సీజేపీ నిరసనలకు కాంగ్రెస్ దూరం.. ‘ఇండియా’ బ్లాక్‌ ర్యాలీకి సీజేపీ దూరం.. డిమాండ్ ఒక్కటే అయినా దారులెందుకు వేరయ్యాయి?

    • రచయిత, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ 'ఇండియా' బ్లాక్‌ నవంబర్ 1న దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ర్యాలీ చేపట్టింది.

ఈ ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు, సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ జనతా దల్, తృణముల్ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫెరెన్స్, వామపక్షాలు సహా చాలా పార్టీలు పాల్గొన్నాయి.

ర్యాలీని విజయవంతం చేయడంలో కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ కీలక పాత్ర పోషించాయి.

ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఓటు చోరీ జరుగుతుందనే ఆరోపణల వేళ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ ర్యాలీ చేపట్టారు.

గత ఏడాది సర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, సీజేపీని లీడ్ చేస్తున్న అభిజిత్ దీప్కే మాత్రం జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేశారు.

జ్ఞానేశ్ కుమార్‌తో 48 గంటల్లో రాజీనామా చేయించి ఎన్నికల కమిషన్‌ను ప్రక్షాళన చేయాలని సెప్టెంబర్ 24న సీజేపీ క్యాంపెయిన్ ప్రారంభించింది.

ముంబయిలో అక్టోబర్ 2న సీజేపీ భారీ ప్రదర్శన చేపట్టింది. అదే టైంలో దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా నిరసనకు విద్యార్థి సంఘాలు యత్నించాయి.

ఇలా జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం నిరసనలు ఉద్ధృతమయ్యాయి. అక్టోబర్ 10న దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ప్రదర్శనకు సీజేపీ పిలుపునిచ్చింది. నవంబర్ 1 ర్యాలీ కంటే ముందే రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ చాలా ధర్నాలు చేపట్టింది.

'ఇండియా' కూటమి ర్యాలీకి మద్దతు ప్రకటించిన సీజేపీ

ఇదే డిమాండ్‌తో రామ్‌లీలా మైదానంలో 'ఇండియా' కూటమి నిర్వహించిన ర్యాలీకి సీజేపీ నాయకత్వం దూరంగా ఉంది.

'ఇండియా' కూటమి చేపట్టే ర్యాలీకి తమ మద్దతు ఉంటుందని అక్టోబర్ 28న సీజేపీ ప్రకటించిన తర్వాత కూడా ఆదివారం నాటి కార్యక్రమంలో కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఎవరూ పాల్గొనలేదు.

"జ్ఞానూ తప్పకుండా వెళ్లిపోవాల్సిందే. నవంబర్ 1న 'ఇండియా' కూటమి నిర్వహించే ర్యాలీకి సీజేపీ మద్దతు ఉంటుంది. దేశమే సుప్రీం" అని అక్టోబర్ 28న అభిజిత్ దీప్కే ఎక్స్‌లో పోస్టు చేశారు.

అయితే ఆదివారం మాత్రం దీప్కే మరో ట్వీట్ చేశారు. "మేం ర్యాలీకి మద్దతు ఇస్తున్నాం, కానీ అందులో పాల్గొనడం లేదు" అని పేర్కొన్నారు.

ర్యాలీ నిర్వహిస్తున్న అంశానికి మాత్రమే మద్దతు ఇస్తున్నామని దీప్కే చెప్పారు. కానీ స్వతంత్ర అస్తిత్వాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు.

"మేం ఒకటిగానే ఉన్నాం, కానీ సీజేపీ స్వతంత్ర, తటస్థ సంస్థ, దాన్ని అలానే ఉంచాలని భావిస్తున్నాం" అని దీప్కే చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీతో సమావేశం అనంతరం, " ఓటు చోరీకి వ్యతిరేకంగా ఎవరు పోరాడినా తమ మద్దతు ఉంటుంది" అని దీప్కే చెప్పారు.

రామ్‌లీలా మైదాన్‌లో చాలామంది సీజేపీ కార్యకర్తలు కనిపించారు, కానీ వేదికపై ముఖ్యనేతలు ఎవరూ కనిపించలేదు, ఎలాంటి ప్రకటనలు కూడా చేయలేదు.

