ఎల్ నినో ‘అత్యంత తీవ్రరూపం’ దాల్చబోతోందా? ఇది ఎప్పటివరకు కొనసాగొచ్చు? ‘ఇన్‌కాయిస్’ ఏం చెప్పింది?

ఎల్ నినో
ఫొటో క్యాప్షన్, ‘డిసెంబరు నాటికి ఎల్ నినో తీవ్ర రూపం దాల్చబోతోంది’ అని ఇన్‌కాయిస్ ప్రాజెక్టు సైంటిస్ట్ బి.శివయ్య బీబీసీతో చెప్పారు.

ఎల్ నినో 'అత్యంత తీవ్రం' కానుందని చెబుతోంది హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్).

ఇప్పుడున్న పరిస్థితి తీవ్రం కానుందని, ఉష్ణోగ్రతల్లోనూ భారీగా తేడాలు రానున్నాయని ఇన్‌కాయిస్ ప్రాజెక్టు సైంటిస్ట్ బి.శివయ్య బీబీసీతో చెప్పారు.

మరోవైపు, ఎల్ నినో కారణంగా వర్షాలు సరిగా కురవక 'తీవ్రమైన కరవు' పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరవు మండలాలను ఆయా ప్రభుత్వాలు గుర్తించాయి.

తెలంగాణలో 358, ఆంధ్రప్రదేశ్‌లో 388 మండలాల్లో కరవు ఛాయలు నెలకొన్నాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి.

భారత్‌లో ఎల్ నినో పరిస్థితులపై ఇన్‌కాయిస్ వివిధ దశల్లో ప్రత్యేక బులెటెన్ విడుదల చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఎల్ నినో ప్రభావం ఏ స్థాయిలో ఉంది? మున్ముందు ఏం జరగవచ్చు? అసలు ఎప్పటిలోగా ప్రభావం తగ్గుతుంది? వచ్చే వేసవి 'మండిపోవడం' ఖాయమా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ బీబీసీ ఇంటర్య్వూలో సమాధానాలు చెప్పారు శివయ్య.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

దేశంలో ఎల్ నినో పరిస్థితులు ఎప్పటివరకు కొనసాగనున్నాయి?

శివయ్య: ఎల్ నినో 'అత్యంత తీవ్ర' (వెరీ స్ట్రాంగ్) దశకు దగ్గరలో ఉంది. ఇప్పటికే ఇన్‌కాయిస్ తరఫున బులెటెన్ విడుదల చేశాం.

ప్రతి నెలా ఎల్ నినో పరిస్థితులపై బులిటెన్ ఇస్తున్నాం.

ఈ ఏడాది డిసెంబరుకు 'అత్యంత తీవ్ర' దశకు ఎల్ నినో చేరుకుంటుంది. 2027 మార్చి తర్వాత నుంచి ఎల్ నినో తీవ్రత క్రమంగా తగ్గే అవకాశం ఉందని ఇన్‌కాయిస్ అధ్యయనంలో తేలింది.

వెరీ స్ట్రాంగ్ దశ అని ఏ అంశాల ఆధారంగా చెబుతుంటారు?

శివయ్య: ఎల్ నినోకు సంబంధించిన సమాచారం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను ఆధారంగా చేసుకుని ఇస్తుంటాం.

పసిఫిక్ మహా సముద్రంలో భూమధ్య రేఖకు దగ్గరలో తూర్పు, పడమర మధ్యన ఉన్న సముద్ర ఉష్ణోగ్రతల వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకుని ఎల్ నినో తీవ్రతను చెబుతుంటాం.

ప్రస్తుతం ఈ ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీలు ప్లస్ (+)గా... అంటే పెరిగినట్లుగా చూపిస్తోంది. ఇవి డిసెంబరు నాటికి 3 నుంచి 3.5 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉంది. దాని ప్రకారం, డిసెంబరు నాటికి ఎల్ నినో తీవ్ర రూపం దాల్చబోతోంది.

ఇన్‌కాయిస్ ప్రాజెక్టు సైంటిస్ట్ బి.శివయ్య
ఫొటో క్యాప్షన్, ఇన్‌కాయిస్ ప్రాజెక్టు సైంటిస్ట్ బి.శివయ్య

ఎల్ నినో తీవ్రత తగ్గాక కూడా ఆ ప్రభావం ఇంకా ఎన్నాళ్లు ఉంటుంది?

