మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
ఒక ఫేస్బుక్ పోస్టుకు వేసిన మరణ శిక్షను రద్దు చేసిన సౌదీ అరేబియా
- రచయిత, దైనిక్ హేవావితారణ, జులియానా ఖాన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ఫేస్బుక్లో కామెంట్ చేసినందుకు ఓ వ్యక్తికి విధించిన మరణశిక్షను సౌదీ అరేబియా సుప్రీంకోర్టు రద్దు చేసిందని శ్రీలంక ఉప విదేశాంగమంత్రి అరుణ్ హేమచంద్ర చెప్పారు.
ఇస్లాం మతాన్ని, మహమ్మద్ ప్రవక్తను అవమానించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై 27ఏళ్ల అనోజన్ శివరాసాకు సౌదీ అరేబియాలోని అప్పీల్ కోర్ట్ సెప్టెంబర్‌లో మరణశిక్ష విధించింది.
ఈ కేసు శ్రీలంకలో తీవ్ర సంచలనం సృష్టించింది.
శివారాసాకు క్షమాభిక్ష లభింపజేసేలా చేయడానికి దౌత్యపరమైన ప్రయత్నాలు జరిగాయి.
సౌదీ అరేబియా అత్యున్నత న్యాయస్థానం ఆ మరణశిక్షను రద్దు చేసిందని ఫేస్బుక్లో చేసిన పోస్ట్‌లో హేమచంద్ర చెప్పారు. ఈ విషయంలో కృషిచేసిన ఇరుదేశాల అధికారులు, న్యాయబృందాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
హిందూ యాత్రికుల వెనక వస్తున్న ఓ యువ ముస్లిం వ్యక్తి కుక్కను తన్నుతున్న దృశ్యాలు జూన్ చివర్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ఆన్లైన్లో మతపరమైన వాదోపవాదాలు జరిగాయి.
ఈ చర్చ సమయంలో ఓ వ్యక్తి హిందూ దేవతను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందిస్తూ శివరాసా తమిళంలో మహమ్మద్ ప్రవక్తను అవమానించేలా కామెంట్ చేశారు.
శివరాసా వెంటనే ఆ వ్యాఖ్యను తొలగించి, క్షమాపణ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు. అయినప్పటికీ ఆ కామెంట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆయన పనిచేస్తున్న సంస్థ, సౌదీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జూలైలో ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని, సోషల్ మీడియా ఖాతాలను సౌదీ అధికారులు డిలీట్ చేశారు.
శివరాసాపై తదుపరి న్యాయపరమైన చర్యలుంటాయా లేదా, ఆయన ఇంకా నిర్బంధంలోనే ఉంటారా, ఉంటే ఎంతకాలం ఉంటారనే విషయాలపై స్పష్టత లేదు.
అంతకుముందు అల్ -అహ్సా క్రిమినల్ కోర్టు శివరాసాకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 30లక్షల సౌదీ రియాల్స్ జరిమానా విధించింది.
శివరాసాకు మరణశిక్షను సౌదీఅరేబియా రద్దు చేసినట్టు ఆ దేశంతో న్యాయపరమైన చర్చల్లో పాల్గొంటున్న శ్రీలంక పార్లమెంట్ సభ్యులు ఫైజర్ ముస్తఫా బీబీసీతో ధ్రువీకరించారు. సుప్రీంకోర్ట్ తాజా తీర్పును పరిశీలిస్తున్నామన్నారు.
సెప్టెంబర్ 28నుంచి శివరాసాతో తమకు నేరుగా ఎలాంటి కాంటాక్ట్ లేదని ఆయన కుటుంబసభ్యులు గతంలో తెలిపారు.
శివరాసా ప్రాణాలను కాపాడాలని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా విజ్ఞప్తులు చేశాయి.
అంతకుముందు అప్పీళ్ల కోర్టు మరణశిక్ష విధించిన తర్వాత ఆయన తల్లి కొడుకుకు క్షమాభిక్ష పెట్టాలని విజ్ఞప్తి చే శారు.
