రాప్తాడు: తరగతి గదిలోకి వచ్చి రంపంతో విద్యార్థినిపై దాడి.. అసలేం జరిగింది?

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

అనంతపురం జిల్లా రాప్తాడులోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి జరగడం కలకలం రేపింది. నిందితుడి కోసం గాలిస్తున్నామని అనంతపురం ఎస్పీ జగదీశ్ బీబీసీకి చెప్పారు.

ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తరగతి గదిలో పాఠాలు జరుగుతున్న సమయంలోనే ఓ వ్యక్తి లోపలికి ప్రవేశించి విద్యార్థినిపై దాడికి పాల్పడ్డారు.

ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన తోటి విద్యార్థిని కూడా గాయపడ్డారు. రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది. విద్యార్థిని చికిత్స పొందుతున్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి అనంతపురం కలెక్టర్ ఓ. ఆనంద్ చేరుకుని పరామర్శించారు.

బాలికకు మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో జనరల్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్‌లో బెంగళూరుకు తరలిస్తున్నట్లు జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి బీబీసీకి చెప్పారు.

'తరగతి గదిలోకి ఎలక్ట్రిక్ రంపంతో వచ్చిన నిందితుడు'

ఘటనపై సమాచారం అందుకున్న రాప్తాడు పోలీసులు వెంటనే పాఠశాలకు చేరుకుని వివరాలు సేకరించారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల వివరాల ప్రకారం, ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో పదో తరగతి గదిలో పాఠాలు జరుగుతుండగా, చెట్లను నరికేందుకు ఉపయోగించే ఎలక్ట్రిక్ రంపంతో ఓ వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించి బాలికపై దాడికి పాల్పడ్డాడని వారు చెప్పారు.

ఈ దాడిలో ఆమెకు ముఖం, గొంతు, పొత్తికడుపు సహా పలు చోట్ల తీవ్ర గాయాలయ్యాయని కుడిచేయి కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు... ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థిని కూడా గాయపడిందని పోలీసులు వెల్లడించారు.

తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థినులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రధాన బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం మంత్రి సత్యకుమార్ పర్యవేక్షణలో బెంగళూరుకు ఆసుపత్రికి తరలిస్తున్నారు.

అక్కడి మణిపాల్ ఆసుపత్రిలో బాలికకు అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్యులను మంత్రి నారా లోకేశ్ కోరారు. బాలికను తరలించేందుకు 'గ్రీన్ ఛానల్' ఏర్పాటు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు.

పాఠశాలలో మరమ్మతు పనులు జరుగుతుండటంతో, నిందితుడిని పనివాడిగా భావించిన కొందరు ఉపాధ్యాయులు, భద్రతా సిబ్బంది అతడిని ప్రశ్నించకుడా వదిలేశారని పోలీసులు చెబుతున్నారు.

నిందితుడు ఎవరు?

ఈ దాడికి పాల్పడిన వ్యక్తి పేరు హేమంత్. అతడు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నాగులూరు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని ఎస్పీ తెలిపారు.

''బాధిత బాలికకు అతను బంధువుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అయితే ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా అనే కోణం, లేక ఇతరత్రా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది ఆ విద్యార్థిని స్పృహలోకి వచ్చాక స్టేట్‌మెంట్ రికార్డ్ చేసి తెలుసుకుంటాం. దాడి అనంతరం పాఠశాల నుంచి పరారైన నిందితుడిని పోలీసులు ధర్మవరం రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నది అబద్దం'' అని ఆయన అన్నారు.

‘మా పాప చాలా మెతక’

ఈ ఘటనపై బాధిత బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

పాఠశాల ప్రాంగణంలోకి ఎలక్ట్రిక్ రంపంతో ఒక వ్యక్తి ప్రవేశించి తరగతి గదిలో దాడి చేసేవరకు భద్రతా వ్యవస్థ ఏం చేస్తోందని బాధితురాలి మేనత్త ప్రశ్నించారు.

