జుల్ఫికర్ అలీ భుట్టో: ‘నేను భారత పౌరుడిని’ అంటూ బెనజీర్ భుట్టో తండ్రి భారతీయ కోర్టుల్లో ఎందుకు పోరాడారు?

    • రచయిత, వకర్ ముస్తఫా
    • హోదా, విలేకరి, పరిశోధకులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

భారత్‌కు స్వాతంత్య్రం రావడానికి మరో ఏడెనిమిది నెలల సమయం ఉంది. సింధ్‌కు చెందిన ప్రముఖ భూస్వామి, రాజకీయ నాయకుడు సర్ షానవాజ్ భుట్టో తన భార్య, కుమార్తెతో కలిసి జునాగఢ్‌కు వెళ్లి అక్కడి ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించారు.

చిన్న కుమారుడు జుల్ఫికర్ అలీ భుట్టోను బొంబాయి (ప్రస్తుత ముంబయి)లోనే చదువుకుంటూ, విస్తృతమైన కుటుంబ ఆస్తులను చూసుకోవాలని ఆయన కోరారు.

అయితే జుల్ఫికర్ అలీ భుట్టో 1947 సెప్టెంబరులో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లడానికి బొంబాయి నుంచి బయలుదేరారు.

దీంతో భారత ప్రభుత్వం ఆయన ఆస్తులను 'ఎవాక్యూ ప్రాపర్టీ'గా ప్రకటించి స్వాధీనం చేసుకుంది. అంటే, యజమాని పాకిస్తాన్‌కు వెళ్లిపోవడంతో ఆస్తులను ఇక్కడే వదిలివెళ్లడంగా పరిగణించడం.

ఈ ఆస్తులను తిరిగి పొందడానికి భుట్టో తొమ్మిదేళ్ల పాటు భారత న్యాయస్థానాల్లో పోరాడారు. ఆ సమయంలో ఆయన తాను భారత పౌరుడినేనని వాదించారు.

భుట్టో కుటుంబ ఆస్తులు

స్టాన్లీ వోల్పర్ట్ తన పుస్తకం 'జుల్ఫీ భుట్టో ఆఫ్ పాకిస్తాన్: హిజ్ లైఫ్ అండ్ టైమ్స్'లో పేర్కొన్న వివరాల మేరకు జుల్ఫికర్ భుట్టో కుటుంబం జునాగఢ్‌కు వెళ్లిన తర్వాత ఆయన బొంబాయిలోని కార్మైకేల్ మార్గంలోని 'ది నెస్ట్' అనే ఇంటిలో నివసించేవారు.

'బార్ అండ్ బెంచ్' వెబ్‌సైట్‌లో రాసిన వ్యాసంలో న్యాయవాది సంజయ్ ఘోష్ తెలిపిన వివరాల ప్రకారం, బొంబాయిలోని వర్లీ ఎస్టేట్‌లో ఉన్న 4A నంబరు ఇంటిని సర్ షా నవాజ్ భుట్టో బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి శాశ్వత లీజుకు తీసుకున్నారు. ఇందుకోసం రూ.25,344 చెల్లించారు.

బొంబాయిలో రద్దీగా ఉండే ఫోర్ట్ ప్రాంతంలో భుట్టో కుటుంబానికి బహుళ అంతస్తుల ఆస్టోరియా హోటల్ కూడా ఉండేది. 1946 నుంచి 1947 మధ్య ఈ హోటల్ ద్వారా ఆయనకు రూ.1.10 లక్షలకు పైగా అద్దె ఆదాయంగా లభించింది.

సంజయ్ ఘోష్ ప్రకారం, సర్ షా నవాజ్ ఈ ఆస్తులను తన 18 ఏళ్ల కుమారుడి పేరుకు బదిలీ చేశారు. 1947 సెప్టెంబరు మొదట్లో జుల్ఫికర్ అలీ భుట్టో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అదే ఏడాది నవంబరులో సర్ షా నవాజ్ భుట్టో కరాచీలో శాశ్వతంగా స్థిరపడ్డారు.

భారత పౌరుడిగా తన ఆస్తులపై హక్కులను కాపాడుకోడానికి పోరాడిన భుట్టో, పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా పట్ల తన అభిమానాన్ని పలుమార్లు వ్యక్తం చేశారు.

