బుకాంగి: కాలువలోకి వచ్చిన ఆడ సొర చేపను ఎన్నిసార్లు వెనక్కు పంపినా ఎందుకు మళ్లీమళ్లీ అక్కడికే వచ్చింది? ఇప్పుడది ఎక్కడుంది

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జేక్ క్వాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
దక్షిణ కొరియా ఆగ్నేయ తీరాన ఉన్న బీచ్ సిటీ బుసాన్‌లోని ఒక కాలువలో ఒక పెద్ద సొరచేప కనిపించడంతో దాన్ని రక్షించడానికి మెరైన్ బయాలజిస్ట్ కిమ్ హ్యూన్-వూ రంగంలోకి దిగారు.
చేపల వేట నౌకలకు సాయం చేసేందుకు మ్యాకరెల్ చేపల సమూహాలను ట్రాక్ చేసే ఒక బిజినెస్ ట్రిప్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా సెప్టెంబర్ మధ్యలో ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది.
ఒక సొరచేపను రక్షించమని కోస్ట్ గార్డ్ తనను కోరుతుందని దేశంలోని ప్రముఖ షార్క్ నిపుణులలో ఒకరైన కిమ్ హ్యూన్ ఎప్పుడూ ఊహించలేదు.
దక్షిణ కొరియాకు సొరచేపలు కొత్తేమీ కాదు. ప్రపంచంలో రద్దీగా ఉండే ఓడరేవుల్లో ఏడో స్థానంలో ఉన్న ఓడరేవుకు ఆనుకుని ఉన్న కాంక్రీటు కాలువలో ఇంత పెద్ద సొరచేప కనిపించడం ఇదే మొదటిసారి.


ఫొటో సోర్స్, Reuters
వాటర్ ఫ్రంట్ వద్ద అప్పటికే చేరిన ప్రజలను చూసి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ నుంచి వచ్చిన కిమ్ బృందం వేగంగా కదలాల్సి వచ్చింది.
వారి మొదటి పని ఆ సొర చేప ఏ జాతికి చెందినదో గుర్తించడం.
సొర చేపల్లో కొన్ని జాతులు మిగతా వాటి కంటే ప్రమాదకరమైనవి.
1975 నాటి బ్లాక్ బస్టర్ సినిమా 'జాస్'లో చూపించిన గ్రేట్ వైట్ షార్క్ మనుషులపై దాడి చేసి చంపే రకంగా పేరుగాంచింది.
అయితే బుసాన్‌లో కనిపించినది ఆడ 'డస్కీ షార్క్' అని తేలింది.
ఈ జాతి కేవలం రెండు ప్రాణాంతక దాడులతో మాత్రమే సంబంధం ఉంది.

ఫొటో సోర్స్, Hosu Lee/BBC
అయినప్పటికీ అక్కడ చేరిన ప్రజలలో ఎవరైనా కాలువలోకి దూకుతారేమో లేదా పడిపోతారేమోనని కిమ్ భయపడ్డారు.
ఆ సొరచేపను తిరిగి సముద్రంలోకి పంపించాలని ఆయన భావించారు.
ఇందు కోసం చిన్న కోస్ట్ గార్డ్ నౌక మొదట 'ఎలక్ట్రికల్ డిటరెన్స్ పరికరాన్ని' ఉపయోగించి ప్రయత్నించింది.
ఇది సొరచేపలను అక్కడ నుంచి పంపించడానికి అవసరమైన తేలికపాటి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది.
సాధారణంగా జనాదరణ పొందిన బీచ్‌ల దగ్గర సొర చేపలు కనిపించినప్పుడు వీటిని ఉపయోగిస్తారు.
అయితే ఆ పరికరంతో 5 గంటలు ప్రయత్నించిన తర్వాత కూడా ఆ సొరచేప దానికి లొంగనంత పెద్దదిగా ఉందని అధికారులు నిర్ధరించారు.
దీంతో కిమ్ తన వ్యూహాన్ని మార్చారు.
సొరచేప స్వయంగా సముద్రంలోకి వెళ్లే వరకు వేచి చూడాలని నిర్ణయించుకున్నారు. కానీ అలా జరగలేదు.

