యుక్రెయిన్: ప్రజలు కలుపు మొక్కలు వండుకొని తిన్నచోట కాల్పుల విరమణ

కలుపు మొక్కలు, గడ్డి, యుక్రెయిన్
    • రచయిత, డాన్ జాన్సన్, ఓల్గా మాల్చేవ్‌స్కా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

రష్యా స్వాధీనంలో ఉన్న యుక్రెయిన్ నగరం ఒలెష్కీలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఇక్కడి ప్రజలు ఆహారం, నీరు, విద్యుత్ లేకుండా ఇన్నాళ్లూ దిక్కుతోచని స్థితిలో చిక్కుకుపోయారు.

యుక్రెయిన్ అధికారులు, రష్యా రక్షణ శాఖ ఈ తాత్కాలిక కాల్పుల విరమణను పాటిస్తున్నట్లు తెలిపాయి.

అమెరికా ప్రథమ మహిళ మెలనియా ట్రంప్ చొరవతో కుదిరిన ఈ కాల్పుల విరమణ ద్వారా శుక్రవారం నాడు ప్రజలకు సహాయక సామగ్రి పంపిణీతో పాటు వారి సురక్షిత తరలింపు జరగనుందని వైట్‌హౌస్ తెలిపింది.

ఖేర్సన్ ప్రాంతంలోని యుద్ధ ప్రాంతమైన ఒలెష్కీ నగరానికి ఒకవైపు యుక్రెయిన్ స్థావరాలను వేరుచేసే నిప్రో నది ఉండగా, మరోవైపు రష్యా బలగాలు మోహరించి ఉన్నాయి. దీంతో ఈ నగరం రెండువైపులా దిగ్బంధనంలో కూరుకుపోయింది.

ప్రాణాలు నిలబెట్టుకోవడానికి గార్డెన్‌లో పెరిగే కలుపు మొక్కలను వండుకుని తిన్నట్లు చాలామంది ప్రజలు చెప్పారు. తాము తీవ్రమైన ఆకలితో అలమటిస్తున్నామని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుకుంటున్నామని వారు బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"రష్యా మానవత్వంపై నాకు నమ్మకం లేదు"

ఒలెష్కీలో అమల్లోకి వచ్చిన ఈ కాల్పుల విరమణ నిలబడుతుందన్న నమ్మకం లేదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

"రష్యా మానవత్వంపై నాకు నమ్మకం లేదు" అని ఒక స్థానికుడు అన్నారు.

ఒలెష్కీ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 200 మంది పిల్లలతో సహా సుమారు 6,000 మంది చిక్కుకుపోయారని, నగరంలో కేవలం 1,700 మంది మాత్రమే నివసిస్తున్నారని యుక్రెయిన్ రాజధాని కీయెవ్ భావిస్తోంది.

యుద్ధానికి ముందు ఇక్కడ 24,000 మంది నివసించేవారు. కానీ 2022 ఫిబ్రవరిలో పూర్తి స్థాయి దండయాత్ర ప్రారంభించిన తొలి రోజుల్లోనే ఈ నగరాన్ని రష్యా ఆక్రమించుకుంది.

ఇక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, నగరంలోకి నిత్యావసరాలు చేరవేయడం కూడా చాలా కష్టం. అలాగే ఇక్కడి నుంచి బయటపడే మార్గాల్లో మందుపాతరలు అమర్చడం, డ్రోన్ దాడుల ముప్పు ఉండటంతో ఇక్కడి నుంచి తప్పించుకోవడం కూడా చాలా ప్రమాదకరం.

దుకాణాలేవీ తెరవలేదు. మూడేళ్లుగా నగరంలో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా లేదు.

ఒలెష్కీలోకి ఆహారం, వైద్య సహాయం అనుమతించడంతో పాటు ప్రజలను సురక్షితంగా తరలించేందుకు అంగీకరించాలని పోప్ లియో XIV ఈ నెల ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణ విషయంలో మాస్కోతో సహకరించాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీని ఆయన కోరారు.

ప్రస్తుత కాల్పుల విరమణ ద్వారా శుక్రవారం నాటి తరలింపు ప్రక్రియలో ప్రజలు సురక్షితంగా బయటకు వెళ్లేలా రోడ్లపై ఉన్న మందుపాతరలను తొలగించి, సహాయ సామగ్రిని లోపలికి అనుమతించనున్నారు.

