రోటీ, రైస్ తింటూ బరువు తగ్గొచ్చా? 9 ప్రశ్నలు - జవాబులు

వెయిట్ లాస్, ఆహారం, బరువు తగ్గింపు
ఫొటో క్యాప్షన్, బరువు తగ్గడానికి, శరీరంలో కొవ్వు తగ్గడానికి మధ్య చాలా తేడా ఉంది.
ప్రచురణ
చదివే సమయం: 7 నిమిషాలు

బరువు తగ్గాలని నిర్ణయించుకున్నామని చెబితే చాలు అనేక సలహాలు మన చెవినపడతాయి. కొందరు రోటీ, అన్నం మానేయమంటారు, మరికొందరు అడపాదడపా ఉపవాసం ఉండమంటారు. ఇంకొందరు ద్రవపదార్థాలు మాత్రమే తీసుకుంటే బరువు ఇట్టే తగ్గిపోవచ్చని చెబుతారు.

అయితే, నాజూగ్గా మారడానికి ఇష్టమైన ఆహార పదార్థాలను వదిలేయడం, నిరంతరం ఆకలితో ఉండటం తప్పనిసరా?

బరువు తగ్గడం, శరీరంలోని కొవ్వు తగ్గడం ఒకటేనా?

ఈ రెండింటి మధ్య తేడా ఉంటే, మనం నిజంగా కొవ్వు కోల్పోతున్నామా లేక లేక కండరాలు, నీటి బరువు మాత్రమే తగ్గించుకుంటున్నామా అనే విషయం ఎలా తెలుసుకోవాలి?

ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి బీబీసీ హిందీ ఎడిటర్ నితిన్ శ్రీవాస్తవ వైద్యురాలు, ఆహార నిపుణురాలు డాక్టర్ శిఖా శర్మతో మాట్లాడారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

1. బరువు తగ్గడానికి, కొవ్వు తగ్గడానికి తేడా ఏమిటి?

బరువు తగ్గడానికి, శరీరంలో కొవ్వు తగ్గడానికి మధ్య చాలా తేడా ఉందని డాక్టర్ శిఖా శర్మ చెబుతున్నారు.

దీన్ని వివరించేందుకు ఆమె రెండు చిత్రాలను ఊహించుకోవాలని సూచిస్తున్నారు. మొదటి చిత్రంలో బరువు తగ్గినప్పటికీ కండరాలు బలహీనంగా ఉండి, ముఖంలో కాంతి లేకుండా, అనారోగ్యంగా కనిపించే వ్యక్తి ఉంటారు. రెండో చిత్రంలో ముఖంలో కాంతి, బలమైన కండరాలు, నిటారైన శరీర భంగిమతో ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి ఉంటారు.

సాధారణంగా ప్రజలు బరువు తగ్గాలనుకుంటారని, అందుకోసం శరీర బరువును తగ్గించే పద్ధతులను అనుసరిస్తారని ఆమె చెబుతున్నారు. కానీ వాస్తవానికి వారు కోరుకునేది శరీరంలోని అధిక కొవ్వును తగ్గించుకుని, ఆరోగ్యంగా కనిపించడం.

"మీరు కొవ్వు తగ్గించుకోవాలనుకుంటే, కేవలం కొవ్వు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి. బరువు తగ్గడంపై కాదు " అని ఆమె సూచిస్తున్నారు.

వెయిట్ మెషీన్‌పై నిలబడినప్పుడు అది శరీరంలోని కొవ్వును మాత్రమే కొలవదు. ఎముకలు, శరీరంలోని నీరు, అవయవాలు, కండరాల బరువును కూడా లెక్కిస్తుంది.

కొవ్వును పత్తితో పోలుస్తూ, దాని బరువు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుందని శర్మ వివరిస్తున్నారు. అందువల్ల శరీరంలో కొవ్వు తగ్గిందో లేదో తెలుసుకోవడానికి తూనిక యంత్రంతో పాటు అంగుళాల టేపును కూడా ఉపయోగించాలని సూచిస్తున్నారు.

