ఒడిశాలో ‘అర్నబ్’ వర్షాలకు విరిగిపడుతున్న కొండచరియలు

ఫొటో సోర్స్, ANI
అర్నబ్ తుపాను కారణంగా కురిసిన వర్షాలకు ఒడిశాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీని వల్ల రహదార్లు దెబ్బతింటున్నాయి. రోడ్లపై ప్రయాణించేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులుసూచిస్తున్నారు.
అర్నబ్ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల మోహన సమీపంలోని తప్తపాని ఘాట్ వద్ద గజపతి-గంజాం సరిహద్దులో పెద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.
భారీగా మట్టి, బండరాళ్లు జారిపడి రహదారిని మూసేశాయి. అదే సమయంలో భారీగా ప్రవహిస్తున్న వరద నీరుతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయింది.
మోహన నుంచి బరంపురం వైపు ఓ రోగిని తీసుకువెళ్తున్న అంబులెన్స్ కూడా వెనుదిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రహదారిపై కొండచరియలు విరిగిపడటాన్ని, వరద ప్రవాహాన్ని చూసిన అంబులెన్స్ సిబ్బంది ముందుకెళ్తే ప్రమాదమని గ్రహించి వెనక్కి వెళ్లిపోయారు.
బరంపురం పట్టణాన్ని దక్షిణ ఒడిశాతో కలిపే కీలకమైన జాతీయ రహదారి 326 తీవ్రంగా దెబ్బతింది.
గజపతి జిల్లాలోని మోహనలో లెడ్‌బంద్ వద్ద వరద ప్రవహానికి కొంత భాగం కొట్టుకుపోయింది.
దీనివల్ల కూడా రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అక్కడి నుంచి ముందుకెళ్లే సాహసం చేయలేక కొందరు వెనుదిరిగితే, మరికొందరు సమీపంలో ఆగిపోయారు.
కొంధమాల్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీనివల్ల కుహబాడ గ్రామం, కళింగ ఘాట్ ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. కళింగ ఘాట్‌లోని దంగాడి కొండలో కొంత భాగం మూడోసారి కూలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇలాంటి ప్రాంతాల మీదుగా వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