"మా అబ్బాయి తప్పులను మన్నించి వాడికి క్షమాభిక్ష ప్రసాదించి తిరిగి మా దగ్గరకు పంపమని వేడుకుంటున్నా’’ అని శివరాసా తల్లి రసమాణికం యోగలక్ష్మి కోరారు. తన కొడుకు ప్రాణాలను కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
సెప్టెంబర్ 28 తర్వాత ఎలాంటి సమాచారం లేకపోవడంతో....
సౌదీ అరేబియాలోని అప్పీళ్ల కోర్టు శివరాసాను దోషిగా తేల్చి మరణశిక్ష విధించిన తర్వాత శ్రీలంక వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. క్షమాభిక్ష కోరుతూ పౌర సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి. అనోజన్‌కు క్షమాభిక్ష లభించేలా వివిధ రాజకీయ పార్టీలు, ప్రభుత్వ సంస్థలు దౌత్యపరమైన ప్రయత్నాలను సమన్వయంతో కొనసాగించాయి.
అయితే సెప్టెంబర్ 28 తర్వాత ఆయన గురించి కుటుంబానికి ఎలాంటి సమాచారం అందలేదు. దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ ఇకపై ఈ విషయంపై ఎలాంటి ప్రకటనలు చేయవద్దని కుటుంబానికి శ్రీలంక ప్రభుత్వం సూచించింది.
మరణ శిక్ష అమలు చేసే తేదీపై సౌదీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారాన్ని విడుదల చేయలేదు. ఈ శిక్ష ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టంగా తెలియలేదు. కుటుంబ సభ్యులకు లేదా విదేశీ రాయబార కార్యాలయాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా మరణ శిక్ష అమలు చేసిన చరిత్ర సౌదీ అరేబియాకు ఉంది. సాధారణంగా శిక్ష అమలు చేసిన తర్వాతే బంధువులకు ఈ విషయాన్ని తెలియజేస్తుంటారు.
‘శ్రీలంక నుంచే ఫిర్యాదులు’
"ఈ విషయం గురించి సౌదీ అరేబియాలోని ప్రజలకు ఏం తెలియదు. శ్రీలంకలో ఉన్న కొందరు వ్యక్తులే నా సోదరుడు పనిచేస్తున్న కంపెనీకి ఈ-మెయిళ్లు పంపారు. ఆ వ్యక్తులెవరో చెప్పాలనుకోవడం లేదు" అని అనోజన్ సోదరుడు హమ్సిదన్ శివరాసా బీబీసీ సింహాళతో చెప్పారు. ఈ మెయిల్స్ ఆధారంగానే అనోజన్ కంపెనీ ఆ విషయాన్ని సౌదీ అరేబియా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారని హమ్సిదన్ చెప్పారు.
అంతకు ముందు ఏం జరిగింది?
ఈ కేసులో కీలక మలుపు సెప్టెంబర్ 17నచోటు చేసుకుంది. అనోజన్పై దేశంలోని సైబర్ నేరాల చట్టం కింద కాకుండా, షరియా చట్టం కింద విచారణ జరపాలని సౌదీ ప్రాసిక్యూటర్లు అప్పీల్ చేశారు. అప్పీళ్ల కోర్టు వారి విజ్ఞప్తిని ఆమోదించి, అనోజన్‌కు విధించిన శిక్షను మరణశిక్షగా మార్చింది.
అనోజన్‌కు సాయం చేయడానికి అవకాశం ఉన్న అన్ని చర్యలు తీసుకుంటున్నామని శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
అనోజన్ కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 21న శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస నాయకేతో అధ్యక్ష కార్యాలయంలో భేటీ అయ్యారు. అనోజన్‌కు క్షమాభిక్ష లభించేలా ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుందని అధ్యక్షుడు వారికి హామీ ఇచ్చారు. దీని కోసం సౌదీ అరేబియా అధికారులతో దౌత్య మార్గాల ద్వారా చర్చలు జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కేసు వివిధ మత వర్గాలను ఒక్కటి చేసింది. రామన్న నికాయ, అమరపుర మహా నికాయకు చెందిన బౌద్ధ మత ప్రముఖులు, హిందూ మత నాయకులతో కలిశారు. అత్యవసరంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఒక వినతి పత్రాన్ని అధ్యక్ష కార్యాలయానికి సమర్పించారు.
