మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
కళ్లద్దాలతో స్పష్టంగా కనిపిస్తే కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లేనా? చూపు తగ్గుతోందని ఎలా గుర్తించాలి?
- రచయిత, ఓంకార్ కరంబేల్కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 10 నిమిషాలు
రోడ్డుపై నడుస్తున్నప్పుడు పక్క నుంచి వస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా కనిపించకుండా పోతారు.
రాత్రివేళ వాహనం నడుపుతున్నప్పుడు ఎదురుగా ఉన్న వాటిని చూడటం గతంలో కంటే కష్టంగా అనిపిస్తుంది.
చదువుతున్నప్పుడు అక్షరాలు మసకగా కనిపిస్తాయి. నిటారుగా ఉన్న గీతలు కూడా కాస్త వంకరగా కనిపించడం మొదలవుతుంది.
చాలాసార్లు అలసట, వయసు పెరగడం లేదా కళ్లద్దాల పవర్ మారడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయని భావించి వాటిని పట్టించుకోం.
చూపు తగ్గిపోవడం అంటే కళ్ల ముందు చీకట్లు కమ్ముకుని ఏమీ కనిపించకుండా పోవడం మాత్రమే కాదు.
కొన్ని తీవ్రమైన కంటి వ్యాధులు ఎలాంటి హెచ్చరికలు లేకుండా చాలా నెమ్మదిగా ముదిరిపోతాయి.
ఉదాహరణకు గ్లకోమా ప్రారంభ దశలో చాలాసార్లు స్పష్టమైన లక్షణాలేవీ కనిపించవు.
డయాబెటిక్ రెటినోపతీ విషయంలోనూ తొలిదశలో ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు.
అందుకే చూపులో మార్పు కనిపించడమే ఎప్పుడూ కంటి వ్యాధికి తొలి సంకేతం కాకపోవచ్చు.
'నాకు స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి నా కళ్లు ఆరోగ్యంగానే ఉన్నాయి' అని భావించడం కొన్నిసార్లు ప్రమాదకరంగా మారవచ్చు.
మరి చూపు తగ్గడం మొదలైందని తెలిపే తొలి సంకేతాలేంటి? పక్కన ఉన్న వస్తువులను చూసే సామర్థ్యం (పెరిఫెరల్ విజన్) తగ్గిందని ఎలా గుర్తించాలి? ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే చూపును దెబ్బతీసే వ్యాధులేంటి? కళ్లను క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం ఎంత ముఖ్యం? అనే విషయాలను తెలుసుకోవడం అవసరం.
'చూపు మసకబారకముందే కళ్లకు నష్టం మొదలై ఉండొచ్చు'
మనకు స్పష్టంగా కనిపిస్తుంటే, చదవడంలో ఇబ్బంది లేకపోతే, కళ్లు నొప్పిగా లేకపోతే అవి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాయని భావించడం సహజమే.
కానీ, కొన్ని తీవ్రమైన కంటి వ్యాధుల విషయంలో ఈ నమ్మకమే మనల్ని తప్పుదోవ పట్టించవచ్చు.
గ్లకోమా ప్రారంభ దశలో చాలాసార్లు స్పష్టమైన లక్షణాలు లేదా ప్రమాద సంకేతాలు కనిపించవు. డయాబెటిక్ రెటినోపతీ తొలిదశలోనూ ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు.
వయసు పెరగడం వల్ల వచ్చే మాక్యులర్ డీజెనరేషన్లో మధ్య భాగంలోని చూపు దెబ్బతినవచ్చు. ముఖ్యంగా 'వెట్ ఏఎండీ' (Wet Age-related Macular Degeneration)లో నిటారుగా ఉన్న గీతలు వంకరగా కనిపించడం తొలి లక్షణం కావచ్చు.
మరికొన్ని మార్పులు మాత్రం తక్షణ ప్రమాదానికి సంకేతాలు కావచ్చు.
కళ్ల ముందు అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో కొత్త చుక్కలు లేదా దారాల్లాంటి ఆకారాలు తేలుతున్నట్లు కనిపించడం, కాంతి మెరుపులు కనిపించడం, పక్క చూపులో నీడ కనిపించడం, కళ్ల ముందు బూడిద రంగు తెర కమ్ముకున్నట్లు అనిపించడం రెటీనాకు సంబంధించిన వ్యాధుల లక్షణాలు కావచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే కంటి వైద్య నిపుణులను సంప్రదించాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ సూచిస్తోంది.
