మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
ఇంజమామ్ ఉల్ హక్: సిక్స్ కొట్టాలని ఉందని సెహ్వాగ్ చెబితే, ఫీల్డర్లను ముందుకు తీసుకొచ్చిన పాకిస్తానీ కెప్టెన్
- రచయిత, రషీద్ షకూర్
- హోదా, బీబీసీ కరాచీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
అప్పుడే జట్టులోకి వచ్చిన 21 ఏళ్ల క్రికెటర్‌తో "నువ్వు రికమండేషన్‌తో జట్టులోకి వచ్చావు" అని సీనియర్ ఆటగాడు తిడుతూ, హేళనగా మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
అలా హేళనకు గురైన అదే ఆటగాడు తర్వాత తన అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చారు. నాటి ఆ కుర్రాడే ఇంజమామ్ ఉల్ హక్. ఈ ఘటనలన్నీ 1992 ప్రపంచకప్ సందర్భంగా జరిగాయి.
ఆ ప్రపంచకప్‌లో ఇమ్రాన్ ఖాన్ నాయకత్వం వహించిన పాకిస్తాన్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఆ టోర్నమెంట్లో ఇంజమామ్ ఉల్ హక్ కీలక పాత్ర పోషించారు. న్యూజీలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 60 పరుగులు, ఫైనల్లో 42 పరుగులు చేసి పాకిస్తాన్ విజయానికి చేరువ చేశారు.
తన కాలంలో ఇంజమామే అత్యుత్తమ యువ బ్యాటర్ అని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను ఈ రెండు ఇన్నింగ్స్‌లతో ఇంజమామ్ ఉల్ హక్ నిరూపించి చూపించారు.
ఇంజమామ్ ఉల్ హక్‌ను ఎందుకు మొదట్లో విమర్శించారు? సిఫార్సుతో జట్టులోకి వచ్చావని దూషించడానికి కారణం ఏంటి?
'నువ్వు సిఫార్సుతో జట్టులోకి వచ్చావు' అని ఒక సీనియర్ ఆటగాడి కామెంట్
ఇంజమామ్ ఉల్ హక్ ఒక ఇంటర్వ్యూలో నాకు ఈ విషయం నాకు చెప్పినప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయా. అలాంటిది నిజంగా జరిగి ఉంటుందా అని నమ్మలేకపోయా.
"ప్రపంచకప్‌లో మా జట్టు న్యూజీలాండ్‌తో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్‌లో నేను కేవలం ఐదు పరుగులే చేయగలిగా" అని ఇంజమామ్ గుర్తు చేసుకున్నారు.
''మేమంతా ఆ విజయంతో చాలా ఆనందంగా డ్రెసింగ్రూమ్లోని షవర్ ప్రాంతంలో స్నానం చేస్తున్నాం. అప్పుడు ఒక సీనియర్ క్రికెటర్ నా దగ్గరకు వచ్చి తిట్టాడు. నువ్వు సిఫార్సుతో జట్టులోకి వచ్చావు అన్నాడు. ఆయన పేరు చెప్పడం కరెక్ట్ కాదని భావిస్తున్నా. ఆ మాటలు నన్ను ఎంతగానో బాధించాయి. నేను షవర్ కింద ఉన్నంతసేపూ ఏడుస్తూనే ఉన్నా" అని ఇంజమామ్ అన్నారు.
"ఏ సిఫార్సుతో జట్టులోకి వచ్చానా అని ఆలోచిస్తూ ఉండిపోయా. అలాంటి సిఫార్సులు చేసే వ్యక్తి ఎవరూ లేరు. ప్రతిభ ఆధారంగానే జట్టులో చోటు సంపాదించా" అని చెప్పారు.
"ప్రపంచకప్ ఆడటానికి ముందు నేను శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు చేశా. అలాగే పాకిస్తాన్లో రెండు ఫస్ట్‌క్లాస్ సీజన్లలో 10 సెంచరీలు సాధించా" అన్నారు ఇంజమామ్.
"ఆ సీనియర్ క్రికెటర్ పట్ల ఇప్పటికీ ఎంతో గౌరవం ఉంది. కానీ ఆయన మాటలను ఇన్ని సంవత్సరాలు గడిచినా మర్చిపోలేకపోతున్నా" అని ఇంజమామ్ అన్నారు.