తాను ఒక మందుపాతరపై కాలు వేశానని, ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నానని, ఇప్పటికే రెండు ఆపరేషన్లు జరిగాయని ఒక మహిళ బీబీసీకి చెప్పారు.

"నేను అక్కడ ఎంతకాలం ఉండాలో నాకు తెలియదు" అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం నాటి తరలింపులో తాను వెళ్లలేనేమోనని ఆమె వాపోయారు.

ఇక్కడ ఒకే ఒక్క ఆసుపత్రి మాత్రమే పాక్షికంగా పనిచేస్తోందని, అది కూడా శరీర భాగాలను తొలగించే అత్యవసర ఆపరేషన్లు చేయడానికి వారంలో కొన్ని రోజులు మాత్రమే తెరుస్తున్నారని స్థానికులు గత నెలలో బీబీసీకి తెలిపారు.

కిెయేవ్, ఖార్కివ్

'తరలింపు సమయంలో మళ్లీ కాల్పులు మొదలైతే'

కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఒలెష్కీలోని ప్రజలను సంప్రదించడం కష్టంగా మారింది.

రష్యన్ల ప్రతీకార దాడులకు భయపడి చాలామంది అక్కడి పరిస్థితుల గురించి మాట్లాడేందుకు వెనుకాడుతున్నారు. దీంతో కాల్పుల విరమణ అమలు తీరును నిర్ధరించడం సవాలుగా మారింది.

తరలింపు ప్రణాళికలపై చాలా వివరాలు అస్పష్టంగా ఉన్నాయి. దీనికోసం ఎక్కడ, ఎలా నమోదు చేసుకోవాలనేది కూడా తెలియదు.

పెంపుడు జంతువులను తీసుకురావొచ్చా అని కొందరు అడుగుతుంటే, ఇళ్లు వదిలి వెళితే తమ భవిష్యత్తు ఏమవుతుందని మరికొందరు ఆందోళన చెందుతున్నారు.

"మన ప్రజలను రక్షించే ఈ మిషన్ విజయవంతంగా, సురక్షితంగా జరగడం అత్యంత కీలకం" అని జెలియెన్‌స్కీ కార్యాలయ అధిపతి కైరిలో బుడనోవ్ మంగళవారం అన్నారు.

తమ నెపర్ గ్రూప్ ఆర్మీ విభాగాలు ప్రధాన రహదారులపై ఇంజనీరింగ్ పనులు చేపడుతున్నాయని, పేలుడు పదార్థాలు, మందుపాతరలను తొలగిస్తున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నామని ప్రజలు ఆశాభావంతో ఉన్నప్పటికీ, రష్యా తమను తిరిగి యుక్రెయిన్‌లోకి అనుమతించకపోవచ్చన్న భయాలు కూడా ఉన్నాయి. యుక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్నారన్న నెపంతో తమ ఫోన్లు, ఆన్‌లైన్ కార్యకలాపాలను తనిఖీ చేసి, తమను తీసుకెళ్లి చిత్రహింసలు పెడతారేమోనని ఆందోళన చెందుతున్నారు.

తరలింపు సమయంలో మళ్లీ కాల్పులు మొదలవుతాయేమోనని, కాల్పుల విరమణను పాటించలేదని యుక్రెయిన్‌పై నిందలు వేస్తారేమోనని ఒలెష్కీ కి చెందిన స్థానికుడొకరు ఆందోళన వ్యక్తం చేశారు.

గత నెలలో, ఒలెష్కీలో క్లిష్ట పరిస్థితి, ఆహారం, ఔషధాల సరఫరాలో సమస్యలు ఉన్నాయని క్రెమ్లిన్ అంగీకరించింది. అయితే వాటిని పరిష్కరించడానికి రష్యా మిలిటరీ పనిచేస్తోందని చెబుతూ కీయెవ్‌పై నింద మోపింది.

ఈ పరిస్థితిపై స్పందించిన వైట్ హౌస్, మెలానియా ట్రంప్ చొరవ వల్లే కాల్పుల విరమణ సాధ్యమైందని గత వారం తెలిపింది.