అందువల్ల స్పష్టంగా కనిపిస్తున్నంత మాత్రాన కళ్లు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాయని అనుకోలేం. కంటి సమస్యలు మొదలయ్యే వరకు వేచి చూడకుండా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం.
చూపు క్రమంగా తగ్గుతుంటే సంబంధిత వ్యక్తి దాన్ని గుర్తించగలరా? అనేది ముఖ్యమైన ప్రశ్న. దీనిపై డోంబివిలిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కంటి వైద్య నిపుణురాలిగా పనిచేస్తున్న డాక్టర్ స్వాతి హిరేను మేం అడిగాం.
''చూపు తగ్గుతున్న విషయాన్ని గుర్తించే అవకాశం ఉంది. అయితే, చూపు నెమ్మదిగా తగ్గుతున్నప్పుడు మెదడు, సంబంధిత వ్యక్తి తమకు తెలియకుండానే ఆ మార్పులకు అలవాటుపడవచ్చు. ఉదాహరణకు, దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించని వ్యక్తి వాటిని దగ్గరి నుంచి చూడటం అలవాటు చేసుకోవచ్చు. దీంతో చూపు తగ్గుతున్న విషయాన్ని వెంటనే గుర్తించలేకపోవచ్చు. ముఖ్యంగా రెండు కళ్లలోనూ క్రమంగా మార్పులు వస్తుంటే ఈ సమస్యను ఆలస్యంగా గుర్తించే అవకాశం ఉంది'' అని ఆమె వివరించారు.
డాక్టర్ స్వాతి హిరే మాట్లాడుతూ, ''ఒక కంటిలో చూపు తగ్గుతున్నప్పుడు మరో కన్ను కొంతవరకు ఆ లోపాన్ని భర్తీ చేస్తుంది. దీంతో రెండు కళ్లతో చూసేటప్పుడు చూపు బాగానే ఉన్నట్లు అనిపించవచ్చు. ముఖ్యంగా గ్లకోమా వంటి కొన్ని వ్యాధుల్లో చూపు పరిధి క్రమంగా తగ్గుతుంది. అందువల్ల ప్రారంభంలో ఈ సమస్యను గుర్తించలేకపోవచ్చు. అయితే, ఇలాంటి మార్పుల వల్ల రోజువారీ పనుల్లో కొన్ని చిన్నచిన్న ఇబ్బందులు ఎదురవుతాయి"
''ఉదాహరణకు రాత్రివేళ వాహనం నడపడం కష్టంగా అనిపించడం, మెట్లు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు అడుగు సరిగ్గా వేయలేక బ్యాలెన్స్ కోల్పోవడం, నడుస్తున్నప్పుడు పక్కనున్న వ్యక్తులను లేదా వస్తువులను ఢీకొట్టడం, చదువుతున్నప్పుడు తరచూ చదువుతున్న వరుసను తప్పిపోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తి ముఖాన్ని గుర్తించడంలో ఇబ్బంది పడటం వంటివి జరగవచ్చు.అందువల్ల చూపులో చిన్న మార్పు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా కంటి పరీక్ష చేయించుకోవడం ముఖ్యం'' అని చెప్పారు.
పెరిఫెరల్ విజన్ తగ్గడం అంటే?
డాక్టర్ స్వాతి చెప్పిన వివరాల ప్రకారం మనం ఎదురుగా చూస్తున్నప్పుడు కూడా చుట్టుపక్కల కనిపించే ప్రాంతాన్ని పెరిఫెరల్ విజన్ అంటారు. ఈ చూపు తగ్గుతున్నప్పుడు తరచూ వస్తువులను ఢీకొట్టడం, జనసమూహంలో నడవడానికి ఇబ్బంది పడటం, చదవడం కష్టంగా అనిపించడం లేదా రాత్రివేళ స్పష్టంగా కనిపించకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
వాహనం నడుపుతున్నప్పుడు లేదా రోడ్డుపై నడుస్తున్నప్పుడు ప్రమాదాలు జరగవచ్చు. కొన్నిసార్లు త్రుటిలో ప్రమాదాలు తప్పిపోవచ్చు.