'నేనంటే కొందరికి ఈర్ష్య'
అదే ప్రపంచకప్‌లో జరిగిన మరో ఘటనను ఇంజమామ్ ఉల్ హక్ గుర్తు చేసుకున్నారు.
జట్టులోని కొందరు సీనియర్ ఆటగాళ్లు కొత్తగా వచ్చిన వారిని ఆహ్వానించేవారు కాదనే విషయం ఈ ఘటనతో తెలుస్తుంది. కొన్నిసార్లు వారి ప్రవర్తన అసూయతో ఉన్నట్లు అనిపిస్తుంది.
''ప్రపంచకప్ సమయంలోనే పాకిస్తాన్ జట్టు ఒక విందు కార్యక్రమానికి హాజరైంది. అక్కడ ఇమ్రాన్ ఖాన్ నన్ను చూసి ఈ కుర్రాడిలో ఎంతో ప్రతిభ ఉందని అక్కడ చెప్పారు" అని ఇంజమామ్ తెలిపారు.
"తన ఆటతో మన మ్యాచ్‌లను గెలిపిస్తాడు అని కూడా అన్నాడు. అయితే అక్కడే ఉన్న కొందరు క్రికెటర్లకు ఆ మాటలు నచ్చలేదు. వారంతా నావైపు కోపంగా చూశారు" అని ఇంజమామ్ గుర్తు చేసుకున్నారు.
ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసే సమయంలో ఇంజమామ్ ఉల్ హక్‌ను జట్టులోకి తీసుకోవడాన్ని ఒక సెలెక్టర్ తీవ్రంగా వ్యతిరేకించాడని చాలా కొద్దిమందికే తెలుసు.
ఆ తర్వాత ఆయన తన పదవికి రాజీనామా కూడా చేశారు.
కానీ ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఇంజమామ్ ఉల్ హక్ ప్రతిభకు ఫిదా అయిపోయారు. కచ్చితంగా ఆయన జట్టులో ఉండాలని పట్టుబట్టారు.
ఇంజమామ్‌పై ఇమ్రాన్ ఖాన్‌కు ఎంత నమ్మకం ఉందో ప్రముఖ భారతీయ క్రీడా పాత్రికేయుడు అయాజ్ మెమన్ మాటల ద్వారా అర్థం చేసుకోవచ్చు.
బ్యాటింగ్ ప్రతిభతోనే వెలుగులోకి వచ్చిన ఇంజమామ్
"1992 ప్రపంచకప్ ఫైనల్ కంటే ముందు ఇంజమామ్ గురించి ఎవరికీ తెలియదు. సెమీఫైనల్లో న్యూజీలాండ్‌పై అద్భుతమైన బ్యాటింగ్ చేసి వెలుగులోకి వచ్చాడు" అని అయాజ్ మెమన్ బీబీసీ హిందీకి చెప్పారు.
"ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు మెల్బోర్న్లో ఇమ్రాన్ ఖాన్‌ను కలిశాం. అప్పుడు ఆయన ప్రస్తుత ప్రపంచంలో అత్యుత్తమ యువ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ అని చెప్పారు. అప్పటి వరకు అతను పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోవడంతో, కెప్టెన్ అతిగా పొగుడుతున్నట్టు మేం భావించాం" అని అయాజ్ మెమన్ అన్నారు.
"కానీ ఫైనల్లో కీలకమైన 42 పరుగుల ఇన్నింగ్స్ ఆడి తన బ్యాటింగ్ ప్రతిభను నిరూపించినప్పుడు, ఇంజమామ్లో ఎంతటి ప్రతిభ దాగి ఉందో గ్రహించాం. కేవలం బ్యాటింగ్ ప్రతిభనే కాదు, క్రికెట్‌కు కావాల్సిన ఓర్పు, సహనం కూడా గమనించాం" అని అయాజ్ చెప్పారు.
"ఆ సమయంలో మొదటి ప్రపంచ కప్ ఆడుతున్న సచిన్ తెండూల్కర్ కూడా అంతర్జాతీయ క్రికెట్లో, ప్రపంచ స్థాయి బ్యాటర్‌గా గుర్తింపు పొందుతున్నాడు" అని వివరించారు.
