‘మధ్యాహ్నానికి గాలుల వేగం తగ్గే అవకాశం’ : ఏపీ వాతావరణ శాఖ

ఫొటో సోర్స్, ANI
అర్నబ్ తుపాను ప్రస్తుతానికి ఒకే చోట నిలిచి ఉందని, ఒకట్రెండు గంటల్లో తీరం దాటుతుందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు. ఏఎన్ఐతో మాట్లాడిన ఆమె తుపాను తీరం దాటే సమయంలో 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు.
"ప్రస్తుతం ఈ తుపాను తీవ్రతను గమనిస్తే, కోనసీమ, కాకినాడ పరిసర ప్రాంతాలతోపాటు ఇతర తీరప్రాంత జిల్లాల్లో గాలి వేగం గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వరకు ఉంది. ఇది గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం తుపాను దాదాపు ఒకే చోట నిలిచి ఉంది. ఒకటి రెండు గంటల్లో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది. రాబోయే కొద్ది గంటల్లో ఈ తుపాను తీరాన్ని దాటుతుందని అంచనా. ఆ తర్వాత దీని తీవ్రత తగ్గి, 'తీవ్ర తుపాను'గా మారుతుంది. మధ్యాహ్నానికి ఇది మరింత బలహీనపడి కేవలం 'తుపాను'గా మారే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో ఇది 'అత్యంత తీవ్ర తుపాను' స్థితిలో ఉంటుంది. కొన్ని గంటల తర్వాత గాలి వేగం గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. మధ్యాహ్నానికి గాలి వేగం మరింత తగ్గి, గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లకు చేరుకుంటుందని అంచనా" అని నాగరత్నం తెలిపారు.







