మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
రష్మికతో వందసార్లు అడిగించుకుని పెళ్లికి ఓకే చెప్పానన్న విజయ్ దేవరకొండ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ ఏంటి?
- రచయిత, కమలాదేవి నల్లపనేని
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
‘‘రష్మిక: మనం పెళ్లిచేసుకుందాం...
విజయ్ దేవరకొండ: ఓకే..చూద్దాం..ఎందుకిప్పుడు?
రష్మిక: నేను పెళ్లిచేసుకుందాం అనుకుంటున్నా
విజయ్ దేవరకొండ: నువ్వు నన్ను ఈ మాట వందసార్లు అడుగు...అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం
కరణ్ జోహార్: నిజంగా వందసార్లు అడిగావా?
రష్మిక: పెళ్లికి ముందు నేను ఓ సంవత్సరం పాటు అడుగుతూనే ఉన్నా. ప్రతిరోజూ అడిగా''
ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి పాల్గొన్న ‘కాఫీ విత్ కరణ్’ షోలో బాగా చర్చనీయాంశంగా మారిన సంభాషణ ఇది.
పెళ్లయి ఇంకా ఏడాదికాని ఓ సినిమా జంట, ప్రేక్షకుల్లో బాగా పాపులారిటీ ఉన్న జంట.. ఓ బహిరంగ వేదికపై వ్యక్తిగత జీవితం గురించి ఇలా దాపరికాలు లేకుండా మాట్లాడడానికి సంబంధించిన చర్చ కాదిది.
సినిమారంగంలో ఎన్నో విజయాలను సాధించి, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఓ హీరోయిన్ అదే రంగంలో పేరు ప్రఖ్యాతులున్న ఓ హీరోతో వివాహ బంధంలోకి అడుగుపెట్టడానికి, అతన్ని ఒప్పించడానికి పదే పదే అడగాల్సిరావడం, ఆ పరిస్థితిని అతను సృష్టించడం, ప్రేమ, పెళ్లి ప్రతిపాదనలకు సంబంధించి పూర్తి వ్యక్తిగత విషయాన్ని ఓ జాతీయస్థాయి టాక్ షోలో చెప్పడం సరైనదా కాదా అన్నకోణంలో సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయాలను విజయ్ దేవరకొండ బహిరంగపరచడం వల్ల రష్మిక గౌరవానికి భంగం కలిగిందా, విజయ్ దేవరకొండ చెప్పిన మాటల అర్ధం ఏంటి? అంతిమంగా వాళ్లిద్దరి సంబంధంలో ఉన్న ప్రేమ గాఢత ప్రపంచానికంతటికీ తెలిసిందా ? ప్రేమ, పెళ్లి విషయంలో రష్మిక బలహీనురాలిగా కనిపిస్తోందా.. ఇలా అనేక కోణాల్లో ఈ సంభాషణపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
'విజయ్ దేవరకొండ అవమానకరంగా మాట్లాడారా...?’
షో పూర్తిగా టెలికాస్ట్ కాకముందే పెళ్లిపై విజయ్ దేవరకొండ, రష్మిక వ్యాఖ్యల క్లిప్ బయటకు వచ్చింది.
అప్పటినుంచే మొదలైన ట్రోలింగ్ షో టెలికాస్ట్ తర్వాత తీవ్రస్థాయికి చేరింది. తనపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తాయని తెలిసినప్పటికీ ఈ విషయాన్ని చెబుతున్నానని విజయ్ దేవరకొండ అన్నారు.
పెళ్లిచేసుకోవాలని వందసార్లు అడగమని రష్మికతో చెప్పడమే కాకుండా ఆ విషయాన్ని టీవీషోలో చెప్పడం ద్వారా విజయ్ దేవరకొండ అవమానకరంగా వ్యవహరించారని, అహంకారాన్ని బయటపెట్టుకున్నారని కొందరు యూజర్లు విమర్శిస్తున్నారు.
ఓ బంధంలో ఇద్దరి మధ్య మాత్రమే ఉండాల్సిన విషయాలను జాతీయస్థాయిలో ప్రసారమయ్యే టీవీ కార్యక్రమంలో ఉన్నానని తెలిసి కూడా విజయ్ బయటకు చెప్పారని రష్మిక ఆత్మగౌరవం గురించి ఆలోచించి ఉంటే ఈ విషయాలను అందరిముందు చెప్పేవాడుకాదని కొందరు యూజర్లు అభిప్రాయపడుతున్నారు. రష్మికకు ఆత్మగౌరవం ఉండాలని అన్నారు.