"నేను సీజేపీతో కలిసి పనిచేస్తున్నా, ఈరోజు రామ్‌లీలా మైదాన్‌కు వచ్చా. నాలాంటి మరికొంతమంది కార్యకర్తలను ఇక్కడ చూడవచ్చు. నిజానికి, అందరం పోరాడే సమస్య ఒక్కటే" అని సీజేపీ నిరసనల్లో పాల్గొన్న ఒక యువతి బీబీసీ న్యూస్ హిందీతో చెప్పారు.

"వ్యవస్థలో మార్పును సీజేపీ కోరుకుంటోంది, అందుకే నా లాంటి యువత సీజేపీతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ర్యాలీలో పాల్గొనడం అంటే, ఏదో ఒక రాజకీయ పార్టీకి మద్దతు తెలపడం అని అర్థం కాదని నమ్ముతున్నా" అని ఆమె అన్నారు.

"సీజేపీకి సంబంధించిన వారు చాలామంది ఈ ర్యాలీకి రాలేదు. అయితే, కొంతమంది యువకులు మాత్రం వచ్చారు; వారు ఈ నిరసనలో భాగస్వాములవుతున్నారు" అని ఆ యువతితోపాటు వచ్చిన వ్యక్తి బీబీసీ న్యూస్ హిందీతో అన్నారు,

"సీజేపీ ఏమాత్రం మందకొడిగా లేదు. చాలామంది సీజేపీ కార్యకర్తలు, 'జెన్-జి' నిరసనకారులు రామ్‌లీలా మైదాన్‌కు చేరుకున్నారు. మా అందరి లక్ష్యం ఒక్కటే, మేమంతా కలిసి ఉన్నాం. సీజేపీ అనుసరించబోయే వ్యూహం ఏంటో త్వరలోనే బయటపడుతుంది, అలాగే త్వరలోనే తదుపరి కార్యాచరణపై పిలుపునిస్తాం." అని రామ్‌లీలా మైదాన్‌లో సీజేపీ కార్యకర్త మహమ్మద్ జునైద్ అన్నారు.

అయితే, విద్యార్థి సంఘం 'ఐసా' అధ్యక్షురాలు నేహా బోరా ఈ వేదికపై కనిపించి మాట్లాడారు. ఉండి, ప్రసంగం కూడా చేశారు.

"దేశ ప్రజలను తమ పౌరసత్వాన్ని నిరూపించుకోమని అడగడానికి మీరు ఎవరు?" అని నేహా బోరా ప్రశ్నించారు.

రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన ర్యాలీలో వివిధ విద్యార్థి సంఘాలకు చెందిన కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో కనిపించారు. ఇలాంటి సమయంలో 'ఇండియా' కూటమి ర్యాలీకి దూరంగా ఉండటం అనేది సీజేపీ అనుసరిస్తున్న వ్యూహమా లేక అనివార్యమైన పరిస్థితియా అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఏ రాజకీయ వేదికపైనా కనిపించడానికి సీజేపీ ఇష్టపడటం లేదా?

ఈ ర్యాలీకి సీజేపీ దూరంగా ఉండటం అనేది వ్యూహం కావచ్చు లేదా అనివార్యత కూడా కావచ్చు అని సీనియర్ పాత్రికేయుడు విజయ్ త్రివేది అభిప్రాయపడ్డారు.

"రాజకీయంగా కనిపించకూడదనేది వారి వ్యూహంలో భాగమని భావిస్తున్నాను. దీన్ని మీరు అనివార్యత అనవచ్చు లేదా వ్యూహం అనవచ్చు; ఇది రెండూ కూడా కావచ్చు" అని విజయ్ త్రివేది అన్నారు,

సీజేపీ తన ప్రత్యేక అస్తిత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో అది పాల్గొనడం వల్ల, ఒక అరాజకీయ ఉద్యమం ఇప్పుడు రాజకీయ ఉద్యమంగా మారుతోందనే విమర్శలకు దారితీసిందని అన్నారు.

"వారు మొదట ఉద్యమంలో చేరి, ఎన్నికల సంఘం గురించి మాట్లాడినప్పుడు, అది రాజకీయేతర ఉద్యమమని పేర్కొనడంపై చాలా విమర్శలు వచ్చాయి. అంతకుముందు రాజకీయాల గురించి మాట్లాడలేదు, కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. బహుశా, ఆ విమర్శను తప్పించుకోవడానికి అలా చేసి ఉండవచ్చు" అని త్రివేది అన్నారు,

అయితే, సీజేపీ ఏదో ఒక రకమైన ఒత్తిడి ఉండే అవకాశం లేకపోలేదని కూడా త్రివేది భావిస్తున్నారు.

