మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
చెరువులో చిక్కుకున్నవారిని కాపాడేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతు, అయిదుగురు సురక్షితంగా ఒడ్డుకు..
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో ఎస్డీఆర్ఎఫ్ బోట్లు ప్రమాదానికి గురయ్యాయి.
ఈ ప్రమాదంలో అయిదుగురు తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్) సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
ఈ విషయాన్ని ఖమ్మం జిల్లా కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ యాదవ్ 'బీబీసీ'కి ధ్రువీకరించారు.
మొత్తం పదిమంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితోపాటు స్థానికుడు ఒకరు గల్లంతు కాగా, తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అయిదుగురు సురక్షితంగా బయటపడినట్లు సబ్ కలెక్టర్ బీబీసీతో చెప్పారు.
గల్లంతైనవారిలో మరో ఆరుగురు కూడా సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం అందినట్లు ఆయన చెప్పారు.
కాగా, గల్లంతైన సిబ్బందిని చెరువు నుంచి సురక్షితంగా బయటకు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అధికారులు గాలింపు చర్యలు కొనసాగించారు.
నిరంతరాయంగా సహాయక చర్యలు చేపడుతున్నామని, అందరూ సురక్షితంగానే ఉన్నారని అజయ్ కుమార్ యాదవ్ బీబీసీకి తెలిపారు.
'నీటి ఉద్ధృతి, గాలుల ధాటికి'
ఈ ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. భారీ వర్షాలతో నీటితో నిండిన చెరువులో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ బోట్లు ప్రమాదానికి గురయ్యాయి.
'బుధవారం సాయంత్రం సుమారు 7 గంటల తర్వాత బేతుపల్లి చెరువులో ఎనిమిది మంది మత్స్యకారులు చిక్కుకున్నట్లు సమాచారం అందింది. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించి ముందుగా ముగ్గురిని రక్షించారు. మిగిలిన అయిదుగురిని కాపాడేందుకు వెళ్తుండగా వారి బోట్లు ప్రమాదానికి గురయ్యాయి' అని ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యాలయం బీబీసీకి తెలిపింది.
చెరువులో చిక్కుకున్న మత్స్యకారులను ఒడ్డుకు చేర్చేందుకు 10 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెండు బోట్లలో వెళ్లారు. నీటి ఉద్ధృతి, బలమైన గాలుల కారణంగా ఆ రెండు బోట్లు ఒక్కసారిగా బోల్తా పడ్డాయని మంత్రి కార్యాలయం వెల్లడించింది. దీంతో వాటిలో ఉన్న సిబ్బంది గల్లంతయ్యారు.
'సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు, సహాయక బృందాలు, గజ ఈతగాళ్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుళ్ల కోసం చెరువులో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు' అని మంత్రి కార్యాలయం తెలిపింది.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారని ఆయన కార్యాలయం వెల్లడించింది. గల్లంతైన వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపింది.
మరోవైపు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిస్థితిని సమీక్షించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
‘మురసు’ ప్రభావంతో
మురసు తుపాను ప్రభావంతో సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల్లో అనేక వాగులు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండిపోయాయి. దీంతో పలు చోట్ల రహదారులు కొట్టుకుపోవడం, గండ్లు పడటం, అలుగులు పారడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఈ పరిస్థితుల కారణంగా ఘటనా స్థలానికి చేరుకోవడంలోనూ అధికారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం కూడా సహాయక చర్యలకు ఆటంకంగా మారింది.
ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అంతా సుశిక్షితులని, వారికి లైఫ్ జాకెట్లు కూడా ఉండటంతో క్షేమంగా బయటపడతారని ఆశిస్తున్నట్లు మంత్రి కార్యాలయం తెలిపింది.
సాధారణంగా ఎస్డీఆర్ఎఫ్లో పోలీసు కానిస్టేబుళ్లు ఎక్కువగా ఉంటారు. తాజా ఘటనలో అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)