కనిగిరి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళ ఎందుకు ఏడ్చారు? మరో మహిళ పోలీసుల కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?

మున్సిపల్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, కనిగిరి, మహిళలు, టీడీపీ, వైసీపీ
ఫొటో క్యాప్షన్, కనిగిరి చైర్ పర్సన్‌గా పోటీచేసేందుకు తాను వేసిన నామినేషన్‌ను తిరస్కరించారని వైసీపీకి చెందిన పులి శాంతి చెప్పారు.
    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్‌
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్‌ల స్క్రూటినీ సందర్భంగా.. ఓ మహిళ పోలీసుల కాళ్లు పట్టుకుని బతిమాలుతున్నట్టు.. మరో మహిళ కన్నీళ్లు పెట్టుకుంటూ రోడ్డుపై నిలుచున్నట్టు ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అసలు ఎవరా మహిళలు... పోలీసుల కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?

మరో మహిళ ఎందుకు ఏడుస్తున్నారు?

దీనిపై పోలీసులు ఏమంటున్నారు?

ఎన్నికల అధికారులు ఏం చెబుతున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి మున్సిపాలిటీలో కూడా కౌన్సిలర్, చైర్‌పర్సన్‌ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.

ఈ క్రమంలో వైఎసీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్ధిగా పోటీ చేయాలనుకున్న పులి శాంతి ఈనెల 17న రెండు సెట్ల నామినేషన్, 18వ తేదీన ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

అలాగే తన తల్లితో కూడా మరో రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేయించానని, మొత్తం ఐదు సెట్ల నామినేషన్లు దాఖలు చేశామని పులి శాంతి బీబీసీతో చెప్పారు.

మున్సిపల్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, కనిగిరి, మహిళలు, టీడీపీ, వైసీపీ
ఫొటో క్యాప్షన్, డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినా ఇవ్వలేదని అధికారులు అంటున్నారని పులి శాంతి ఆరోపించారు.

నామినేషన్ ఎందుకు తిరస్కరించారు?

నామినేషన్ల స్క్రూటినీ ఈనెల 19వ తేదీ సోమవారం జరగ్గా ఉదయమే తాము మున్పిపల్‌ కార్యాలయం వద్దకు చేరుకున్నామని పులి శాంతి చెప్పారు.

అయితే ఉదయం నుంచి పోలీసులు తమను లోపలికి వెళ్లనివ్వలేదని, ఎన్నిసార్లు బతిమాలినా లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. ఆ క్రమంలోనే తాను ఉద్వేగానికి గురయ్యానని పులి శాంతి బీబీసీకి తెలిపారు.

తాము నిరసన వ్యక్తం చేసినా, ఎంత బతిమాలినా.. లోపలికి వెళ్లనివ్వలేదని, పైగా టీడీపీ కార్యకర్తలు తమపై దౌర్జన్యం చేసి తమ కౌన్సిలర్‌ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను సైతం చించివేశారని ఆరోపించారు.

అసిస్టెంట్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న కనిగిరి మున్సిపల్‌ కమిషనర్‌ పర్వతనేని శ్రీధర్‌ చివరకు ఆదివారం సాయంత్రం తన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని చెప్పారని శాంతి ఆవేదన వ్యక్తం చేశారు.

అదేమని అడిగితే డిక్లరేషన్‌ ఫామ్‌ ఇవ్వలేదని చెప్పారని, వాస్తవానికి తాము సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇచ్చినా ఇవ్వలేదని అబద్ధం చెప్పి తన నామినేషన్‌ తిరస్కరించడం అన్యాయమని శాంతి, ఆమె భర్త గోవర్ధన్‌ రెడ్డి అన్నారు.

అయితే, పులి శాంతి ఆరోపిస్తున్నట్లుగా తాము ఎవరి నామినేషన్ పత్రాలు చించివేయలేదని స్థానిక టీడీపీ నాయకులు చెప్పారు.

మున్సిపల్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, కనిగిరి, మహిళలు, టీడీపీ, వైసీపీ
ఫొటో క్యాప్షన్, సరైన వివరాలు లేకపోవడంతో పులి శాంతి నామినేషన్‌ను పై స్థాయి అధికారులు తిరస్కరించారని కనిగిరి మున్సిపల్ కమిషనర్ చెప్పారు.

అన్ని వివరాలు లేవు... అందుకే రిజెక్ట్‌ అయింది: మున్సిపల్‌ కమిషనర్‌

ఇదే విషయమై కమిషనర్‌ పర్వతనేని శ్రీధర్‌తో బీబీసీ మాట్లాడింది.

తాము ఉద్దేశ్యపూర్వకంగా పులి శాంతి నామినేషన్‌ తిరస్కరించలేదని ఆయన చెప్పారు. ఆమె నామినేషన్‌ పత్రాల్లో సరైన వివరాలు లేవని, అందుకే తిరస్కరణకు గురైందని అన్నారు.

ఆ నామినేషన్‌ పత్రాలను తాను ఒక్కడినే పరిశీలించనని, ఎన్నికల సంఘం నియమించిన బాధ్యులైన అధికారులు పరిశీలించిన తర్వాత ఇచ్చే నివేదికను, వారి నిర్ణయాన్ని మాత్రమే తాను అధికారికంగా ప్రకటిస్తానని శ్రీధర్‌ చెప్పారు.

శాంతి నామినేషన్‌ను తన పై స్థాయిలోని ఎన్నికల అధికారులే రిజెక్ట్‌ చేశారని, ఆ నిర్ణయాన్ని మాత్రమే తాను అధికారికంగా ప్రకటించానని అన్నారు.

మున్సిపల్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, కనిగిరి, మహిళలు, టీడీపీ, వైసీపీ
ఫొటో క్యాప్షన్, తమ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడంపై న్యాయపోరాటం చేస్తామని వైసీపీ చెబుతోంది.

‘కాళ్లు పట్టుకున్నప్పటికీ...’

వీడియోలో ఓ ఎస్‌ఐ కాళ్లు పట్టుకుని బతిమాలుతున్నట్లుగా కనిపిస్తున్న మరో మహిళ పేరు షేక్‌ సమీరా.. ఆమె కనిగిరి మున్సిపల్‌ ఎన్నికల్లో 18వ వార్డు నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.

సమీరా నామినేషన్‌ను కూడా తిరస్కరించారని, స్క్రూటినీ ప్రక్రియ కోసం మున్సిపల్‌ కార్యాలయంలోని ఎన్నికల అధికారుల వద్దకు పంపాలని ఆమె ఎన్నిసార్లు మొత్తుకున్నా.. ఎంత విలపించినా పోలీసులు పట్టించుకోలేదని పులి శాంతి తెలిపారు.

చివరికి ఆమె కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని, ఆమె నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురైందని శాంతి చెప్పారు. కాగా,షేక్‌ సమీరా బీబీసీకి అందుబాటులోకి రాలేదు. రాగానే ఆమెతో మాట్లాడి ఆమె వాదనను అప్‌ డేట్‌ చేస్తాం.

కెమెరాలు రాగానే అలా చేశారు: పోలీసులు

వైరల్‌ అయిన వీడియోలు, వైసీపీ నేతల ఆరోపణలపై స్పందించేందుకు కనిగిరి డీఎస్పీ శ్రీనివాస్‌ సుముఖత వ్యక్తం చేయలేదు. ఈ విషయంపై మాట్లాడేందుకు బీబీసీ ఫోన్‌ చేయగా.. తన ఫోన్‌ సరిగ్గా లేదని, విషయం అర్ధం కావడం లేదని అన్నారు.

కనిగిరి సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ సుబ్రమణ్యంతో బీబీసీ మాట్లాడగా అసలు అలాంటి ఘటనలేమీ కనిగిరిలో జరగలేదని చెప్పారు.