మానవతా కార్యకలాపాల్లో భాగంగా, యుక్రెయిన్ నగరమైన ఖేర్సన్ (ఒలెష్కీకి నదికి అవతలి వైపున ఉంది) వైపు కాల్పులు జరపడాన్ని మాస్కో కాలమానం ప్రకారం 04:00 (యుక్రెయిన్‌లో 03:00; 01:00 GMT) గంటలకు నిలిపివేసినట్లు రష్యా రక్షణ శాఖ టెలిగ్రామ్‌లో తెలిపింది.

స్థానిక కాలమానం ప్రకారం నవంబర్ 1వ తేదీ రాత్రి 23:59 వరకు ఈ కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని జెలియెన్‌ స్కీ పార్టీకి చెందిన యుక్రెయిన్ ఎంపీ డేవిడ్ అరఖామియా తెలిపారు.

ఈ ఆపరేషన్‌ను సమన్వయం చేసేందుకు పార్లమెంటు మానవ హక్కుల కమిషనర్ డిమిత్రో లుబినెట్స్ ఆ ప్రాంతాలకు వెళ్లినట్లు యుక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.

"రష్యా మానవ హక్కుల కమిషనర్ యానా లాంట్రాటోవాతో సహకారంతో, అమెరికా ప్రథమ మహిళ మెలనియా ట్రంప్ మధ్యవర్తిత్వం, సమన్వయంతో చేపడుతున్న మానవతా మిషన్‌లో ఇది భాగం" అని లుబినెట్స్ సోషల్ మీడియాలో రాశారు.

మానవతా ప్రయోజనాల కోసం చేపడుతున్న ఈ ఆపరేషన్ పట్ల సంయమనం పాటిస్తున్నామని యుక్రెయిన్ సైనిక జనరల్ స్టాఫ్ పేర్కొంది.

అయితే వదంతులను వ్యాప్తి చేయవద్దని, అవాస్తవ నివేదికలను నమ్మవద్దని ప్రజలను కోరింది.

రష్యా, యుద్ధం, కాల్పుల విరమణ

రష్యా మందుపాతరలను తొలగించిన మార్గాల ద్వారా బయటకు వెళ్లే పౌరులు "రష్యా వైపు వెళ్లి అక్కడే ఉండేలా" అది చూసుకుంటుందని జెలియెన్‌స్కీ హెచ్చరించారు.

అయితే కొందరు ఎలాగైనా యుక్రెయిన్ నియంత్రణలో ఉన్న భూభాగంలోకి చేరుకుంటారని, చిక్కుకుపోయిన ప్రతి ఒక్కరూ తమ గమ్యస్థానాలకు చేరుకుని సురక్షితంగా యుక్రెయిన్‌కు వెళ్లగలిగితే బాగుంటుందని ఆయన అన్నారు.

"రెండు దేశాలకు చెందిన సైనికేతర, పౌర నాయకులు ఒలెష్కీ నివాసితుల ఇళ్లను సందర్శించి, వారికి ఏ స్థాయి సహాయం అవసరమో నిర్ణయించడానికి కలిసి పనిచేస్తారు" అని గతవారం వైట్ హౌస్ తెలిపింది.

వైట్ హౌస్ ఈవెంట్‌లలో అమెరికా ప్రథమ మహిళ మెలనియా ట్రంప్ అరుదుగా కనిపిస్తున్నప్పటికీ, రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా తలెత్తిన మానవతా సమస్యలను పరిష్కరించడంలో ఆమె క్రియాశీలకంగా మారారు.

2025 ఆగస్టులో, ఆమె పుతిన్‌కు ఒక లేఖ రాస్తూ, "ప్రపంచవ్యాప్తంగా పిల్లలను, భవిష్యత్ తరాలను రక్షించుకోవాల్సిన సమయం ఇది" అని పేర్కొన్నారు.

ఒలెష్కీలో కాల్పుల విరమణ కొనసాగుతుండగా, ఇతర ప్రాంతాల్లో దాడులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.

సోమవారం సాయంత్రం, యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లోని ఒక విశ్వవిద్యాలయం, వంతెనపై జరిగిన దాడుల్లో ఒకరు మరణించగా, 14 మంది గాయపడ్డారు.

అలాగే రష్యాలోని బ్రయాన్స్క్‌పై యుక్రెయిన్ చేసిన డ్రోన్ దాడిలో ఒకరు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)