'' ఎవరొచ్చినారు ఎలా కోసినాడో మాకు ఇంకా తెలియదు. ఆ పాప చాలా మెతక. 8:30 కే స్కూల్‌కి వెళ్ళిపోతుంది. ఇది స్కూల్లో జరిగింది మెడ కోశాడు కాళ్లు చేతులు దెబ్బలు తగిలాయి. ఇప్పుడు మేం పెద్ద ఆసుపత్రికి తీసుకువచ్చాం. మా పాప అయ్యవారిపల్లి నుంచి రోజూ ఆటోలో వస్తుంది. ఆ ఊరు అబ్బాయి అంటున్నారు. స్కూల్‌లోకి ఆ అబ్బాయి కట్టెలు కోసే మిషన్‌తో వచ్చాడంటే అక్కడ సెక్యూరిటీ ఉండదా?'' అని ఆమె ప్రశ్నించారు.

‘అప్పుడు స్కూల్లో ఐదుగురే టీచర్లున్నారు’

''రెండో పీరియడ్ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి తరగతి గదిలోకి వచ్చాడు. అతడు ఒక్కడే వచ్చాడు, ఒక్కసారిగా దాడికి దిగడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. అసలు ఏం చేయాలో తెలియలేదు'' అని క్లాస్ టీచర్ రాజేశ్వరి చెప్పారు.

ఆ సమయంలో పాఠశాలలో కేవలం ఐదుగురు ఉపాధ్యాయులే ఉన్నట్లు రాప్తాడు హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు రాజేశ్వరీ చెప్పారు.

''క్లాస్ జరుగుతోంది. పిల్లలు బయటికి అరుచుకుంటూ వచ్చారు. చంపినారు చంపినారంటే బయట ఎక్కడో ఏమో జరుగుతుంది అనుకున్నాం. క్లాసులోకి వెళ్లి చూడంగానే ఆ పాప తీవ్రంగా గాయపడింది. . అబ్బాయి పరిగెత్తి వెళ్ళిపోయాడు. ఆ పాపను తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్లాం. బాగా చదివే పాప. అడ్డుకోబోయిన ఇంకొక అమ్మాయి కాలుకు గాయం అయింది. ఆ అమ్మాయిని కూడా ఆస్పత్రికి తీసుకెళ్లాం'' అని ఆమె చెప్పారు.

విద్యార్థిని కుటుంబానికి సీఎం చంద్రబాబు ఫోన్

ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు అత్యుత్తమ వైద్యం అందించాలని వైద్య బృందాన్ని ఆదేశించారు. గాయపడిన బాలిక తల్లితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘తరగతి గదిలో రక్తపు మడుగులో ఉన్న చిన్నారిని చూసి కన్నీళ్లు ఆగడం లేదు. ఆడపిల్లలు, మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీపడదు. పిల్లల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కూడా చర్యలు తీసుకుంటాం’’ అని లోకేష్ హెచ్చరించారు.

ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలోకి ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ రంపంతో ప్రవేశించి విద్యార్థినిపై దాడి చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులపై చూపుతున్న దృష్టిని రాష్ట్రంలో నేరాలను అరికట్టడంపై చూపడం లేదని విమర్శించారు.

గాయపడిన విద్యార్థినులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై పారదర్శక విచారణ జరపాలని, రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల భద్రతా ఏర్పాట్లను సమీక్షించాలని డిమాండ్ చేశారు.

‘మా పిల్లలను ఇక స్కూల్‌కు ఎలా పంపిస్తాం?’

పాఠశాలల్లో పిల్లల భద్రతపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

''అయ్యవారిపల్లి నుంచి రోజూ ఆటోలో వస్తారు. స్కూల్లో అందరూ ఉంటారు కదా స్కూల్లోనే ఇలా జరుగుతుంటే, ఏం చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లోనే ఇలా జరిగితే రేపు పొద్దున పిల్లలను స్కూలుకు ఎలా పంపించాలి. రేపు పొద్దున మా పిల్లలను స్కూలుకి ఎలా పంపించాలి''అని స్థానికులు అంటున్నారు.

భాదితురాలిని పరామర్శించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత నేరస్థుడిని కఠిన శిక్షపడేలా చూస్తామన్నారు.

''హైస్కూల్లో ఇలా జరగడం చాలా దారుణం. రంపం తీసుకొని వెళ్లి దాడి చేయడం చాలా బాధాకరం. ఆ అమ్మాయితో పాటు, అడ్డుకోబోయిన మరో అమ్మాయికి కూడా దెబ్బలు తగిలాయి. దీనిపై సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటాం. '' అని పరిటాల సునీత అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)