సంజయ్ ఘోష్ తన వ్యాసంలో పేర్కొన్న వివరాల ప్రకారం, కేథడ్రల్ అండ్ జాన్ కానన్ పాఠశాలలో చదువుతున్నప్పుడు, 15 ఏళ్ల వయసులో భుట్టో జిన్నాకు రాసిన లేఖలో "పాకిస్తాన్ కోసం నా ప్రాణాలను త్యాగం చేసే రోజు వస్తుంది" అని రాశారు.

స్టాన్లీ వోల్పర్ట్ ప్రకారం, అమెరికాలో ఉన్నప్పుడు భుట్టో తన స్నేహితులతో జిన్నా గురించి తరచూ మాట్లాడేవారు. "ఆయనే నా నాయకుడు. ఆయనే నా ఆదర్శం. ఆయనను గౌరవిస్తా" అని చెప్పేవారు.

జిన్నా 1948 సెప్టెంబరు మొదట్లో మరణించినప్పుడు, వాషింగ్టన్‌లో పాకిస్తాన్ తొలి రాయబారి ఎంఏహెచ్ ఇస్ఫహానీకి భుట్టో లేఖ రాశారు. "మనకు అత్యంత అవసరమైన ఈ కీలక సమయంలో, మన ప్రియమైన నాయకుడి అపారమైన ఔదార్యం అవసరమైన వేళ మనం అనాథలమయ్యాం" అని అందులో పేర్కొన్నారు.

తొమ్మిదేళ్ల న్యాయపోరాటం

న్యాయవాది, రచయిత ఏజీ నూరానీ 'ఫ్రంట్‌లైన్' పత్రికలో రాసిన వ్యాసం ప్రకారం, భుట్టో తన ఆస్తులను ఎవాక్యూ ప్రాపర్టీగా ప్రకటించడాన్ని తొమ్మిదేళ్ల పాటు వివిధ న్యాయస్థానాల్లో సవాలు చేశారు. కస్టోడియన్, కస్టోడియన్ జనరల్, బొంబాయి హైకోర్టు, పంజాబ్ హైకోర్టు నుంచి చివరకు సుప్రీంకోర్టు వరకు ఆయన న్యాయపోరాటం సాగింది.

"తన ఆస్తులను వదులుకోవడం లేదా పాకిస్తాన్ పౌరసత్వాన్ని స్వీకరించడం అనే నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారు" అని నూరానీ రాశారు.

భుట్టో ఆస్తుల వ్యవహారాన్ని 1965 నవంబరు 19న అప్పటి పునరావాస వ్యవహారాల మంత్రి మహావీర్ త్యాగి రాజ్యసభలో ప్రస్తావించారు. విభజన సమయంలో జుల్ఫికర్ అలీ భుట్టో తన తల్లిదండ్రులతో కలిసి బొంబాయిలో నివసించేవారని, అక్కడ ఆయనకు ఆస్తులు ఉండేవని చెప్పారు.

సభలో త్యాగి సమర్పించిన పత్రాల ప్రకారం, 1949 జులై 27న ఎవాక్యూ ప్రాపర్టీ డిప్యూటీ కస్టోడియన్ ముందు, 1951 నవంబరు 17న కస్టోడియన్ ముందు భుట్టో ప్రమాణపూర్వకంగా వాంగ్మూలాలు ఇచ్చారు.

సీనియర్ కేంబ్రిడ్జి పరీక్ష పూర్తి చేసిన తర్వాత 1947 సెప్టెంబరు 8న అమెరికాకు బయలుదేరానని, అక్కడే శాశ్వతంగా నివసిస్తున్నానని ఆయన తెలిపారు. విదేశాలకు బయలుదేరినప్పుడు తన వద్ద భారత పాస్‌పోర్టు ఉందని కూడా పేర్కొన్నారు.

1949 జులై 27న ఇచ్చిన వాంగ్మూలంలో, 1945 నుంచే వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించానని, వాటి నుంచి వచ్చిన సమాధానాలను తన తండ్రి అందుకునేవారని చెప్పారు. తాను బొంబాయిలో చదువుకున్నానని, కరాచీలో నివసించడం లేదని పేర్కొన్నారు.

