మీరు ఈ వెబ్‌సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్‌సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.

నన్ను ప్రధాన వెబ్‌సైట్‌కు తీసుకెళ్లండి

లైవ్ , ‘ఇరాన్‌ వార్’ మా ఓటమికి కారణమైనా, అవసరమైతే మళ్లీ యుద్ధానికి సిద్ధమే: డోనల్డ్ ట్రంప్

ఇరాన్‌తో యుద్ధం కారణంగానే మధ్యంతర ఎన్నికల్లో తన రిపబ్లికన్ పార్టీ ఓటమి పాలైందన్న వాదనలో చాలా వరకు నిజం ఉందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు. అయితే, అవసరమైతే మళ్లీ యుద్ధానికి సిద్ధమేనని స్పష్టం చేశారు

సారాంశం

  • ఇరాన్‌తో యుద్ధం కారణంగానే మధ్యంతర ఎన్నికల్లో తన రిపబ్లికన్ పార్టీ ఓటమి పాలైందన్న వాదనలో చాలా వరకు నిజం ఉందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.
  • రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్‌ను పదవి నుంచి తొలగించే ఆలోచన లేదని ట్రంప్ స్పష్టం చేశారు.
  • హెగ్‌సెత్ తన బాధ్యతలను చాలా బాగా నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు.
  • విధ్వంసకరంగా వ్యవహరించనంత వరకు డెమొక్రాట్లతో కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని అధ్యక్షుడు తెలిపారు.
  • ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు పడిపోయాయి, రెండు నెలల కనిష్ఠ స్థాయికి చేరాయి.
  • తెలంగాణలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి సమీపంలో బేతుపల్లి చెరువులో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్ఎఫ్ బోట్లు గల్లంతయ్యాయి.
  • గల్లంతైన ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బందిలో అయిదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు.
  • మొత్తం పదిమంది ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బందితోపాటు స్థానికుడు ఒకరు గల్లంతు కాగా.. అయిదుగురు సురక్షితంగా బయటపడినట్లు కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ యాదవ్ 'బీబీసీ'కి చెప్పారు.

లైవ్ కవరేజీ

  1. మిడ్‌టర్మ్‌లో డెమొక్రాట్ల ఆధిక్యం తరువాత తగ్గిన చమురు ధరలు, లాభాలతో ముగిసిన మార్కెట్లు, రాషెల్ క్లన్, ప్రియా పటేల్ - బిజినెస్ రిపోర్టర్స్

    అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల ఆధిక్యం తరువాత స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. మరోవైపు చమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. చమురు ధరలు బ్యారల్‌కు 100 డాలర్ల కంటే తగ్గాయి.

    బుధవారం బ్రెంట్ క్రూడ్ ధరలు 8 శాతం తగ్గి బ్యారల్ 95 డాలర్లకు చేరింది. గత రెండు నెలల కాలంలో ఇదే అంత్యంత కనిష్ఠం.

    మరోవైపు ఈ ఎన్నికల ఫలితాలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. రిపబ్లికన్ల ఓటమికి ఇరాన్‌తో యుద్ధం కారణమని వాన్స్ వ్యాఖ్యానించారు.

    యుద్ధాన్ని ముగించాలని, కాస్ట్ ఆఫ్ లివింగ్‌పై దృష్టి పెట్టాలని, ఇజ్రాయెల్‌తో అమెరికా సంబంధాలను పునరాలోచించాలని వాన్స్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లు సానుకూలంగా స్వీకరించాయి.

    ఎన్నికల తర్వాతి రాజకీయ పరిస్థితులు ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరగకుండా ఆపుతాయనే అంచనాలు పెరిగాయి.

    దీంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో కీలకమైన యుఎస్ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి.

    డో జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 3 శాతం పెరిగింది. ఎస్ అండ్ పి 500 సూచీ 1.6 శాతం లాభపడగా, టెక్ ఆధారిత నాస్‌డాక్ 1.4% పెరిగింది.

  2. చెరువులో చిక్కుకున్నవారిని కాపాడేందుకు వెళ్లిన ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతు, అయిదుగురు సురక్షితంగా ఒడ్డుకు..

    ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో ఎస్‌డీఆర్ఎఫ్ బోట్లు ప్రమాదానికి గురైన ఘటనలో అయిదుగురు తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్‌డీఆర్ఎఫ్) సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయాన్ని ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ యాదవ్ 'బీబీసీ'కి ధ్రువీకరించారు.

    మొత్తం పదిమంది ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బందితోపాటు స్థానికుడు ఒకరు గల్లంతు కాగా, తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అయిదుగురు సురక్షితంగా బయటపడినట్లు సబ్ కలెక్టర్ బీబీసీతో చెప్పారు.

    గల్లంతైనవారిలో మరో ఆరుగురు కూడా సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం అందినట్లు ఆయన చెప్పారు.

    కాగా, గల్లంతైన సిబ్బందిని చెరువు నుంచి సురక్షితంగా బయటకు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

    రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అధికారులు గాలింపు చర్యలు కొనసాగించారు. నిరంతరాయంగా సహాయక చర్యలు చేపడుతున్నామని, అందరూ సురక్షితంగానే ఉన్నారని అజయ్ కుమార్ యాదవ్ బీబీసీకి తెలిపారు.

  3. ఇరాన్‌తో యుద్ధం మా ఓటమికి కారణమైనా, అవసరమైతే మళ్లీ యుద్ధానికి సిద్ధమే: డోనల్డ్ ట్రంప్

    ఇరాన్‌తో యుద్ధం కారణంగానే మధ్యంతర ఎన్నికల్లో తన రిపబ్లికన్ పార్టీ ఓటమి పాలైందన్న వాదనలో చాలా వరకు నిజం ఉందని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

    అయితే, అవసరమైతే మళ్లీ యుద్ధానికి సిద్ధమేనని స్పష్టం చేశారు.

    మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్‌లోని ఉభయ సభల్లోనూ మెజారిటీ కోల్పోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత ట్రంప్ తొలిసారిగా మీడియాతో మాట్లాడారు.

    ఇరాన్‌తో యుద్ధం కారణంగానే రిపబ్లికన్లు భారీగా ఓటమి పాలయ్యారన్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యల్లో చాలా వరకు నిజం ఉందని ట్రంప్ అన్నారు.

    అయితే, యుద్ధం కంటే దాని ప్రభావంతో పెరిగిన ఇంధన ధరలే ఓటమికి కారణమని పేర్కొన్నారు.

    రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్‌ను పదవి నుంచి తొలగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

    హెగ్‌సెత్ తన బాధ్యతలను చాలా బాగా నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు.

    విధ్వంసకరంగా వ్యవహరించనంత వరకు డెమొక్రాట్లతో కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని ట్రంప్ తెలిపారు.

    అయితే, వారు తీసుకొచ్చే బిల్లులను అడ్డుకునేందుకు తనకు వీటో అధికారం ఉందని చెప్పారు.

  4. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన అప్‌డేట్స్ మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి