సౌదీలో చిక్కుకున్న భారతీయ యాత్రికుల పరిస్థితి ఎలా ఉంది?

ఫొటో సోర్స్, Imran Khan/Imran Shaikh
- రచయిత, తేజస్వి సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
సౌదీ అరేబియాలో వైమానిక దాడుల ముప్పు, భద్రతాపరమైన పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి రాకపోకలు సాగిస్తున్న విమానాలపై భారత విమానయాన సంస్థలు నిషేధాన్ని పొడిగించాయి.
భారత రాయబార కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 24 వరకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించగా, ఆకాశా ఎయిర్ మాత్రం అక్టోబర్ 27 వరకు విమానాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అక్టోబర్ 10న యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడి నేపథ్యంలో భద్రతాపరమైన ఆందోళనలు నెలకొన్నాయి. ఈ దాడిలో ఒక భారతీయు పౌరుడు ప్రాణాలు కోల్పోగా, పలువురు భారతీయులు గాయపడ్డారు.
మరోవైపు, ఇండిగో కూడా వివిధ నగరాలకు నడిపే విమానాల రద్దు గడువును పొడిగించింది. రియాద్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలను అక్టోబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. జెడ్డా, దమ్మామ్, మదీనా నగరాలకు సంబంధించిన విమాన సర్వీసులు అక్టోబర్ 27 వరకు రద్దు కానున్నాయి.
విమానాలు రద్దు కావడంతో పలువురు భారతీయ ఉమ్రా యాత్రికులు సౌదీ అరేబియాలో చిక్కుకుపోయారు. ఈ పరిస్థితిపై దిల్లీకి చెందిన ఇమ్రాన్ ఖాన్, ముంబయికి చెందిన ఇమ్రాన్ షేక్‌తో బీబీసీ మాట్లాడింది. వీరిద్దరూ ప్రస్తుతం మక్కాలో ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ సెప్టెంబర్ 30న మక్కా చేరుకోగా, ఇమ్రాన్ షేక్ సుమారు నెలన్నర క్రితం అక్కడికి వెళ్లారు.


ఫొటో సోర్స్, Imran Sheikh
సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన భారతీయుల పరిస్థితి ఏంటి?
సెప్టెంబర్ 30న తన బృందంతో కలిసి అక్కడికి చేరుకున్నానని ఉమ్రా యాత్ర కోసం మక్కాకు వెళ్లిన ఇమ్రాన్ ఖాన్ బీబీసీతో చెప్పారు. అక్టోబర్ 15న ఇండిగో విమానంలో తిరిగి రావాల్సి ఉండగా, విమానం రద్దు కావడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని తెలిపారు.
"నాతో పాటు ఇక్కడ టికెట్లు కూడా లేని ఇతర బృందాల వారు ఉన్నారు. ఏజెంట్ల ద్వారా వచ్చిన వారే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ఏజెంట్లు యాత్రికులను అక్కడే వదిలేసి కనిపించకుండా పోయారు’’ అని ఆయన చెప్పారు.
"ఇప్పుడు అలాంటి వారికి ఉండటానికి హోటళ్లు లేవు. ఖర్చు చేయడానికి సౌదీ రియాళ్లు కూడా లేవు. కొందరు తిరిగి వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్లారు. కానీ విమానం రద్దు కావడంతో, మరో అవకాశం దొరుకుతుందనే ఆశతో అక్కడే ఉండిపోయారు" అని వివరించారు.
సౌదీ ఎయిర్‌లైన్స్‌లో నేరుగా ప్రయాణించేందుకు గతంలో టికెట్లు అందుబాటులో ఉండేవని, ఇప్పుడు వచ్చే నెల 10 నుంచి 15వ తేదీ వరకు కూడా టికెట్లు కనిపించడం లేదని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలు కూడా దొరకడం లేదని తెలిపారు.
ముంబయి నుంచి మక్కా చేరుకున్న ఇమ్రాన్ షేక్, ప్రస్తుతం పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని చెప్పారు. జెడ్డాలోని భారత కాన్సులేట్ తనకు ఆహారం అందిస్తోందని తెలిపారు.