పౌరసత్వంపై వాదనలు

భారత కస్టోడియన్ జనరల్‌కు 1956 జనవరి 30న చేసిన అప్పీలులో భుట్టో తాను కరాచీలో తాత్కాలికంగా మాత్రమే నివసిస్తున్నానని తెలిపారు.

"అప్పీలుదారు తన వ్యవహారాలను స్వయంగా చూసుకోగల వయసున్న వ్యక్తి. ఆయన తల్లిదండ్రులు కరాచీలో నివసిస్తున్నారని, ఆయనకు అక్కడ వివాహం జరిగిందన్నదానిని ఆధారంగా చేసుకుని కరాచీనే ఆయన శాశ్వత నివాసమని నిర్ధరించలేం" అని పేర్కొన్నారు.

భారత పాస్‌పోర్టుతో భారత పౌరుడిగానే అమెరికాలోకి ప్రవేశించానని, ఆ సమయంలో తాను భారత పౌరుడినేనని భుట్టో వాదించారు. యుక్తవయసుకు వచ్చిన తర్వాత కరాచీని శాశ్వత నివాసంగా ఎంచుకున్నట్లు నిర్ధరించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులో 1957 సెప్టెంబరు 11న అప్పీలు దాఖలు చేసి, తనను ఎవాక్యూ ప్రాపర్టీ యజమానిగా పరిగణిస్తూ తీసుకున్న చర్యలన్నీ చెల్లవని ప్రకటించాలని కోరారు.

అయితే, అప్పటికే భుట్టో పాకిస్తాన్ తరఫున ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. 1958 ఏప్రిల్‌లో జెనీవాలో జరిగిన సముద్ర చట్టాల సదస్సులోనూ పాకిస్తాన్ ప్రతినిధిగా పాల్గొన్నారు.

సుప్రీంకోర్టులో 1958 ఆగస్టు 13న దాఖలు చేసిన పిటిషన్‌లో తాను ఇప్పుడు కరాచీలో శాశ్వతంగా స్థిరపడ్డానని, పెండింగ్‌లో ఉన్న అప్పీలును కొనసాగించే ఉద్దేశం లేదని తెలిపారు. అదే ఏడాది నవంబరు 3న కోర్టు అప్పీలును ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. దీనికి కొన్ని రోజుల ముందే పాకిస్తాన్‌లో సైనిక పాలకుడు అయూబ్ ఖాన్ మంత్రివర్గంలో భుట్టో వాణిజ్య మంత్రిగా నియమితులయ్యారు.

పాకిస్తాన్‌లో పరిహారం కోసం దరఖాస్తు

నూరానీ ప్రకారం, 1956లోనే భుట్టో పాకిస్తాన్‌లో క్లెయిమ్స్ రిజిస్ట్రేషన్ చట్టం 1955 కింద పరిహారం కోసం దరఖాస్తు చేశారు.

బొంబాయిలోని ఆస్టోరియా హోటల్ విలువ రూ.12 లక్షలు, ఇంటి విలువ రూ.1.40 లక్షలుగా ఆయన పేర్కొన్నారు. అయితే హోటల్‌కు రూ.3,93,952, ఇంటికి రూ.1.40 లక్షల పరిహారాన్ని క్లెయిమ్స్ అధికారి ఆమోదించారు.

భుట్టో అప్పీలు చేసిన తర్వాత 1956 అక్టోబరు 6న హోటల్ విలువను రూ.9,97,991కు పెంచారు. ప్రభుత్వ సూత్రం ప్రకారం ఆస్తి మూలధన విలువను కూడా నిర్ణయించారు.

1957 సెప్టెంబరు 18న తుది ఉత్తర్వులు వెలువడ్డాయి. అంటే, భారత సుప్రీంకోర్టులో భుట్టో అప్పీలు దాఖలు చేసిన వారం రోజులకే పాకిస్తాన్‌లో ఆయన పరిహారం వ్యవహారంలో తుది నిర్ణయం వెలువడింది.

అదే ఆస్తులపై భారత్‌లో భారత పౌరుడిగా హక్కులు కోరిన భుట్టో, పాకిస్తాన్‌లో మాత్రం పాకిస్తాన్ పౌరుడిగా పరిహారం కోరుతున్నారనే ఆరోపణలు వచ్చాయి.

