స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం- రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 68 మంది మృతి

ఫొటో సోర్స్, Getty Images
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌కు దక్షిణంగా ఉన్న ఉర్దా సమీపంలో రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 68 మంది మరణించారు.
ఈ మరణాలను కాస్టిల్లా-లా మాంచా ప్రాంతీయ ప్రభుత్వం ధృవీకరించింది. ఈ రెండు రైళ్లలో 500 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. సహాయ చర్యలు కొనసాగుతుండగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రమాదం తర్వాత బయటకు వచ్చిన వీడియో ఫుటేజ్‌ను బీబీసీ వెరిఫై విశ్లేషించింది. రైలు బోగీలు పట్టాలు తప్పి, బోల్తా పడి ఉండటం ఈ వీడియోలలో కనిపించింది.
మొదటి బోగీ తీవ్రంగా దెబ్బతినగా, దాని చుట్టూ శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మరో వీడియోలో అనేక ఎమర్జెన్సీ వాహనాలు, రెస్క్యూ సిబ్బంది కనిపిస్తున్నారు. ఈ వీడియోలలో కొంతమంది దుప్పట్లు కప్పుకుని గడ్డి మీద పడుకుని కనిపించారు. ఒక వ్యక్తికి ఐవీ(Intravenous-చికిత్స కోసం ఉపయోగించేది) బ్యాగ్ పెట్టి ఉంది.
ప్రమాదం జరిగిన తర్వాత తీసిన డ్రోన్ ఫోటోలను స్పానిష్ సివిల్ గార్డ్ విడుదల చేసింది. ఈ ఫోటోలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి. పట్టాలు తప్పిన కోచ్‌ల చుట్టూ డజన్ల కొద్దీ వాహనాలు, హెలికాప్టర్లు, అంబులెన్సులు కనిపిస్తున్నాయి. గాయాలపాలైన వారు నేలపై పడుకుని కనిపించారు.


ఫొటో సోర్స్, EPA
కొనసాగుతున్న సహాయకచర్యలు
ఈ ప్రమాదంలో కనీసం 64 మంది మరణించారని అంతకు ముందు రీజనల్ గవర్నమెంట్ వర్గాలు స్పానిష్ మీడియాకు తెలిపాయి. తర్వాత మృతుల సంఖ్య పెరిగింది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు రైళ్లు కలిపి 500 మందికి పైగా ప్రయాణికులను తీసుకెళుతున్నట్లు అంచనా.
ప్రైవేట్ సంస్థ అయిన ఇర్యో రైల్‌కు చెందిన ట్రైన్లో 147 మంది ప్రయాణికులు, దాన్ని ఢీకొట్టిన హైస్పీడ్ రైల్లో 397 మంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
గత జనవరిలో 46 మంది ప్రాణాలు కోల్పోయిన అడమాస్ దుర్ఘటన కంటే ఈ ప్రమాదం మరింత తీవ్రంగా ఉండొచ్చని స్పానిష్ మీడియాతో మాట్లాడిన అధికార వర్గాలు వెల్లడించాయి.

