‘ఐ డోంట్‌ కేర్‌.. గెలిస్తే గెలుస్తా, లేదంటే ఓడిపోతా.. ఫైట్ అయితే తప్పదు’.. ఏబీ వెంకటేశ్వరరావు బీబీసీ ఇంటర్వ్యూలో ఇంకా ఏమేం చెప్పారు?

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

విజయవాడ మేయర్‌ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి పోటీలో ఉన్నారు.

అయితే వామపక్షాలు, కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థిగా ఇంటలిజెన్స్‌ మాజీ డీజీ, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బరిలో నిలవడం ఆసక్తిని పెంచింది.

పోలీస్‌ శాఖలో పదవీ విరమణ చేసిన తర్వాత గత రెండేళ్లుగా వివిధ సామాజిక సమస్యలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్న ఆయన ఉన్నట్టుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం.. అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి నిలవడం చర్చనీయంగా మారింది.

విజయవాడ మేయర్‌ ఎన్నికలో ఆయన పోటీకి కారణమేమిటి.. ఎన్నికల్లో గెలిస్తే ఆయన అజెండా ఏమిటి, కూటమి అభ్యర్ధి రాధాతో ఉన్న అనుబంధం ఏమిటి..

కాంగ్రెస్‌ పార్టీ సహకారం ఎందుకు తీసుకుంటున్నారు?

ఈ విషయాలన్నిటిపై ఏబీ వెంకటేశ్వరరావు ‘బీబీసీ తెలుగు’తో మాట్లాడారు.

ప్రశ్న: 2025 ఏప్రిల్‌లో అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన మీరు.. నాకు పదవులపై ఎలాంటి ఆశలేదని ప్రకటించారు.. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ మేయర్‌ పదవికి పోటీ చేయడానికి కారణం ఏమిటి?

ఏబీవీ: ఎమ్మెల్యే అయిపోవాలనీ, ఎంపీ అయిపోవాలనో మంత్రి అవ్వాలనో కోరికలు లేవు.. కానీ ఇప్పుడు మేయర్‌ పదవికి ఎందుకు పోటీ చేస్తున్నానంటే విజయవాడలో ప్రత్యేక వాతావరణం ఉంది. ఇక్కడి ప్రజలు విశాల దృక్పథం, ప్రగతిశీల భావజాలం కలిగిన వాళ్లు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్‌ పార్టీ ముందుకొచ్చి మీరు పోటీ చేస్తానంటే మేం మద్దతిస్తామని చెప్పాయి.. దీంతో ఇక్కడ రాజకీయంగా లీడ్‌ తీసుకోవడానికి ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికి ఇదే సరైన సమయం అని భావించి పోటీ చేస్తున్నాను.

ప్రశ్న: విజయవాడ సీటును జనసేనకి ఇవ్వడం ఇష్టం లేక తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం మీకు మద్దతిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.. దీనిపై మీరేమంటారు,.

ఏబీవీ: చేయొచ్చు.. నిజంగా ఆ విధంగా సపోర్ట్‌ చేయొచ్చు కూడా కానీ బయటకు వచ్చి బహిరంగంగా సపోర్ట్‌ చేయరు.. కానీ ఓట్లేయొచ్చు.. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను పోటీ చేయడం లేదు.

ప్రశ్న: జనసేనకి, ప్రత్యేకించి వంగవీటి రాధాకృష్ణకి టికెట్ ఇవ్వడం ఇష్టం లేక తెలుగుదేశం పార్టీలోనే ఓ వర్గమే మీతో పోటీ చేయిస్తోంది అనే విమర్శలున్నాయి..

ఏబీవీ: అది వాస్తవం కాదు.. అదైతే వందశాతం చెప్పగలను.. లెఫ్ట్‌ పార్టీలు నోరు తెరిచి అడిగిన తర్వాతే నాకు మేయర్‌ పదవికి పోటీ చేయాలనే ఆలోచన కలిగింది.. ఇందులో తెలుగుదేశం పాత్ర ఏమీ లేదు.

ప్రశ్న: ఇక్కడ మేయర్‌ సీటు జనసేనకి కాకుండా టీడీపీకి ఇచ్చి ఉంటే మీరు పోటీ చేసే వారా?