గ్లకోమా వ్యాధిలో ఈ మార్పు నొప్పి లేకుండా చాలా నెమ్మదిగా జరగవచ్చు. మధ్య భాగంలోని చూపు చాలాకాలం స్పష్టంగానే ఉండటం వల్ల సమస్య తీవ్రంగా మారే వరకు పక్క చూపు తగ్గుతున్న విషయాన్ని గుర్తించలేకపోవచ్చు.
రాత్రివేళ చూడటంలో ఇబ్బంది మొదలై, ఆ తర్వాత పక్క చూపు క్రమంగా తగ్గిపోవడం 'రెటినైటిస్ పిగ్మెంటోసా' అనే అరుదైన వంశపారంపర్య వ్యాధికి కూడా సంబంధించిన లక్షణాలు కావచ్చు. వయసు పెరగడం వల్లే చూపునకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని చాలామంది భావించి వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు
చదివేటప్పుడు ఎక్కువ వెలుతురు అవసరం కావడం, రాత్రివేళ సరిగా కనిపించకపోవడం, చూపు మసకబారడం, కళ్ల ముందు చుక్కలు లేదా మెరుపులు కనిపించడం, రంగులను గుర్తించడంలో మార్పులు రావడం వంటివాటిని కొందరు వయసు ప్రభావంగా భావిస్తారు.
అయితే, ఇలాంటి లక్షణాలు తరచూ కనిపిస్తున్నా లేదా వాటిలో మార్పులు వస్తున్నా కంటి పరీక్ష చేయించుకోవడం అవసరం.
కళ్లద్దాలు పెట్టుకున్నప్పుడు చూపు స్పష్టంగా కనిపించడానికి, కళ్లు పూర్తిగా ఆరోగ్యంగా ఉండటానికి మధ్య తేడా ఏంటని డాక్టర్ స్వాతి హిరేను మేం అడిగాం.
దీనికి ఆమె సమాధానమిస్తూ, ''కళ్లద్దాలు పెట్టుకోవడం వల్ల చూపునకు సంబంధించిన పవర్ సమస్యను సరిచేసి స్పష్టంగా చూడగలుగుతాం. అయితే, అంతమాత్రాన కళ్లలో ఎలాంటి వ్యాధి లేదని చెప్పలేం. గ్లకోమా, రెటీనా లేదా కంటి వెనుక భాగానికి సంబంధించిన కొన్ని వ్యాధులు ప్రారంభ దశలో ఉన్నప్పటికీ కళ్లద్దాలతో స్పష్టంగా కనిపించవచ్చు. అందువల్ల కళ్లద్దాల పవర్ పరీక్షించుకోవడం, కళ్లను పూర్తిస్థాయిలో పరీక్షించుకోవడం రెండూ వేర్వేరు విషయాలు"
''కళ్లద్దాల పవర్ పరీక్షించేటప్పుడు ప్రధానంగా చూపు ఎంత స్పష్టంగా ఉంది, సరైన పవర్ ఎంత ఉండాలి అనే అంశాలను పరిశీలిస్తారు. అయితే, పూర్తిస్థాయి కంటి పరీక్షలో కంటి లోపలి ఒత్తిడి, రెటీనా, కంటి నుంచి మెదడుకు దృశ్య సమాచారాన్ని చేరవేసే ఆప్టిక్ నర్వ్తో పాటు కంటిలోని ఇతర భాగాలను కూడా పరీక్షించవచ్చు'' అని ఆమె వివరించారు.
అందువల్ల కళ్లద్దాలు వాడేవారు తమ పవర్ పెరిగిందా, తగ్గిందా అని మాత్రమే చూసుకోవడం సరిపోదు.
ముఖ్యంగా వయసు పెరిగినప్పుడు, కుటుంబంలో ఎవరికైనా గ్లకోమా ఉన్నప్పుడు, మధుమేహం ఉన్నప్పుడు లేదా చూపులో అకస్మాత్తుగా మార్పులు కనిపించినప్పుడు పూర్తిస్థాయి కంటి పరీక్ష చేయించుకోవడం అవసరం.
చూపు మందగించడం
చూపు తగ్గడం అంటే అకస్మాత్తుగా కళ్ల ముందు చీకట్లు కమ్ముకోవడం లేదా ఏమీ కనిపించకుండా పోవడం మాత్రమే కాదు.
చాలాసార్లు చాలా చిన్న మార్పులతో ఈ సమస్య మొదలవుతుంది.
