ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న అరబ్బులు ఎవరు?

ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

ఇజ్రాయెల్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలూ ఈసారి అరబ్ నేతృత్వంలోని పార్టీలు కింగ్‌మేకర్లుగా అవతరించే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. అక్కడ నివసిస్తున్న అరబ్ జనాభాలో ఎక్కువ మంది ముస్లింలే.

అయితే, ఇజ్రాయెల్ ఒక యూదు దేశం. మరి అక్కడ ఇంత పెద్ద సంఖ్యలో ముస్లిం జనాభా ఎలా ఉంది?

ఇజ్రాయెల్ 1948లో ప్రత్యేక దేశంగా ఆవిర్భవించినప్పుడు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న లక్షలాది మంది అరబ్బులు తమ ఇళ్లను వదిలి వెళ్ళిపోయారు.

కానీ, అలా వెళ్లకుండా అక్కడే ఉండిపోయిన వారికి ఇజ్రాయెల్ ప్రభుత్వం పౌరసత్వం కల్పించింది. వారినే ఇప్పుడు ఇజ్రాయెల్ అరబ్బులు అని పిలుస్తున్నారు.

ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న అరబ్బులు ఆ దేశపు అతిపెద్ద మైనారిటీ వర్గం. వీరు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లలో నివసిస్తున్న అరబ్ పాలస్తీనియన్ల కంటే భిన్నమైనవారు.

ఇజ్రాయెల్ మొత్తం జనాభాలో సుమారు 20 శాతం మంది అరబ్ మూలాలున్నవారే.

అరబ్ పౌరులకు చట్టపరంగా యూదులతో సమానమైన హక్కులు ఉన్నాయి. అయితే, ఈ రెండు వర్గాల మధ్య మతపరమైన, సాంస్కృతిక, సామాజిక వ్యత్యాసాలు కూడా ఉన్నాయి.

ఇజ్రాయెల్‌లోని మైనారిటీ జనాభాలో దాదాపు 80 శాతం ముస్లీంలు కాగా, మిగిలిన వారు క్రైస్తవులు, డ్రూజ్ వర్గానికి చెందినవారు.

ఈ అరబ్ ముస్లింలలో చాలామంది వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లలో నివసిస్తున్న పాలస్తీనియన్లతో తమను తాము పోల్చుకుంటారు.

ఇజ్రాయెల్‌లో అరబ్బుల పరిస్థితి ఎలా ఉంది?

ఇజ్రాయెల్ తనను తాను యూదుల, ప్రజాస్వామ్య దేశంగా అభివర్ణించుకుంటుంది. కానీ విమర్శకులు దీనిని అంగీకరించరు.

"అరబ్ పౌరులకు యూదులతో సమానమైన పౌర, చట్టపరమైన హక్కులు ఉన్నాయి. అయితే, అరబ్ పౌరులకు సాధారణంగా నిర్బంధ సైనిక సేవ నుంచి మినహాయింపు ఉంటుంది" అని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతోంది.

డ్రూజ్ కమ్యూనిటీకి చెందిన పురుషులతో సహా కొన్ని వర్గాలకు సైనిక సేవ కోసం వేర్వేరు నియమాలు వర్తిస్తాయి.

బీబీసీ న్యూస్ నివేదిక ప్రకారం, ఒక ఇజ్రాయెల్-అరబ్ ఎంపీ అక్కడి వ్యవస్థ గురించి మాట్లాడుతూ, "యూదులకు ఈ దేశం ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది, అదే అరబ్బులకైతే ఇదొక యూదు దేశంలా పనిచేస్తుంది" అని వ్యాఖ్యానించారు.

అరబ్ సమాజంలోని చాలామంది తమను తాము ఇజ్రాయెల్‌లో "రెండవ తరగతి పౌరులు"గా భావిస్తుంటారు.

అసమానతలకు సంబంధించిన ఈ విషయాల గురించి ప్రభుత్వ విచారణల్లో, అంతర్జాతీయ నివేదికల్లో కూడా ప్రస్తావించారు.

2003లో ఏర్పాటైన ఓర్ కమీషన్ తన విచారణలో, అరబ్ సమాజం పట్ల ప్రభుత్వ వైఖరి వివక్షాపూరితంగా ఉందని తేల్చింది.

అదేవిధంగా, అరబ్ పౌరులు చట్టపరమైన, సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారని అమెరికా విదేశాంగ శాఖ నివేదిక కూడా పేర్కొంది.

ఇజ్రాయెల్‌లో అరబ్బులు ఎక్కడ నివసిస్తున్నారు?

ఇజ్రాయెల్ అరబ్బుల జనాభా అత్యధికంగా ఉత్తర ఇజ్రాయెల్‌లో ఉంది. నజరేత్, ఉమ్ అల్-ఫామ్, సఖ్నిన్ వంటి నగరాలు వీరికి ప్రధాన కేంద్రాలు.

