మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
పాకిస్తాన్: సౌదీ నుంచి వచ్చానంటూ తమ్ముడి అంత్యక్రియల్లో పాల్గొన్న అన్నయ్యే హంతకుడని ఎలా తెలిసింది?
- రచయిత, ఎహ్తేషామ్ అహ్మద్ షమీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
అక్టోబర్ 17వ తేదీ మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయం..
పాకిస్తాన్‌లోని గుజరాత్ జిల్లా రోపిరి గ్రామంలో నివసించే మొహమ్మద్ సుఫియాన్ అనే యువకుడి మొబైల్‌కు ఒక వాట్సాప్ కాల్ వచ్చింది.
అవతలి వైపు నుంచి మాట్లాడింది సౌదీ అరేబియాలో ఉంటున్న ఆయన పెద్దన్న మొహమ్మద్ బిలాల్.
‘‘నువ్వు వెంటనే గుజరాత్ సిటీ చేరుకో. అక్కడ నీకోసం ఆశ్చర్యకరైన బహుమతి వేచి ఉంది. నీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేయాలి" అని ఫోన్లో చెప్పారు బిలాల్.
అన్న మాటలు నమ్మిన సుఫియాన్ వెంటనే తన మోటార్‌సైకిల్‌పై ఇంటి నుంచి బయలుదేరారు.
గుజరాత్ సిటీలో అన్న చెప్పిన ప్రాంతానికి చేరుకున్న సుఫియాన్‌కు అక్కడ కనిపించిన ఆ బహుమతి మరెవరో కాదు. స్వయంగా తన అన్నే అని తెలిసి ఆశ్చర్యపోయారు.
ఇద్దరు కలిసి మధ్యాహ్నం హాయిగా భోజనం చేశారు. చాలా సేపు మాట్లాడుకున్నారు. సాయంత్రమైన తర్వాత బైక్‌పై తిరిగి ఇంటికి ప్రయాణమయ్యారు.
కానీ ఆ తమ్ముడికి తెలీదు.. అన్న ఇచ్చిన 'సర్ప్రైజ్' తన ప్రాణాలకే ముప్పని!
గుజరాత్ జిల్లా పోలీస్ అధికారి ఫైసల్ షహజాద్ తెలిపిన వివరాల ప్రకారం.. దరికారి రోడ్డులోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే, టాయిలెట్‌కు వెళ్లాలనే నెపంతో బిలాల్ బైక్‌ను ఆపమని తమ్ముడిని కోరారు.
సుఫియాన్ బండి ఆపడమే ఆలస్యం బిలాల్ తన వెంట తెచ్చుకున్న కత్తితో తమ్ముడి మెడపై బలంగా పొడిచి దారుణంగా చంపేశారు.
అనంతరం మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేశారు.
ఈ దారుణ హత్యను దారిదోపిడీగా చిత్రీకరించేందుకు సుఫియాన్ మొబైల్ ఫోన్, బైక్‌ను తీసుకుని అక్కడ నుంచి పరారయ్యారు.
బైక్‌ను కోట్లాలోని పంజాబ్ మోటార్స్ వెలుపల పార్క్ చేసి అక్కడి నుంచి లాహోర్‌కు పారిపోయారు.
సౌదీ డ్రామా.. అంత్యక్రియల్లో కన్నీళ్లు
నిందితుడు బిలాల్ సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్ వచ్చిన విషయం కుటుంబ సభ్యులలో ఎవరికీ తెలియదు.
రాత్రి వేళ సుఫియాన్ దారుణంగా హత్యకు గురయ్యారనే వార్తను కుటుంబ సభ్యులు బిలాల్‌కు ఫోన్ చేసి చెప్పగా తనకు ఏమీ తెలియనట్లు నటించారు.
అంతేకాదు, "సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చే వరకు తమ్ముడి అంత్యక్రియలు చేయకండి. కాస్త ఆగండి" అని కుటుంబ సభ్యులను కోరారు.
అయితే ఆ సమయంలో బిలాల్ సౌదీలో లేరు. పాకిస్తాన్‌లోనే ఉన్నారని పోలీసులు చెప్పారు.
మరుసటి రోజు ఉదయం (అక్టోబర్ 18) బిలాల్ గ్రామానికి చేరుకుని తమ్ముడి మరణవార్త వినగానే అత్యవసర విమానంలో సౌదీ నుంచి నేరుగా పాకిస్తాన్ వచ్చినట్లు పెద్ద నాటకమాడారు.
ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తమ్ముడి అంత్యక్రియల కార్యక్రమాల్లో ముందుండటమే కాకుండా అందరినీ హత్తుకుని ఏడ్చారు.