ఫొటో సోర్స్, EPA
'చాలామంది బయటకు రాలేకపోయారు'
ప్రమాదం తర్వాత అక్కడ "గందరగోళం" నెలకొందని, చాలా మంది బయటకు రాలేకపోయారని 17 ఏళ్ల ఎడ్వర్డో కాడెనా సెర్ అనే యువకుడు మీడియాకు చెప్పారు.
ప్రమాదానికి సంబంధించిన ఫుటేజీలో అనేక కోచ్‌లు పట్టాలు తప్పి, పెద్ద మొత్తంలో శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉండటం కనిపిస్తుంది.
ప్రమాదం ధాటికి ఒక కోచ్ వెనుక భాగం ముక్కలైపోయినట్లు మొబైల్ ఫోన్లో తీసిన ఒక వీడియోలో కనిపిస్తుంది. నుజ్జునుజ్జు అయిన కోచ్‌ల శిథిలాల మధ్య కొంతమంది నిలబడి ఉన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఆగి ఉన్న ఇర్యో రైలును హైస్పీడ్ రైలు వెనుక నుంచి ఢీకొట్టిందా అనే విషయాన్ని ఇప్పటి వరకు నిర్ధరించలేకపోయామని అధికారులు తెలిపారు.
ప్రమాదానికి సంబంధించి అధికారిక వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
అయితే పట్టాలలో తలెత్తిన సమస్య కారణంగా ఒక రైలు నిలిచిపోగా, వెనుక నుంచి వచ్చిన హైస్పీడ్ రైలు దానిని ఢీకొట్టినట్లు వార్తా కథనాలు సూచిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Javier SORIANO / AFP via Getty Images
ఆపరేషన్లను వాయిదా వేసిన ఆసుపత్రులు
స్పానిష్ వార్తా సంస్థ ఈఎఫ్ఎఫ్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ప్రమాదం తర్వాత పెరుగుతున్న క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు వీలుగా టోలెడో, సియుడాడ్ రియల్, అల్కాజర్ డి శాన్ జువాన్లోని ఆసుపత్రులు షెడ్యూల్ చేసిన ఆపరేషన్లను వాయిదా వేశాయి.
ప్రమాదం జరిగిన తర్వాత వైద్య అవసరాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంటూ, మాడ్రిడ్ రక్త మార్పిడి కేంద్రం రక్తదానాల కోసం "ఎమర్జెన్సీ కాల్" జారీ చేసింది.
స్పానిష్ మీడియా కథనాల ప్రకారం, టోలెడో బ్లడ్ బ్యాంక్ కూడా రక్తదానాల కోసం విజ్ఞప్తి చేసింది.
బీబీసీ కరస్పాండెంట్లు థామస్ కోప్‌ల్యాండ్, మార్లిన్ థామస్, షెర్రీ రైడర్లు అందించిన సమాచారం ప్రకారం, పెద్ద సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు, అంబులెన్స్‌లను కూడా రంగంలోకి దించారు. ప్రమాద స్థలంలో పెద్ద సంఖ్యలో అత్యవసర వాహనాలు, సహాయక బృందాలు ఉన్నట్లు డ్రోన్ చిత్రాలు చూపించాయి.

ఫొటో సోర్స్, Javier SORIANO / AFP via Getty Images
కార్యక్రమాలను రద్దు చేసుకున్న రాజకీయ పార్టీలు
బీబీసీ విలేఖరి సెర్గి ఫోర్కాడా ఫ్రైక్సాస్ అందించిన సమాచారం ప్రకారం ఆ ప్రమాదం తర్వాత స్పెయిన్‌లోని చాలా రాజకీయ పార్టీలు బుధవారం జరగాల్సిన తమ ఎన్నికల కార్యక్రమాలను రద్దు చేసుకున్నాయి.
ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్, చట్టసభ సభ్యులు తమ కార్యక్రమాలను రద్దు చేసుకుని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ప్రతిపక్ష కన్జర్వేటివ్ నాయకుడు అల్బెర్టో నూనెజ్ ఫెయిక్సోతోపాటు నవంబర్ 29న జరగనున్న ఎన్నికలలో పాల్గొంటున్న చాలామంది అభ్యర్థులు కూడా తమ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.
అయితే మితవాద పార్టీ వోక్స్ పార్టీ మాత్రం భిన్నంగా స్పందించింది.
దేశంలో రైల్వేల భద్రతలో లోపాలను ఇలాంటి సంతాప వ్యవహారాలతో కప్పిపుచ్చలేరని, అలాంటి ప్రయత్నాలకు తమ పార్టీ సహకరించదని ఆ పార్టీ నాయకుడు శాంటియాగో అబాస్కల్ అన్నారు.

ఫొటో సోర్స్, EPA
గతంలోనూ రైలు ప్రమాదాలు
ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ సోషల్ మీడియాలో సంతాప సందేశం పంపుతూ.. గాయపడిన వారికి, వారి కుటుంబాలకు సానుభూతిని మద్దతును అందించారు.
ఈ ఏడాది జనవరిలో కూడా ఒకే లైన్‌పై వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 46 మంది మరణించారు.
తాజాగా జరిగిన భయానక రైలు ప్రమాదంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ప్రధాని పెడ్రో సాంచెజ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























