పుట్టిన రోజు సందడి తరువాత రాత్రి 9 గంటలకు అమ్మ పక్కన పడుకున్న ఆరేళ్ల పాప తెల్లారేసరికి మాయమైంది.. 8 రోజులైనా దొరకని ఆచూకీ

ఫొటో సోర్స్, Newsclick
- రచయిత, విజయానంద్ అరుముగం
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఆరేళ్ల పాప కనిపించకుండాపోయి ఎనిమిది రోజులు దాటింది. అయినా, ఆ పాప ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
''ఆ రోజు రాత్రి (అక్టోబర్ 11న) పుట్టినరోజు జరుపుకుంది. నా పక్కన పడుకుంది. తర్వాత రోజు ఉదయం నాపక్కన నా కూతురు కనిపించలేదు'' అని పాప తల్లి చెప్పారు.
"నిఘా కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌తో సహా పలు కోణాల్లో దర్యాప్తు జరిపినప్పటికీ, మేమింకా ఒక నిర్ధరణకు రాలేకపోయాం" అని సెంజీ డీఎస్పీ బీబీసీతో అన్నారు.
విల్లుపురం జిల్లాలోని సెంజీ సమీపంలోని ఒక గ్రామానికి చెందిన మహిళ అక్టోబర్ 12వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
''అక్టోబర్ 11న నా పాప పుట్టినరోజు. సాయంత్రం 7 గంటల సమయంలో మేం కేక్ కట్ చేసి, సెలబ్రేట్ చేశాం. బంధువులతో మాట్లాడి వచ్చిన తర్వాత, రాత్రి 11 గంటల సమయంలో నిద్రపోయాను'' అని తెలిపారు.
తర్వాత రోజు ఉదయం 6 గంటలకు తాను నిద్రలేచినప్పుడు, పాప కనిపించలేదని ఆమె తల్లి చెప్పారు. ఆ తర్వాత, పాప అదృశ్యమైనట్లు పోలీసు స్టేషన్లో కేసు దాఖలు చేసినట్లు తెలిపారు.

7 ప్రత్యేక దళాల సంస్థ
పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత.. పాపను కనుగొనేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ, అంత తేలిగ్గా సాగలేదు.
స్నిపర్ డాగ్స్ సాయంతో కూడా పోలీసులు తీవ్రమైన సెర్చ్ ఆపరేషన్ చేశారు. బాలిక అదృశ్యమైన ఇంట్లో, సమీప ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టారు.
బాలిక కనిపించకుండాపోయిన ప్రాంతానికి సమీపంలో అటవీ, పర్వత ప్రాంతాలు ఉన్నాయి. పోలీసులు డ్రోన్ కెమెరా సహాయంతో ఆ ప్రాంతమంతా గాలింపు చేపట్టారు.
పోలీసులతో పాటు గ్రామస్తులు కూడా సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కానీ, పాపకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు.
పాప కనిపించకుండాపోయిన కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో, జిల్లా ఎస్పీ మతివానన్ నేరుగా రంగంలోకి దిగి దర్యాప్తును వేగవంతం చేశారు.
ఘటన తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, తప్పిపోయిన బాలికను త్వరితగతిన గుర్తించేందుకు జిల్లా ఎస్పీ ప్రత్యక్ష పర్యవేక్షణలో, ఒక అదనపు ఎస్పీ, ముగ్గురు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ల నేతృత్వంలో 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఈ విషయమై, అక్టోబర్ 19న విల్లుపురం జిల్లా పోలీసులు జారీ చేసిన పత్రికా ప్రకటనలో, వివిధ కోణాల్లో విస్తృత దర్యాప్తు, గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
‘‘పాప కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామంలోని పలువురిని విచారిస్తున్నాం’’ అని పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, Handout
పోలీసు దర్యాప్తు గురించి రిపోర్టర్లతో మాట్లాడిన పాప తల్లి, అక్టోబర్ 11 రాత్రి జరిగిన విషయాలను వివరించారు.
''అక్టోబర్ 11న నా పాప పుట్టినరోజు. సాయంత్రం 7 గంటల సమయంలో మేం కేక్ కట్ చేసి, సెలబ్రేట్ చేశాం. 9 గంటల వరకు బర్త్‌డే పార్టీకి వచ్చిన బంధువులతో మాట్లాడాం. బంధువులందరూ ఉన్నప్పుడే నా కూతురు నిద్రపోయింది. వారు వెళ్లిన తర్వాత సుమారు 9.30 గంటలకు నిద్రపోయాను. నా కూతురు అప్పుడు నా పక్కనే పడుకుంది. 11 గంటల వరకు నాకు నిద్రపట్టలేదు. ఇంటి ముందు తలుపు పెట్టే అలవాటు మాకు లేదు. సుమారు 11.45 గంటలకు కూడా నేను నా కూతుర్ని చూశాను. తర్వాత రోజు ఉదయం లేచినప్పుడు, నా కూతురు కనిపించలేదు'' అని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Handout
'నా కూతురికి ఏం జరగకూడదు'
పాప తల్లి ఒక రైతు కూలీ. ఆమె భర్త మేకల కాపరిగా ఉన్నారు. ఆ దంపతుల పెద్ద కుమార్తె నర్సింగ్ ట్రైనింగ్ స్కూల్లో చదువుకుంటోంది.
"వాళ్ల ఇంటికి సమీపంలో అటవీ ప్రాంతం ఉంది. జంతువుల సంచారం వల్ల ఏమైనా జరిగి ఉంటుందా?" అని అడగ్గా, పాప తల్లి ఇలా సమాధానమిచ్చారు.
"అలాంటి సమస్యలేమీ ఇప్పటివరకు రాలేదు. చెరకు పొలాల్లో పందులు ఇబ్బంది పెడతాయి. కానీ, ఏ జంతువూ ఎప్పుడూ ఇంట్లోకి రాలేదు" అని తెలిపారు.
''నా కూతురు గ్రామంలో అందరితో మామూలుగానే మాట్లాడుతుంది. అంగన్వాడీకి, గుడికి ఒక్కతే వెళ్తుంది. ఆమెకు ఏం జరిగిందో తెలియడం లేదు. నా కూతురికి ఏం జరగకూడదని ఆశిస్తున్నాం'' అని అన్నారు.
పాప ఇంటికి సమీపంలో నివసిస్తున్న ఒక మహిళ, తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఆ పాప ఏడుపు విన్నట్లు మీడియాకు తెలిపారు.
సంఘటన జరిగిన రోజున పాప తండ్రి, తల్లి, అమ్మమ్మ అక్కడే ఉన్నారు.
"ఆ రోజు ఆవు కొమ్ము విరిగిపోవడంతో, నేను దానికి పసుపు పూసి రాత్రి 11.30 గంటల ప్రాంతంలో నిద్రపోయాను. ఉదయం నిద్రలేచి చూసేసరికి పాప కనిపించలేదు" అని పాప తండ్రి చెప్పారు.