"ప్రభుత్వం నుంచి కొంత ఒత్తిడి ఉండే అవకాశం కూడా ఉంది, అందుకే వారు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు" అని ఆయన చెప్పారు.

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా సీజేపీ చేపట్టిన ఉద్యమానికి ఇంకా పెద్దఎత్తున ప్రజా మద్దతు లభించకపోవడమే అతిపెద్ద సవాలు అని త్రివేది అభిప్రాయపడ్డారు.

"ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, 'ఇండియా' కూటమి చేపట్టిన ఉద్యమంలో కూడా సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే, ఈ నిరసన రాజకీయ రంగు పులుముకుంది. ఆదివారం జరిగిన ర్యాలీలో రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలే ఎక్కువగా కనిపించారు. సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో లేరు" అని అన్నారు,

ప్రస్తుత పరిస్థితుల్లో ముందుకు సాగాలంటే, సీజేపీకి కేవలం కొన్ని సమస్యలే కాకుండా, సంస్థకు, ప్రజలకు మధ్య సంబంధం కూడా అవసరమని విజయ్ త్రివేది భావిస్తున్నారు.

"ప్రజలను ఏకం చేయడానికి ఒక సంస్థ, ఒక వ్యవస్థ అవసరం. కేవలం ఒక అంశం మాత్రమే సరిపోదు. కాంగ్రెస్‌కు ఒక వ్యవస్థ ఉంది. వారు ఈ అంశంపై ప్రజలను సమీకరించారు. ఇక సీజేపీ విషయానికి వస్తే, వారు ఈ అంశంపై ప్రజలను సమీకరించగలరో లేదో అన్నది స్పష్టంగా లేదు" అని త్రివేది చెప్పారు.

జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ఎంత దూకుడుగా వ్యవహరించాలే అంశంపై నిర్ణయం తీసుకోవడం సీజేపీకి అంత సులభం కాదని త్రివేది భావిస్తున్నారు.

"ఆయనకు ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే, యువత వారితో కలిసి ఉన్నారు, కానీ ఈ అంశం యువతను అంతగా ఆకర్షించడం లేదు. ఇప్పుడు ఆయన ముందుకు వెళ్తే తనకు ఎంతవరకు మద్దతు లభిస్తుందోనని అయోమయంలో పడవచ్చు" అని అంటున్నారు.

సీజేపీ దూరంగా ఉండటానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, ప్రస్తుతం అది ఏ రాజకీయ పార్టీతో లేదా కూటమితోనూ సంబంధం కలిగి ఉండాలని కోరుకోవడం లేదని సీనియర్ జర్నలిస్ట్ ఆదేశ్ రావల్ అభిప్రాయపడ్డారు.

"ప్రస్తుతానికి ఆయన ఏ రాజకీయ పార్టీతోనూ కలిసి కనిపించాలని అనుకోవడం లేదని నా అభిప్రాయం. భవిష్యత్తులో ఏదైనా పెద్ద ఉద్యమానికి దారితీసే పరిస్థితి ఏర్పడితే, అప్పుడు ఆయన ఇప్పటికే ఒక పక్షం వైపు చేరిపోయారని విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది" అని రావల్ అన్నారు,

సీజేపీని తమతో కలుపుకునేందుకు 'ఇండియా' కూటమి తరపున ఒక ప్రయత్నం జరిగిందన్నారు రావల్.

రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతిపక్షాల సమావేశం జరిగినప్పుడు, అలాగే ఒక టీ చర్చా సందర్భంలో అభిజిత్ దీప్కేను సంప్రదించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, ఆ సమయంలో దీప్కే అరెస్టవ్వడం, ఇతర పరిణామాల కారణంగా, ఈ చర్చలు ముందుకు సాగలేదన్నారు.

"ఇది వేర్వేరు నిరసనలు కాదని, ఒకటేనని ప్రతిపక్షాలు పదేపదే చెబుతున్నాయి. తాము వేర్వేరుగా నిరసన తెలుపుతున్నట్లు కనిపించకూడదని భావిస్తున్నాయి" అని రావల్ అన్నారు

ప్రతిపక్షాలు ఈసారి కూడా సీజేపీని తమతో కలుపుకొని వెళ్లాలని ప్రయత్నించాయి. మద్దతు కోరాయి. అయితే, సీజేపీ తన స్వతంత్ర అస్తిత్వాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకుందని ఆయన తెలిపారు.