నడుస్తున్నప్పుడు తరచూ వస్తువులను ఢీకొట్టడం, పక్క నుంచి వస్తున్న కారు లేదా స్కూటర్ కనిపించకపోవడం, కిటికీ ఊచలు లేదా తలుపు ఫ్రేమ్ వంకరగా కనిపించడం, తక్కువ వెలుతురులో చూడటానికి ఇబ్బంది పడటం, ఒక కంటిలో అకస్మాత్తుగా చూపు మసకబారడం వంటివి తీవ్రమైన కంటి సమస్యలకు తొలి సంకేతాలు కావచ్చు.
ముఖ్యంగా గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతీ వంటి కొన్ని వ్యాధుల ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. మరి చూపు తగ్గడం అసలు ఎలా మొదలవుతుందనే విషయాన్ని ముంబయిలోని వర్లీలో ఉన్న ఏఎస్జీ హాస్పిటల్ లిమిటెడ్‌లో మెడికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ సువీరా జైన్‌ను మేం అడిగాం.
''కంటిలో ఏ భాగం ప్రభావితమైందనే దానిపై చూపులో మార్పులు ఎలా మొదలవుతాయనేది ఆధారపడి ఉంటుంది.సాధారణంగా ఎక్కువగా కనిపించే గ్లకోమా రకంలో ప్రారంభ దశలో నొప్పి ఉండదు. ముందుగా చుట్టుపక్కల కనిపించే చూపు, అంటే పెరిఫెరల్ విజన్ తగ్గవచ్చు. దీంతో వ్యాధి బాగా ముదిరే వరకు చాలామంది సమస్యను గుర్తించలేరు" అని ఆమె అన్నారు.
''వయసు సంబంధిత మాక్యులర్ డీజెనరేషన్ లో మధ్య భాగంలోని చూపు క్రమంగా తగ్గవచ్చు. నిటారుగా ఉన్న గీతలు వంకరగా లేదా అలల మాదిరిగా కనిపించవచ్చు. చూపు మధ్యలో బూడిద రంగు మచ్చ లేదా ఖాళీ ప్రాంతం కనిపించవచ్చు. రెటినల్ డిటాచ్మెంట్లో చూపు తగ్గడంతో పాటు అకస్మాత్తుగా కళ్ల ముందు నల్లటి చుక్కలు లేదా ఆకారాలు తేలుతున్నట్లు కనిపించడం, కాంతి మెరుస్తున్నట్లు అనిపించడం, పక్క చూపు తగ్గడం వంటి లక్షణాలు ఉండవచ్చు" అన్నారామె.
''మధుమేహం కారణంగా వచ్చే కంటి వ్యాధుల్లో ప్రారంభంలో అసలు లక్షణాలే కనిపించకపోవచ్చు. కొందరికి చూపు మసకబారడం, కళ్ల ముందు చుక్కలు లేదా ఆకారాలు తేలుతున్నట్లు కనిపించడం, రాత్రివేళ చూడటంలో ఇబ్బంది, మధ్య భాగంలోని చూపులో అసాధారణ మార్పులు వంటి సమస్యలు ఎదురవుతాయి.
చిన్నపిల్లల్లో మయోపియా సమస్య కూడా పెరుగుతున్న ఆందోళనకు కారణమవుతోంది. మయోపియా అంటే దగ్గరగా ఉన్న వస్తువులు స్పష్టంగా కనిపించి, దూరంగా ఉన్నవి మసకగా కనిపించడం'' అని జైన్ వివరించారు.
ఒక అధ్యయనం అంచనాల ప్రకారం, 2050 నాటికి భారత నగరాల్లోని పిల్లల్లో మయోపియా సమస్య 48 శాతానికి చేరుకోవచ్చని డాక్టర్ జైన్ తెలిపారు.
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
- నడుస్తున్నప్పుడు తలుపు ఫ్రేమ్‌ను లేదా ఇతర వస్తువులను ఢీకొట్టడం.
- పక్క నుంచి వస్తున్న స్కూటర్ లేదా ఇతర వాహనాలను వెంటనే గుర్తించలేకపోవడం.
- కిటికీ ఊచలు, తలుపు ఫ్రేమ్ వంటి నిటారుగా ఉన్న గీతలు వంకరగా కనిపించడం.
