ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. గుడ్‌నైట్
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.
‘‘ఈ ర్యాలీ ఏ ఒక్క వ్యక్తి కోసమో లేదా ఏ ప్రత్యేక రాజకీయ పార్టీ కోసమో కాదు. సామాన్య పౌరుల ఓట్లను కాపాడటానికే ఈ ర్యాలీ. పది లక్షల మంది దిల్లీకి తరలివస్తారు’’
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. గుడ్‌నైట్
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.

ఫొటో సోర్స్, kcvenugopalmp
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం మరోసారి డిమాండ్ చేశారు.
దిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో నవంబర్ 1న ఇండియా కూటమి ర్యాలీ జరగనున్న నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కేసీ వేణుగోపాల్ సమావేశమయ్యారు.
ఈ భారీ ర్యాలీలో 10 లక్షల మంది పాల్గొంటారని ఆయన చెప్పారు.
"ఎస్ఆర్ఐను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని సమర్థవంతంగా నిర్వీర్యం చేశారు. ఈ విధానంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. ఈ ర్యాలీ ఏ ఒక్క వ్యక్తి కోసమో లేదా ఏ ప్రత్యేక రాజకీయ పార్టీ కోసమో కాదు. సామాన్య పౌరుల ఓట్లను కాపాడటానికే ఈ ర్యాలీ. పది లక్షల మంది దిల్లీకి తరలివస్తారు’’ అని ఆయన అన్నారు .
"ఇది సీనియర్ నాయకులందరి బాధ్యత. మనమందరం కలిసికట్టుగా పనిచేసి ఐక్యంగా ముందుకు సాగుదాం" అని చెప్పారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉత్తరప్రదేశ్, హరియాణా పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

ఫొటో సోర్స్, Sener Yilmaz Aslan/Getty Images
ఫ్రాన్స్‌లో శనివారం నాటి నిరసనలు, ఘర్షణలకు సంబంధించి దాదాపు 13వందలమందిని అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ నిరసనల్లో లక్షలాదిమంది ప్రజలు పాల్గొన్నారు.
శనివారం పగటిపూట నిరసనలు చాలావరకు శాంతియుతంగా సాగాయి. రాత్రి పొద్దుపోయాక కొన్నిచోట్ల నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు జరిగాయి. పారిస్ సహా పలు నగరాల్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. వాటర్ కానన్లను ఉపయోగించారు.
మార్సెయ్ నగరంలో నిరసనకారులు రోడ్లపై ఏర్పాటు చేసిన బారికేడ్లకు నిప్పుపెట్టారు. బోర్డో నగరంలో ఓ దుకాణానికి అమర్చిన చెక్క పలకలను కొందరు తొలగించారు.
అయితే, గత వారాంతంలో జరిగిన స్థాయిలో అల్లర్లు, దోపిడీలు జరగకుండా అధికారులు ఇప్పటివరకు నియంత్రించగలిగారు.
శనివారం జరిగిన నిరసనల్లో సుమారు నాలుగు లక్షల పదివేల మంది పాల్గొన్నట్టు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.
అయితే ఈ సంఖ్య దాదాపు 8 లక్షలుగా ఉంటుందని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి.

ఫొటో సోర్స్, Sener Yilmaz Aslan/Getty Images
జీవన వ్యయం పెరగడం, పాఠశాలల్లో అధ్వాన పరిస్థితులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా దాదాపు 70 వేల మంది పోలీసులను మోహరించారు. పలు నగరాల్లో ఆంక్షలు విధించారు.
గతంలో జరిగిన నిరసనల సందర్భంగా పోలీసుల సంఖ్య కంటే ఆందోళనకారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పరిస్థితులు అదుపుతప్పాయి. వందలాది వ్యాపార సంస్థల్లో దోపిడీలు జరిగాయి. భవనాలకు నిప్పుపెట్టారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు నిర్వహించే ప్రదర్శనలకు మాత్రమే అనుమతి ఉంటుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఈ వారం ప్రారంభంలోనే ఆదేశాలు జారీ చేశారు.