కొన్నిసార్లు బరువు అలాగే ఉన్నప్పటికీ దుస్తులు వదులుగా మారుతుంటాయి. ఇది శరీరంలోని కొవ్వు తగ్గుతోందనడానికి సంకేతం కావచ్చని ఆమె చెబుతున్నారు.

నిజానికి ప్రజలు కొవ్వు తగ్గాలనుకుంటారు. కానీ వారు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తారు అని చెప్పారు.

వెయిట్ లాస్, ఆహారం, బరువు తగ్గింపు
ఫొటో క్యాప్షన్, పాలిష్ చేయని పాత బియ్యాన్ని తీసుకోవాలి.

2. కేలరీలు తగ్గించడమే పరిష్కారమా?

బరువు తగ్గడం గురించి చర్చ వచ్చినప్పుడు కేలరీల లెక్కలు తరచూ ప్రస్తావనకు వస్తుంటాయి. మొబైల్ యాప్‌ల ద్వారా ఏ ఆహారం నుంచి ఎన్ని కేలరీలు లభిస్తున్నాయి, నడక లేదా వ్యాయామం ద్వారా ఎన్ని ఖర్చవుతున్నాయి అనేది తెలుసుకోవచ్చు.

అయితే, ఆహారం తీసుకోవడాన్ని తగ్గించి కేలరీలను నియంత్రించడం మాత్రమే సరైన పద్ధతి కాదని డాక్టర్ శర్మ అంటున్నారు. ఇలా చేయడం వల్ల కొవ్వుతో పాటు కండరాల ద్రవ్యరాశి కూడా తగ్గిపోయి, శరీరం బలహీనంగా మారవచ్చని వివరిస్తున్నారు.

కేలరీల కాన్సెప్టు ఆవిరి యంత్రాల్లో ఇంధనాన్ని మండించి ఎంత శక్తిని ఉత్పత్తి చేయవచ్చో తెలుసుకునే ప్రయత్నాల నుంచి వచ్చిందని ఆమె చెబుతున్నారు. అయితే, ఆవిరి యంత్రంలో ఇంధనం మండే ప్రక్రియకు, మానవ శరీరంలో ఆహారం శక్తిగా మారే ప్రక్రియకు తేడా ఉందని అంటున్నారు. శరీరంలో ఆహారం శక్తిగా మారే ప్రక్రియను జీవక్రియ అంటారు.

ఒక వ్యక్తికి నిర్ణీత కేలరీల పరిమితిలో ఐస్‌క్రీమ్ లేదా హాట్ చాక్లెట్ మిఠాయి మాత్రమే ఇచ్చినా, కేలరీలు తగ్గినంత మాత్రాన ఆరోగ్యకరమైన రీతిలో కొవ్వు తగ్గదని ఆమె ఉదాహరణగా చెబుతున్నారు. దీర్ఘకాలిక ఫలితాల కోసం ఆహారం పరిమాణంతో పాటు దాని నాణ్యత, శరీర అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు.

వెయిట్ లాస్, ఆహారం, బరువు తగ్గింపు
ఫొటో క్యాప్షన్, నితిన్ శ్రీవాస్తవ, డాక్టర్ శిఖా శర్మ

3. శరీరంలో పేరుకునే కొవ్వులన్నీ ఒకటేనా?

చర్మం కింద పేరుకునే కొవ్వుకు, అంతర్గత అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వుకు తేడా ఉందని శర్మ వివరిస్తున్నారు.

చర్మం కింద ఉండే కొవ్వు వల్ల ముఖం, శరీరం నిండుగా కనిపించవచ్చు. అంతర్గత అవయవాల చుట్టూ పేరుకునే కొవ్వును విసెరల్ ఫ్యాట్ అంటారు. ఈ కొవ్వు ఎక్కువగా ఉన్నవారికి చేతులు, కాళ్లు సన్నగా ఉన్నప్పటికీ పొట్ట ముందుకు పొడుచుకొచ్చినట్లు కనిపించవచ్చు.