"ప్రతి ఆటగాడికి తనదైన ప్రత్యేక స్థానం ఉంటుంది. సచిన్, ఇంజమామ్ ఇద్దరూ గొప్ప కెరీర్‌ను నిర్మించుకున్నారు. చాలా కాలంపాటు అంతర్జాతీయ క్రికెట్లో తమదైన ముద్ర వేశారు" అని తెలిపారు.
ఇంజమామ్‌పై భారత క్రికెటర్లకు ప్రత్యేక గౌరవం
ఇంజమామ్ ఆడుతున్న కాలంలో కూడా భారత్-పాకిస్తాన్ మధ్య మైదానంలో తీవ్రమైన పోటీ ఉండేది. అయితే మైదానం బయట మాత్రం ఇరు దేశాల ఆటగాళ్లు ఒకరి పట్ల మరొకరు గౌరవం, ఆప్యాయతతో ఉండేవారు.
ఈ విషయంలో ఇంజమామ్ ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనతో కలిసి లేదా ప్రత్యర్థులుగా ఆడిన భారత క్రికెటర్లు ఇంజమామ్‌ను ఎంతో గౌరవించేవారు. అలాగే ఇంజమామ్ కూడా భారత ఆటగాళ్ల పట్ల అదే స్థాయిలో అభిమానంతో ఉండేవారు.
ఇంజమామ్ తన కుమారుడు ఇబ్తిసామ్ ఉల్ హక్‌ను ప్రత్యేకంగా స్టేడియానికి తీసుకెళ్లి సచిన్ తెందూల్కర్‌తో మాట్లాడించిన 2004 నాటి సందర్భాన్ని ఎవరు మర్చిపోలేరు
"ఈ అబ్బాయి నా కొడుకు, కానీ నీ అభిమాని" అని సచిన్‌తో చెప్పారు ఇంజమామ్.
ఒక టీవీ కార్యక్రమంలో ఈ ఘటనను సచిన్ తెందూల్కర్ ప్రస్తావించారు.
ఇంజమామ్ తన దృష్టిలో ఎంతో గౌరవనీయమైన క్రికెటరని అన్నారు.
భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఒక కార్యక్రమంలో ఇంజమామ్‌ను ఆయన సమక్షంలోనే ప్రశంసించారు.
"ఇంజీ భాయ్ మా మీద ఆడేటప్పుడు సెంచరీ కంటే తక్కువ చేయాలని ఎప్పుడూ అనుకునేవాడు కాదు. నిద్రలేచి వచ్చి కూడా సెంచరీ కొట్టేస్తారేమో అనిపించేది. ఆయనకు అది చాలా సాధారణమైన విషయంలా కనిపించేది" అని సౌరవ్ గంగూలీ అన్నారు.
మరో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కూడా ఒక ఐపీఎల్ కార్యక్రమంలో ప్రపంచంలోనే అత్యుత్తమ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లలో ఒకరిగా ఇంజమామ్ ఉల్ హక్‌ను అభివర్ణించారు.
మిడిల్ ఆర్డర్లో ఇంజమామ్ ఉల్ హక్ కంటే మెరుగైన బ్యాటర్ ఎవరూ లేరని రాహుల్ ద్రవిడ్ భావించేవారు.
కరాచీలో 2004లో భారత్‌పై ఇంజమామ్ చేసిన సెంచరీ ఇన్నింగ్స్ వీడియోను హోటల్‌కు వెళ్లిన తర్వాత మూడుసార్లు చూశానని రాహుల్ ద్రవిడ్ ఒకసారి చెప్పారు.
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఒక టీవీ కార్యక్రమంలో ఇంజమామ్‌ను ఆసియాలోనే అత్యుత్తమ మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా అభివర్ణించారు. అలాగే మైదానంలో ఇంజమామ్‌తో జరిగిన ఓ సరదా సంఘటనను కూడా గుర్తు చేసుకున్నారు.