నలుగురు సభ్యులతో కూడిన శ్రీలంక న్యాయ ప్రతినిధుల బృందం ఈ వారంలో సౌదీ అరేబియా వెళ్లి అనోజన్ స్థానిక న్యాయవాదులతో సమావేశమయింది.
"సౌదీ అరేబియాలో అనోజన్ కేసును రెండు న్యాయ సంస్థలు విచారించాయి. ఆ రెండు సంస్థల న్యాయవాదులతో కలిసి, కేసు పురోగతిపై చర్చించి, ఇకపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ప్రణాళిక రూపొందించడానికి మేం అక్కడికి వెళ్తాం" అని బృందంలోని సభ్యుడు, అధ్యక్ష న్యాయవాది ఉపుల్ కుమారప్పెరుమ అంతకుముందు బీబీసీ సింహళకు తెలిపారు.
కంగారుపడుతున్న కుటుంబం
మరణశిక్షపడ్డాక స్వదేశంలోని కుటుంబ సభ్యులతో అనోజన్ ఎలాంటి సంప్రదింపులు జరప లేకపోయారు.
"నా సోదరుడు రెండు రోజుల నుంచి ఫోన్ చేయడం లేదు" అని హమ్సిదన్ సెప్టెంబర్ 28న తెలిపారు. " ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనే విజ్ఞప్తితో రాయబార కార్యాలయానికి సమాచారం చేరవేశాం. ఏదైనా అప్డేట్ ఉంటే చెప్పాలని కోరాం. వారు పరిశీలిస్తామన్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదు. అందుకే ఇంకా మేం ఎదురు చూస్తూనే ఉన్నాం" అని వాపోయారు.
సౌదీ అరేబియాలోని జైళ్లలో మరణ శిక్షపడిన ఖైదీలకు సాధారణంగా వ్యక్తిగత మొబైల్ ఫోన్లు ఉపయోగించే అవకాశం ఉండదు. జైలు అధికారులు పర్యవేక్షణలో అధికారిక మార్గాల ద్వారానే కాల్స్ ఏర్పాట్లు చేస్తారు.
10 మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తికి మరణశిక్ష
సౌదీ అరేబియాలో ఆన్లైన్లో వ్యక్తం చేసిన అభిప్రాయాలకు విధిస్తున్న కఠిన శిక్షలపై మానవ హక్కుల సంస్థలు పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశాయి.
సౌదీ అరేబియాకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మహ్మద్ అల్ గామ్ది సోషల్ మీడియా చేసిన వ్యాఖ్యలకు జూలై 2023లో మరణశిక్ష విధించారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
" కేవలం 10 మంది ఫాలోవర్స్ ఉన్న తన రెండు ‘ఎక్స్’ ఖాతాల ద్వారా కామెంట్స్ చేసినందుకు మహ్మద్ బిన్ నాసర్ అల్- గామ్దీకి మరణశిక్ష విధించారు. ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేయడం తప్ప వేరే నేరం చేయలేదు" అని అప్పట్లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా విభాగం పరిశోధన, న్యాయవాద కార్యకలాపాల డైరెక్టర్ ఫిలిప్ లూథర్ వ్యాఖ్యానించారు.
అల్-గామ్దీకి విధించిన మరణశిక్షను రద్దు చేసి, 30 ఏళ్ల జైలు శిక్షగా మార్చారని సౌదీ అరేబియాలో మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే స్వతంత్ర స్వచ్చంద సంస్థ ఏఎల్క్యూఎస్టీ తెలిపింది.
సౌదీ ఆరేబియాలో కోటి మందికిపైగా విదేశీ కార్మికులు పనిచేస్తున్నారని అంతర్జాతీయ వలసల సంస్థ (ఐవోఎం) పేర్కొంది. తక్కువ వేతనాలు పొందే వలస కార్మికులు భాషాపరమైన అడ్డంకులు, సరైన న్యాయ సహాయం అందని కారణంగా సౌదీ న్యాయవ్యవస్థలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి.
సౌదీ అరేబియా కోర్టులు మాదకద్రవ్యాల నేరాలు లేదా హత్య కేసుల్లో విధించే శిక్షలతో పోలిస్తే దైవదూషణ కేసుల్లో వేసిన శిక్షలు అమలు కావడం చాలా అరుదుగా జరుగుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)