- చూపు మధ్యలో బూడిద రంగు మచ్చ లేదా ఖాళీ ప్రాంతం కనిపించడం.
- తక్కువ వెలుతురులో చూడటానికి ఇబ్బంది పడటం.
- అకస్మాత్తుగా కళ్ల ముందు అనేక చుక్కలు లేదా ఆకారాలు తేలుతున్నట్లు కనిపించడం.
- కళ్ల ముందు కాంతి మెరుస్తున్నట్లు అనిపించడం.
- ఒక కంటిలో మాత్రమే చూపు మసకబారడం.
ఎలాంటి లక్షణాలు లేకుండానే కళ్లకు నష్టం జరగవచ్చా?
ఈ ప్రశ్నకు డాక్టర్ సువీరా జైన్ సమాధానమిస్తూ, ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా కళ్లకు నష్టం జరిగి ఉండవచ్చని చెప్పారు.
డాక్టర్ సువీరా జైన్ చెప్పిన వివరాల ప్రకారం, భారత్‌లో అనేక గ్లకోమా కేసులను గుర్తించడం లేదు. దక్షిణ భారతదేశంలో జనాభా ఆధారంగా నిర్వహించిన ఒక అధ్యయనాన్ని ప్రస్తావించిన వైద్య కథనం ప్రకారం, గ్లకోమా కేసుల్లో దాదాపు 90 శాతం నిర్ధరణ కాకుండా ఉండే అవకాశం ఉంది.
దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి గ్లకోమా ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడమే. నొప్పి ఉండదు. ముందుగా మధ్య భాగంలోని చూపు కాకుండా పక్క చూపు దెబ్బతినవచ్చు. దీంతో సమస్యను గుర్తించే సమయానికి చూపు గణనీయంగా దెబ్బతిని ఉండవచ్చు.
డయాబెటిక్ రెటినోపతీ ప్రారంభ దశలోనూ తప్పనిసరిగా లక్షణాలు కనిపిస్తాయని చెప్పలేం. అందుకే 'నాకు స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి నా కళ్లు ఆరోగ్యంగా ఉన్నాయి' అని భావించడం ఎప్పుడూ సురక్షితం కాదు అని డాక్టర్ సువీరా చెప్పారు.
ఈ వ్యాధుల వల్ల చూపు శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందా
కొన్ని వ్యాధుల కారణంగా చూపునకు జరిగిన నష్టాన్ని తర్వాత సరిచేయడం సాధ్యం కాకపోవచ్చు.
గ్లకోమా: ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే కోల్పోయిన చూపును తిరిగి పొందలేం. అయితే, వ్యాధిని ముందుగానే గుర్తించి సరైన చికిత్స ప్రారంభిస్తే మరింత నష్టం జరగకుండా తగ్గించవచ్చు లేదా నివారించవచ్చు.
డయాబెటిక్ రెటినోపతీ: ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. కానీ వ్యాధి ముదిరితే చూపు తీవ్రంగా దెబ్బతినవచ్చు. కొన్నిసార్లు శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది.
వయసు సంబంధిత మాక్యులర్ డీజెనరేషన్: ఈ వ్యాధి రెటీనాలోని 'మాక్యులా' అనే భాగాన్ని ప్రభావితం చేస్తుంది.
చదవడం, ముఖాలను గుర్తించడం వంటి పనులకు అవసరమైన మధ్య భాగంలోని స్పష్టమైన చూపులో మాక్యులా కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రారంభంలో లక్షణాలు లేకపోవచ్చు. కొన్నిసార్లు చూపు కాస్త మసకబారడం, రంగులు వెలిసినట్లు కనిపించడం, రంగులు లేదా వెలుతురులో తేడాలను గుర్తించే సామర్థ్యం తగ్గడం వంటి మార్పులు కనిపించవచ్చు.
ఈ వ్యాధి వల్ల నొప్పి ఉండదు. అందువల్ల చాలామందికి కంటి పరీక్ష అవసరమని అనిపించదు.
నిటారుగా ఉన్న గీతలు వంకరగా కనిపించడం లేదా చూపు మధ్యలో మచ్చ కనిపించడం మొదలయ్యే వరకు కొందరు కళ్లద్దాల పవర్ మారి ఉంటుందని భావిస్తారు.
అందువల్ల సరైన సమయంలో వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవడం ముఖ్యం.
ఎవరికి ప్రమాదం ఎక్కువ?
