‘భూమిపైకి క్షిపణిలా దూసుకొచ్చిన విమానం’.. తొమ్మిది మంది మృతి

    • రచయిత, క్రెయిగ్ హోయల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

అమెరికాలోని ఫ్లోరిడాలో ఆదివారం ఓ ప్రైవేట్ జెట్ నివాస ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా రవాణా శాఖ మంత్రి తెలిపారు.

పామ్ బీచ్ కౌంటీలోని సంపన్న ప్రాంతమైన మార్-ఎ-లాగోలో ఉన్న అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రిసార్ట్‌కు సుమారు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రెస్ట్‌హేవెన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

అమెరికా తూర్పు ప్రామాణిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:50 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం రాత్రి 11:20 గంటలకు) విమానం కూలింది.

ప్రమాదానికి సంబంధించిన చిత్రాల్లో నివాస ప్రాంతంలోని రోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడినట్లు కనిపిస్తోంది. అక్కడక్కడా మంటలు కనిపించడంతో పాటు లియర్‌జెట్ 60 విమానానికి చెందిన శకలాలు, కాంక్రీట్ ముక్కలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

టెక్సాస్‌లోని ఆస్టిన్ నుంచి బయలుదేరిన ఈ విమానం బహామాస్‌కు వెళ్లాల్సి ఉందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) ఒక ప్రకటనలో వెల్లడించింది.

అమెరికా మీడియా కథనాలు, విమాన గమనంపై జరిపిన విశ్లేషణల ప్రకారం.. కూలిపోవడానికి ముందు జెట్ విమానం సెకనుకు వందల అడుగుల వేగంతో కిందికి దూసుకొచ్చింది.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ప్రమాద దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే, ఆ వీడియోకు సంబంధించిన వివరాలు ఇంకా ధ్రువీకరించలేదు.

డ్యాష్‌క్యామ్‌లో రికార్డయినట్లుగా కనిపిస్తున్న ఈ దృశ్యాల్లో.. ఓ నివాస ప్రాంతంలోని రోడ్డుపై వాహనాలు వెళ్తుండగా, అకస్మాత్తుగా విమానం నేలవైపు దూసుకొచ్చి కూలడం, ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగడం కనిపిస్తోంది.

'క్షిపణిలా దూసుకొచ్చింది'

"ఆ వీడియో చూస్తే ఒక్కసారిగా ఉలిక్కిపడతాం. క్షిపణిలా కిందికి దూసుకొచ్చింది. భారీ పేలుడు సంభవించి, శకలాలు అన్ని వైపులా ఎగిరిపడ్డాయి" అని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ ప్రమాదం తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.

ప్రమాద సమయంలో విమానంలో ఎవరెవరు ఉన్నారనే వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే, విమానం కూలిన ప్రాంతంలో నేలపై ఉన్నవారిలో ఎవరైనా చనిపోయినట్లు లేదా గాయపడినట్లు ఇప్పటివరకైతే తమకు సమాచారం అందలేదని డిసాంటిస్ చెప్పారు.

ఈ ఘటనను 'భయంకరమైన విషాదం'గా అభివర్ణించిన అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ.. ప్రమాద స్థలానికి సహాయక బృందాన్ని పంపిస్తున్నట్లు తెలిపారు. జాతీయ రవాణా భద్రతా మండలి చేపట్టనున్న దర్యాప్తునకు ఎఫ్ఏఏ బృందం సహకరిస్తుందని వెల్లడించారు.

"ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు, ఆత్మీయుల కోసం ప్రార్థించండి" అని డఫీ కోరారు.

ప్రమాద తీవ్రత దృష్ట్యా పామ్ బీచ్ కౌంటీ అగ్నిమాపక, రక్షణ విభాగం దీన్ని భారీ ప్రాణనష్టం సంభవించిన ఘటనగా ప్రకటించింది.

ట్రంప్ రిసార్ట్‌లోనే ఉన్నారా?

ఆరు వరుసల రహదారిగా ఉన్న మిలిటరీ ట్రయిల్‌పై ఈ ప్రమాదం జరిగిందని పామ్ బీచ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. ఈ రహదారి వెంబడి పలు వ్యాపార సంస్థలు, రెస్టారెంట్లు ఉన్నాయి.

ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని ట్రైలర్ పార్క్ కమ్యూనిటీ నుంచి సుమారు 600 మంది స్థానికులను ఖాళీ చేయిస్తున్నట్లు డిసాంటిస్, స్థానిక అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించారు.

విమానం కూలిన ధాటికి స్థానిక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా నీటి సరఫరా పైపులైన్లు దెబ్బతిన్నాయని, రహదారిని తిరిగి తెరవడానికి కనీసం 30 రోజులు పట్టవచ్చని చెప్పారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నట్లు రిపోర్టులున్నాయి. మీడియా సమావేశం జరుగుతున్న సమయంలోనూ భారీ వర్షం కురిసింది.

ఆదివారం ఉదయం ట్రంప్ మార్-ఎ-లాగో రిసార్ట్‌లోనే ఉన్నారు. ప్రమాదం జరగడానికి సుమారు గంట ముందు సమీపంలోని విమానాశ్రయం నుంచి ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఆయన బయలుదేరారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)