సీడీఎస్ అగ్నివీర్‌ల సర్వీస్ కాలం పొడిగింపు...
అగ్నివీర్ పథకంపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కీలక సమాచారం వెల్లడించారు.
అగ్నివీర్ పథకం కింద నాలుగేళ్ల పాటు సైన్యంలో నియమితులైన యువతకు ఇప్పుడు మరో రెండేళ్ల పాటు అదనపు సర్వీస్ చేసే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.
"ఈ రోజు భారత రక్షణ దళాలకు, మన అగ్నివీర్‌లకు ఎంతో ముఖ్యమైన రోజు. కేంద్ర మంత్రివర్గం అగ్నివీర్‌లందరికీ భారత రక్షణ దళాల్లో చేరేందుకు మార్గం కల్పించింది" అని జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి అన్నారు.
2022 జూన్ 14న అగ్నిపథ్ పథకాన్ని ప్రారంభించిన సమయంలోనే అగ్నివీర్‌ల పనితీరును నిరంతరం అంచనా వేస్తామని, ఎప్పటికప్పుడు ఈ పథకాన్ని సమీక్షిస్తామని ప్రకటించినట్లు ఆయన చెప్పారు.
అగ్నివీర్‌ల తొలి బ్యాచ్ ప్రస్తుతం తమ నాలుగేళ్ల సర్వీస్ కాలాన్ని పూర్తి చేసుకునే దశకు చేరుకుందని, ఈ నాలుగేళ్లలో వారి పనితీరుపై నిర్వహించిన అంచనాల్లో మంచి ఫలితాలు వచ్చాయని, వారి సామర్థ్యంపై సానుకూల స్పందన లభించిందని ఆయన వెల్లడించారు.
గతంలో ఉన్న నిబంధనల ప్రకారం, అర్హత, ప్రతిభ ఆధారంగా 25 శాతం మంది అగ్నివీర్‌లను మాత్రమే రెగ్యులర్ సైనిక బలగాల్లోకి తీసుకునేవారు. మిగిలిన 75 శాతం మంది నాలుగేళ్ల సర్వీస్ అనంతరం క్రమశిక్షణ, నైపుణ్యాలు కలిగిన యువతగా సమాజంలోకి తిరిగి వెళ్లాల్సి ఉండేది.
అయితే సవరించిన విధానం ప్రకారం మిగిలిన 75 శాతం మంది అగ్నివీర్‌లకు మరో రెండేళ్ల పాటు అదనపు సర్వీస్ చేసే అవకాశం కల్పించనున్నట్లు జనరల్ సుబ్రమణి తెలిపారు.
ఈ రెండేళ్ల అదనపు సర్వీస్ పూర్తయిన తర్వాత సాయుధ దళాల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న అగ్నివీర్‌లందరినీ నిర్దేశించిన ఎంపిక ప్రమాణాల ఆధారంగా సైన్యంలోకి తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన వెల్లడించారు.