నిందితుడు మొహమ్మద్ బిలాల్‌ను జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న బైక్, మొబైల్ ఫోన్ తదితర వస్తువులను పరిశీలించాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలపడంతో, న్యాయస్థానం అతనిని మూడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.
కొడుకు కోసం తండ్రి వెదుకులాట
అక్టోబర్ 17న గుజరాత్‌లోని దౌలత్‌నగర్ పోలీస్ స్టేషన్లో బిలాల్ తండ్రి ఖాలిద్ మహమూద్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ప్రాథమికంగా ఆయన తన ఫిర్యాదులో ఎవరి పేరునూ నిందితుడిగా పేర్కొనలేదు.
గుర్తుతెలియని వ్యక్తులే తన కొడుకును చంపేశారని ఆయన ఫిర్యాదు చేశారు.
24 ఏళ్ల మొహమ్మద్ సుఫియాన్ అక్టోబర్ 17 మధ్యాహ్నం 1:35 గంటలకు గుజరాత్ సిటీలో ఏదో పని నిమిత్తం బైక్‌పై బయలుదేరారు.
"సాయంత్రం వరకు సుఫియాన్ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందాను. నా స్నేహితులతో కలిసి వాడి కోసం వెతకడం ప్రారంభించాను. రాత్రి 8:45 గంటల సమయంలో దరికారి రోడ్డులోని హైవే సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన వద్దకు చేరుకోగా, రోడ్డు పక్కన ఒక వ్యక్తి బోర్లా పడి ఉండటం గమనించాం" అని తండ్రి చెప్పినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
"మేము దగ్గరకు వెళ్లి బైక్ హెడ్లైట్ల వెలుతురులో చూడగా అక్కడ సుఫియాన్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడి గొంతు కోసి ఉంది. చుట్టుపక్కల వెతికినా నా కొడుకు మోటార్‌సైకిల్, మొబైల్ ఫోన్ అక్కడ కనిపించలేదు" అని ఎఫ్ఐఆర్లో తెలిపారు.
నిందితుడిని ఎలా పట్టుకున్నారు?
ఈ మర్డర్ కేసును ఛేదించడానికి సీసీ కెమెరాలు, సేఫ్ సిటీ కెమెరా రికార్డింగ్‌లు కీలక పాత్ర పోషించాయని దౌలత్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎహసాన్ లతీఫ్ తెలిపారు.
ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం 1:35 గంటలకు సుఫియాన్ ఇల్లు వదిలి వెళ్లినట్లు రికార్డుల ద్వారా తెలిసింది.
ఆ తర్వాత అతడు ప్రయాణించిన మార్గాల్లోని ఫ్యాక్టరీలు, నివాస గృహాల సీసీటీవీ కెమెరాలను పోలీసులు తనిఖీ చేశారు.
ఈ క్రమంలో, గుజరాత్ సిటీలోని మేజర్ అజీజ్ భట్టీ షహీద్ ఆసుపత్రి ముందు ఉన్న సేఫ్ సిటీ కెమెరాలో మధ్యాహ్నం 3:42 గంటలకు సుఫియాన్ నిలబడి ఉండటం కనిపించింది.
అక్కడ అతడు దాదాపు గంటన్నర పైగా వేచి చూశారు. సాయంత్రం 5:27 గంటలకు ఒక వ్యక్తి అక్కడకు రాగా, సుఫియాన్ అతడిని ఎంతో ఆత్మీయంగా కౌగిలించుకుని ఆహ్వానించారు. ఇద్దరూ కలిసి కొద్దిసేపు మాట్లాడుకుని, సమీపంలోని రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్లారు.
"ఆ దృశ్యాల్లో ఉన్న వ్యక్తిని మేం సులభంగానే గుర్తించాం. ఎందుకంటే తమ్ముడి అంత్యక్రియల సమయంలో తానే పెద్దన్ననని, తమ్ముడు చనిపోయాడని తెలియగానే సౌదీ నుంచి ఎమర్జెన్సీ ఫ్లైట్‌లో వచ్చానని చెప్పిన వ్యక్తి ఇతనే. కానీ, సీసీటీవీ రికార్డింగ్ మాత్రం మరో కథను చెప్పింది. తమ్ముడు హత్యకు గురవడానికి ముందే బిలాల్ పాకిస్తాన్లో ఉన్నాడనేది స్పష్టమైంది" అని పోలీస్ అధికారి ఎహసాన్ లతీఫ్ వివరించారు.
ఆ తర్వాత లభించిన మరో సీసీటీవీ ఫుటేజీలో రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు సోదరులు ఒకే బైక్‌పై వెళ్తుండటం కనిపించింది.
సుఫియాన్ బైక్ నడుపుతుండగా బిలాల్ వెనుక కూర్చున్నారు.