"మద్దతు ఇవ్వడం ఒక ఎత్తు, వేదికపై కలిసి కూర్చోవడం మరొక ఎత్తు. భవిష్యత్తులో చేపట్టబోయే ఆందోళనకర రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని, 'ఇండియా' కూటమితో కలిసి పనిచేసేందుకు సీజేపీ సంకోచిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే, సీజేపీ అనుసరిస్తున్న ఈ వ్యూహం సరైనదే" అని రావల్ పేర్కొన్నారు.

సీజేపీ ఆందోళనలు కొనసాగుతాయా?

దీపావళి తర్వాత మళ్లీ నిరసనల కొనసాగించే అంశంపై సన్నాహాలు చేస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు.

ఈ నేపథ్యంలో, జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ చేపట్టే తన కార్యకలాపాలను సీజేపీ కొనసాగిస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఇటువంటి పరిస్థితుల్లో, జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ సీజేపీ తన కార్యకలాపాలను కొనసాగిస్తుందా అన్నది ప్రశ్న?

ఈ విషయంలో తానే ముందుండి నడిపించాలని సీజేపీ భావిస్తోందని విజయ్ త్రివేదీ అభిప్రాయపడుతున్నారు, అయితే దీనికి ఎంతవరకు మద్దతు లభిస్తుందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

అదే సమయంలో, రాజకీయాలు అనేవి అవకాశాల క్రీడ అని, ఏ ఉద్యమం భవిష్యత్తును కూడా ముందుగానే నిర్ణయించలేమని ఆదేశ్ రావల్ పేర్కొన్నారు.

జూలైలో జరిగిన పేపర్ లీక్ ఘటనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను రావల్ ఉదాహరణగా పేర్కొన్నారు. ఆ నిరసనల్లో యువత, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం వల్ల ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిందని చెప్పారు.

ఓట్ల దొంగతనానికి సంబంధించిన సమస్య ప్రతి ఇంటితోనూ ముడిపడి ఉంది, కానీ దీనిపై అటువంటి విస్తృత ప్రజా భాగస్వామ్యం ఇంకా కనిపించలేదన్నారు.

యువతరానికి తమ సందేశాన్ని చేరవేయడంలో సీజేపీ కీలక పాత్ర పోషించిందని రావల్ నమ్ముతున్నారు. ఆయన దృష్టిలో తన ఉద్యమాన్ని కొనసాగించే సామర్థ్యం సీజేపీకి ఇంకా ఉంది.

సీజేపీ దూరంగా ఉండటం దేన్ని సూచిస్తోంది?

'ఇండియా' బ్లాక్ ర్యాలీ నుంచి సీజేపీ గైర్హాజరును కేవలం గైర్హాజరుగా మాత్రమే చూడటం ఈ పరిణామాన్ని అసంపూర్ణంగా అర్థం చేసుకోవడమే అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

సీజేపీ ఒకవైపు జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేయడంతోపాటు 'ఇండియా' కూటమిర్యాలీకి మద్దతు తెలిపింది. మరోవైపు, వేదికపై కనిపించకుండా దూరంగా ఉంది.

సీజేపీ తన గుర్తింపు విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోందని విజయ్ త్రివేది, ఆదేశ్ రావల్ ఇద్దరూ అంగీకరిస్తున్నారు. అది ఏ రాజకీయ పార్టీ లేదా కూటమితో సంబంధం లేని ఒక క్రియాశీలక సంస్థగా ఎదగాలని కోరుకుంటోంది.

అయితే, ఈ వ్యూహం ఒక సవాలును కూడా ఎదుర్కొంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

"ఒక ఉద్యమం దీర్ఘకాలంలో ప్రభావవంతంగా కొనసాగాలంటే, కేవలం ఏదో ఒక అంశాన్ని లేవనెత్తడం లేదా సోషల్ మీడియాలో చర్చించుకోవడం సరిపోదు. దానికి విస్తృత ప్రజా మద్దతు, వ్యవస్థాగత నిర్మాణం, నిరంతరం క్రియాశీలంగా ఉండే సామర్థ్యం కూడా అవసరం" అని త్రివేది అంటారు.

'ఇండియా' కూటమి నిర్వహించిన ర్యాలీలో రాజకీయ పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, అయితే సామాన్య ప్రజల భాగస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)