ఏబీవీ: పోటీ చేసే వాడిని

ప్రశ్న: ఎన్నికలలో మీ ప్రధాన ప్రచారాస్త్రం ఏమిటి?

ఏబీవీ: పాలకులు విజయవాడపై వివక్ష చూపిస్తున్నారు. నేను పోటీ చేస్తున్నానని చెప్పడం లేదు.. అంకెలతో సహా ఆధారాలు నావద్ద ఉన్నాయి.

విశాఖకు రూ. 4 వేల కోట్లు కేటాయించి.. విజయవాడకి రూ. 140 కోట్లు కేటాయించడం అనేది దుర్మార్గం.. అంతెందుకు పక్కనే ఉన్న మంగళగిరికి రూ.250 కోట్లు కేటాయించారు. కేంద్రం ఇచ్చే నిధులను పాలకులు వాళ్లు ఇష్టమొచ్చినట్టు కేటాయించుకుంటున్నారు.. విజయవాడ ప్రజలు చేసిన పాపం ఏమిటి.. కూటమికి నగరంలోని మూడు సీట్లూ గెలిపించారు.. మరి వాళ్లకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు.. ఇలాంటి వివక్షపై ప్రశ్నిస్తాం.. నేను ప్రశ్నించగలిగినంత గట్టిగా నాతో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్ధులు ప్రశ్నించగలరా.. అని సూటిగా అడుగుతున్నాను.. విజయవాడకు జరుగుతున్న అన్యాయంపై గట్టిగా నిలదీసి అడిగేందుకు నాలాంటి వాడే అర్హుడు. ఇదే ప్రజల్లోకి తీసుకువెళ్తాను

ప్రశ్న: గెలుపుపై మీ అంచనాలు ఎలా ఉన్నాయి

ఏబీవీ: ఏమో నాకు తెలియదు.. ఐ డోంట్‌ కేర్‌.. గెలిస్తే గెలుస్తా.. లేదంటే ఓడిపోతా.. ఫైట్‌ అయితే కంటిన్యూ చేస్తా

ప్రశ్న: గెలిస్తే మీ విజయవాడ నగరాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు?

ఏబీవీ: నేనేమీ అది ఇది చేస్తా అని ప్రగల్భాలు పలకను. విజయవాడకి ఉన్న బడ్జెట్‌ని నిజాయితీగా ఖర్చు పెడతాను.. కచ్చితంగా అవినీతి లేకుండా పాలన చేస్తాను.. కార్పొరేషన్‌లో ప్రతి పనికీ డబ్బులు తీసుకునే సంస్కృతిని రూపుమాపుతాను.. నగరంలో స్ట్రీట్‌ వెండర్స్‌ సమస్యలను పరిష్కరిస్తాను. బుడమేటి ముంపు సమస్య పరిష్కారం కోసం సీరియస్‌గా కృషి చేస్తాను.

ప్రశ్న: జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయానికి గురైనవారు ఎవరైనా సమాచారం ఇవ్వాలంటూ మీరొక వాట్సాప్ నంబర్ గతంలో చెప్పారు.. ఇప్పటివరకు ఆ నంబర్‌ కి ఏమైనా సమస్యలు వచ్చాయా? వాటి పరిష్కారానికి మీరేమైనా కృషి చేశారా?

ఏబీవీ: కొన్ని సమస్యలు వచ్చాయి,.. కొన్ని కేసుల్లో జరిగిన అన్యాయాలపై ఫిర్యాదులు వచ్చాయి. వాటి పరిష్కారానికి కృషి చేశాను. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసు గురించి నేను టేకప్‌ చేసిన తర్వాతే కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రశ్న: మీకు వంగవీటి రాధాకృష్ణ కుటుంబ సభ్యులతో ఏమైనా బంధుత్వం ఉందా?

2019 ఎన్నికలకు ముందు వంగవీటి రాధా వైయస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి తెలుగుదేశం లోకి వచ్చారు అప్పుడు మీరు ఇంటిలిజెన్స్‌ డీజీగా ఉన్నారు.. అప్పుడు ఆయన టీడీపీలో రావడం వెనుక మీరే ఉన్నారనే ప్రచారం జరిగింది.. ఇది ఎంతవరకు నిజం?

