వందల కోట్ల రూపాయల విలువైన బ్రా ధరించిన కైలీ జెన్నర్‌పై జరుగుతున్న చర్చ ఏంటి?

కైలీ జెన్నర్‌, విక్టోరియాస్ సీక్రెట్
ఫొటో క్యాప్షన్, కైలీ జెన్నర్ ధరించిన బ్రా 18 క్యారెట్ల బంగారంతోనూ, 4,410 వజ్రాలతో తయారు చేశారు.
    • రచయిత, నవోమి డిసౌజా, మియా చాహల్
    • హోదా, బీబీసీ న్యూస్‌బీట్ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

రియాలిటీ టీవీ స్టార్ కైలీ జెన్నర్ 50 మిలియన్ డాలర్ల (సుమారు 475 కోట్ల రూపాయలు ) విలువైన బ్రా ధరించి విక్టోరియాస్ సీక్రెట్ ఫ్యాషన్ షోలో అరంగేట్రం చేయడంపై మిశ్రమ స్పందన వచ్చింది.

లోదుస్తుల దిగ్గజ సంస్థ విక్టోరియాస్ సీక్రెట్ వార్షిక ప్రదర్శనలో మేకప్ మొఘల్ కైలీ జెన్నర్ 18 క్యారెట్ల బంగారంతోనూ, 4,410 వజ్రాలతో తయారైన ఫాంటసీ బ్రాను ధరించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

ఈ ప్రదర్శనలో ఫాంటసీ బ్రా ఎప్పటి నుంచో కీలక అంశంగా ఉంది . ఈ ఫాంటసీ బ్రాను ధరించే అవకాశాన్ని మోడళ్లు గౌరవంగా, జీవితంలో ఒక మైలురాయిగా భావిస్తారు.

అంత విలువైన బ్రా ధరించే అవకాశం ఈ 29ఏళ్ల కర్దాషియన్ స్టార్‌కు ఇవ్వడంపై కొంతమంది అభిమానులు సంతోషం వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం ఓ సీనియర్ మోడల్‌కు అవకాశం ఇవ్వలేదని ఆ బ్రాండ్‌ను తీవ్రంగా విమర్శించారు.

ఈ కార్యక్రమాన్ని చాలా వ్యూహాత్మకంగా రూపొందించారని, మోడలింగ్, సోషల్ మీడియా భవిష్యత్తు ఎలా ఉండనుందనే అంశంపై చర్చకు దారి తీసేలా పక్కా ప్రణాళికతో రూపొందించారని సోషల్ మీడియా, మార్కెటింగ్ నిపుణుడు జోయెల్ మార్లినార్సన్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"సెలబ్రిటీ ప్రపంచంలో వచ్చిన కొత్త మార్పునకు కైలీ ఒక ఉదాహరణ. ఇప్పుడు సంప్రదాయ మోడల్ ప్రమాణాలకు ఎవరు సరిపోతారనే దాని కంటే ఎవరు ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తారనే విషయానికి బ్రాండ్లు ప్రాధాన్యం ఇస్తున్నాయి" అని జోయెల్ బీబీసీకి చెప్పారు.

కైలీ జెన్నర్ సోషల్ మీడియాతోపాటు, తన సిస్టర్స్‌తో కలిసి చేసిన రియాలిటీ షోను చూస్తూ పెరిగిన యువ ప్రేక్షకులకు ఆమెతో ఓ ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడిందని మార్లినార్సన్ చెప్పారు.

అయితే, ఫ్యాషన్ రంగంలో నయోమీ క్యాంప్‌బెల్ ఒక వెలుగు వెలిగిన రోజులను గుర్తు చేసుకునేవారు కూడా ఉంటారని ఆయన అన్నారు. జెన్నర్‌కు ఈ అవకాశం ఇవ్వడాన్ని వారిలో కొందరు ద్రోహంగా భావించవచ్చని చెప్పారు.

కైలీ జెన్నర్‌, విక్టోరియాస్ సీక్రెట్
ఫొటో క్యాప్షన్, కైలీ జెన్నర్‌ను ఎంపిక చేయడంపై విమర్శలు రేగాయి

రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని సంస్థలు

"మొత్తానికి ఇది మార్కెటింగ్‌లో వచ్చిన కొత్త ధోరణికి నిదర్శనం. విక్టోరియాస్ సీక్రెట్‌తోపాటు ఎన్నో ఏళ్లుగా పేరున్న బ్రాండ్లు రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు" అని ఆయన అన్నారు.

"ప్రజల దృష్టిని ఆకర్షించి, వార్తల్లో నిలుస్తూ, ఎప్పటికప్పుడు జనాన్ని ఆకట్టుకునే వ్యక్తిని తీసుకురావాలని బ్రాండ్లు కోరుకుంటున్నాయి. విక్టోరియాస్ సీక్రెట్ కూడా సరిగ్గా అదే చేసింది." అని అన్నారు.

జెన్నర్ ఆకట్టుకునే లుక్‌తో కనిపించిన వీడియోను విక్టోరియాస్‌ సీక్రెట్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పంచుకుంది. ఆ వీడియో కింద కొందరు అభిమానులు ఆమెను ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు.

