అమిలీయా ఇయర్హార్ట్: 90 ఏళ్ల కిందట ప్రపంచాన్ని చుట్టిరావాలని బయల్దేరిన ఈ మహిళ ఎలా అదృశ్యమయ్యారు, ఈ మిస్టరీని ఛేదిస్తారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అలెక్స్ ఫిలిప్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
పసిఫిక్ మహాసముద్రంలోని ఓ మారుమూల ద్వీపంలో అమిలీయా ఇయర్హార్ట్కు చెందిన విమాన శకలాల అన్వేషణ మళ్లీ మొదలైంది. వాతావరణం అనుకూలించక పోవడంతో పరిశోధకులు కొన్ని రోజులు తమ అన్వేషణ కొనసాగించ లేకపోయారు.
ఈ అన్వేషణ కోసం కిరిబాటీలో భాగమైన నికుమారోరో ద్వీపానికి ఓ బృందం ప్రయాణించింది.
ఈ దీవిలోని ఓ సరస్సులో ఏరియల్ చిత్రాల ద్వారా గుర్తించిన తరైయా పేరుతో ప్రసిద్ధి చెందిన ఓ వస్తువును పరిశీలించడం ద్వారా ఈ ప్రసిద్ధ విమానయాత్రికురాలి అదృశ్యాన్ని ఛేదించాలని ఈ అన్వేషణ బృందం ఆశతో ఉంది.
అమీలియా ఇయర్హార్ట్ 1937లో విమానంలో ప్రపంచాన్ని చుట్టిరావాలనే లక్ష్యంతో బయల్దేరి అదృశ్యమయ్యారు.
అప్పటి నుంచి ఆమె ఏమయ్యారనే విషయమై రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.

ఉధృతమైన అలలు, బలమైన ఈదురుగాలుల కారణంగా వాతావరణం మెరుగుపడే వరకు పరిశోధకులు మూడు రోజుల పాటు తమ పరిశోధనా నౌకలోనే ఉండాల్సి వచ్చింది.
"మేం ఎట్టకేలకు నికుమరోరో ద్వీపంలో కాలు మోపగలిగాం" అని ఆ యాత్రలో పాలుపంచుకుంటున్న టెక్నాలజీ స్పెషలిస్ట్ శిరీష బండ్ల తాము ప్రయాణించిన ‘మారిన్ మైనికు’ నౌక డెక్ పై నుంచి పంపిన వీడియో సందేశంలో తెలిపారు.
ఈ పరిశోధకులు గత వారం ఎలాంటి జనావాసాలు లేని ఈ పగడపు దీవికి చేరుకుని, తమ పరిశోధనకు అనుగుణమైన ప్రాంతంలో నీటి అడుగున సర్వే ప్రారంభించారు.
కానీ పసిఫిక్ మహాసముద్రంలో బలంగా మారిన ఎల్ నినో పరిస్థితుల వల్ల ఏర్పడిన వాతావరణం, వారు తమ రెండో దశ పరిశోధనలను ప్రారంభించకుండా ఇప్పటివరకు అడ్డుకుంది. ఈ దశలోనే వారు నీటి అడుగున ఉన్న వస్తువుల లోతును పరీక్షించాల్సి ఉంది, అలాగే అక్కడ పేరుకుపోయిన మట్టిని కూడా తొలగించాల్సి ఉంది."
"వీలైతే అన్ని పనులు పూర్తి చేయడానికి మేం కృషి చేస్తున్నాం" అని శిరీష బండ్ల అన్నారు. "సిబ్బంది చాలా ఉత్సాహంగా ఉన్నారు" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Purdue University
హవాయి టు కాలిఫోర్నియా, మధ్యలో ఏమైంది?
అమీలియా ఇయర్ హార్ట్ 1937 జూలై 2 నాటికి తన ట్విన్ ఇంజిన్ లాక్‌హీడ్ ఎలెక్ట్రా విమానంలో కాలిఫోర్నియా నుంచి దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా మీదుగా విజయవంతంగా ప్రయాణించి పాపువా న్యూ గినియాలోని 'లే'కు చేరుకున్నారు.
అక్కడి నుంచి నావిగేటర్ ఫ్రెడ్ నూనాన్తో కలిసి హవాయి వైపుగా ప్రయాణించి , చివరకు కాలిఫోర్నియాకు తిరిగి వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు.
కానీ నికుమరోరో సమీపంలోని ఒక మారుమూల, జనసంచారం లేని హౌలాండ్ ద్వీపానికి చేరుకుని ఇంధనం నింపుకునే ప్రయత్నంలో ఆమె విమానం ఎలాంటి ఆనవాళ్లు లేకుండా అదృశ్యమైంది.
అమీలియా ఇయర్హార్ట్ అనుకోకుండా నికుమరోరోకు చేరుకుని, అక్కడ తన విమానాన్ని దింపి, ఒంటరిగా జీవిస్తూ మరణించి ఉండవచ్చనేది ఒక సిద్ధాంతం.
పర్డ్యూ యూనివర్సిటీ చెబుతున్న 1938 నాటి ఫోటోలో కనిపిస్తున్న 'తరైయా ఆబ్జెక్ట్' అని పిలిచే చిత్రాలు, తక్కువ లోతు ఉన్న నీటిలో పడి ఉన్న ఒక చిన్న విమాన శకలాలు కావొచ్చని చెబుతున్నారు. అయితే, వీటిపై ఇతర అన్వేషకులు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ యాత్రపై ఉన్న ఆసక్తి కారణంగా న్యూజీలాండ్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియం శుక్రవారం నికుమరోరోకు సంబంధించి ఇంతకుముందు ఎన్నడూ చూడని నిఘా చిత్రాలను విడుదల చేసింది.