మక్కాలో పెద్ద సంఖ్యలో భారతీయులు చిక్కుకుపోయుంటారని ఆయన అంచనా వేశారు. "ప్రస్తుతం విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యే వరకు ఎదురుచూస్తున్నాం" అని చెప్పారు.
భారత కాన్సులేట్, ప్రభుత్వం సహాయం అందిస్తున్నాయని ఇమ్రాన్ షేక్ తెలిపారు. అయితే, అధికారులు నేరుగా తమకు ఫోన్ చేయలేదని, వారి సోషల్ మీడియా పోస్టును చూసిన తర్వాత తామే సంప్రదించి ప్రయాణికుల జాబితాను పంపించామని చెప్పారు.
ఇమ్రాన్ ఖాన్ మాత్రం జెడ్డాలోని భారత అధికారిక సంస్థ నుంచి తనకు ఫోన్ వచ్చిందని తెలిపారు.
"మా యాత్రికులు క్షేమంగా ఉన్నారా, వారికి హోటల్ వసతి కల్పించారా అని తెలుసుకోవడానికి ఫోన్ చేశారు. సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేశారు" అని చెప్పారు.
అయితే, చాలామంది యాత్రికులు ఎక్కడ చిక్కుకుపోయారు, ఏం చేయాలి అనే కనీస సమాచారం కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. "వారికి హెల్ప్‌లైన్ నంబర్ గురించి తెలియకపోతే, ఎలా ఫోన్ చేసి సమాచారం తెలుసుకుంటారు?" అని ప్రశ్నించారు.
ఉమ్రా యాత్రికులకు వీసా గడువు ముగిసిపోవడం సమస్య కాదని ఇమ్రాన్ షేక్ చెప్పారు. వీసా చెల్లుబాటు కాలం ఏడాది కాగా, సౌదీ అరేబియాలో ఉండేందుకు అనుమతించే గడువు 90 రోజులు. సాధారణంగా ఉమ్రా యాత్ర ప్యాకేజీ 15 రోజుల పాటు ఉంటుంది.
వీసా ఇంకా వర్తిస్తుంది, సౌదీ ప్రభుత్వం దాని గడువును ఏడాదికి పొడిగించిందని, అవసరమైతే దాన్ని పునరుద్ధరించుకునే అవకాశం కూడా ఉందని ఆయన వివరించారు.
"90 రోజుల గడువు ముగిసేలోపే విమానాల సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం" అని చెప్పారు.
విమానాల రద్దు గురించి మొదట అక్టోబర్ 12న సమాచారం వచ్చిందని, అప్పటి నుంచి ఇప్పటికి 12 రోజులు మాత్రమే గడిచాయని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.
మక్కాలో చిక్కుకుపోయిన ఇమ్రాన్ ఖాన్, సౌదీ ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. అందువల్ల చేతిలో రియాళ్లు లేని వారు ఆహారం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
"వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో మధ్యాహ్నం, సాయంత్రం బిర్యానీ, జ్యూస్, చికెన్ రోల్స్, నీళ్లు అందిస్తున్నారు. ఆహారం తీసుకోవడానికి ప్రజలు వరుసలో నిలబడుతున్నారు" అని వివరించారు.
వసతి కోసం హోటల్ సదుపాయం ఉందని, యాత్రికులు తమను పంపిన సంస్థ ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చని చెప్పారు.
"ఎవరినీ బలవంతంగా డబ్బు చెల్లించమని అడగడం లేదు. డబ్బు ఉంటే చెల్లించండి. లేకపోతే మిమ్మల్ని పంపిన కార్యాలయం వివరాలు ఇవ్వండి. మేం వారిని సంప్రదించి డబ్బు వసూలు చేస్తాం" అని చెబుతున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.
ఇమ్రాన్ షేక్ కూడా పలువురు ఉమ్రా యాత్రికుల వద్ద కరెన్సీ అయిపోయిందని, వారికి ఆహారం, పానీయాలు అందిస్తున్నారని చెప్పారు. సౌదీ అరేబియాలో బంధువులు, స్నేహితులు ఉన్నవారు వారి నుంచి అప్పు తీసుకుని ఖర్చులు నెట్టుకొస్తున్నారనీ, భారత్ నుంచి కూడా కొందరు సహాయం చేస్తున్నారని తెలిపారు.