మరికొందరు దీన్ని "నిజమైన మోడళ్లకు ఘోర అవమానంగా అభివర్ణించారు. ఎంతోమంది ప్రతిభావంతులైన మోడళ్లు ఉండగా ఆమెనే ఎందుకు ఎంచుకున్నారు" అని ప్రశ్నించారు.

"ఒకప్పుడు అద్భుతమైన అందచందాలకు పేరున్న ఈ షో ఇప్పుడు ఇన్‌ప్లుయెన్సర్ల సర్కస్‌గా మారిపోయింది" అని ఒకరు వ్యాఖ్యానించారు. "నిజమైన మోడలింగ్ ప్రతిభ, హుందాతనం, ర్యాంప్‌పై ఆకట్టుకునే తీరు స్థానంలో సోషల్ మీడియా పలుకుబడికి ప్రాధాన్యం ఇస్తున్నారు, అందరికీ అవకాశం ఇస్తున్నట్టు పైపైన చూపించే ప్రయత్నం చేస్తున్నారు" అని విమర్శించారు.

కైలీ జెన్నర్‌, విక్టోరియాస్ సీక్రెట్
ఫొటో క్యాప్షన్, కైలీ జెన్నర్ ప్రభావం అన్ని రంగాలలో ఉందని నిర్వాహకులు నమ్ముతున్నారు

"అన్ని రంగాల్లో ప్రవేశం ఉన్నందునే..."

ప్రజల అభిరుచులు, ధోరణులపై మంచి ప్రభావం ఉన్నందుకే జెన్నర్‌ను ఎంచుకున్నామని వోగ్ పత్రికతో విక్టోరియాస్ సీక్రెట్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ ఆడమ్ సెల్మన్ చెప్పారు.

జెన్నర్‌ ప్రభావం ఒక్క రంగానికే పరిమితం కాకుండా ఫ్యాషన్, సంస్కృతి, టీవీ అన్ని రంగాల్లో ఉందని ఆయన అన్నారు.

"సరిగ్గా అదే చేశాం. ఇది చాలా పెద్ద షో. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే దీని ఉద్దేశం. అందుకు ఆమె గొప్ప ప్రేరణగా నిలుస్తారని భావిస్తున్నా’’ అన్నారు.

కైలీ జెన్నర్‌, విక్టోరియాస్ సీక్రెట్
ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది ఫాంటసీ బ్రాను ఆభరణాల బ్రాండ్ జాకబ్ అండ్‌కోతో కలిసి విక్టోరియాస్ సీక్రెట్ రూపొందించింది.

2018లో ఆగిన షో 2024 నుంచి పునః ప్రారంభం

యువతను ఆకట్టుకోడానికి విక్టోరియాస్ సీక్రెట్ జెన్నర్‌ను ఎంచుకుందని భావిస్తున్నట్టు బ్రిటిష్ మోడల్ సమ్మర్ నెస్‌బెత్ న్యూస్‌బీట్‌తో చెప్పారు.

"ఆమెకు ఎంతో పలుకుబడి ఉంది. ప్రజలపై బలమైన ముద్ర వేయగలరు. మనం ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఉన్నాం" అని న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై నడిచిన 25 ఏళ్ల నటి సమ్మర్ నెస్‌బెత్ అన్నారు.

తక్కువ రేటింగ్‌లు రావడంతోపాటు, మహిళల పట్ల వివక్ష చూపుతోందని, పాత ధోరణుల్లోనే సాగుతోందని, వైవిధ్యం లేదని విమర్శలు రావడంతో ఈ లోదుస్తుల బ్రాండ్ 2018లో తన ఫ్యాషన్‌ షోను రద్దు చేసింది.

"మహిళలందరికీ గుర్తింపు ఇస్తాం" అనే హామీతో ఈ షో 2024లో తిరిగి ప్రారంభమైంది. విభిన్న నేపథ్యాలు, శరీరాకృతులు ఉన్న మోడళ్లకు అవకాశం కల్పించింది. ఇందులో ప్లస్ సైజ్ మోడల్‌గా యాష్లీ గ్రాహమ్ కూడా పాల్గొన్నారు.

ఈ ఏడాది ఫాంటసీ బ్రాను ఆభరణాల బ్రాండ్ జాకబ్ అండ్‌కోతో కలిసి విక్టోరియాస్ సీక్రెట్ రూపొందించింది. ఇప్పటివరకు తాము తయారుచేసిన వాటిలో ఇదే అత్యంత విలువైన బ్రా అని జాకబ్ అండ్‌కో తెలిపింది. దీన్ని తయారుచేయడానికి 15 మంది కళాకారులు వెయ్యి గంటలకు పైగా శ్రమించారని పేర్కొంది.

బ్రాలపైనే ఇంతగా దృష్టి పెట్టడం చూస్తే, "మనం వాస్తవ ప్రపంచానికి ఎంత దూరంగా ఉన్నామో తెలుస్తోంది" అని నెస్‌బెత్ అభిప్రాయపడ్డారు.

"ప్రజలు తిండి కోసం కూడా ఇబ్బంది పడుతున్నారు. కరెంటు బిల్లులు కూడా కట్టలేకపోతున్నారు" అని ఆమె అన్నారు.

"మనం దేనిపై దృష్టి పెడుతున్నాం, దేనికోసం డబ్బు ఖర్చు చేస్తున్నాం అనే విషయాలపై చాలా చర్చ జరగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా" అని అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)