ఫొటో సోర్స్, Archaeological Legacy Institute
చివరిసారి జనావాసం ఉన్నది ఎప్పుడు?
సీప్లేన్ నుంచి 1938లో తీసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో 'తరైయా ఆబ్జెక్ట్' స్పష్టంగా కనిపించనప్పటికీ, అవి ఎస్ఎస్ నార్విచ్ సిటీ అనే బ్రిటీష్ వాణిజ్య నౌకకు సంబంధించిన శకలాలను చూపిస్తున్నాయి. ఈ నౌక 1929లో వచ్చిన ఓ భారీ తుపాను సమయంలో ఈ ద్వీపంలో చిక్కుకుపోయి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 11మంది చనిపోయారు.
ఈ సంఘటన ఆ ద్వీపం చుట్టూ ఉన్న ప్రమాదాలను స్పష్టం చేసిందని అమెరికాకు చెందిన ఆర్కియాలజికల్ లెగసీ ఇన్స్టిట్యూట్తో కలిసి ఈ యాత్రకు నాయకత్వం వహిస్తున్న పుర్డ్యూ యూనివర్సిటీ పేర్కొంది.
ఆ పగడపు దీవిలోని సరస్సులోకి ప్రవేశించాలంటే, 1963లో బ్రిటిష్ వారు పగడపు దిబ్బలో సృష్టించిన ఒక ఇరుకైన మార్గం గుండా పడవలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ ద్వీపంలో చివరిసారి జనావాసం ఉన్నది అప్పుడే.
అయితే, ఆదివారం వరకు ద్వీపం చుట్టూ గంటకు 27 నాట్ల (31 మైళ్ల) వేగంతో గాలులు వీచడం వల్ల, అలల ఉద్ధృతికి ఇరుకు మార్గంలో ప్రయాణించే పడవ పగడపు దిబ్బపైకి కొట్టుకుపోయే ప్రమాదం ఉందని యూనివర్సిటీ చెప్పింది.
"అమేలియా ఇయర్హార్ట్ అదృశ్యమైన కొద్దిసేపటికే.. ఫ్లోరిడాకు చెందిన ఒక 15 ఏళ్ల బాలిక తన తండ్రి షార్ట్వేవ్ రేడియోలో ఇయర్హార్ట్ వాయిస్ విన్నానని, ఆమె రేడియోలో 'న్యూయార్క్ సిటీ' అని పదే పదే చెబుతోందని పేర్కొన్నట్లు పర్ద్యూ యూనివర్సిటీ తెలిపింది.
ఇయర్హార్ట్ ద్వీపంలోనే చిక్కుకుపోయిందని నమ్మే పరిశోధకులు దీనిపై మరో వాదనను తెరపైకి తెచ్చారు. ఆమె తానున్న ప్రదేశాన్ని'నార్విచ్ సిటీ నౌక శకలాల సమీపంలో ఉందని చెప్పి ఉండవచ్చని, కానీ రేడియో సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆ బాలిక దాన్ని 'న్యూయార్క్ సిటీ'గా తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చని వారు వాదిస్తున్నారు.

ప్రస్తుతం తమ పరిశోధనకు మూడు రోజులు అంతరాయం ఏర్పడటం వల్ల.. పరిశోధన బృందం తమ క్షేత్రస్థాయి పనులను పూర్తి చేయడానికి యాత్ర సమయాన్ని పొడిగించింది.
అమీలియా ఇయర్హార్ట్ విమానానికి సంబంధించి ఏవైనా ఆశాజనకమైన ఆధారాలు దొరికాయా లేదా అనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు.
ఈ అన్వేషణపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసక్తి గురించి తమ బృందానికి తెలుసని, ఫలితాలను "వీలైనంత త్వరగా" వెల్లడిస్తామని ఏఎల్ఐ డైరెక్టర్ రిక్ పెట్టిగ్రూ పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు తలెత్తకముందే, 'తరైయా ఆబ్జెక్ట్' ఏమిటో కొన్ని రోజుల్లోనే గుర్తించగలమని పర్డ్యూ యూనివర్సిటీ తెలిపింది.
అమీలియా ఇయర్హార్ట్ అదృశ్యమైన సమయంలో ఆ ద్వీపంలో మానవ ఉనికి ఉన్నట్లు పరిశోధకులు గతంలో ఆధారాలు కనుగొన్నప్పటికీ, తరైయా వస్తువు కేవలం పగడపు దీవి నుంచి లోతులేని సరస్సులోకి పడిపోయిన ఒక చెట్టు మాత్రమేనని కొంతమంది నమ్ముతున్నారు.
ఆమెను కనుగొనేందుకు గతంలో కూడా ప్రయత్నాలు చేశారు. అవి పూర్తిగా విఫలమయ్యాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)