భుట్టో 1967 నవంబరు 30న పాకిస్తాన్‌ పీపుల్స్ పార్టీని స్థాపించారు.

ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు రఫీరజా తన పుస్తకం 'జుల్ఫికర్ అలీ భుట్టో అండ్ పాకిస్తాన్ 1967-1977' లో, 1965 యుద్ధం తర్వాత భారత పార్లమెంటులో వచ్చిన ఆరోపణలను పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో సమాచార మంత్రి అయూబ్ ఖాన్ మళ్లీ ప్రస్తావించారని రాశారు.

'డాన్' పత్రిక 1967 జులై 2నాటి సంపాదకీయంలోనూ ఈ ఆరోపణలు పునరావృత మయ్యాయి. దానికి ప్రతిగా ఆరోపణలను ఖండిస్తూ వివరణ ఇవ్వాలని, పత్రికపై పరువునష్టం నోటీసు జారీ చేయాలని నిర్ణయించినట్లు రఫీ రజా తెలిపారు. పలువురు న్యాయవాదులు ఈ కేసులో పాల్గొనేందుకు వెనుకాడటంతో తానే నోటీసు పంపినట్లు చెప్పారు. అయితే, సుదీర్ఘ న్యాయపోరాటాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే కారణంతో కోర్టును ఆశ్రయించకూడదని నిర్ణయించుకున్నట్లు వివరించారు.

భారత పార్లమెంటులో మళ్లీ చర్చ

1967 ఆగస్టు 8న 'ది హిందూ' ప్రచురించిన కథనం ప్రకారం, ఆగస్టు 7న లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అప్పటి భారత విదేశాంగ మంత్రి ఎంసీ చాగ్లా, జుల్ఫికర్ అలీ భుట్టో పౌరసత్వ వ్యవహారాన్ని 'ద్వంద్వ విధేయత'కు సంబంధించిన అంశంగా అభివర్ణించారు.

భుట్టో తిరిగి భారత్‌కు రావాలని కోరుకుంటారని తాను భావించడం లేదని చాగ్లా అన్నారు. ఒకవేళ ఆయన తిరిగి వస్తే భారత పౌరసత్వం మంజూరు చేస్తారా అని ప్రశ్నించగా, అది ఊహాజనిత పరిస్థితని, అటువంటి సందర్భంలో దేశ పౌరసత్వ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

భారత్‌పై భుట్టో గతంలోనూ, ఇటీవల చేసిన ప్రసంగాల్లోనూ శత్రుత్వ భావనను ప్రేరేపించే వ్యాఖ్యలు చేశారని చాగ్లా ఆరోపించారు. ఆయన భారత పౌరసత్వం మార్చుకుంటే బొంబాయిలోని ఆస్తులను తిరిగి ఇస్తారా అని ప్రశ్నించగా, కార్యదర్శి "లేదు" అని సమాధానమిచ్చారు. ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కూడా దీనికి నిరాకరిస్తూ తల ఊపారు.

1977లో భుట్టో ప్రభుత్వాన్ని కూలదోసి ఆయనను అరెస్టు చేసిన తర్వాత, జనరల్ జియా ఉల్ హక్ ప్రభుత్వం కూడా అయూబ్ ఖాన్ సైనిక ప్రభుత్వం తరహాలో ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని స్టాన్లీ వోల్పర్ట్ రాశారు.

అమెరికా, బ్రిటన్‌లలో నివసించిన సమయంలో భుట్టో తనను భారత పౌరుడిగా పరిగణించుకున్నారని కూడా ఆరోపించారు. అయితే, ఈ వాదనలు స్పష్టంగా తప్పని వోల్పర్ట్ పేర్కొన్నారు.

"భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత, తన తండ్రికి చెందిన బొంబాయి ఆస్తులకు సరైన ధర పొందేందుకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అమెరికాలో ఉన్న సమయంలో ఎక్కువ భాగం పాకిస్తాన్‌ గురించి, కొత్త ప్రపంచంలో ఆ దేశ ప్రాధాన్యం గురించి తన స్నేహితులకు, సామాజిక సంస్థలకు వివరించడానికే వెచ్చించారు" అని వోల్పర్ట్ తన పుస్తకంలో రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)