పొట్ట చుట్టూ పేరుకునే విసెరల్ ఫ్యాట్ ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదకరమని, ఇది గుండె జబ్బులు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో సంబంధం కలిగి ఉంటుందని ఆమె చెబుతున్నారు.

శరీర నిర్మాణం, జన్యువులు, పేగులు, కాలేయం ఆరోగ్యం, హార్మోన్లు కూడా కొవ్వు ఎక్కడ పేరుకుంటుందనే అంశంపై ప్రభావం చూపుతాయని వివరిస్తున్నారు. మహిళల్లో కాలక్రమేణా హార్మోన్లలో మార్పులు వస్తాయని, పురుషుల్లో కండరాల ద్రవ్యరాశి తగ్గేకొద్దీ హార్మోన్లు, కొవ్వు నిల్వ అయ్యే విధానం మారవచ్చని చెబుతున్నారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలను ప్రస్తావిస్తూ, దేశంలో సుమారు 30 శాతం మంది మహిళలు, 27 శాతం మంది పురుషుల్లో అధిక బరువు సమస్య నమోదైందని నితిన్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ పరిస్థితి ఆందోళనకరమని శర్మ అన్నారు. ఇదే ధోరణి కొనసాగితే మధుమేహం, గుండె, మూత్రపిండాల వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

వ్యవసాయంలో ఉపయోగించే రసాయనాలు, పురుగుమందులు, శుద్ధి చేసిన నూనెలు, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా తయారు చేసే ప్రాసెస్డ్ ఆహార పదార్థాలు కూడా ఈ సమస్య పెరగడానికి కారణాలుగా ఆమె పేర్కొన్నారు.

ప్యాక్డ్ ఫ్రెంచ్ ఫ్రైస్, సాసేజీలు, శీతల పానీయాలు, కృత్రిమంగా తయారు చేసే చీజ్ వంటి పదార్థాలను ఉదాహరణలుగా వివరించారు.

ఎంత తింటున్నామన్నదే కాకుండా, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమని చెప్పారు.

4. కొవ్వు తగ్గాలంటే అన్నం,రోటీలు మానేయాలా?

బరువు తగ్గాలనుకునేవారిలో తరచూ ఎదురయ్యే ప్రశ్నల్లో ఇది ఒకటి. అయితే, రోటీ, అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని శర్మ చెబుతున్నారు.

"రోటీ, అన్నం మానేయకండి. వాటిని మరింత పోషకమైన ప్రత్యామ్నాయాలతో మార్చుకోండి" అని ఆమె సూచిస్తున్నారు.

రోటీ తయారీలో పొట్టు కలిగిన పిండిని ఉపయోగించాలని, గోధుమ పిండిలో బార్లీ, చిరుధాన్యాలు లేదా శనగపిండిని కలపవచ్చని చెబుతున్నారు.

దీనివల్ల రోటీలో ప్రొటీన్లు, ఇతర పోషకాల పరిమాణం పెరుగుతుందని వివరిస్తున్నారు.

గోధుమలు రక్తంలో చక్కెర స్థాయులను పెంచవచ్చని ఆమె చెబుతున్నారు.

అందువల్ల వాటిని పూర్తిగా మానేయడానికి బదులుగా పిండి రకాన్ని మార్చుకోవాలని సూచిస్తున్నారు.

అన్నం విషయానికి వస్తే, పాలిష్ చేసిన బియ్యానికి బదులుగా పాలిష్ చేయని పాత బియ్యాన్ని ఉపయోగించాలని శర్మ సూచిస్తున్నారు.

కొత్త బియ్యంతో పోలిస్తే పాత బియ్యానికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని ఆమె చెబుతున్నారు.

వెయిట్ లాస్, ఆహారం, బరువు తగ్గింపు
ఫొటో క్యాప్షన్, రాత్రి 7 లేదా 8 గంటల తర్వాత ఆహారం తీసుకోకూడదనే కఠినమైన నియమం అవసరం లేదు

5. భోజనానికి సరైన సమయం ఏది?