కనిగిరి ఎస్‌ఐ సందీప్‌ మాత్రం తమ వద్దనే ఆ ఘటనన జరిగిందని అంగీకరించారు.

వైసీపీ అభ్యర్ధులందరూ పెద్ద ఎత్తున జనాలను వెంటబెట్టుకొని వచ్చారని, 144 సెక్షన్‌ నేపథ్యంలో అంతమందికి అనుమతి లేదని చెప్పినప్పటికీ ఉద్దేశ్యపూర్వకంగా వాదనలకు, ఘర్షణలకు దిగారని ఎస్‌ఐ చెప్పారు.

ఇక ఓ మహిళ కాళ్లు పట్టుకున్న ఘటనపై ఎస్‌ఐ స్పందించారు.

''అప్పటివరకు ఆమె చాలా గట్టిగా పోలీసులతో మాట్లాడారు.. ఓరకంగా దురుసుగా వ్యవహరించారు. అయితే వీడియో కెమెరాలతో మీడియా వాళ్లు రాగానే ఒక్కసారిగా కాళ్లు పట్టుకున్నారు'' అని ఎస్‌ఐ చెప్పారు.

అయితే ''ఆమె కాళ్లు పట్టుకున్న వీడియో ఉంది.. కదా.. అంతకు ముందు ఆమె దురుసుగా వ్యవహరించిన దృశ్యాలు ఏమైనా సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయా.. ఆ దృశ్యాలు మీవద్ద ఉన్నాయా'' అని బీబీసీ ప్రశ్నించగా.. అలాంటి దృశ్యాలు తమ వద్ద లేవన్నారు.

కాగా ఆ వీడియోలో ఉన్న చంద్రశేఖరాపురం(సీఎస్‌ పురం) ఎస్‌ఐ వెంకటేశ్వరరెడ్డితో (ఆ మహిళ కాళ్ల మీద పడి బతిమాలింది ఈయన్నే) బీబీసీ మాట్లాడింది.

''ఆమె మధ్యాహ్నం మూడుగంటల తర్వాత వచ్చారు.. అప్పటికే సమయం అయిపోయిందని చెప్పడంతో మొదట గట్టిగానే మాట్లాడారు తర్వాత ఉన్నట్టుండి కాళ్లు పట్టుకున్నారు.. నేను ఒకింత షాక్‌ అయ్యాను... ఆ తర్వాత ఆమెకి వాస్తవ పరిస్థితి అర్ధం కావాలని లోపలికి అనుమతించాను.. నేను చెప్పినట్టుగానే రిటర్నింగ్‌ ఆఫీసర్‌ అప్పటికే టైం అయిపోయిందని ఆమెను బయటకు పంపించేశారు.. ఇదీ వాస్తవంగా జరిగింది''అని వెంకటేశ్వరరెడ్డి బీబీసీతో అన్నారు.

కోర్టుకు వెళ్తాం: వైసీపీ

కనిగిరి మున్సిపాలిటీలో వైసీపీ అభ్యర్ధులు మొత్తం 32 వార్డులకు, చైర్‌ పర్సన్‌ ఎన్నికకు నామినేషన్లు దాఖలు చేయగా, 24 వార్డుల అభ్యర్ధుల నామినేషన్లను మాత్రమే స్వీకరించి.. మిగిలిన ఎనిమిది మంది నామినేషన్లను తిరస్కరించారని, అలాగే చైర్‌ పర్సన్‌ అభ్యర్ధి పులి శాంతి నామినేషన్‌ను కూడా తిరస్కరించారని కనిగిరి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నారాయణ బీబీసీతో అన్నారు.

నిబంధనల మేరకు అన్ని పత్రాలు సమర్పించినా అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా వేధింపులకు గురి చేసి తమ చైర్‌ పర్సన్‌ సహా ఎనిమిది వార్డుల అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం అన్యాయమని అన్నారు.

దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని, ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)