ఫొటో సోర్స్, Raj K Raj/Hindustan Times via Getty Images
బెంగళూరు ఐటీ కంపెనీల్లో కన్నడిగులకు ఉద్యోగాలను నిరాకరిస్తున్నారంటూ ఫిర్యాదులు రావడం బాధాకరమని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అన్నారు.
స్థానికంగా కన్నడం మాట్లాడేవారిని ఉద్యోగ అవకాశాల్లో పక్కనపెడుతున్న అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.
ఏదైనా ప్రైవేటు సంస్థ ఉద్దేశపూర్వకంగా కన్నడిగులను పక్కనపెట్టినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.
కన్నడిగుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తూ, వారి సమస్యలపై స్పందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Roy Rochlin/Getty Images for Newsweek
ప్రపంచ సంక్షోభాలను ఐక్యరాజ్యసమితి చూస్తూ ఉండిపోకుండా నాయకత్వ పాత్ర పోషించాలని విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ చెప్పినట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా జరిగిన చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్ సమ్మేళన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడారు.
‘‘మనం పరిపూర్ణత లేని ప్రపంచంలో జీవిస్తున్నాం. అయితే, మరింత మెరుగైన ప్రపంచం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనేఉన్నాం. ఐక్యరాజ్యసమితి దానిలోని లోపాలను, పరిమితులను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకుకృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భాగస్వామ్యం లేకుండా చేయకూడదు. ప్రపంచ సంక్షోభాలను చూస్తూ ఉండిపోకుండా ఐక్యరాజ్యసమితి నాయకత్వ పాత్ర పోషించాలి” అని జైశంకర్ అన్నారు.

ఫొటో సోర్స్, X/@@YKhemchandSingh
మణిపుర్లో శాశ్వత శాంతిని నెలకొల్పే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్త కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ తెలిపారు.
రాష్ట్రంలోని అధికారికంగా గుర్తించిన 33 షెడ్యూల్డ్ తెగలతో సహా మొత్తం 36 వర్గాల నుండి ఈ కమిటీలో ప్రతినిధులు ఉంటారని ఆయన అన్నారు.
శనివారం ఇంఫాల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఖేమ్‌చంద్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో ఈ శాంతి కమిటీ ప్రాధాన్యం గురించి చర్చించినట్లు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించేందుకు ఖేమ్‌చంద్ సింగ్ ఈ నెల అక్టోబర్ 10న న్యూదిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.
యాదృచ్ఛికంగా, అదే రోజు మణిపుర్లో భారీ హింస చెలరేగింది. 12 గంటల వ్యవధిలో కామ్జోంగ్, కాంగ్పోక్పిఉఖ్రుల్ జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో తొమ్మిది మంది మరణించారు.
మే 3, 2023 నుంచి మెయితీ సమాజానికి, కుకీ తెగకు మధ్య కొనసాగుతున్న హింస ఈ ఏడాది కొంతమేరకు సద్దుమణిగింది. అయితే, ఫిబ్రవరిలో ఉఖ్రుల్ జిల్లాలో కుకీ, నాగా యువకుల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత పరిస్థితి మళ్లీ తీవ్రరూపం దాల్చింది.
దాదాపు ఎనిమిది నెలల క్రితం ప్రారంభమైన నాగ-కుకీ ఘర్షణలో ఇప్పటివరకు కనీసం 22 మంది నాగాలు, 31 మంది కుకీలు మరణించారు. మైతేయి, కుకీ, నాగ వర్గాల మధ్య నెలకొన్న ఈ త్రిముఖ ఉద్రిక్తత రాష్ట్ర ప్రభుత్వానికి సవాళ్లను మరింత తీవ్రతరం చేసింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
సౌదీ అరేబియా రాజధాని రియాద్ నుంచి విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమైన ఆదివారం నాడే మరోసారి రియాద్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
హూతీ తిరుగుబాటు దారులు పదేపదే దాడులకు పాల్పడినట్టు కథనాలు వచ్చిన తరువాత రియాద్‌లోని కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రెండు వారాలపాటు మూసివేశారు.
ఆదివారం తెల్లవారుజామున ఒక విమానం ఇక్కడి నుండి టేకాఫ్ అయినట్లు ప్రపంచవ్యాప్తంగా విమానాల కదలికలను ట్రాక్ చేసే 'ఫ్లైట్రాడార్' వెబ్సైట్ పేర్కొంది.
అయితే, రాజధాని రియాద్‌లో తాజాగా జరిగిన ఈ పేలుడుకు గల కారణాలపై సౌదీ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
మరోవైపు, కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం తమకు ఇప్పటికీ "సురక్షితం కానిది" "సైనిక లక్ష్యం" అని హూతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరియా హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ, "విమానాశ్రయాన్ని తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం వల్ల జరిగే పరిణామాలకు సౌదీ అరేబియానే బాధ్యత వహించాల్సి ఉంటుంది" అని పేర్కొన్నారు.
కాల్పుల విరమణ ఒప్పందం ముగిసినప్పటి నుండి హూతీ తిరుగుబాటుదారులు ఈ విమానాశ్రయాన్ని పలుమార్లు లక్ష్యంగా చేసుకున్నారు.
ఈ నెల ప్రారంభంలో జరిగిన ఒక దాడిలో 13 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు.

