పెట్రోల్, డీజిల్ మీద వ్యాట్ తగ్గించండి.. రాష్ట్రాలకు ప్రధాని మోదీ వినతి

'ప్రజలపై ధరల భారం తగ్గించడానికి పెట్రోల్, డీజిల్‌పై మేం పన్నులు తగ్గించాం. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాలు చమురుపై తమ పన్నులను తగ్గించలేదు. ఇప్పటికైనా వ్యాట్ తగ్గించి ప్రజలకు ప్రయోజనం కలిగించండి' అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

లైవ్ కవరేజీ

పృథ్వి రాజ్

  1. రాహుల్ తీరు ప్రజాస్వామ్యానికే అవమానకరం: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శ, ఇంకా కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోలేదు అన్న సింధియా

    రాహుల్ గాంధీపై జ్యోతిరాదిత్య సింధియా విమర్శలు
    ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీపై జ్యోతిరాదిత్య సింధియా విమర్శలు

    దిల్లీలో రాహుల్ గాంధీ, ప్రతిపక్ష నేతలు చేపట్టిన నిరసన ప్రజాస్వామ్యానికే అవమానమని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శించారు.

    " లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచి జిల్లా పంచాయతీలు, సర్పంచుల వంటి స్థానిక సంస్థల ఎన్నికల వరకు నిరంతరం ఎన్నికలు జరిగే దేశంలో, ఆ వ్యవస్థపైనే అనుమానాలు వ్యక్తం చేయడం లేదా మచ్చ తీసుకురావడానికి ప్రయత్నించడం కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్దేశాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడుతుంది, కానీ ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగ వ్యవస్థలోని ప్రతి అంశాన్ని తక్కువ చేసి చూపడానికి లేదా అప్రతిష్టపాలు చేయడానికి వెనుకాడటం లేదు. అత్యవసర పరిస్థితిని (ఎమర్జెన్సీ) విధించి రాజ్యాంగాన్ని కాలరాసిన అదే కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రశ్నిస్తోంది. న్యాయవ్యవస్థ, ప్రధాన న్యాయమూర్తి, భారత సైన్యం, ఎన్నికల సంఘంపై కూడా ప్రశ్నలు లేవనెత్తిన పార్టీ ఇదే. కాంగ్రెస్ పార్టీ బలహీనపరచడానికి ప్రయత్నించని రాజ్యాంగ సంస్థ అంటూ ఏదీ లేదు" అని ఆయన విమర్శించారు.

  2. బెదిరించినా, భయపెట్టినా వెనక్కి తగ్గబోము: రాహుల్ గాంధీ, సోమవారం ఆందోళనలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు చెప్పిన రాహుల్

    సుప్రీంకోర్టు వరకు మార్చ్ నిర్వహించిన "ఇండియా" బ్లాక్ నేతలు
    ఫొటో క్యాప్షన్, సోమవారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, ఇతర నాయకులు

    రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా సాగుతున్నారని రాహుల్ అభిప్రాయపడ్డారు. సోమవారం జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు చెప్పిన రాహుల్, మొన్న యువకులపై దాడి చేసిన వారు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

    ప్రధాన మంత్రి మాదిరిగానే వారికి కూడా నిలబడి పోరాడే ధైర్యం లేదన్నారు. కేవలం అధికారం, బలాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే పోరాడుతున్నారని విమర్శించారు./

    అందరూ కలిసి ఒక జట్టుగా పని చేస్తున్నారని, జరుగుతున్నవి వేర్వేరు నిరసనలు కావని, ఇదొక ఉద్యమమని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని హరించేవారికి, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేవారికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నిలబడతారని, ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గబోరని పేర్కొన్నారు. భారత ప్రజలు భయపడబోరని ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం ఉందన్నారు. కొట్టవచ్చు, బెదిరించవచ్చు, భయపెట్టేందుకు ప్రయత్నించవచ్చు అయినా తగ్గబోమని స్పష్టం చేశారు.

  3. నేడు చంద్రబాబుతో విజయ్ సమావేశం-నదీ జలాలపై చర్చలు, నదుల అనుసంధానంపై నేడు ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రుల భేటీ

    నదీ జలాల పంపిణీ, అనుసంధానంపై నేడు ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రుల భేటీ
    ఫొటో క్యాప్షన్, నేడు చంద్రబాబుతో విజయ్ సమావేశం

    మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2.30 గం.లకు విజయ్ తన క్యాంప్ ఆఫీస్ నుంచి బయల్దేరుతారు. సుమారు 4 గంటల సమయానికి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4.10 గంటలకు విజయవాడ కనక దుర్గ ఆలయాన్ని సందర్శిస్తారు. దర్శనం తర్వాత 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు.