కొంతమంది తమ కళ్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
మధుమేహం ఉన్నవారు: మధుమేహంతో ఎంతకాలంగా బాధపడుతున్నారనే దానితో పాటు కంటి సమస్యల ప్రమాదం పెరగవచ్చు.
అధిక రక్తపోటు లేదా కుటుంబంలో గ్లకోమా చరిత్ర ఉన్నవారు: మధుమేహం, అధిక రక్తపోటు, కుటుంబ ఆరోగ్య చరిత్ర గ్లకోమా ప్రమాదాన్ని అంచనా వేసేటప్పుడు పరిగణనలోకి తీసుకునే ముఖ్యమైన అంశాలు.
40 ఏళ్లు పైబడినవారు, ముఖ్యంగా 60 ఏళ్లు దాటినవారు: వయసు పెరిగే కొద్దీ అనేక కంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
మయోపియా ఉన్నవారు: గ్లకోమా ప్రమాదాన్ని పెంచే అంశాల్లో మయోపియా కూడా ఒకటి.
దీర్ఘకాలంగా స్టెరాయిడ్లు వాడేవారు: ఎక్కువకాలం స్టెరాయిడ్లు వాడటం వల్ల గ్లకోమా ప్రమాదం పెరగవచ్చు. అందువల్ల వైద్యుల సలహా లేకుండా స్టెరాయిడ్లు కలిగిన ఐ డ్రాప్స్‌ను ఎక్కువకాలం వాడకూడదు.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి
డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయడం ప్రమాదకరం కావచ్చు.
- అకస్మాత్తుగా కళ్ల ముందు అనేక చుక్కలు లేదా ఆకారాలు తేలుతున్నట్లు కనిపించడం, కాంతి మెరుపులు కనిపించడం, చూపునకు అడ్డంగా తెర లేదా నీడ కమ్ముకున్నట్లు అనిపించడం, అకస్మాత్తుగా చూపు కోల్పోవడం వంటివి రెటినల్ డిటాచ్మెంట్ లక్షణాలు కావచ్చు.
- ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కంటి వైద్య నిపుణులను సంప్రదించాలి.
- బాణసంచా లేదా మరేదైనా కారణంగా కంటికి గాయమైతే కంటిని రుద్దకూడదు. గాయం చిన్నదిగా కనిపించినా వైద్య సహాయం తీసుకోవాలి.
- వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో కళ్లలో మంట లేదా నీరు కారడం మాత్రమే కాకుండా నొప్పి, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.
కంటి పరీక్షలు ఎంత తరచుగా చేయించుకోవాలి?
కంటి పరీక్షలు ఎంత వ్యవధిలో చేయించుకోవాలనే విషయంలో వివిధ వైద్య మార్గదర్శకాల్లో తేడాలు ఉన్నాయి.
డాక్టర్ జైన్ సలహా ప్రకారం, ఎలాంటి లక్షణాలు లేని 40 ఏళ్లు పైబడినవారు సాధారణంగా రెండేళ్లకు ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవాలి.
ఎక్కువ ప్రమాదం ఉన్నవారు, 60 ఏళ్లు దాటినవారు ఏటా ఒకసారి పరీక్ష చేయించుకోవాలని ఆమె సూచించారు.
మధుమేహం ఉన్నవారికి కంటి పాపను విస్తరింపజేసి చేసే 'డైలేటెడ్ ఐ ఎగ్జామినేషన్' క్రమం తప్పకుండా చేయించుకోవడం చాలా ముఖ్యం.
అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ మార్గదర్శకాల ప్రకారం, 40 ఏళ్ల వయసులో ప్రాథమిక కంటి పరీక్ష చేయించుకోవాలి.
ఆ తర్వాత 54 ఏళ్ల వరకు ప్రతి రెండు నుంచి నాలుగేళ్లకు ఒకసారి, 55 నుంచి 64 ఏళ్ల మధ్య ప్రతి ఒకటి నుంచి మూడేళ్లకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలని సిఫార్సు చేస్తోంది.
అందువల్ల అందరికీ ఒకే పరీక్షల షెడ్యూల్ వర్తించదు.
వయసు, మధుమేహం, కుటుంబ ఆరోగ్య చరిత్ర, ఇప్పటికే ఉన్న కంటి వ్యాధులు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంత తరచుగా పరీక్షలు చేయించుకోవాలో కంటి వైద్య నిపుణులు నిర్ణయించవచ్చు.