నది సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో దాదాపు అరగంట పాటు వీరిద్దరి జాడ కనిపించలేదు. ఆ తర్వాత అదే మార్గంలో ఉన్న కెమెరాలో నిందితుడు బిలాల్ ఒక్కడే ఒంటరిగా బైక్ నడుపుకుంటూ గుజరాత్ సిటీ వైపు రావడం రికార్డయింది.
అదే సమయానికి సుఫియాన్ మాయమయ్యాడు. "ఇలాంటి పరిస్థితిలో సుఫియాన్‌ను చంపింది మరెవరో కాదు. అతడి సొంత అన్న బిలాలే అని అర్థం చేసుకోవడం పోలీసులకు పెద్ద కష్టం కాలేదు" అని ఎహసాన్ లతీఫ్ చెప్పారు.
ఆ తర్వాత మృతదేహం కింద పడి ఉన్న కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దానిపై బిలాల్ వేలిముద్రలు లభించడంతో ఆ కత్తిని లాహోర్‌లోని పంజాబ్ ఫోరెన్సిక్ లాబొరేటరీకి విశ్లేషణ కోసం పంపారు.
హత్య ఎందుకు జరిగిందంటే..
తమ మధ్య గతంలో ఆస్తి పంపకాల వివాదం ఉండేవని అయితే దానిని పరిష్కరించుకున్నామని ఈ ఇద్దరు సోదరుల తండ్రి ఖాలిద్ మహమూద్ చెప్పారు.
"నాకు నలుగురు కుమారులు. ఒకరు చనిపోయారు. మరొకరు యూరప్ వెళ్లారు. బిలాల్ సౌదీ అరేబియాలో ట్రాలీ నడుపుతూ ఉండేవారు. చిన్న కొడుకు సుఫియాన్ పాకిస్తాన్లో నాతోనే ఉండేవారు. ఊరిలో ఉన్న మా 1089 చదరపు అడుగుల ఇల్లు పంపకం విషయానికి వచ్చినప్పుడు నేను బిలాల్‌కు ఊరి బయట ఉన్న 4050 చదరపు అడుగల వ్యవసాయ భూమిని ఇచ్చి ఇంట్లో ఇకపై ఎలాంటి వాటా ఉండదని చెప్పాను" అని తండ్రి వివరించారు.
కానీ, తన తమ్ముడు సుఫియాన్ వల్లే తండ్రి తనకు ఇంట్లో వాటా ఇవ్వకుండా అన్యాయం చేశారని తన వారసత్వ హక్కుల్లో తమ్ముడు జోక్యం చేసుకుంటున్నాడని బిలాల్ మనసులో పగ పెంచుకున్నారు.
ఈ నిర్ణయం తండ్రిది కాదు, తమ్ముడిదే అని భావించారు.
"బిలాల్ ఇంతటి ఘాతుకానికి ఒడిగడతాడని ఊహించలేకపోయాను" అని తండ్రి కన్నీరుమున్నీరయ్యారు.
"తమ్ముడి అంత్యక్రియల ఏర్పాట్లలో బిలాలే ముందున్నాడు. అందరినీ హత్తుకుని ఏడ్చాడు. నా తమ్ముడిని ఇంత దారుణంగా చంపిన ఆ దుర్మార్గులు ఎవరో నాకు తెలియదు, నా ప్రాణమున్నంత వరకు నా తమ్ముడి రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటాను అని నా ముందే నాటకమాడాడు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు రోజుల తర్వాత పోలీసులు బిలాల్‌ను విచారణ కోసం స్టేషన్‌కు పిలిచినప్పుడు కూడా తమకేం అనుమానం రాలేదని కేవలం స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికే అనుకున్నామని తండ్రి చెప్పారు.
కొద్ది గంటల తర్వాత తండ్రిని స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు ఆయన్ని చేతులకు బేడీలతో ఉన్న బిలాల్ ముందు కూర్చోబెట్టారు.
పోలీసుల విచారణలో నిందితుడు బిలాల్ తన నేరాన్ని అంగీకరించారు. ఆస్తి పంపకాల్లో తనకు అన్యాయం జరిగిందనే కక్షతోనే తమ్ముడిని హతమార్చినట్లు ఒప్పుకున్నారు.
"నా ప్రపంచం కుప్పకూలింది. నాకంటే పెద్ద దురదృష్టవంతుడు ఎవరూ ఉండరు. నా కళ్ల ముందే నా ఇద్దరు కొడుకులు లేకుండా పోయారు. ఒకడు దారుణంగా హత్యకు గురవగా మరొకడు జైలు పాలయ్యాడు" అని ఆ ముసలి తండ్రి కన్నీరు పెట్టుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)