    గోదావరి-కావేరీ నదుల అనుసంధానం, కృష్ణా జలాల విడుదలపై చంద్రబాబుతో చర్చిస్తారు. అనంతరం ఇద్దరూ కలిసి విజయవాడలో జరుగుతున్న ఉత్సవ్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో విజయవాడ నుంచి తిరిగి తమిళనాడుకు బయల్దేరి వెళ్తారు విజయ్.

  4. అందరినీ వద్దని బెదిరించిన ట్రంప్.. తాను మాత్రం రష్యా నుంచి డీజిల్ కొనే ఒప్పందం ఎందుకు చేసుకున్నారు?

  5. సీజేపీ నిరసన ప్రదర్శనల రిపోర్టింగ్‌లో జర్నలిస్టులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?

  6. బీజేపీ వ్యతిరేక ఓట్లనే తొలగిస్తున్నారు: రేవంత్ రెడ్డి

    కాంగ్రెస్ తెలంగాణ, రేవంత్ రెడ్డి
    ఫొటో క్యాప్షన్, సోమవారం జరగనున్న ర్యాలీ కోసం దిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

    బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) అమలుచేసిన రాష్ట్రాలలోనే ఆ పార్టీ గెలిచిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

    సోమవారం జరగనున్న కాంగ్రెస్ పాదయాత్ర కోసం దిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

    "ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నది ఎవరంటే..దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మైనార్టీలు, యువత. బీజేపీని ఓడించాలనుకున్న ప్రజల ఓటు హక్కును తొలగించడానికి కుట్ర చేశారు. జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కమిషన్ సభ్యులు చెప్పారు. తప్పులు జరుగుతున్నాయని తెలిసినపుడు, ఆ అధికారిని తొలగించడానికి మోదీకి అభ్యంతరం ఏమిటి?, ఆయనకు అండగా ఎందుకు నిలబడుతున్నారు" అని రేవంత్ రెడ్డి అన్నారు.

  7. ఒమన్‌ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్‌పై డ్రోన్‌ దాడి

    ఒమన్, భారత నౌకలపై డ్రోన్ దాడి
    ఫొటో క్యాప్షన్, ఇద్దరు భారతీయులు గల్లంతైనట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఆదివారం రాత్రి ధ్రువీకరించారు (ప్రతీకాత్మక చిత్రం).

    ఒమన్‌ సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న ట్యాంకర్‌పై ఆదివారం డ్రోన్‌ దాడి జరిగింది. నౌకలో ఉన్న 11 మంది భారతీయ నావికుల్లో తొమ్మిది మందిని రక్షించగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఇద్దరు నావికులు కనిపించకుండా పోయిన విషయాన్ని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఆదివారం రాత్రి ధ్రువీకరించారు.

    "అక్టోబర్ 11న సోహార్ యాంకరేజ్ వద్ద భారతీయ ట్యాంకర్ ఎం.టి. పెట్రో డాల్ఫిన్‌పై డ్రోన్ దాడి జరిగింది. ట్యాంకర్‌పై 11 మంది భారతీయ నావికులు ఉన్నారు. తొమ్మిది మందిని రక్షించారు, ఇద్దరు గల్లంతయ్యారు" అన్నారు.

    స్థానిక తీర రక్షక దళం గాలింపు, సహాయక చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు.

    గల్లంతైన వారిని గుర్తించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, సహాయక చర్యలకు పూర్తి మద్దతు అందించేందుకు సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని సర్బానంద సోనోవాల్‌ పేర్కొన్నారు.

  8. సీజేపీ: బాండ్‌పై సంతకం చేస్తే నిరసనలకు దూరంగా ఉంచగలరా? చట్టం ఏం చెబుతోంది?

  9. మియన్మార్‌లో పెరుగుతున్న బలవంతపు సైనిక నియామకాలు..

  10. విపక్ష ఎంపీలతో భేటీకి సీజేఐ సూర్యకాంత్ నిరాకరణ

    సీజేపీ, ప్రతిపక్షాలు
    ఫొటో క్యాప్షన్, ప్రతిపక్ష పార్టీల ఎంపీలను కలవకపోవడానికి సీజేఐ కొన్ని కారణాలు చెప్పారు (ఫైల్ ఫోటో).

