‘నాలాంటి ఆరోగ్య సమస్య వస్తే జనం దాని గురించి మాట్లాడటానికి సిగ్గు పడతారు’

ఫొటో సోర్స్, Monica Thomas
- రచయిత, ఎమిలీ హోల్ట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
మోనికా థామస్ యుక్తవయసులో ఉన్నప్పుడు ఆమెకు జననాంగాల వద్ద దురద, నొప్పి మొదలయ్యాయి.
ఆమె ఎన్నిసార్లు వైద్యుల చుట్టూ తిరిగినా.. అది సాధారణ చర్మ సమస్య అని కొట్టిపారేశారు. రోజురోజుకూ ఆమె లక్షణాలు మరింత తీవ్రమయ్యాయి.
పుండ్లు, బొబ్బల వల్ల నిరంతర నొప్పితో ఆమె నరకం అనుభవించారు.
"నేను నడవలేని స్థితికి చేరుకున్నా, చాలా కాలం మంచానికే పరిమితమయ్యా" అని ఆమె చెప్పారు.
బయాప్సీ చేయించుకోవడానికి ముందు ఆరు నెలల్లో డాక్టర్లు తనను 28 సార్లు పరీక్షించారని మోనికా చెప్పారు.


ఫొటో సోర్స్, Dr Nighat Arif
వందమందిలో ఒకరికి వచ్చే అవకాశం
"సమాజంలో మహిళలు ఎదుర్కొనే గైనికల్ అనారోగ్య సమస్యల గురించి పెద్దగా మాట్లాడరు. వాటి గురించి మాట్లాడటం చాలా తప్పు అనే భావన ఉంది" అని ఆమె అన్నారు.
"వైద్యుల దగ్గరికి వెళ్లినప్పుడు కూడా దుస్తులు విప్పి పరీక్షించుకోవడం నాకు చాలా ఇబ్బందిగా సిగ్గుగా అనిపించేది. కానీ, నొప్పితో, దురదతో, తీవ్రమైన అసౌకర్యంతో ఆ బాధను భరిస్తూ బతకడం అంతకన్నా నరకం" అని 34 ఏళ్ల మోనికా అన్నారు.
ఆమెకు 'లైకన్ స్క్లిరోసస్' అనే వ్యాధి ఉన్నట్లు తేలింది. ఇది జీవితాంతం వేధించే ఒక రకమైన వాపుతో కూడిన చర్మ వ్యాధి.
ఇది జననావయవాలపై ప్రభావం చూపుతుందని దీనివల్ల అక్కడ తెల్లటి మచ్చలు ఏర్పడటం, దురద, నొప్పి, చర్మం పగలడం లేదా తెగడం వంటివి జరుగుతాయని మహిళల ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ నిఘత్ ఆరిఫ్ వివరించారు.
ఈ వ్యాధి స్త్రీలు, పురుషుల్లో కనిపిస్తుంది. 50 ఏళ్లు పైబడిన మహిళల్లో ఇది ఎక్కువగా వస్తుంది.
దీనివల్ల ఒక్కోసారి బాహ్య జననేంద్రియ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
"ఈ జబ్బు కారణంగా లైంగిక కలయికలో మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. చాలామంది దీనిని లైంగికంగా సంక్రమించే వ్యాధి అని పొరబడతారు. కానీ ఇది అంటువ్యాధి కాదు" అని ఆమె బీబీసీ రేడియో 5 లైవ్ పాడ్‌కాస్ట్ కార్యక్రమం "దట్ టైమ్ ఆఫ్ ది మంత్"లో చెప్పారు
ఈ వ్యాధి బాధితుల సంఖ్యపై పరిమిత పరిశోధనలు మాత్రమే జరిగాయి.
దాదాపు వందమంది మహిళల్లో ఒకరు దీని బారిన పడుతున్నట్లు బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధనల్లో వెల్లడైంది. వెస్ట్ మిడ్‌లాండ్స్, వార్విక్‌షైర్‌లో నివసిస్తున్న ప్రజలపై బ్రిస్టల్ విశ్వవిద్యాలయం ఈ పరిశోధన చేసింది.
"ఈ అంచనా వాస్తవం కంటే చాలా తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే ఈ వ్యాధిని గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. కొంతమంది తమ జీవితాంతం ఈ సమస్య ఉందని తెలియకుండానే గడిపేస్తారు" అని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ సోఫీ రీస్ బీబీసీతో చెప్పారు.