శివయ్య: మార్చి తర్వాత నుంచి ప్రస్తుత ఎల్ నినో తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభావాలనేవి వెంటనే తొలగిపోవు.

ఆ తర్వాత ఆరు నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం.

సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కనుక వెంటనే ప్రభావాలు తగ్గవు. అవి కూడా క్రమక్రమంగా తగ్గుతాయి. మార్చి నుంచి ఎల్ నినో ప్రభావం తగ్గితే, దాని ప్రకారం సముద్ర ఉష్ణోగ్రతలు కూడా నెమ్మదిగా తగ్గే వీలుంది. దీనివల్ల వాతావరణంలో వేడి కూడా ఒక్కసారిగా తగ్గకుండా, క్రమంగా తగ్గొచ్చు.

ఎల్ నినో
ఫొటో క్యాప్షన్, ఇప్పుడున్న ఎల్ నినో పరిస్థితులతో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో 80-90 శాతం ఉపరితలంలో 'మెరైన్ హీట్ వేవ్స్' పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పిన ఇన్‌కాయిస్ ప్రాజెక్టు సైంటిస్ట్

భారత్‌లో గతంలో ఎన్నోసార్లు ఎల్ నినోలు ఏర్పడ్డాయి.. అప్పటికి, ఇప్పటికి తేడా ఏమిటి?

శివయ్య: సాధారణంగా ఎల్ నినో అనేది ప్రతి రెండు నుంచి ఆరేళ్ల మధ్య ఏర్పడుతుంది. గతంలో ఏర్పడిన ఎల్ నినోలు కొన్ని చూసుకుంటే రెండేళ్లపాటు కూడా కొనసాగాయి. కొన్ని ఎల్ నినోల ప్రభావం ఏడాదికే తగ్గిపోయింది.

ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం మాత్రం ఏడాదిపాటు ఉంటుందని ఐఎండీ, ఇన్‌కాయిస్, ఇతర సంస్థల అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇఫ్పుడున్నది 'వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో' అని చెప్పాలి. సముద్ర ఉష్ణోగ్రతల ఆధారంగా ఇది చెబుతున్నాం. 1997లో వచ్చిన 'వెరీ స్ట్రాంగ్ ఎల్ నినో' తర్వాత ఇప్పుడు ఏర్పడిన ఎల్ నినో మళ్లీ ఆ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని మా అధ్యయనంలో తేలింది.

ఎల్ నినో ప్రభావంతో భూ ఉష్ణోగ్రతలలో ఎలాంటి తేడాలు రావొచ్చు?

శివయ్య: సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఆ వేడి తిరిగి వచ్చి వాతావరణంలోనే కలుస్తుంది. దానివల్ల భూ ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి.

గతంలో ఎల్ నినో పరిస్థితులు ఏర్పడినప్పుడు అవి 'వేడి లేదా తీవ్రమైన వేడి సంవత్సరాలు''గా మారాయి. 2024లో కూడా ఈ పరిస్థితి చూశాం.

ప్రస్తుత ఎల్ నినో కారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు వాతావరణంలోకి వచ్చి కలవనుండటంతో 2027లో తీవ్రమైన ఎండలు ఉండే అవకాశం ఉందని అంచనా. అలాగే ప్రస్తుత శీతాకాలంలో కూడా ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఏర్పడనున్నాయి.

Sea Wave
ఫొటో క్యాప్షన్, సముద్రంలో అలలు

ప్రస్తుత ప్రభావం సముద్రాలపై ఎలా ఉండబోతోంది?

శివయ్య: ఉష్ణోగ్రతలు పెరగడాన్ని 'మెరైన్ హీట్ వేవ్స్'గా చెబుతుంటాం. ఇది మత్స్య సంపదపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఇప్పుడున్న ఎల్ నినో పరిస్థితులతో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో 80-90 శాతం ఉపరితలంలో 'మెరైన్ హీట్ వేవ్స్' పరిస్థితులు ఏర్పడ్డాయి.

దీనివల్ల మత్స్య సంపద... అంటే చేపలు, ఇతర జలచరాలపై ప్రభావం పడి, వాటి పరిమాణం తగ్గొచ్చు. అవి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వీలుంది.