"ఉదయం రాజులా, మధ్యాహ్నం రాణిలా, రాత్రి పేదవాడిలా భోజనం చేయాలి" అనే పాత సామెతలో వాస్తవం ఉందని శర్మ అంటున్నారు.

ఉదయం శరీర జీర్ణక్రియ చురుగ్గా మారుతుందని, మధ్యాహ్నం అత్యుత్తమ స్థాయికి చేరుకుని, సూర్యాస్తమయం తర్వాత క్రమంగా తగ్గుతుందని ఆమె వివరిస్తున్నారు.

ఉదయం అల్పాహారం తేలికగా చేయాలని, మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట మధ్య భోజనం చేయాలని సూచిస్తున్నారు. సాయంత్రం ఆకలేస్తే వేరుశనగలు లేదా వేయించిన శనగలు తినవచ్చని, రాత్రి 7 గంటలకల్లా భోజనం చేయడానికి ప్రయత్నించాలని చెబుతున్నారు.

అయితే, రాత్రి 7 లేదా 8 గంటల తర్వాత ఆహారం తీసుకోకూడదనే కఠినమైన నియమం అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు.

కానీ, రాత్రిపూట ఎక్కువ తినకుండా ఉండాలని సూచిస్తున్నారు.

చాలామంది ఉదయం సరైన ఆహారం తీసుకోకుండా బిస్కెట్లు వంటి ప్రాసెస్డ్ పదార్థాలు తింటారని, మధ్యాహ్నం 2 లేదా 3 గంటలకు భోజనం చేసి, రాత్రి 11 గంటలకు తింటారని ఆమె చెబుతున్నారు. ఈ అలవాట్లు శరీర సహజ దినచర్యకు విరుద్ధమని వివరిస్తున్నారు.

వెయిట్ లాస్, ఆహారం, బరువు తగ్గింపు
ఫొటో క్యాప్షన్, "మీరు కొవ్వును తగ్గించుకోవాలనుకుంటే, కేవలం బరువు తగ్గడంపై కాకుండా కొవ్వు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి"

6. రోజువారీ ఆహారంలో ఏం తీసుకోవాలి?

ప్రతి ఒక్కరి శరీర నిర్మాణం భిన్నంగా ఉంటుందని, ఒకరికి సరిపోయే ఆహారం మరొకరికి సరిపోకపోవచ్చని శర్మ చెబుతున్నారు.

ఉదయం తులసి, అల్లం, దాల్చిన చెక్క, యాలకులు, సోంపుతో తయారు చేసిన పానీయం తీసుకోవచ్చని సూచిస్తున్నారు. ఆ తర్వాత టీ లేదా కాఫీ తాగవచ్చని, ఉదయం పండ్లు తినడంతో పాటు రోజుకు కనీసం ఒక పండైనా తీసుకోవాలని చెబుతున్నారు.

అల్పాహారంగా వేరుశెనగలతో చేసిన అటుకులు, శనగపిండి లేదా పెసరపప్పు చిల్లా, కూరగాయలతో నింపిన పరాఠా, ఇడ్లీ, రాగి ఇడ్లీ, ఢోక్లా లేదా ఉడికించిన శనగలు తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

మధ్యాహ్నం భోజనంలో మల్టీగ్రెయిన్ రోటీ, ఆకుకూరలు, ఇతర కూరగాయలను చేర్చుకోవాలని చెబుతున్నారు. పిండిలో పప్పులు కలిపి రోటీలు తయారు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

సాయంత్రం వేళ వేయించిన శనగలు లేదా వేరుశనగలు తినవచ్చని చెబుతున్నారు.

రాత్రి భోజనానికి ముందు సూప్ తీసుకోవడం వల్ల తీవ్రమైన ఆకలి కారణంగా ఎక్కువగా తినకుండా ఉండవచ్చని సూచిస్తున్నారు.