    విపక్ష పార్టీల ఎంపీలతో సమావేశమయ్యేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ నిరాకరించారు. వారిని కలవలేకపోవడానికి కొన్ని కారణాలను సీజేఐ వివరించినప్పటికీ, లేఖ గోప్యతను దృష్టిలో ఉంచుకుని వాటిని బహిర్గతం చేసేందుకు నిరాకరించారు.

    “విపక్ష నేతల లేఖ నాకు నిన్న అందింది. దానికి నిన్న రాత్రే సమాధానం ఇచ్చాను. కొన్ని కారణాలను వివరిస్తూ వారిని కలవలేనని తెలియజేశాను” అని సీజేఐ సూర్యకాంత్ సోమవారం మీడియాతో చెప్పారు.

    ‘వన్ నేషన్‌–వన్‌ ఎలక్షన్‌’పై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సుప్రీంకోర్టు పర్యటన రద్దు కావడంపై కూడా సీజేఐని ప్రశ్నించగా, ఆయన స్పందిస్తూ.. “ఆ విషయంలో కోర్టులో విరుద్ధ ప్రయోజనాల (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అందుకే, మేం దీనిపై చర్చించాం. ఎలాంటి విరుద్ధ ప్రయోజనాలకైనా దూరంగా ఉండాలని నా సీనియర్ న్యాయ సహచరులు, నేను ఒకే అభిప్రాయానికి వచ్చాం” అని తెలిపారు.

    సీజేఐను కలిసేందుకు సమయం కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి లేఖ రాసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం తెలిపారు.

  11. యువత ఆగ్రహం ఎవరి మీద? ఎన్నికల సంఘంపైనా, మోదీ పైనా?

  12. నేహా బోరా గురించి దర్శకుడు దేవా కట్టా ట్వీట్

    దేవా కట్టా, నేహా బోరా
    ఫొటో క్యాప్షన్, దేవా కట్టా

    అఖిల భారత విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా గురించి టాలీవుడ్ దర్శకుడు దేవా కట్టా 'ఎక్స్' వేదికగా స్పందించారు.

    "ఆమెతో మీరు ఏకీభవించవచ్చు, లేకపోవచ్చు... ఆమె పోరాట స్ఫూర్తితో మీరు మమేకం కావచ్చు, కాకపోవచ్చు... కానీ, మన రాజకీయాలు, రాజకీయ నాయకుల నేరపూరిత, నిరంకుశ పోకడలు సాధారణ విషయంగా మారిపోతుండటంపట్ల ఆమె వ్యక్తం చేస్తున్న ఆక్రోశం, ఆగ్రహాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే... అప్పుడు నిజమైన 'యాంటీ-నేషనల్’ మీరే!!" అంటూ ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

  13. సీజేపీ ఆందోళనలు: పోలీసులు విమానంలోకి వచ్చి అరెస్టు చేయవచ్చా?

  14. జిబూటి తీరంలో పడవ మునగడంతో పిల్లలు సహా 139 మంది మృతి, హఫ్సా ఖలీల్

    జిబూటి తీరం, పడవ మునిగిపోవడం
    ఫొటో క్యాప్షన్, ఓబాక్ ఓడరేవు పట్టణానికి ఉత్తరాన ఉన్న గుహెరె సమీపంలో వలసదారులకు సహాయం చేస్తున్న ఐఓఎం సిబ్బంది

    జిబూటి తీరంలో పడవ మునిగిపోవడంతో కనీసం 139 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారని, అందులో 15 మంది పిల్లలున్నారని ఐక్యరాజ్యసమితి వలసల విభాగం తెలిపింది. పలువురి ఆచూకీ ఇంకా తెలియడం లేదని తెలిపింది.

    305 మందితో జిబూటి నుంచి యెమెన్‌కు బయల్దేరిన పడవ.. గురువారం రాత్రి ఓబాక్ ఓడరేవు పట్టణం సమీపంలో తిరగబడింది.

    ఈ ఘటనలో సుమారు 82 మందిని రక్షించినట్లు అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) తెలిపింది.