ఉత్పత్తి పడిపోవచ్చు. ఇలా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం కనిపిస్తుంది. అలాగే కోరల్స్ (పగడాలు) చనిపోయే (బ్లీచింగ్) ప్రమాదం ఉంది. రంగురంగుల కోరల్స్ అనేవి తెల్లగా మారిపోవచ్చు.

ఎల్ నినో
ఫొటో క్యాప్షన్, తెలంగాణలో 358, ఆంధ్రప్రదేశ్‌లో 388 మండలాల్లో కరవు ఛాయలు నెలకొన్నాయని ప్రభుత్వాలు చెబుతున్నాయి.

రానున్న వ్యవసాయ సీజన్‌కు ఎలా సన్నద్ధం కావాలి?

శివయ్య: భారత్‌లో ఇప్పటికే వర్షపాతం లోటు ఉందని ఐఎండీ చెబుతోంది. ఏపీ, తెలంగాణలోనూ వర్షాభావ పరిస్థితులు చూస్తున్నాం. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రానున్న వ్యవసాయ సీజన్‌కు సిద్ధంగా ఉండాలి.

సాధారణంగా వరి పంటకు ఎక్కువ నీరు అవసరం పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలా కాకుండా తక్కువ నీటితో సాగయ్యే పంటలవైపు మళ్లితే మంచిది.

భారత్‌లో ఎల్ నినో పరిస్థితులున్నా సరే కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. మరికొన్ని ప్రాంతాలు... ముఖ్యంగా దక్షిణాదిలో వర్షాభావంతో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా తేడాలు రావడానికి కారణమేంటి?

శివయ్య: వాతావరణంలో వచ్చే మార్పులతో ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన తేడాలు రావడమనేది ఎల్ నినో నేపథ్యంలో జరుగుతుంటాయి. ఇది సాధారణమే. సముద్ర ఉష్ణోగ్రతలలో తేడాలు రావడం వల్ల గాలుల గమనం మారుతుంది.

దానివల్ల మేఘాలు ఒకేచోటకు వెళ్లి అక్కడ భారీగా వర్షం కురుస్తుంది. దీంతో ఆకస్మిక వరదలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. మేఘాల గమనంలో ఈ మార్పులతో అదే సమయంలో వేరొకచోట వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి.

బంగాళాఖాతం తీరం
ఫొటో క్యాప్షన్, బంగాళాఖాతం తీరం

సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయా.. ఈ ప్రయోగాలు ఏ స్థాయిలో ఉన్నాయి?

శివయ్య: ఈ విషయంలో ప్రయోగాలు జరుగుతున్నాయి. దీన్ని మెరైన్ క్లౌడ్ బ్రైట్నింగ్‌ అని పిలుస్తున్నారు. అయితే, ఇది 'సురక్షితం' అని చెప్పలేం. సహజసిద్ధమైన పరిస్థితికి కృత్రిమంగా మార్పులు చేస్తే ప్రతికూల పర్యవసనాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఈ ప్రక్రియలో అతి సూక్ష్మ ఉప్పు కణాలను సముద్ర ఉపరితల వాతావరణంలో స్ప్రే చేయడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చని చెబుతున్నారు. ఆస్ట్రేలియా వంటి చోట్ల దీన్ని చేపట్టారు. కానీ, ఈ ప్రయోగాలపై ఇంకా సమగ్ర అధ్యయనం జరగాల్సి ఉంది.

అంతేకాకుండా పసిఫిక్ మహా సముద్రంలో ఈ తరహా ప్రయోగాలు చేయాలంటే సాధ్యం కాకపోవచ్చు. ప్రపంచంలో అతి పెద్దదైన పసిఫిక్ మహా సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గించడం చాలా కష్టంతో కూడుకున్నది. అలాగే కృత్రిమంగా చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు తలెత్తితే ఏంటన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది.

ప్రస్తుత ఎల్ నినోను 'సూపర్ ఎల్ నినో'గా చెప్పవచ్చా?

శివయ్య: శాస్త్రీయంగా చూస్తే 'సూపర్ ఎల్ నినో' అనేది లేదు.

సూపర్ ఎల్ నినో, గాడ్జిల్లా ఎల్ నినో.. ఈ పదాలు ప్రజలు, మీడియా నుంచి పుట్టినవే తప్ప శాస్త్రీయంగా లేవు.

కేవలం 'స్ట్రాంగ్', 'వెరీ స్ట్రాంగ్' ఎల్ నినో అని మాత్రమే మేం చెబుతుంటాం.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)