దోసకాయ, ముల్లంగి, టమాటా వంటి పచ్చి కూరగాయలను కూడా ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు.

ఆపిల్, బీట్‌రూట్, క్యారెట్‌తో తయారు చేసే పానీయాలు గుండె, పేగులు, కాలేయ ఆరోగ్యానికి మేలు చేయవచ్చని ఆమె పేర్కొన్నారు.

వెయిట్ లాస్, ఆహారం, బరువు తగ్గింపు
ఫొటో క్యాప్షన్, దోసకాయ, ముల్లంగి, టమాటా వంటి పచ్చి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి

7. ఆహారం ముఖ్యమా, వ్యాయామం ముఖ్యమా?

ప్రారంభంలో ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల కొవ్వు త్వరగా తగ్గవచ్చని శర్మ చెబుతున్నారు. అయితే, ఆ ఫలితాలను దీర్ఘకాలం కొనసాగించాలంటే వ్యాయామం అవసరమని స్పష్టం చేస్తున్నారు.

వ్యాయామం కండరాలను బలోపేతం చేయడంతో పాటు జీవక్రియను చురుగ్గా ఉంచుతుందని ఆమె వివరిస్తున్నారు.

వ్యాయామం చేయకుండా సమోసాలు, కచోరీలు తింటూ ఆరోగ్యంగా ఉండవచ్చని అనుకోవడం ఎంత తప్పో, శారీరక శ్రమ లేకుండా కేవలం ఆహారాన్ని మార్చుకుంటే సరిపోతుందని భావించడం కూడా అంతే తప్పని చెబుతున్నారు.

రోజుకు 10 వేల అడుగులు నడవడం చాలామందికి సులభమైన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

జిమ్, ఏరోబిక్స్, యోగా వంటివి చేయలేని వారు నడకతో ప్రారంభించవచ్చని సూచిస్తున్నారు. అయితే, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం, శారీరక సామర్థ్యానికి అనుగుణంగా వ్యాయామం చేయాలని భావించాలి.

ఆహారం
ఫొటో క్యాప్షన్, శారీరక శ్రమ లేకుండా కేవలం ఆహారాన్ని మార్చుకుంటే సరిపోతుందని భావించరాదు.

8. వేగంగా బరువు తగ్గడం మంచిదేనా?

వేగంగా బరువు తగ్గడం కంటే క్రమంగా, స్థిరంగా తగ్గడం మంచిదని శర్మ సూచిస్తున్నారు. తొలుత వేగంగా బరువు తగ్గినప్పుడు కండరాల ద్రవ్యరాశి కూడా తగ్గవచ్చని, వాటిని తిరిగి పెంచుకోవడం కష్టమని చెబుతున్నారు.

వేగంగా బరువు తగ్గిన కొందరిలో మూత్రపిండాలు లేదా పిత్తాశయంలో రాళ్లు ఏర్పడిన సందర్భాలను తాను చూశానని ఆమె తెలిపారు. చిన్న వయసులో శరీరం ఒక్కసారి వచ్చే వేగవంతమైన మార్పును తట్టుకోగలిగినా, పదేపదే ఇలా చేయడం హానికరమని హెచ్చరించారు.

ఆహార నాణ్యతను మెరుగుపరచడం, సరైన పదార్థాలను ఎంచుకోవడం, శారీరక శ్రమ పెంచడం దీర్ఘకాలిక ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్పారు.

అడపాదడపా ఉపవాసం, వారాంతాల్లో అతిగా తినడం

బరువు తగ్గడానికి అడపాదడపా ఉపవాసం ఒక ఖచ్చితమైన పరిష్కారమని భావించడాన్ని శర్మ అంగీకరించడం లేదు.