ఫొటో సోర్స్, Hosu Lee/BBC
ఆ షార్క్‌ను కాలువ నుంచి సముద్రంలోకి పంపించేందుకు అధికారులు ప్రయత్నిస్తూ ఉండగానే.. అదంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
షార్క్ కాలువలో కనిపించిన కొన్ని గంటల్లోనే నగరంలోని ప్రతి ఒక్కరికీ కౌన్సిల్ ఒక ఎమర్జెన్సీ టెక్స్ట్ అలర్ట్ పంపింది.
స్థానికులు, కాలువ పక్కనున్న పార్క్‌కు వచ్చేవారు "అప్రమత్తంగా ఉండాలని" కోరింది.
కాలువ పక్కనే ఉన్న పార్క్‌కు సహజంగా చాలా తక్కువ మంది వస్తుంటారు.
అయితే అధికారులు మెసేజ్ పంపిన తర్వాత సొర చేపను చూసేందుకు వచ్చిన వారితో ఆ ప్రదేశం కిక్కిరిసిపోయింది.
అభిమానులు దానికి దగ్గరలో ఉన్న 'బుక్ హాంగ్' ఓడరేవుతో ముడి పెడుతూ 'బుకాంగి' అని పేరు పెట్టారు.
కొద్ది రోజుల్లోనే ఒక వ్యాపార సంస్థ 'బుకాంగిని' ట్రేడ్‌మార్క్‌గా మార్చింది.
ఆన్లైన్లో బుకాంగి పిన్నులు, బొమ్మలు, టీ-షర్టుల అమ్మకాలు మొదలయ్యాయి.
నగర పాలక అధికారులు ఆ సొరచేప కదలికలను ప్రత్యక్షంగా ప్రసారం చేస్తూ దాన్ని తమ మస్కట్‌గా మార్చుకున్నారు.
కాలువ ప్రవేశద్వారం వద్ద ఒక బ్యానర్ కూడా ఏర్పాటు చేశారు.
బుకాంగిని చూసేందుకు కాలువ పక్కన 30వేల సీట్ల కొత్త బేస్ బాల్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పిటిషన్‌పై సంతకం చేయాలని ప్రజలను కోరారు.
కాలువలో సొరచేపను గుర్తించడం స్థానికులు, సందర్శకులలో ఒక టీమ్ ఎఫర్ట్గా మారింది.
పిల్లలకు మొదటి వరుస ఇవ్వాలని బుకాంగిని ఎవరు చూసినా కొత్తగా వచ్చిన వారికి చూపించాలనేది ఒక అనధికార నియమంగా మారింది.
కొంతమంది స్వయం ప్రకటిత రక్షకులు రాత్రి పూట కాలువ వద్ద గస్తీ కాస్తూ బుకాంగిపై ఎవరూ టార్చ్ లైట్లు లేదా లేజర్లను వేయకుండా చూసుకున్నారు.
16 లక్షల మందికి పైగా సందర్శకులు ఈ కాలువ వద్దకు తరలివచ్చారు.
ఈ సొరచేప వల్ల పోర్ట్ సిటీకి "బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినా రాని ప్రచారం" వచ్చిందని స్థానిక మేయర్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
"ఈ రోజుల్లో ప్రజలు ఇలా కలిసి రావడం చాలా అరుదు" అని తన ఇద్దరు మేనకోడళ్లతో కలిసి సొరచేపను చూడటానికి వచ్చిన కిమ్ జూ-యున్ చెప్పారు.
"బుకాంగి మనల్ని అందరినీ ఏకతాటిపైకి తెచ్చిందని, దాని కోసం అందరూ కలిసి రావడం సరదాగా ఉంది" అని ఆమె అన్నారు.
అయితే, అధికారులు బుకాంగిని అలా కాలువలోనే వదిలేయలేరు. అది సెప్టెంబర్ చివరి నాటికి ఆహారం తీసుకోవడం కనిపించలేదు.
కాంక్రీట్ గోడలను ఢీకొట్టడం వల్ల దాని ముక్కుపై గాయాలు కనిపించాయి.
సొరచేప కంటి చుట్టూ ఉన్న 'తీవ్రమైన' గాయంపై నిపుణులు ఆందోళన చెందుతున్నారని ప్రముఖ మెరైన్ బయాలజీ ప్రొఫెసర్ చోయ్ యూన్ స్థానిక మీడియాతో చెప్పారు.
సెప్టెంబర్ చివర్లో కిమ్ బృందం మరో రెస్క్యూ ప్రయత్నాన్ని ప్రారంభించింది.
మెరైన్ బయాలజిస్ట్ 2004లో మసాచుసెట్స్‌లో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు.
అక్కడ ఒక చెరువు నుండి గ్రేట్ వైట్ షార్క్‌ను దూరంగా పంపడానికి వాటర్ జెట్లను ఉపయోగించారు.
కానీ స్థానిక మెరైన్ బృందం బుకాంగిపై దీనిని ప్రయత్నించినప్పుడు అది మళ్లీ మళ్లీ వెనక్కి తిరుగుతూనే ఉంది.
అక్టోబర్ 2న షార్క్ తిరిగి రాకుండా నిరోధించడానికి కాలువ వెడల్పుకు సరిపోయేలా ఒక వలను ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు.
కానీ ఆ సొర చేప ఆ వల చుట్టూ ఈదుకుంటూ కొన్ని గంటల్లోనే మళ్లీ వెనక్కి వచ్చేసింది.
ఈ సమయంలో సొరచేపలు నావిగేషన్ కోసం ఉపయోగించే వాటి ముక్కులోని విద్యుదయస్కాంత సెన్సర్లలో ఏవైనా సమస్యలు ఉండవచ్చని కిమ్ భావించారు. లేదా హార్బర్లోని ఓడలు చేసే పెద్ద శబ్దాల వల్ల అది అయోమయానికి గురై ఉండవచ్చని అనుకున్నారు.
బుకాంగి అసలు కాలువలోకి రావడానికి సముద్రాలు వేడెక్కడం ఒక సంకేతం కావచ్చనేది ఓషన్స్ మినిస్ట్రీ అభిప్రాయం.