ఫొటో సోర్స్, X/Indiametdept
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారనుందని, బుధవారం ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి సమీపంలో చేరే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
దీని ప్రభావంతో రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
వర్షాల అంచనా:
తుపాను ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
అత్యవసర సహాయ నంబర్లు: ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, ఏవైనా అత్యవసర సహాయాలు లేదా సమాచారం కోసం 112, 1070, 18004250101 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?

ఫొటో సోర్స్, Elke Scholiers/Getty Images
కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నవంబర్ 1న ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సర్‌లో అవకతవకలకు సంబంధించి నవంబర్ 1న దిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో ఇండీ కూటమి భారీ ర్యాలీ నిర్వహించనుంది.
ఈ విషయమై రాహుల్ గాంధీ ఆదివారం 'ఎక్స్'లో ఓ పోస్టు చేశారు. "మా ఓట్లను దొంగిలిస్తున్నారు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించారు. నియమ నిబంధనలను ఉల్లంఘించారు. ప్రశ్నలు అడిగిన వారిపై లాఠీఛార్జ్ చేశారు." అని రాశారు.
విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, వ్యాపారవేత్తలు—ప్రజాస్వామ్యం పట్ల శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ నవంబర్ 1న జరిగే ర్యాలీకి తప్పక రావాలి. ఓటు మీదే. పోరాటం మీదే అని పిలుపునిచ్చారు.
"ఈ కార్యక్రమాన్ని ఇంత ఉత్సాహంగా ప్రచారం చేసి, వీలైనంత ఎక్కువ మందికి చేరేలా చేసినందుకు బీజేపీకి, దాని మిత్రపక్షాలకు హృదయపూర్వక ధన్యవాదాలు. రాబోయే ఏడు రోజులు కూడా ఇదే ఉత్సాహాన్ని, అంకితభావాన్ని కొనసాగించండి!" అని రాహుల్ రాశారు.
మరోవైపు, నవంబర్ 10 తర్వాత ఈ ర్యాలీని నిర్వహించాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసింది.
రద్దీగా ఉండే దీపావళి షాపింగ్ సీజన్లో ఈ ర్యాలీ వల్ల దిల్లీ వ్యాపారాలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లవచ్చని వాణిజ్య సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లకు స్వాగతం.
నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.