"ఈ లక్షణాల గురించి సాయం కోరడానికి దురదృష్టవశాత్తు చాలా అవమానంగా సిగ్గుగా భావిస్తారు. అలాగే వైద్య నిపుణులలో కూడా దీనిపై అవగాహన లోపించింది. ఈ వ్యాధి అసలు తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవడానికి మరిన్ని పరిశోధనలు చాలా అవసరం" అని ఆమె పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook.com/monicahope.thomas
‘ఒంటరితనం, భయానకం’
వ్యాధిని సరిగ్గా గుర్తించకపోవడం వల్ల తన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడిందని మోనికా చెప్పారు.
"అసలు ఏమైందో తెలియదు. ఎలా ముందడుగు వేయాలో తెలియలేదు. అది చాలా భయంకరమైన, ఒంటరితనంతో కూడిన కాలం" అని ఆమె అన్నారు.
ఆమెకు మొదట హెర్పిస్‌కు సంబంధించిన మందులు సూచించారు.
"నేను చర్మవ్యాధి నిపుణురాలి దగ్గరికి వెళ్లినప్పుడు చాలా బాధపడ్డాను. నాకు ఉన్నది హెర్పిస్ కాదని చెప్పడంతో ఆమెకు చాలా కోపం వచ్చింది. అప్పుడామె నన్ను హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలని కోరారు" అని మోనికా వివరించారు.
లైకన్ స్క్లిరోసస్ రావడానికి మోనికా వయసు చాలా తక్కువ అని వైద్యులు చెప్పారు.
"కానీ దురదృష్టవశాత్తు అన్ని వయసుల మహిళల్లోనూ ఇది వస్తుంది. పిల్లల్లో కూడా ఇది రావచ్చు. కాబట్టి వైద్యులు అలా అనడం నాకు చాలా కష్టంగా అనిపించింది. కానీ నా శరీరంలో ఏదో తేడా ఉందని నాకు ఎప్పుడూ తెలుసు" అని మోనికా అన్నారు.
లైకన్ స్క్లిరోసస్‌తో బాధపడుతున్న వారికి మరింత సాయం అందించాలని మోనికా అభిప్రాయపడ్డారు.
"వ్యాధి నిర్ధరణ తర్వాత కూడా సరైన చికిత్స అందడం లేదు. నాకు కనీసం నిరంతర తనిఖీలు లేవు. నేనే స్వయంగా స్టెరాయిడ్ క్రీమ్‌తో దీన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నా. అంతా బాగవుతుందని ఆశిస్తున్నా" అని ఆమె చెప్పారు.
నేషనల్ హెల్త్ మిషన్ వెబ్‌సైట్ ప్రకారం ఈ వ్యాధి రావడానికి కచ్చితమైన కారణం తెలియదు.
మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన చర్మంపై దాడి చేసి దెబ్బతీయడం వల్ల ఇది సంభవించవచ్చు. ఇది అంటువ్యాధి కాదు.
ఎలాంటి ఇన్ఫెక్షన్ వల్ల లేదా వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం వల్ల ఇది రాదు. అయితే చర్మాన్ని గట్టిగా రుద్దడం లేదా చర్మానికి గాయం కావడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రం కావచ్చు.

ఫొటో సోర్స్, Clare Baumhauer
ఐదేళ్ల వయసులోనే..
కెంట్ ప్రాంతానికి చెందిన 53 ఏళ్ల క్లేర్ బామ్‌హోవర్‌కు ఐదేళ్ల వయసులో తొలిసారి ఈ లక్షణాలు కనిపించాయి.
"నాకు దురద, నొప్పి ఉండేవి. దానివల్ల నన్ను ఎప్పుడూ తిడుతుండేవారు. నాకేం జరుగుతుందో అప్పుడు నాకు అస్సలు అర్థం కాలేదు" అని ఆమె చెప్పారు.
ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత లక్షణాలు మరింత తీవ్రమయ్యాయి. చర్మం తెగడం, బొబ్బలు, పుండ్లు ఏర్పడ్డాయి.
