మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

పెట్రోల్, డీజిల్ మీద వ్యాట్ తగ్గించండి.. రాష్ట్రాలకు ప్రధాని మోదీ వినతి

'ప్రజలపై ధరల భారం తగ్గించడానికి పెట్రోల్, డీజిల్‌పై మేం పన్నులు తగ్గించాం. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాలు చమురుపై తమ పన్నులను తగ్గించలేదు. ఇప్పటికైనా వ్యాట్ తగ్గించి ప్రజలకు ప్రయోజనం కలిగించండి' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించండి: మోదీకి ఖర్గే లేఖ

    నియోజకవర్గాల పునర్విభజనపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

    "2026 ఆగస్టు 13న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాయిదా పడ్డాయి. 64 రోజులు గడిచినా, పార్లమెంటు ఉభయ సభలను ఇంకా అధికారికంగా నిరవధిక వాయిదా వేయలేదు. ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదు" అని ఖర్గే ఆ లేఖలో రాశారు.

    "నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టే ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయమని కోరుతూ ఏప్రిల్ 11, 2026న మీకు నేను లేఖ రాసిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ మీరు అలా చేయలేదు"

    ‘‘ఆ తర్వాత 2026 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి ఆలస్యంగా ఆ బిల్లులను బహిరంగంగా అందుబాటులోకి తెచ్చి ఏప్రిల్ 16వ తేదీన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై రాజ్యాంగ సవరణ బిల్లు 2026 ఏప్రిల్ 17వ తేదీన లోక్‌సభలో అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించలేకపోయింది. దీంతో ఆ బిల్లు భారీ తేడాతో వీగిపోయింది.

    ఆ తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్న నా అభ్యర్థనను పునరుద్ఘాటిస్తూ జూలై 16, ఆగస్టు 27తేదీల్లో మీకు మళ్ళీ లేఖ రాశాను. ఇప్పుడు నాలుగోసారి ఇదే విజ్ఞప్తి చేస్తున్నా" అని ఖర్గే ఆ లేఖలో రాశారు.

  2. ర‌ణ‌బాలి రివ్యూ: పెళ్లయిన తర్వాత రష్మికతో తొలి చిత్రం.. విజయ్ దేవరకొండ పంట పండిందా?

  3. మేం పోటీకి భయపడం: ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ప్రకటన

    స్టార్ లింక్ వ్యవహారంలో అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఆరోపణలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆ సంస్థ, తాము ఎప్పుడూ పోటీకి భయపడలేదని పేర్కొంది.

    భారతదేశంలో స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఇటీవల ఆరోపించారు.

    పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీని "ప్రధాన మంత్రి అంబానీ" అని సంబోధించిన మస్క్, భారత్‌లో స్టార్‌లింక్‌కు నిష్పాక్షికంగా పోటీపడే అవకాశం ఇస్తారా? అని ప్రశ్నించారు.

    రిలయన్స్ ప్రకటనలో, "ప్రతి భారతీయ కంపెనీలాగే రిలయన్స్ కూడా దేశీయ విదేశీ పెట్టుబడులతో పాటు సరికొత్త ఆలోచనలకు స్వాగతం పలికే దేశంలో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ప్రజల జీవితాలను మెరుగుపరిచే పనులను ఆహ్వానిస్తుంది"

    స్టార్‌లింక్‌తో సహా ఉపగ్రహ సమాచార రంగంలో పోటీని స్వాగతిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. జియోతో సహా ప్రతి కంపెనీ భారత ప్రజలకు సేవలు అందించాలని, దేశ చట్టాలు, విధానాలను పాటించాలని ఆ ప్రకటనలో పేర్కొంది.

  4. భారత్, చైనాలను ఏకతాటిపైకి తేవాలని నేపాల్ ఎందుకు కోరుకుంటోంది?

  5. సూట్‌కేసులో పాములు, బల్లులను తరలిస్తున్న వ్యక్తిని అడ్డుకున్న అధికారులు

    జర్మనీలోని కోలాన్ బాన్ విమానాశ్రయంలో 90కి పైగా బల్లులు, విషపూరిత పాములను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన వ్యక్తిని అధికారులు అడ్డుకున్నారు.