ఏబీవీ: 2019కి ముందు వంగవీటి అనే సినిమా వచ్చింది. దానిపై రాధా అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసన చేపట్టారు అప్పట్లో ఇంటలిజెన్స్‌ డీజీగా ఉన్నాను.. అయితే విజయవాడ పోలీసులు రాధా నిరసనపై సరిగ్గా యాక్ట్‌ చేయలేదు. నేను ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాను.. అది రాధాకి తెలుసు, ఆ తర్వాత వైసీపీ నేత గౌతంరెడ్డి.. వంగవీటి రంగాపై కొన్ని అభ్యంతర వ్యాఖ్యలు చేశారు.. కానీ దానిపై వైసీపీ నాయకత్వం గౌతంరెడ్డి పట్ల తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నట్టు ప్రకటించి... ఆ తర్వాత పార్టీలో అతన్ని యథావిధిగా కొనసాగించారు. ఈ పరిణామంతో రాధా చాలా బాధపడ్డారు. అప్పుడు నేను వ్యక్తిగతంగా ఉన్న అనుబంధంతో రాధాతో మాట్లాడిన మాట నిజం.. నేను రాజకీయంగా డెసిషన్‌ తీసుకోవాలి అని చెప్పినప్పుడు ఏదో ఒకటి తీసుకోమని సజెస్ట్‌ చేశాను. ఆ తర్వాత టీడీపీ నేతలు కూడా సంప్రదించడంతో పార్టీ మారారు.

ప్రశ్న: ఇప్పుడు అదే రాధా పోటీ చేస్తున్నారనే మీరు ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నారని ప్రచారం ఉంది?

ఏబీవీ: ఇది కరెక్ట్‌ కాదు.. రాధా కూడా దీన్ని నమ్మరు.. నేను తనను ఓడించడానికే వచ్చానని రాధా పొరపాటున కూడా భావించరు.. ఆ నమ్మకం నాకుంది.

ప్రశ్న: కూటమి ప్రభుత్వం రాగానే మిమ్మల్ని ఏపీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించింది.. కానీ మీరు ఆ పదవిని తీసుకోలేదు.. కారణం?

ఏబీవీ: ఆ పోస్టులో కూర్చొని ఖాళీగా ఉండి.. ఈగలు తోలుకోవడం నాకు ఇష్టం లేదు.. నాకు చాలా లక్ష్యాలు ఉన్నాయి.. అందుకే తీసుకోలేదు..

ప్రశ్న: రాష్ట్రంలో ఎన్నికల సంఘం తీరును విపక్ష నేత వైఎస్‌ జగన్‌ తీవ్రంగా విమర్శిస్తున్నారు.. ఈసీ తీరుపై మీరేమంటారు?

ఏబీవీ: ఎన్నికల ప్రచారానికి తక్కువ రోజుల సమయం ఇవ్వడం ఏమిటండీ.. అసెంబ్లీ ఎన్నికలకు 30రోజుల సమయం ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు తక్కువ రోజులు ఇవ్వడం సరికాదు. అసలు ప్రజలను కలిసి మా అజెండా చెప్పుకునే సమయం ఇవ్వాలి కదా.. టైం ఎలా సరిపోతుంది?

ఇందులో స్టేట్‌ గవర్నమెంట్‌ తప్పు కూడా ఉంది.. ఈ ఎన్నికల గురించి ఈసీ ప్రభుత్వానికి ఎప్పుడో అలర్ట్‌ చేసింది.. ఇక షెడ్యూల్‌లోగా ఎన్నికలు జరపాలని కోర్టులు స్వయంగా సుప్రీంకోర్టు ఎన్నోమార్లు తీర్పులు చెప్పింది. ప్రభుత్వం ఈ ఏడాది జనవరి ఫిబ్రవరిల్లోనే ఎన్నికలు జరపాల్సి ఉంది. ఈసీ తీరుతో పాటు ప్రభుత్వ తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను..

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)