"మనకు ఇతరుల శరీర రహస్య భాగాలు కనిపించవు కదా. అందుకే నా శరీరంలో ఉన్నది సాధారణమైనది కాదని నాకు తెలియలేదు. ఆ సమయంలో నేను ఎనిమిది సార్లు గర్భాశయ, యోని పరీక్షలు చేయించుకున్నా. ఎవరూ దీని గురించి ఏమీ చెప్పలేదు" అని క్లేర్ వివరించారు.
2016 లో క్లేర్‌కు చర్మంపై ఒక గాయం అయ్యింది. అది ఎంతకీ మానలేదు.
"ఆ సంవత్సరంలో నాకు 43 ఏళ్లు. అంటే అప్పటికే 38 ఏళ్లుగా నేను ఆ బాధను అనుభవిస్తున్నా. ఇక నేను భరించలేకపోయా" అని ఆమె చెప్పారు
ఒక వైద్యుడు ఆమెకు హెర్పిస్ ఉందని చెప్పి లైంగిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లమని సూచించారు.
తనకు పెళ్లయి 25 ఏళ్లు కావస్తోందని ఆ మాట విని తాను షాక్‌కు గురయ్యానని క్లేర్ చెప్పారు.
చివరికు ఆమెను బయాప్సీ కోసం నిపుణుల వద్దకు పంపించినప్పుడు ఆమెకు లైకన్ స్క్లిరోసస్, బాహ్య జననేంద్రియ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధరణ అయింది.

ఫొటో సోర్స్, facebook.com/monicahope.thomas
‘దాని గురించి నేనెప్పుడూ వినలేదు’
"నేను ఈ వ్యాధి గురించి ఎప్పుడూ వినలేదు. ఎప్పుడూ వినని ప్రదేశంలో అస్సలు వినని క్యాన్సర్ వచ్చింది. బాహ్య జననేంద్రియ భాగం అనే పదాన్ని నేను వినడం అదే మొదటిసారి. అంతకుముందు ఏ ఆరోగ్య నిపుణుడు కూడా ఆ పదాన్ని ప్రస్తావించలేదు. కాబట్టి ఆ సమయంలో దాన్ని జీర్ణించుకోవడం నాకు చాలా కష్టంగా అనిపించింది" అని క్లేర్ చెప్పారు.
వల్వార్ క్యాన్సర్ నుంచి క్లేర్ బయటపడిన ఏడేళ్ల తర్వాత.. సాధారణ చెకప్‌లో అది మళ్లీ వచ్చినట్లు తేలడంతో ఆమె మూడు సంవత్సరాల కిందట శస్త్ర చికిత్స చేయించుకున్నారు.
ఈ ఏడాది జూన్‌లో జరిగిన మరో చెకప్‌లో క్యాన్సర్‌గా మారే అవకాశం ఉన్న కణాలు ఉన్నట్లు తేలడంతో ఆమెకు ఆరోసారి సర్జరీ చేశారు.
తనకు ముందే ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తించి ఉంటే, క్యాన్సర్ ముదిరిపోకముందే గుర్తించి ఉండేవారని క్లేర్ నమ్ముతున్నారు.
"నేను రెండుసార్లు రేడియోథెరపీ తీసుకోవాల్సి వచ్చింది. దానివల్ల నాకు చిన్న వయసులోనే మెనోపాజ్ వచ్చింది. అలాగే కాళ్ల వాపు, నరాల బలహీనత వంటి సమస్యలు మిగిలాయి" అని ఆమె చెప్పారు.
శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చినా ఒకచోట రాసుకోవాలని మోనికా మహిళలకు సూచించారు.
"మన శరీరాల గురించి మరింత బాగా తెలుసుకోవడం. మన రహస్య భాగాల విషయంలో మనకు ఏది సాధారణమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాస్తవానికి మన యోని పెదవులు మారుతూ ఉంటాయి" అని ఆమె చెప్పారు.
"ఒకవేళ వైద్యులు మీ సమస్యను పట్టించుకోకపోతే వేరే వైద్యుల అభిప్రాయాలను తీసుకోండి. సమాధానం దొరికే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి. ఎందుకంటే బాధను భరిస్తూ బతకాల్సిన అవసరం లేదు" అని మోనికా పిలుపునిచ్చారు.
లైకన్ స్క్లిరోసస్‌కు సంబంధించి వైద్యులతో మాట్లాడటానికి సహాయపడే రేఖాచిత్రం, నమూనా ఉన్న గైడ్‌ను ఆమె సిఫార్సు చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