కళ్ల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?
డాక్టర్ జైన్ ప్రకారం, కొన్ని జాగ్రత్తలు చాలా ముఖ్యం.
- క్రమం తప్పకుండా పూర్తిస్థాయి కంటి పరీక్షలు చేయించుకోవాలి: ముఖ్యంగా 40 ఏళ్లు దాటినవారు, మధుమేహం ఉన్నవారు, కుటుంబంలో గ్లకోమా చరిత్ర ఉన్నవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
- మధుమేహం, రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి: సరైన ఆహారం, వ్యాయామం, అవసరమైన మందులు, క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం.
- పిల్లలను బయట ఆడుకునేలా ప్రోత్సహించాలి: దిల్లీలో 10 వేల మంది పాఠశాల విద్యార్థులపై నిర్వహించిన ఒక అధ్యయనాన్ని డాక్టర్ జైన్ ప్రస్తావించారు. రోజుకు రెండు గంటలకు పైగా బయట గడపడానికి, మయోపియా పెరుగుదల తగ్గడానికి మధ్య సంబంధం ఉన్నట్లు ఆ అధ్యయనంలో గుర్తించారు.
- ధూమపానానికి దూరంగా ఉండాలి: ధూమపానం వల్ల కంటిశుక్లం, ఏఎండీ ప్రమాదం పెరగడానికి సంబంధం ఉంది.
- అతినీలలోహిత కిరణాల నుంచి కళ్లను రక్షించుకోవాలి: బయటకు వెళ్లేటప్పుడు యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పించే సన్‌గ్లాసెస్ వాడటం ఉపయోగకరంగా ఉండవచ్చు.
- కంటికి గాయాలు కాకుండా జాగ్రత్తపడాలి: కంటికి గాయమైతే రుద్దకూడదు. వైద్యులను సంప్రదించాలి.
- వాయు కాలుష్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు: డాక్టర్ జైన్ ప్రస్తావించిన యూకే బయోబ్యాంక్ 12 ఏళ్ల అధ్యయనంలో పీఎం 2.5 కాలుష్యానికి అత్యధికంగా గురైనవారిలో గ్లకోమా ప్రమాదం, అతి తక్కువగా గురైనవారితో పోలిస్తే 10 శాతం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఈ అధ్యయనం కాలుష్యానికి, గ్లకోమాకు మధ్య సంబంధాన్ని మాత్రమే సూచిస్తోంది. కాలుష్యం వల్లే గ్లకోమా వస్తుందని నిరూపించడం లేదు.
అన్నింటికంటే ముఖ్యంగా వైద్యుల సలహా లేకుండా ఐ డ్రాప్స్‌ను ఎక్కువకాలం వాడకూడదు. ముఖ్యంగా స్టెరాయిడ్లు ఉన్న డ్రాప్స్‌ను వైద్యుల సూచన లేకుండా ఉపయోగించకూడదు.
బాణసంచా కాల్చేటప్పుడు లేదా కంటికి గాయమయ్యే ప్రమాదం ఉన్న పనులు చేసేటప్పుడు కళ్లకు రక్షణ కల్పించే పరికరాలను ఉపయోగించాలి.
అకస్మాత్తుగా చూపు తగ్గడం, కాంతి మెరుపులు కనిపించడం, కళ్ల ముందు అనేక చుక్కలు, గీతలు కనిపించడం లేదా తెర కమ్ముకున్నట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
జీవనశైలిలో ముఖ్యమైన మార్పులు చేసుకోవాలన్నా, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలన్నా, మందులు వాడాలన్నా, శారీరక వ్యాయామం ప్రారంభించాలన్నా వైద్యులు, తగిన శిక్షణ పొందిన నిపుణుల సలహా తీసుకోవడం అవసరం.
శరీర ఆరోగ్య పరిస్థితిని, కనిపిస్తున్న లక్షణాలను వైద్యులతో సరిగ్గా పరీక్షించుకున్న తర్వాత వారి సలహా మేరకే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం మంచిది.
వైద్యులను సంప్రదించకుండా సొంతంగా చికిత్స చేసుకోవడం ప్రమాదకరం.
(గమనిక: ఈ కథనం అవగాహన కోసం మాత్రమే. మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించండి.)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)