ఫొటో సోర్స్, Handout
'ఏమీ దొరకలేదు' – బాలల సంక్షేమ కమిటీ
విల్లుపురం జిల్లా బాలల సంక్షేమ శాఖ కూడా పోలీసుల సహకారంతో దర్యాప్తు నిర్వహిస్తోంది. పాపను కనుగొనే ప్రయత్నాల గురించి విల్లుపురం జిల్లా బాలల సంక్షేమ అధికారి ఇళయరాజాతో బీబీసీ మాట్లాడింది.
"పాప కనిపించకుండా పోయిన వార్త బయటకు వచ్చినప్పటి నుంచి మేం పోలీసు, రెవెన్యూ శాఖల సహాయంతో దర్యాప్తు నిర్వహిస్తున్నాం. మేం దర్యాప్తు చేసినంత వరకు, మాకు ఏమీ లభించలేదు" అని ఆయన తెలిపారు.
"ఆ పాప ఇంట్లో తన పక్కనే నిద్రపోతోందని ఆమె తల్లి చెప్పింది. ఆమె వివరణ అంత స్పష్టంగా లేదని మేం అర్థం చేసుకున్నాం. ఇది అదృశ్యమైన వ్యక్తి కేసు కావడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ అమ్మాయి దొరికితేనే మేం తదుపరి చర్యలు తీసుకుంటాం" అని ఆయన అన్నారు.
ఎనిమిది రోజులు గడిచినా పాప ఆచూకీ కనుగొనలేకపోయామని విల్లుపురం జిల్లా పోలీసులు జారీ చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు.

ఫొటో సోర్స్, Handout
'600 సెల్ ఫోన్ నెంబర్లు.. సీసీటీవీ ఫుటేజీ'
స్నిపర్ డాగ్స్ సాయంతో పోలీసులు పాపను కనుగొనే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
"పాపను కనుగొనేందుకు లభించే ఆధారాల గురించి సమాచారం సేకరిస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి అందుబాటులో ఉన్న ప్రతి సమాచారాన్ని విడివిడిగా పరిశీలించి, దాని ఆధారంగా దర్యాప్తు నిర్వహిస్తున్నాం" అని విల్లుపురం జిల్లా పోలీసులు తెలిపారు.
"పాప కోసం సంబంధిత గ్రామం, దాని చుట్టుపక్కల ప్రాంతాలు, చెరువులు, సరస్సులు, ఇతర జలాశయాలు, కొండ ప్రాంతాలు, రాళ్ళు, జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశాలలో గాలింపు కొనసాగుతోంది" అని పోలీసులు తెలిపారు.
సంబంధిత గ్రామం, దాని పరిసర ప్రాంతాలలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల వివరాలను, వారి నేపథ్యాలను విచారిస్తున్నట్లు విల్లుపురం జిల్లా పోలీసులు తెలిపారు.
"ఘటన జరిగిన రోజు ఆ ప్రాంతంలో నమోదైన సుమారు 600 సెల్ ఫోన్ నంబర్లను వివిధ కోణాల్లో పరిశీలిస్తూ దర్యాప్తు నిర్వహిస్తున్నాం. సంబంధిత గ్రామం, దాని పరిసర ప్రాంతాల నుంచి సీసీటీవీ ఫుటేజీని సేకరించి పరిశీలిస్తున్నాం" అని పోలీసులు తెలిపారు.
ఇదే సమాచారాన్ని బీబీసీతో పంచుకున్న సెంజీ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ రమేష్ రాజు.. "పాప కనిపించకుండాపోయిన కేసుపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. మేం అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నాం" అని తెలిపారు.
"ఆ పాప బయటకు వెళ్లిందా... లేదా ఆ ప్రాంతంలోనే ఉంటుందా అని నిర్ధరించడానికి దర్యాప్తు జరుగుతోంది. గ్రామాల్లో ఎక్కువ సీసీటీవీలు లేవు. మాకు సుమారు 14 చోట్ల నుంచి అందిన ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు నిర్వహిస్తున్నాం" అని ఆయన చెప్పారు.
"పాప అదృశ్యమైన కేసులో పోలీసులు ఇంకా ఏ నిర్ధరణకు రాలేదు" అని డీఎస్పీ రమేష్ రాజు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