"డానిష్ కనేరియా బౌలింగ్ చేస్తున్న సమయంలో నేను ఇంజీ భాయ్‌తో ఇంజీ భాయ్, బౌండరీ దగ్గర ఉన్న ఫీల్డర్‌ను కాస్త ముందుకు రమ్మని చెప్పండి నాకు సిక్సర్ కొట్టాలనిపిస్తోందని అని అన్నా" అని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నారు.
"ఇంజమామ్ కూడా ఫీల్డర్‌ను ముందుకు పెట్టారు. ఆ తర్వాత బంతికి సిక్స్ కొట్టా. ఇది కనేరియాకు కోపం తెప్పించింది" అని తెలిపారు.
ఇలాంటి ఘటనలు చూస్తుంటే, భారత క్రికెటర్లలో ఇంజమామ్ ఉల్ హక్కు ఎంతటి ఆదరణ, గౌరవం, ఉండేదో అర్థమవుతుంది.
ఇంజమామ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 1992 ప్రపంచకప్ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లినప్పుడు షార్ట్‌పిచ్ బంతులను ఆడటంలో నాకు ఇబ్బంది ఎదురయ్యేదని గుర్తు చేసుకున్నారు.
ఆ సమయంలో ఇంగ్లండ్‌లో సునీల్ గవాస్కర్‌తో కలిసి చారిటీ మ్యాచ్ ఆడాం. తనకు సహాయం చేయమని ఇంజమామ్ కోరాడు.
సునీల్ గవాస్కర్ చెప్పిన సలహా మేరకు తాను షార్ట్‌పిచ్ బంతులను ఎదుర్కొనే సమస్యను అధిగమించానని ఇంజమామ్ చెప్పారు.
ఇంజమామ్ బాల్యం ఎలా సాగింది?
ఇంజమామ్ బాల్యం ఎలా సాగిందో తెలుసుకోవడానికి ఆయన తండ్రిని, చదువు చెప్పిన ఉపాధ్యాయులను, స్నేహితులను కలిశాం.
"కుటుంబంలో చిన్నవాడు. అందుకే ఇంట్లో అందరికీ ఎంతో ముద్దు. అతను కూడా క్రమశిక్షణ ఉన్న వ్యక్తి" అని ఇంజమామ్ తండ్రి పీర్ ఇంతిజామ్ ఉల్ హక్ చెప్పారు.
"సోదరుడు ఇంతిజార్ ఉల్ హక్‌తో చిన్న చిన్న వాదనలు పెట్టుకొని గొడవపడేవాడు. అయితే సరదాగా మాట్లాడుకునే సందర్భాల్లో కూడా హద్దులు మీరకుండా మర్యాదగా ఉండేవాడు'' అని తెలిపారు.
"నా పెద్ద కుమారుడు ఇంతిజార్ ఉల్ హక్ ఎప్పుడూ ఇంజమామ్ క్రికెట్‌పై శ్రద్ధ చూపేవాడు. క్లబ్ క్రికెట్ ఆడేందుకు ప్రోత్సహించాడు. ముల్తాన్‌లో క్లబ్ క్రికెట్ ఆడుతున్న రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఒకసారి అక్కడి కోచ్ నాతో...'' పీర్ సాహిబ్, ఇంజమామ్ చాలా బాగా ఆడుతున్నాడు. కానీ ఇక్కడ ఉంటే గుర్తింపు రాదు. కాబట్టి లాహోర్‌లోని గవర్నమెంట్ కాలేజీలో చేర్పించండి అని సూచించారు" అని చెప్పారు.
"ఆ తర్వాతే ఇంజమామ్‌ను అక్కడకు పంపించా. అక్కడ మంచిగా బ్యాటింగ్ చేసి గుర్తింపు పొందాడు" అని పేర్కొన్నారు.
చేతి రాత సరిగా లేదు కానీ బ్యాటింగ్ అద్భుతం
"ఇంజమామ్ గొప్పగా చదివే విద్యార్థి కాదు. చేతి రాత బాగుండేది కాదు. ఉపాధ్యాయులను గౌరవించేవాడు. క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఒక రోజు ప్రధానోపాధ్యాయుడు ఆయన ప్రతిభను గుర్తించారు. అప్పటి నుంచి స్కూల్ జట్టులో ఆడటం మొదలు పెట్టాడు" అని ఇంజమామ్‌కు చదువు చెప్పిన మహమ్మద్ హసీమ్ ఖాన్ తెలిపారు.