    ఆఫ్రికా ఖండంలోని హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతం నుంచి ఏటా వేలమంది వలసదారులు ప్రాణాలకు తెగించి ఈ ప్రయాణం సాగిస్తున్నారనీ, భద్రత, ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు చేరుకోవాలనే ఆశతో ప్రమాదకరమైన మార్గంలో వెళ్తున్నారని ఐఓఎం తెలిపింది.

  15. రష్యా-యుక్రెయిన్ మధ్య 'ఎనర్జీ సీజ్ ఫైర్' కుదిరిందన్న డోనల్డ్ ట్రంప్

    రష్యా, యుక్రెయిన్, డోనల్డ్ ట్రంప్
    ఫొటో క్యాప్షన్, రష్యా - యుక్రెయిన్ మధ్య ఎనర్జీ సీజ్ ఫైర్ కుదిరిందని డోనల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.

    రష్యా యుక్రెయిన్‌ల మధ్య “ఇంధన వనరులపై దాడుల విరమణకు అంగీకారం కుదిరిందని ఇది తక్షణమే అమలులోకి వస్తుందని” అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ తెలిపారు.

    దీనిపై రష్యా స్పందించలేదు.

    ట్రంప్ ప్రకటన తనకు “కొత్త వార్త” అని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ అన్నట్లు అమెరికా వార్తా వెబ్‌సైట్ ఆక్సియోస్ తెలిపింది.

    అంతకుముందు రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులను “తక్షణమే ఆపాలి” అని అధ్యక్షుడు ట్రంప్ యుక్రెయిన్‌ను హెచ్చరించారు. ట్రంప్- జెలియన్‌స్కీ మధ్య వివాదం నడుస్తున్న తరుణంలో ఈ ప్రకటన వచ్చింది.

    “రష్యా మా ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఆపివేస్తే, మేం రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేయడం ఆపేస్తాం” అని జెలియన్‌స్కీ ఆదివారం చెప్పారు.

  16. ‘స్మైలింగ్ డిప్రెషన్’: మీ చిరునవ్వు వెనుక డిప్రెషన్ కూడా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి

  17. ఎవరీ నేహా బోరా? బీజేపీకి మద్దతు ఇచ్చే కుటుంబం నుంచి వచ్చి ఉద్యమాల ముఖచిత్రంగా ఎలా మారారు?

  18. చీర ధరించి 1600 మీటర్ల పరుగు పందాన్ని 9 నిమిషాల్లో పూర్తి చేసిన కవిత..

  19. భారత టెక్ దిగ్గజాలపై అమెరికా చర్యలు: గ్రీన్ కార్డుల జారీలో తీవ్ర ఆలస్యం తప్పదా?

  20. అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్‌ రాంకా విడుదల

    సీజేపీ, అభిజిత్ దీప్కే, ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌, దిల్లీ పోలీసులు, దిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్
    ఫొటో క్యాప్షన్, శనివారం ముంబయి నుంచి దిల్లీకి వచ్చిన అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ విడుదల చేసినట్లు సీజేపీ లీగల్ హెడ్ రత్నా సింగ్ ‘ఎక్స్’ పోస్టులో తెలిపారు.

    శనివారం ఉదయం ముంబయి నుంచి దిల్లీకి వచ్చిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, సహ కన్వీనర్ సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రాంకాను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు.

    "అభిజిత్, అశుతోష్, సౌరవ్‌లను ఈరోజు ఉదయం 9 గంటలకు దిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు" అని రత్నా సింగ్ తెలిపారు.

    "దిల్లీ పోలీసు అధికారి ఒకరు ఈరోజు ఉదయం నాకు ఈ సమాచారం ఇచ్చారు. సీజేపీ లీగల్ హెడ్ హోదాలో, మా తరఫున హాజరయ్యే ఇతర వకీళ్లతో కలిసి నేను పోలీస్ స్టేషన్‌లో అందుబాటులో ఉంటాను" అని చెప్పారు.

    అంతకుముందు, సీజేపీ నేతలు అభిజిత్ దీప్కే, ఆశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లను ముందస్తు నిర్బంధంలో ఉంచామని, వారిని నేడు దిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు దిల్లీ పోలీసులు చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

    మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కూడా ముగ్గురు నాయకుల నిర్బంధంపై స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

    "మోదీ, షా ఎంతలా భయపడ్డారంటే నేడు వారు పిల్లలను అపహరిస్తున్నారు. దీనికి మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది" అని ఎక్స్‌లో పేర్కొన్నారు