ఫొటో సోర్స్, Zain JAAFAR/AFP via Getty Images
రోడ్డు మార్గంలో యూఏఈకి వెళ్లి అక్కడి నుంచి విమానం ఎక్కచ్చా?
ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించేందుకు విమాన టికెట్ల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. కొన్ని కనెక్టింగ్ విమానాల టికెట్ల ధరలు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఉన్నాయని తెలిపారు.
"ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి విమానం ఎక్కడం ఒక మార్గం. దీని ద్వారా రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు ఖర్చుతో భారత్ చేరుకోవచ్చు. అయితే, దీనికి ట్రాన్సిట్ వీసా అవసరం. అది వెంటనే దొరకడం లేదు" అని చెప్పారు.
మరో మార్గంగా విజిట్ వీసా తీసుకోవచ్చని, అయితే దానికి రెండు నుంచి మూడు రోజులు పడుతుందని వివరించారు. ఇందుకోసం అదనంగా రూ.7 వేలకు పైగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
చాలామంది ఉమ్రా యాత్రికుల బృందాలు దుబాయ్, ఖతార్, ఒమన్ మీదుగా భారత్‌కు తిరిగి వస్తున్నాయని ఇమ్రాన్ షేక్ చెప్పారు. కొందరు బస్సుల్లో ఒమన్, మస్కట్ మీదుగా బయలుదేరారని తెలిపారు.
దుబాయ్‌లో పెద్ద సంఖ్యలో భారతీయులు నివసిస్తుండటం, అక్కడ బంధువులు ఉన్నవారు కూడా ఉండటంతో ఆ నగరం మరో ప్రత్యామ్నాయంగా మారిందని వివరించారు. అయితే, బస్సులో దుబాయ్ చేరుకోవడానికి సుమారు 24 గంటలు పడుతుంది. అక్కడి నుంచి భారత్‌కు విమానంలో రావాల్సి ఉంటుంది.
పెద్ద కుటుంబాలతో ఉమ్రా యాత్రకు వచ్చిన వారు ఖర్చులను భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.
"ఇద్దరు లేదా ముగ్గురు ఉంటే ఖర్చులను కొంతవరకు భరించవచ్చు. కానీ ఐదారుగురు సభ్యులతో వచ్చిన కుటుంబాలకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున కొత్త టికెట్ కొనాల్సి వస్తే, మొత్తం కుటుంబానికి రూ.3 లక్షలు ఖర్చవుతుంది" అని వివరించారు.
విమానాలను రద్దు చేసిన సంస్థలు టికెట్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లిస్తామని చెప్పాయని ఆయన తెలిపారు.
"పూర్తి రీఫండ్ అంటే మనకు తిరిగి వచ్చేది రూ.17 వేలు లేదా రూ.18 వేలు మాత్రమే. కానీ ఇప్పుడు తిరుగు ప్రయాణ టికెట్ ధర రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఉంది. అంటే అదనంగా రూ.35 వేల నుంచి రూ.36 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది" అని చెప్పారు.
విమానయాన సంస్థలు రీఫండ్ మొత్తాన్ని తమ వాలెట్లలో జమ చేస్తున్నాయని ఇమ్రాన్ షేక్ తెలిపారు. మరో విమానయాన సంస్థలో టికెట్ బుక్ చేసుకోవాలంటే నేరుగా బ్యాంకు ఖాతా నుంచి డబ్బు చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. పాత టికెట్‌కు బదులుగా వాలెట్లో జమ చేసిన డబ్బును ఎలా ఉపయోగించుకోవాలని ప్రశ్నించారు.
రీఫండ్ మొత్తాన్ని నేరుగా ప్రయాణికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఆయన కోరారు.
పిల్లలకు అనారోగ్యం కలిగినప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఇమ్రాన్ ఖాన్, ఇమ్రాన్ షేక్ తెలిపారు.
