారు. నిజానికి క్రిస్టా మినహాయిస్తే దాదాపు అందరూ చనిపోయారు. కాబట్టి ఆమె దాని నుంచి ప్రాణాలతో బయటపడటం సాధారణమైన విషయం కాదు" అని అన్నారు.
అయితే, ఈ ఘటనకు సంబంధించిన అనేక విషయాలు సమాధానాలు లేని ప్రశ్నలుగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా, పెంటోబార్బిటాల్ అనే ఔషధం ఆమె శరీరంలోకి ఎంత మోతాదులో చేరింది. రక్తంలో దాని మోతాదు ఎంత ఉంది, ఆమె పూర్తిస్థాయి కోలుకోవడం ఎలా ఉంటుందనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉందన్నారు.
"ఈ దశలో ఆమెకు ఉన్న అన్ని పెద్ద ప్రమాదాలు తొలగిపోయాయని నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పలేను" అని అన్నారు.
పెంటోబార్బిటాల్ నేరుగా పైక్ రక్తప్రసరణ వ్యవస్థలోకి వెళ్లకుండా, ఆమె చర్మం కింద ఉన్న కణజాలంలో వ్యాపించి ఉంటుందని జైవట్ అభిప్రాయపడ్డారు.
"ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదు"
పైక్ ఘటన తనకు ఆశ్చర్యం కలిగించలేదని అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ) పాత్రికేయుడు మైకేల్ గ్రాజిక్ అంటున్నారు. ఈయన అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలో దాదాపు 500 మరణశిక్షల అమలు ప్రక్రియలను రిపోర్ట్ చేశారు.
ఇలాంటి పరిస్థితి ఒకరోజు వస్తుందని తాను ముందుగానే ఊహించానని అంటున్నారు.
"నా అభిప్రాయం ప్రకారం, ఇది ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది" అని అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా మరణశిక్ష విఫలమవ్వడం తాను ఎప్పుడూ చూడలేదని మైకేల్ గ్రాజిక్ చెప్పారు.
అసోసియేటెడ్ ప్రెస్‌లో 46 ఏళ్లపాటు వివిధ అంశాలపై రిపోర్టింగ్ చేసిన గ్రాజిక్, మరణశిక్షల అమలును ప్రత్యక్షంగా వీక్షించడం తన ఉద్యోగంలో ముఖ్యమైన భాగమని చెప్పారు.
అసోసియేటెడ్ ప్రెస్ నుంచి అధికారికంగా పదవీ విరమణ చేసినప్పటికీ, మైకేల్ గ్రాజిక్ ఇప్పటికీ ఫ్రీలాన్సర్‌గా పని చేస్తూ స్వరాష్ట్రం టెక్సస్‌లో జరిగే మరణశిక్ష అమలుపై కథనాలు రాస్తున్నారు.
"20 నుంచి 40 నిమిషాల్లో మరణిస్తారు"
"మేం గదిలోకి ప్రవేశించే సమయానికి దోషిని కట్టేసి ఉంచుతారు" అని ఆయన వివరించారు.
ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష అమలు చేసే సమయంలో సాధారణంగా మోచేయి మడత భాగంలోని రక్తనాళం ద్వారా ఔషధాన్ని ఎక్కిస్తారని గ్రాజిక్ చెప్పారు.
అది సాధ్యం కాకపోతే చేతి వెనుక భాగంలో, పాదం, మెడ, లేదా శరీరంలోని ఇతర భాగాల్లోని రక్తనాళాలను ఉపయోగిస్తారని ఆయన తెలిపారు.
విజయవంతంగా అమలైన మరణశిక్షల్లో, దోషులు సాధారణంగా కొన్ని సెకన్లలోనే స్పృహ కోల్పోయినట్టు స్పష్టంగా గమనించవచ్చని ఆయన అన్నారు.
ప్రాణాంతక మోతాదు ఇచ్చిన తర్వాత సాధారణంగా 20 నుంచి 40 నిమిషాల్లోపే మరణించినట్టు నిర్థరిస్తారని గ్రాజిక్ వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)