ఫొటో సోర్స్, Hosu Lee/BBC
వెచ్చని నీటిలో సమృద్ధిగా ఉన్న చేపలను అనుసరిస్తూ అది అక్కడకు వచ్చి ఉండవచ్చని నమ్ముతోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో దక్షిణ కొరియా తూర్పు తీరంలో సుమారు 50 పెద్ద సొరచేపలు కనిపించాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ.
అధికారుల ప్రయత్నాలు విఫలమైనప్పుడల్లా.. ఆ సొర చేపను ప్రశాంతంగా వదిలేయాలనే అక్కడి ప్రజలు డిమాండ్ చేయడం ప్రారంభించారు.
కొందరు ప్లకార్డులతో వచ్చి "బుకాంగిని ఒంటరిగా వదిలేయండి. వలలను తొలగించండి" అని నినాదాలు చేశారు.

ఫొటో సోర్స్, Hosu Lee/BBC
ఉష్ణోగ్రతలు పడిపోతే కాలువలోనే ఉండటం వల్ల బుకాంగికి తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని కిమ్ వివరించారు.
సాధారణంగా ఇది సొరచేపలు మరింత దక్షిణంగా ఉన్న వెచ్చని నీటిలోకి వలస వెళ్లేలా ప్రేరేపిస్తుంది. "ఈ కాలువను మనం నివాస స్థలం అని పిలవలేం" అని ఆయన చెప్పారు.
"వన్యప్రాణులు కేవలం మనుషుల కోసం తయారు చేసిన ప్రదేశంలో ఉండలేవు" అని కిమ్ అన్నారు.
ప్రజల ఒత్తిడి పెరగడంతో బుకాంగిని సముద్రంలోకి పంపే బాధ్యతను సముద్రాల మంత్రిత్వ శాఖ చేపట్టింది.
బుసాన్ అక్వేరియంకు చెందిన డైవర్లతో సహా దాదాపు 40 మంది సిబ్బందితో సొర చేపను సముద్రంలోకి పంపే ప్రయత్నం మొదలు పెట్టింది.
డైవర్లపై బుకాంగి దాడి చేస్తే వైద్యం అందించడానికి పశువైద్యుడితో పాటు అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచారు.
బుధవారం నాడు డైవర్లు రెండు పొరల వలలను ఏర్పాటు చేశారు. అధికారులు బుకాంగిని విజయవంతంగా ఇరుకైన కాలువ నుండి సముద్రంలోకి తరలించారు.
కానీ రాత్రికి రాత్రే ఆ సొర చేప ఈదుకుంటూ మళ్లీ కాలువలోకి వచ్చి వెలుపలి వల కింద నుంచి దూరింది.
ఈ ప్రయత్నంలో అది రెండు వలల పొరల మధ్య చిక్కుకుపోయింది.
దాంతో గురువారం వెలుపలి పొరను తొలగించారు.
దీంతో బుకాంగి సముద్రం వైపు మరింత ముందుకు ఈదుకుంటూ వెళ్లడం కనిపించింది. అది అప్పుడప్పుడు వెనక్కి తిరిగినప్పటికీ సముద్రంలోకి వెళ్లింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది.

ఫొటో సోర్స్, Reuters
గడిచిన కొన్ని రోజులుగా బుకాంగి కనిపించలేదు. ఇది సానుకూల సంకేతమని నిపుణులు అంటున్నారు.
అది విశాలమైన, లోతైన నీటికి అలవాటు పడుతుండవచ్చని ప్రొఫెసర్ చోయ్ నమ్ముతున్నారు.
సొర చేప చాలా దూరం ప్రయాణించి ఉండే అవకాశం లేదని, రాబోయే వారంలో మళ్లీ కనిపించవచ్చని ఆయన చెప్పారు.
కానీ దానికి తగిలిన గాయాల గురించి ఆయన ఆందోళన చెందుతున్నారు.
కాలువలో చిక్కుకున్న సమయంలో "గోడలకు రుద్దుకోవడంవల్ల దాని ముక్కు రెక్కల పై చర్మం ఊడిపోయింది" అని ఆయన స్థానిక మీడియాతో చెప్పారు.
(సియోల్ నుంచి లీ హ్యూన్ అదనపు సమాచారంతో)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