రష్మిక తనను షరతులు లేకుండా ప్రేమించాలని విజయ్ దేవరకొండ కోరుకున్నారని, ఆమె ప్రేమను అతను తేలిగ్గా తీసుకున్నట్టు అనిపిస్తోందని మరో యూజర్ అన్నారు.
విజయ్ అహంకారంతో వ్యవహరించాడని, తానేమీ చెడ్డవాణ్నికాదని అతను చెప్పడం కూడా సరైనది కాదని మరొకరు అభిప్రాయపడ్డారు.
పెళ్లికి ఒప్పుకునేవరకు నీ భాగస్వామితోనే పెళ్లిచేసుకోమని వందసార్లు అడిగించుకోవడం ఊహించుకోవడానికే బాగాలేదని మరో యూజర్ అన్నారు.
‘విజయ్ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు’
రష్మిక మందన్నా విజయ్ దేవరకొండతో సంతోషంగా ఉందని ఆమెనే విజయ్‌కు పెళ్లి ప్రతిపాదన చేసిందనే కారణంతో ఫెమినిస్టులు దీనిపై అభ్యంతరం వ్యక్తంచేయడం సరికాదని మరో యూజర్ రాశారు. ‘పురుషుడే ముందుగా ప్రపోజ్ చేసేవరకు మహిళ ఎందుకు ఎదురుచూడాలి? ఓ మహిళ పెళ్లి ప్రతిపాదన చేయడంలో తప్పేముంది? సమానత్వం అంటే అదేకదా’ అని ప్రశ్నించారు.
ఇంటర్వ్యూలో విజయ్ వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తున్నారు. వందసార్లు అడిగించుకోడానికి విజయ్ చెప్పిన కారణం గమనిస్తే..ఆయన ఆలోచనావిధానం అర్ధమవుతుందని కొందరు యూజర్లు రాశారు.
జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకునేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని పెద్దలు చెబుతారని విజయ్ ఆ సూత్రాన్నే అనుసరించారని వాళ్లంటున్నారు.
‘ఒక పెళ్లి ప్రతిపాదనను అంగీకరించడానికి మహిళలు సమయం తీసుకోవచ్చుకానీ పురుషులు సమయం తీసుకోకూడదా..విజయ్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు’ అని ఓ యూజర్ ప్రశ్నించారు.
రష్మికను విజయ్ అవమానపర్చలేదని, వాళ్లిద్దరూ కలిసి ఓ బంధంలోకి వెళ్లారని, రష్మికను బాధితురాలిగా చిత్రీకరించడం ఆపాలని మరో యూజర్ సూచించారు.
‘విజయ్..వందసార్లు ఎందుకు’ అని ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ ప్రశ్నించినప్పుడు విజయ్ దేవరకొండ ఇలా సమాధానమిచ్చారు.
''పెళ్లి అనేది చాలా ముఖ్యమైన నిర్ణయం. అన్ని ప్రతిబంధకాలను అధిగమించి బంధం నిలవాలని కోరుకునే వ్యక్తిని. 'నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావా' అని రష్మిక అడిగింది. అప్పుడు నాకు అపరాధ భావం కలిగింది
కానీ నేను నన్ను నేను పరీక్షించుకుంటున్నా. బంధాన్ని పరీక్షించుకుంటున్నా.
అవతలి వ్యక్తి మీద ఆ క్షణం చాలా ప్రేమ ఉన్నట్టు అనిపిస్తోందని పెళ్లిచేసుకోకూడదు.
సంతోషంగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు, కెరీర్ కోసం మొత్తం సమయాన్ని కేటాయిస్తున్నటప్పుడు లేదా మొత్తంగా యాక్టింగే వదిలేసి ఇంటికే పరిమితమైనప్పుడు, జీవితంలోని ఎత్తుపల్లాలన్నింటి సమయంలో కూడా పెళ్లి చాలా ముఖ్యమైనదిగా అనిపించినప్పుడుపెళ్లిచేసుకోవాలి అనేది నా మనసులో మాట. అందుకే రష్మికను వెయిట్ చేయించా’’ అని విజయ్ దేవరకొండ చెప్పారు.