"ఇక్కడ జలుబుకు మందులు కావాలన్నా నేరుగా మెడికల్ షాపులో కొనలేం. ముందుగా వైద్యుడికి చూపించాలి. ఆ తర్వాతే మందులు ఇస్తారు" అని చెప్పారు.
వైద్య పరీక్షలు, మందులు ఉచితంగా అందిస్తున్నప్పటికీ, ముందుగా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుందని తెలిపారు. ఇక్కడ ఇచ్చే మందులు తమ పిల్లలకు పనిచేయడం లేదని కొన్ని కుటుంబాలు చెప్పినట్లు వివరించారు.

ఫొటో సోర్స్, Imran Sheikh
పెద్ద విమానాల్లో యాత్రికులను తీసుకురావాలని ఒవైసీ డిమాండ్
భారతదేశానికి చెందిన సుమారు 4,000 మంది ఉమ్రా యాత్రికులు గత రెండు మూడు వారాలుగా మదీనా, జెడ్డా, మక్కా నగరాల్లో చిక్కుకుపోయారని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.
ట్రావెల్ ఏజెంట్లు యాత్రికులను నిర్లక్ష్యం చేసి వెళ్లిపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
ఈ యాత్రికులు ఇండిగో, ఆకాశా ఎయిర్, ఎయిర్ ఇండియా విమానాల్లో సౌదీ అరేబియాకు వెళ్లారని ఒవైసీ తెలిపారు. జెడ్డాకు విమానాలు నడిపేందుకు ఈ మూడు సంస్థలకు పౌర విమానయాన డైరెక్టరేట్ అనుమతించడం లేదని ఆయన ఆరోపించారు.
సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులను తిరిగి తీసుకురావడానికి ఏ321 వంటి పెద్ద విమానాలను నడిపేందుకు ఈ సంస్థలకు డీజీసీఏ వెంటనే అనుమతి ఇవ్వాలని ఒవైసీ డిమాండ్ చేశారు.
గతవారం రోజుల్లో సౌదీ అరేబియా నుంచి సుమారు 3,000 మంది ఉమ్రా యాత్రికులు భారత్‌కు తిరిగి వచ్చారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.
వీరు కాకుండా, అందుబాటులో ఉన్న విమానాల ద్వారా మరో 10 వేల మందికి పైగా సాధారణ ఉమ్రా యాత్రికులు కూడా గత వారం రోజుల్లో భారత్‌కు చేరుకున్నారని చెప్పారు.
ప్రభావిత ప్రయాణికులు వీలైనంత త్వరగా తిరిగి వచ్చేందుకు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ సంబంధిత విమానయాన సంస్థలు, టూర్ ఆపరేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నాయని తెలిపారు.
మిగిలిన యాత్రికులను కూడా తిరిగి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లపై చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. స్థానిక కమ్యూనిటీలకు చెందిన వలంటీర్ల సహాయంతో భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్లు బాధిత యాత్రికులకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాయి.
భారతీయ ప్రయాణికుల కోసం 24 గంటల కంట్రోల్ రూమ్‌లు
సౌదీ అరేబియాలో ఉన్న భారతీయులకు సహాయం చేసేందుకు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ జనరల్‌లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
ప్రస్తుత పరిస్థితులపై భారతీయులకు ఎప్పటికప్పుడు సూచనలు కూడా జారీ చేస్తున్నట్లు వెల్లడించింది.
ప్రయాణికుల సహాయం కోసం రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం +966-554412016, +966-542126784 నంబర్లను అందుబాటులో ఉంచింది. సౌదీ అరేబియాలోని ప్రయాణికులు టోల్ ఫ్రీ నంబర్ 8002471234ను కూడా సంప్రదించవచ్చు. +966-536216082 వాట్సాప్ నంబర్‌కు సందేశాలు పంపవచ్చు.
జెడ్డాలోని భారత కాన్సులేట్ +966-12-2614093, +966-556122301 ఫోన్ నంబర్లను జారీ చేసింది. +966-536209704 వాట్సాప్ నంబర్‌కు కూడా సందేశాలు పంపవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