    45 ఏళ్ల మెక్సికన్ అగ్నిమాపక సిబ్బంది సభ్యుడు గ్రీన్ ఎగ్జిట్ గుండా వెళ్తున్న సమయంలో "అనుమానాస్పదంగా ఆందోళన చెందుతూ" కనిపించినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

    ఆ వ్యక్తికి అధికారులు డ్రగ్స్ పరీక్ష నిర్వహించగా కొకైన్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత ఆయన సూట్‌కేసును తనిఖీ చేశారు. అందులో ఎలాంటి డ్రగ్స్ లభించలేదు. కానీ, షాంపూ, క్రీమ్ సీసాలు, ప్లాస్టిక్ కంటైనర్లు, సాక్సులలో దాచిన వైపర్లు, రాటిల్‌స్నేక్స్, ఇగువానాలతో పాటు ఇతర జాతుల పాములు, బల్లులు దొరికాయి.

    "విమానాశ్రయంలో సూట్‌కేసులలో తెచ్చే జ్ఞాపికల విషయంలో మా సహచరులు చాలా చూశారు. కానీ మెక్సికో నుంచి 37 సజీవ విషసర్పాలు, 55 బల్లులు రావడం ఇదే మొదటిసారి" అని కోలాన్ కస్టమ్స్ కార్యాలయ ప్రతినిధి జెన్స్ అహ్లాండ్ తెలిపారు.

    కొన్ని జంతువులను "అమానుషమైన పరిస్థితుల్లో" ఉంచినట్లు అహ్లాండ్ చెప్పారు. మరికొన్ని మెక్సికో నగరం నుంచి ఇస్తాంబుల్ మీదుగా ప్రయాణించే సమయంలో చనిపోయాయి.

  6. అమెరికా: స్కూల్లో 16 ఏళ్ల బాలుడి కాల్పులు, ముగ్గురు పిల్లలు సహా టీచర్ మృతి

    అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఒక ప్రాథమిక పాఠశాలలో జరిగిన కాల్పులు ఘటనలో టీచర్‌ సహా 5, 8, 11 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

    బెండ్ నగరంలోని సిల్వర్ రైల్ ప్రాథమిక పాఠశాల వద్ద ఈ ఘటన జరిగింది.

    కాల్పులు జరిపిన వ్యక్తిని బెండ్ నగరానికి చెందిన 16 ఏళ్ల బాలుడిగా గుర్తించారు.

    తాళం వేసి ఉన్న తలుపులపై కాల్పులు జరుపుతూ బాలుడు పాఠశాలలోకి ప్రవేశించారు. పాఠశాలలోకి వెళుతున్న అనుమానితుడిని కమ్యూనిటీలోని ఓ గన్ మెన్ వెంబడించారని, ఆయన చేతిలోనే బాలుడు హతమయ్యాడని పోలీసులు తెలిపారు.

    ఘటనా స్థలంలో ఐదుగురు మృతి చెంది ఉన్నట్లు బెండ్ పోలీస్ చీఫ్ మైక్ క్రాంజ్ తెలిపారు.

    ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు, మరో ఉపాధ్యాయురాలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

  7. దేశం విడిచి వెళ్లాలని నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు

    ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 28 నాటికి భారత్‌ను విడిచి పెట్టాలని అందులో సూచించింది.

    ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో పాల్గొని విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఇమ్రాన్ ఖాన్‌పై ఆరోపణలు ఉన్నాయి.

    అక్టోబర్ 10న ఆగస్టు రివల్యూషన్ గ్రౌండ్స్‌లో జరిగిన నిరసనల్లో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఆందోళనల్లో పాల్గొన్న ఆయన్ని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు.

    ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడని, నిరసనల్లో పాల్గొని విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించారని బీజేపీ నేత కృతి సౌమ్య ఆరోపించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    "విదేశీయుల చట్టాన్ని ఖాన్ ఉల్లంఘించారని గామ్దేవీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆ తర్వాత ఆ ఫిర్యాదును ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు పంపించాం" అని పోలీసులు తెలిపారు.

    ఖాన్‌ను అమెరికా పౌరుడిగా గుర్తించి, ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టంలోని 7, 29 సెక్షన్లు ఉల్లంఘించినట్టు నోటిసుల్లో పేర్కొన్నారు. దీని ఆధారంగానే నిర్దేశించిన గడువులోపు దేశం విడిచి వెళ్లాలని సూచించినట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి వివరించారు.

  8. అంకితా భండారీ తల్లిదండ్రులను నిర్బంధించడాన్ని ఖండించిన రాహుల్ గాంధీ

    అంకితా భండారీ తల్లిదండ్రులను నిర్బంధించడాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఖండించారు.

    బాధితుల గొంతును ఈ ప్రభుత్వం నొక్కేస్తోందని, ప్రశ్నించేవారిని తప్పిస్తోందని ఆయన ఆరోపించారు.

    "ఉదయం 4 గంటలు, ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అంకితా భండారీ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. వారు చేసిన తప్పు ఏంటి?, ఇండియా గేట్ వద్ద ఎలాంటి హాంగామా లేకుండా, బాధతో నిశ్శబ్ధంగా కూర్చొని, సీబీఐ విచారణ పూర్తి అయ్యే వరకు దుష్యంత్ గౌతమ్‌ను గవర్నర్‌గా నియమించొద్దని కోరారు" అని ఎక్స్‌లో రాహుల్ గాంధీ పోస్టు చేశారు.

    "నేను, ప్రియాంక నిన్న వారిని కలిశాం. సీబీఐ దర్యాప్తు ఫలితాలు రాకముందే హడావుడిగా నియమాకాలు పూర్తి చేశారు. ప్రశ్నించిన తల్లిదండ్రులను చీకటిలో అదుపులోకి తీసుకున్నారు. బాధితుల గొంతును అణిచివేయడం, ప్రశ్నించే వారిని పక్కన పెట్టడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది.

    "న్యాయం కోసం జరుగుతున్న పోరాటాన్ని ఎవరూ అణచివేయలేరు, ఆపలేరు. అంకితా భండారీ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. వారికి న్యాయం జరిగే వరకు మద్దతు ఇస్తుంది" అని తెలిపారు.

    ఇండియా గేట్ దగ్గర నిరసన చేస్తున్న అంకితా భండారీ తల్లిదండ్రులతోపాటు పలువురిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    కొంత సమయం వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఉదయం ఐదు గంటలకు విడుదల చేసినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

  9. టీవీకే ఎమ్మెల్యే పల్లవి: ‘‘చంటి పిల్లాడిని సభలు సమావేశాలకు తిప్పుతూ పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారు’’ అంటూ ఆమెపై విమర్శలేంటి?

  10. ప్రధాని మోదీ ముందున్న 10 సవాళ్లు ఏంటి?

  11. ‘‘5 నెలల్లోనే బియ్యం బస్తా రూ.700 పెరిగింది’’ - తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

  12. ఇంద్రకీలాద్రి: అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో రాష్ట్రపతికి ఘన స్వాగతం

    విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. రాష్ట్రపతి ఇంద్రకీలాద్రికి చేరుకున్న సందర్భంగా ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.

    విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రపతికి వేద మంత్రోచ్ఛారణల నడుమ వేద ఆశీర్వచనం అందజేశారు.

    అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కనకదుర్గ అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అలాగే అమ్మవారి చిత్రపటాన్ని అందించి గౌరవపూర్వకంగా సత్కరించారు.

  13. భర్తను హత్య చేసి బ్లూ డ్రమ్‌లో దాచిన మహిళకు, ఆమె ప్రియుడికి ఉరిశిక్ష

  14. జనసేనలో చేరిన వంగవీటి రాధ

    టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరారు. పార్టీ కండువా కప్పి వంగవీటి రాధను పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానించారు.

    పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన వంగవీటి రాధాకృష్ణను పవన్ కల్యాణ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.

    అనంతరం వంగవీటి రాధ తన అనుచరులను పవన్ కల్యాణ్‌కు పరిచయం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టిగా ముందుకు వెళ్దామని పవన్ వారితో అన్నారు.

  15. వద్దన్నా కుప్పలు తెప్పలుగా ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పార్సిళ్లు, తట్టుకోలేక విదేశాలకు వెళ్లిపోయిన ఇన్‌ఫ్లూయెన్సర్

  16. జాతీయ జెండా ఎగురవేసినవారిని జైల్లో పెట్టడం పిరికితనం -రాహుల్

    జంతర్ మంతర్‌లో జాతీయ జెండా ఎగరేయడం నేరం కాదు, కానీ ఆ పనిచేసిన కొందరిని జైల్లో పెట్టడం పిరికితనమే అన్నారు లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ.

    సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ కస్టడీకి పంపడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ఎక్స్‌ ఖాతాలో స్పందించారు.

    “జంతర్ మంతర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి శాంతియుతంగా నిరసన తెలపడం నేరం కాదు. యువకులను జైల్లో వేయడం పిరికితనం” అని రాహుల్ గాంధీ విమర్శించారు.

    "విద్యార్థులు, యువతరం, జర్నలిస్టులు, ‘ఇండియా’ బ్లాక్ పార్టీల బ్యానర్లు వేర్వేరు కావచ్చు. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. ఒకే విషయం గురించి నిరసనలు జరుగుతున్నాయి. పౌరులు తమ రాజ్యాంగబద్ధమైన హక్కులను కోరుతున్నారు. జంతర్ మంతర్ దేశ ప్రజలది. దాన్ని తిరిగి సాధించుకుంటాం’’ అని రాహుల్ స్పష్టం చేశారు.

    ఇదే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా సోషల్ మీడియాలో విమర్శించారు.

    "త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి, భారత్ మాతాకి జై అని నినాదాలు చేసిన సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను మీరు జైలుకు పంపించారు. యువతతో పెట్టుకోవద్దు మోదీజీ, త్వరలోనే మీ నియంతృత్వానికి ముగింపు పలుకుతారు" అని సంజయ్ సింగ్ రాసుకొచ్చారు.

    మంగళవారం జంతర్ మంతర్‌లోకి అక్రమంగా చొరబడ్డారని సీజేపీ నాయకులపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

  17. పాకిస్తాన్‌: ఇమ్రాన్ ఖాన్ కంచుకోటలో ఎమర్జెన్సీ, ప్రభుత్వం తప్పు చేస్తోందంటున్న నిపుణులు

  18. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్‌కు 5 రోజుల కస్టడీ

    జంతర్ మంతర్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించారనే ఆరోపణలపై సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను మందిర్ మార్గ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనంతరం వారిని 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

    అంతకు ముందు సీజేపీ నేతల అరెస్టుపై కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన న్యాయ వ్యవహారాల చీఫ్ రత్న సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    "న్యాయవాదులను కలిసేందుకు కూడా వారిని అనుమతించలేదు. తెల్లవారుజామున 3 గంటలకు ఒక ప్రైవేట్ వాహనంలో వారిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారి మనోధైర్యం ఏమాత్రం తగ్గలేదు." అని పేర్కొన్నారు.

    "అనుమతి లేకుండా ప్రవేశించడం, బాండ్ షరతులు ఉల్లంఘించడం, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలు సీజేపీ నేతలపై మోపారు" అని రత్న సింగ్ 'ఎక్స్'లో పోస్ట్‌ చేశారు.

  19. నీటిలో మునిగిపోయిన ఈ గ్రామానికి కోహినూరు వజ్రానికి లింకేంటి, జనం ఇంకా అక్కడ ఎందుకు తవ్వుతున్నారు?

  20. గుడ్ మార్నింగ్, బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం,

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేశ్. మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.