ఇంజమామ్‌కు హాస్య చతురత కూడా ఎక్కువే. మీడియా సమావేశాల్లో కూడా ఆయన తరచూ తన చమత్కారంతో అందర్నీ నవ్వించేవారు. స్నేహితులతో ఉన్నప్పుడు ఆయన మరో వ్యక్తిలా ఉండేవారు.
ఇంజమామ్‌కు ముజ్తబా ఖోఖర్ అనే స్నేహితుడితో ఎంతో ఆత్మీయమైన స్నేహం ఉండేది. ఖోఖర్ సెలూన్ నడుపుతూ ఉండేవారు. కానీ వారి స్నేహానికి ఆ విషయం ఎప్పుడూ అడ్డురాలేదు. వాళ్లిద్దరూ రాత్రంతా కూర్చొని ముచ్చట్లు చెప్పుకునే వారు. ఇంజమామ్ ఆమ్లెట్లు వేస్తే, ముజ్తబా రొట్టెలు చేసేవారు.
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ముజ్తబా సెలూన్ ముందు నుంచే ఊరేగింపు సాగినప్పుడు అక్కడ ఆపి ఆయన్ని కలిసి వెళ్లారు. అలాంటి స్నేహితుడు 2024లో చనిపోయారు.
ఇంజమామ్ ఎప్పుడూ నిద్ర విషయంలో రాజీ పడేవాడు కాదని, రంజాన్ సమయంలో సహరీ కోసం ఫజర్ అజాన్‌కు ముందే లేపినా చాలాసార్లు లేచేవాడు కాదని, ఉపవాసాన్ని మాత్రం కొనసాగించినట్టు ఆయన్ని ప్రోత్సహించిన ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ ఇషాక్ పటేల్ చెప్పారు.
ఇంజమామ్‌కు మతిమరుపు కూడా ఉందని ఇషాక్ వెల్లడించారు. "ఒకసారి బట్టలకు ఇస్త్రీ చేయడానికి ఫ్రిజ్ ప్లగ్ తీసేశాడు. ఇస్త్రీ చేసిన తర్వాత మళ్లీ ప్లగ్ పెట్టడం మరచిపోయాడు. ఫలితంగా ఫ్రిజ్‌లోని ఐస్ అంతా కరిగిపోయి ఆ గది నీటితో నిండిపోయింది. చాలా సార్లు ఇంటి తాళాలు మర్చిపోయి వెనక్కి వచ్చేవాడు" అని గుర్తు చేశారు.
ప్రశాంతంగా బ్యాటింగ్ చేసే ఇంజమామ్
''ఇంజమామ్ బ్యాటింగ్ చేసే తీరు చాలా ప్రశాంతంగా ఉండేది. షాట్లు ఆడటానికి అతనికి కావలసినంత సమయం ఉన్నట్టుగా కనిపించేది. మరో మాటల్లో చెప్పాలంటే, బ్యాటింగ్‌ను చాలా సులభంగా కనిపించేలా చేసేవాడు. మొదటి నుంచే వేగవంతమైన బౌలింగ్‌ను అద్భుతంగా ఎదుర్కొనేవాడు. అలాగే స్పిన్ బౌలర్లపై కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసేవాడు'' అని అయాజ్ మెమన్ చెప్పారు.
"నా అంపైరింగ్ కెరీర్లో బ్యాటింగ్ చేస్తూ చూడటానికి ఎంతో ఆనందం కలిగించిన ఆటగాళ్లలో ఇంజమామ్ ఒకరు" అని బీబీసీతో ఇంటర్నేషనల్ క్రికెట్ అంపైర్ అలీమ్ దార్ అన్నారు.
"ఇంజమామ్ ఎన్నో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడినా, బంగ్లాదేశ్‌పై ముల్తాన్ టెస్టులో చేసిన 138 పరుగుల ఇన్నింగ్స్‌ను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మ్యాచ్‌లో ఒంటిచేత్తో పాకిస్తాన్‌ను గెలిపించారు. ఆ టెస్టులో నేను టీవీ అంపైర్‌గా ఉన్నాను" అని అలీమ్ దార్ గుర్తుచేసుకున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)