16 గంటల ఉపవాసం తర్వాత కొందరు కాఫీ, చిక్కటి టీ, వేయించిన పదార్థాలు, ప్రాసెస్డ్ ఆహారం లేదా శాండ్‌విచ్‌లతో ఉపవాసాన్ని విరమిస్తారని ఆమె చెబుతున్నారు. ఆకలితో ఉండి, ఆ తర్వాత అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం శరీరంపై ఒత్తిడిని పెంచవచ్చని వివరిస్తున్నారు.

వివిధ సంస్కృతుల్లో ఉపవాసాన్ని ఖర్జూరం, కొబ్బరి నీరు, నిమ్మరసం లేదా పండ్లు వంటి తేలికపాటి పదార్థాలతో విరమిస్తారని చెబుతున్నారు. సరైన పద్ధతిలో చేయని ఉపవాసం వల్ల కండరాలు తగ్గడం, తాత్కాలిక ఫలితాలే రావడం, ఆ తర్వాత నిరాశకు గురవడం వంటి సమస్యలు ఎదురుకావచ్చని హెచ్చరిస్తున్నారు.

వారంలో ఐదు రోజులు కఠినమైన ఆహార నియమాలు పాటించి, వారాంతాల్లో విపరీతంగా తినడం కూడా మంచిది కాదని ఆమె అంటున్నారు. పెళ్లిళ్లు, పండుగల సమయంలో అప్పుడప్పుడు ఎక్కువగా తినడం సమస్య కాకపోయినా, ప్రతి వారం ఇదే అలవాటును కొనసాగించడం శరీరంపై పదేపదే ఒత్తిడి కలిగించడమేనని వివరిస్తున్నారు.

9. రేపటి నుంచే కొవ్వు తగ్గించుకోవాలంటే?

ముందుగా ఇంట్లోని ఆహార వాతావరణాన్ని మార్చుకోవాలని శర్మ సూచిస్తున్నారు. ఫ్రిజ్‌‌లో పండ్లు, సలాడ్లను అందుబాటులో ఉంచి, చాక్లెట్లు, స్వీట్ బాక్సులు లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు.

ఆకర్షణీయమైన అనారోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉంటే నియంత్రణ పాటించడం కష్టమని వివరిస్తున్నారు.

శరీరానికి తగినంత నీరు అందించడం కూడా ముఖ్యమని చెబుతున్నారు. నీటితో పాటు హెర్బల్ పానీయాలు, నిమ్మరసం, కొబ్బరి నీరు తీసుకోవచ్చని సూచిస్తున్నారు

నీళ్ల సీసాను వెంట ఉంచుకుని, ప్రతి గంటకు కొద్దికొద్దిగా నీరు తాగాలని చెబుతున్నారు.

కొన్నిసార్లు శరీరానికి నీరు అవసరమైనప్పటికీ, దాన్ని ఆకలిగా పొరబడతారని, ఆ సమయంలో చిప్స్ లేదా చాక్లెట్లు తినడం ప్రారంభిస్తారని ఆమె వివరిస్తున్నారు.

ఆహారం తీసుకోవడాన్ని శిక్షగా భావించకూడదని శర్మ చెబుతున్నారు.

తీపి తినాలనిపిస్తే అంజీరాలు, ఎండు ద్రాక్ష, మామిడి వంటి సహజంగా తీపి ఉండే పదార్థాలను ఎంచుకోవచ్చని సూచిస్తున్నారు.

దీర్ఘకాలంపాటు ఉడికించిన సొరకాయ, గుమ్మడికాయ వంటి రుచిలేని ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం సాధ్యం కాదని ఆమె అంటున్నారు.

ఆహారం రుచిగా ఉండాలని, అయితే రుచి అంటే చాక్లెట్లు, చిప్స్ మాత్రమే కాదని గుర్తించాలని చెబుతున్నారు.

"ఆహార నియమాలంటే తక్కువ తినడం కాదు. నిర్ణీత పద్ధతిలో, క్రమశిక్షణతో తినడం. ఆహారం తీసుకోవడాన్ని శిక్షలా మార్చుకోవద్దు" అంటారు డాక్టర్ శిఖా శర్మ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)