ఇదే షోలో ఒకరోజు బ్యాచిలర్‌గా ఉండాల్సి వస్తే ఏం పనులు చేస్తారు అని కరణ్ జోహార్ అడిగితే....తాను ఒంటరిగా ఉండలేనని, రష్మికతో కలిసి ఉండడానికి తాను అలవాటుపడిపోయానని తనతో ఉండడం చాలా సౌకర్యంగా, హాయిగా అనిపిస్తుందని విజయ్ దేవరకొండ బదులిచ్చారు.
‘రష్మిక అలా మాట్లాడి ఉండాల్సింది కాదు’
విజయ్ దేవరకొండ వ్యాఖ్యలపై ఫెమినిస్టులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ అభద్రతాభావంలో ఉన్నారని ఆల్ ఇండియా ఫెమినిస్ట్ అసోసియేషన్‌కు చెందిన వి.సునీత అభిప్రాయపడ్డారు.
''విజయ్ దేవరకొండతో పోలిస్తే రష్మిక విజయాలశాతం ఎక్కువ. అలాంటి హీరోయిన్ను భార్యగా అంగీకరించాలంటే తనపై తనకు నమ్మకం ఉండాలి. అది లోపించడం వల్లే ఆయన అన్నిసార్లు అడిగించుకున్నారు. ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా ఆ విషయాన్ని బయటకు చెబుతున్నారు'' అని సునీత అభిప్రాయపడ్డారు.
మహిళలను పెళ్లి తర్వాత కూడా పూర్తిస్థాయి హీరోయిన్గా అంగీకరించే సంస్కృతి టాలీవుడ్లో ఇంకా రాలేదని, ఈ విషయంలో బాలీవుడ్ పరిస్థతి కాస్త మెరుగ్గా ఉందని ఆమె అన్నారు.
''పెళ్లిచేసుకోవాలంటూ ఏడాదంతా తాను విజయ్ను అడుగుతూనే ఉన్నానని రష్మిక చెప్పడం సరైనది కాదు. కెరీర్లో ఎంత విజయవంతమైనప్పటికీ మహిళలకు పెళ్లే అంతిమలక్ష్యం అన్న తప్పుడు భావం ఈ వ్యాఖ్యల ద్వారా సమాజానికి వెళ్తుంది'' అని సునీత విశ్లేషించారు.
నచ్చిన వ్యక్తిని తనను పెళ్లిచేసుకోవాల్సిందిగా ఓ మహిళ పదేపదే అడగడాన్ని మహిళా సాధికారతగా భావించడం తప్పని అభ్యంతరం వ్యక్తం చేశారు సునీత.
తాత్కాలిక ఎమోషన్లమీద ఆధారపడకుండా దీర్ఘకాలంలో సంబంధం ఎలా ఉంటుందనేదాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని విజయ్ దేవరకొండ అనుకోవడంలో తప్పేమీలేదని ప్రముఖ క్లినికల్, రీహాబిలిటేషన్ సైకాలజిస్ట్ రాధిక ఆచార్య చెప్పారు.
''విజయ్ వ్యాఖ్యలను ఇగో కోణంలో చూడకూడదు. ఒకరికొకరు నచ్చే విషయాల్లో, నచ్చని విషయాల్లోకూడా కలిసి ఉండాలని అనిపించినప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకోవడం సరైనదే. వాళ్లది చాలా పరిణితి చెందిన బంధం. ఇది ఆలోచన, స్థిరత్వంతో కూడిన నిర్ణయం'' అని రాధిక ఆచార్య అన్నారు.
రష్మికతో పోలిస్తే విజయ్ దేవరకొండ జీవితంలో ఆటుపోట్లు ఎక్కువని అందుకే పెళ్లి నిర్ణయం తీసుకోవడానికి ఆయన ఎక్కువ సమయం తీసుకున్నారని, వాళ్లిద్దరూ ఎంచుకున్న జీవిత విధానాన్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని ఆమె సూచించారు.
''రష్మిక వందసార్లు పెళ్లిచేసుకోవాలని కోరారు కాబట్టి రష్మిక, విజయ్ దేవరకొండ బంధంలో రష్మికను బలహీనురాలిగా చూడకూడదు. విజయ్ వ్యాఖ్యలను సరైన కోణంలో ఆమె అర్ధం చేసుకుందికాబట్టే ఏడాది పాటు ఎదురుచూసింది. ఇందులో నెగటివ్ కోణమే లేదు'' అని రాధిక అభిప్రాయపడ్డారు.
విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి ఎలా జరిగిందంటే
రష్మిక, విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు. ఈ సినిమా 2018లో విడుదలైంది. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’లో నటించారు. రష్మిక తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది.
పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో జరిగింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)