మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
బంగ్లాదేశ్‌లో మరోసారి రోడ్డెక్కిన ప్రజలు, ఈ ఆందోళనలకు కారణమేంటి?
బంగ్లాదేశ్‌లో బట్టల ఫ్యాక్టరీల్లో పనిచేసే సుమారు 10 లక్షల మంది కార్మికులు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
దీనివల్ల దేశంలోని 529 ఫ్యాక్టరీల్లో పనులు పూర్తిగా ఆగిపోయాయి. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ పెద్ద సంఖ్యలో కార్మికులు రోడ్లపైకి వచ్చారు.
పరిస్థితి ఇలాగే ఉంటే సోమవారం కూడా బట్టల ఉత్పత్తి ఆగిపోతుందని ఫ్యాక్టరీల యజమానులు భయపడుతున్నారు. ఈ గొడవలు రాజధాని ఢాకా చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక ప్రాంతాల్లో జరుగుతున్నాయి.
ఆదివారం జరిగిన నిరసనల్లో కొందరు వాహనాలను ధ్వంసం చేశారు. రోడ్లను దిగ్బంధించారు. పోలీసులతో కూడా గొడవపడ్డారు. దాంతో పోలీసులు వారిని అదుపు చేయడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు.
బంగ్లాదేశ్‌లో కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. 2024లో విద్యార్థుల ఉద్యమం వల్ల అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తారిక్ రెహమాన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా ఆందోళనలు తగ్గలేదు.
కార్మికుల డిమాండ్ ఏంటి?
ఆందోళన చేస్తున్న కార్మికులు తమ కనీస నెల జీతాన్ని 30,000 టాకాలకు (రూ. 21వేలు) పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం వారికి కేవలం 12,500 టాకాలు (రూ. 8.8 వేలు) మాత్రమే వస్తోంది.
జీతాన్ని రెట్టింపు కంటే ఎక్కువ చేయాలని వారు కోరుతున్నారు.
బియ్యం, పప్పులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు, బస్సు చార్జీలు, మందుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల తాము బ్రతకడమే కష్టంగా మారిందని కార్మికులు చెబుతున్నారు.
కార్మికుల డిమాండ్‌ను పరిశీలించడానికి దేశ కార్మిక మంత్రి ఆరిఫుల్ హక్ చౌధరి ఆదివారం వేజ్ బోర్డు ఏర్పాటు చేశారు.
ఆందోళనలను విరమించుకుని పనుల్లోకి వెళ్లాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
అయితే ప్రభుత్వం కమిటీ వేసినా తాము నమ్మమని జీతాలు పెంచుతూ అధికారికంగా ప్రకటన వచ్చే వరకు తమ పోరాటం ఆపేది లేదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వం ఏమంది?
ఈ హింసపై ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ ఆదివారం రాత్రి మంత్రులు, అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఫ్యాక్టరీల్లో పనులు ఆగకుండా చూడాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు.
గొడవలు చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని హోంమంత్రి సలావుద్దీన్ అహ్మద్ చెప్పారు.
నిరసనల పేరుతో పోలీసులపై దాడులు చేశారని, వాహనాలు తగలబెట్టారని, ఒక పెద్ద గిడ్డంగిని ధ్వంసం చేశారని ఆయన పేర్కొన్నారు.
"కార్మికుల ముసుగులో కొందరు బయటి వ్యక్తులు ఈ ఉద్యమంలోకి దూరి గొడవలు సృష్టిస్తున్నారు" అని హోంమంత్రి ఆరోపించారు.
బంగ్లాదేశ్ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి సరిహద్దు అవతలి దేశం నుంచి కొందరు రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు.
పాత ప్రభుత్వానికి (అవామీ లీగ్‌కు) చెందిన వారే కావాలని డిసెంబర్ నెలను దృష్టిలో పెట్టుకుని ఈ అలజడులు సృష్టిస్తున్నారని కార్మిక మంత్రి ఆరిఫుల్ హక్ చౌధరి ఆరోపించారు.
2025 డిసెంబర్లో విద్యార్థి నాయకుడి హత్య జరిగినప్పటి నుండి బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నాయి.
ఇండియాలో తలదాచుకున్న మాజీ ప్రధాని షేక్ హసీనా ఈ డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తారనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ గొడవలు చేస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది.
ఇవి నిజంగా కార్మికులు చేస్తున్న గొడవలేనా?
ఈ ఆందోళనలు అక్టోబర్ 31న అకస్మాత్తుగా ప్రారంభమయ్యాయి.
సావర్, ఆషూలియా, మిర్పూర్, గాజీపూర్ లాంటి ముఖ్యమైన ప్రాంతాల్లో కార్మికులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు.
మొదట కేవలం 30 ఫ్యాక్టరీలు మూతపడగా ఆదివారానికి ఆ సంఖ్య 500 కి చేరింది.
కార్మికులు ఇంత అకస్మాత్తుగా ఎందుకు తిరగబడ్డారు?
దీని వెనుక కేవలం జీతాల పెంపు డిమాండ్ మాత్రమే ఉందా, లేక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా? అని బంగ్లాదేశ్ మీడియా అనుమానిస్తోంది.
నిషేధిత అవామీ లీగ్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ గొడవల్లో పాల్గొన్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి.
కొందరు విద్యార్థి నాయకులు ఈ ఊరేగింపులకు నాయకత్వం వహిస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
"ఈ ఉద్యమంలో ఉన్నది నిజమైన కార్మికులు కాదు. వారే అయితే సమస్య ఎప్పుడో సర్దుమణిగేది. దీని వెనుక ప్రభుత్వంపై పెద్ద కుట్ర జరుగుతోంది" అని ఫ్యాక్టరీల యజమానుల సంఘం ప్రెసిడెంట్ మహ్మద్ హతేమ్ ఆరోపించారు.
జీతం 30వేల టాకాలు చేయడం సాధ్యమేనా?
కనీస జీతాన్ని 30 వేల టాకాలను చేయడం అస్సలు సాధ్యం కాదని ఫ్యాక్టరీల యజమానులు చెబుతున్నారు.
గత పదేళ్లలో (2013-2023) మూడుసార్లు జీతాలు పెంచామని ఇప్పుడు మళ్లీ ఇంత భారీగా పెంచితే ఫ్యాక్టరీలు నష్టపోయి మూతపడతాయని వాదిస్తున్నారు.
అంత జీతం ఇచ్చే శక్తి తమకు లేదంటున్నారు.
ప్రభుత్వం వేసిన కమిటీ అందరికీ న్యాయం జరిగేలా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)