ఇవి కాకుండా, అరబ్, యూదు వర్గాలు కలిసి జీవించే హైఫా, జాఫా, ఎకార్ వంటి నగరాల్లో కూడా చాలామంది నివసిస్తున్నారు.

అరబ్బులు 1948 తరువాత తమ ఇళ్లను భూములను వదిలివెళ్లడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంది. ఓర్ కమీషన్ ప్రకారం, ఇది చాలా విశాలమైన భూభాగం.

తదుపరి ప్రభుత్వ విధానాలు ఇజ్రాయెల్ అరబ్బుల భూములను మరింత తగ్గించాయని కమీషన్ తన నివేదికలో పేర్కొంది.

ఖచ్చితమైన గణాంకాలు పొందడం కష్టమే అయినప్పటికీ, హక్కుల సంఘాల ప్రకారం ఇజ్రాయెల్ అరబ్బులు దేశ మొత్తం జనాభాలో 20 శాతం ఉన్నా, దేశ భౌగోళిక విస్తీర్ణంలో కేవలం 3 శాతం భూమి మాత్రమే వారి ఆధీనంలో ఉంది.

బెడౌయిన్ (Bedouin) టౌన్‌షిప్‌లు మినహా 1948 తర్వాత కొత్తగా ఎలాంటి అరబ్ పట్టణాలు ఏర్పడలేదు.

కానీ ఇజ్రాయెల్ అరబ్ జనాభా మాత్రం అప్పటినుంచి కనీసం ఏడు రెట్లు పెరిగింది.

ఓర్ కమీషన్ నివేదిక ప్రకారం, అనేక అరబ్ నివాస ప్రాంతాల చుట్టూ సైనిక చెక్‌పోస్టులు, యూదుల కౌన్సిళ్లు, జాతీయ పార్కులు, హైవేలు ఉండటంతో వాటి విస్తరణ అసాధ్యంగా మారింది.

హక్కుల సంఘాల అంచనా ప్రకారం ఇజ్రాయెల్ దక్షిణాన ఉన్న నెగెవ్ ప్రాంతంలో సుమారు 1,60,000 మంది సంచార జాతులైన బెడౌయిన్ అరబ్బులు నివసిస్తున్నారు.

వీరిలో దాదాపు సగం మంది కనీస సదుపాయాలు కూడా లేని, గుర్తింపు లేని నివాస ప్రాంతాల్లో జీవిస్తున్నారు.

ఇజ్రాయెల్‌లో అరబ్ ప్రాంతాలు ఎలా ఉంటాయి?

ఇజ్రాయెల్‌లోని అరబ్ కుటుంబాల్లో సగానికి పైగా పేదరికంలో మగ్గుతున్నాయి. అదే యూదు కుటుంబాల్లో ఈ సంఖ్య 15 శాతం మాత్రమే. ఈ అంతరం అంతకంతకూ పెరుగుతోంది.

మొస్సావా అడ్వొకసీ సెంటర్ ప్రకారం, గత కొన్నేళ్లుగా ఒక్క ఏడాది మినహా ప్రతి ఏటా అరబ్ కమ్యూనిటీల అభివృద్ధికి కేటాయించే ప్రభుత్వ నిధుల్లో కోత విధిస్తూ వస్తున్నారు.

యూదు ప్రాంతాల కంటే అనేక అరబ్ ప్రాంతాల్లో మున్సిపల్ సేవలు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి.

తరగతి గదులు తక్కువగా ఉండటం, పాత రోడ్లు, ఉపాధి అవకాశాలు లేకపోవడం వీరికి ప్రధాన సమస్యలు.

అరబ్ ప్రాంతాల్లో మున్సిపల్ పన్నుల వసూలు తక్కువగా ఉండటమే ఈ వివక్షకు కారణమని కొంతమంది ఇజ్రాయెలీలు అంటుంటారు.

అయితే, సరైన సేవలు అందించనప్పుడు పన్నులు ఎందుకు చెల్లించాలని కొందరు అరబ్బులు భావిస్తున్నారని మొస్సావా సెంటర్ చెబుతోంది.

మున్సిపల్ ఖజానాను నింపే ఫ్యాక్టరీలు, వ్యాపారాలు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఈ అరబ్ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది.

అమెరికా విదేశాంగ శాఖ ప్రకారం, చాలా ఉపాధి రంగాల్లో ఇజ్రాయెలీ అరబ్బులకు తగిన ప్రాతినిధ్యం లేదు.

మొస్సావా సెంటర్ ప్రకారం, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఇజ్రాయెలీ అరబ్బులు కేవలం 8 శాతం మాత్రమే ఉన్నారు. హైటెక్ కంపెనీలలో పనిచేసే 70,000 మంది ఉద్యోగులలో కేవలం 300 మంది మాత్రమే అరబ్బులు.

అంతేకాకుండా దేశంలో ప్రభుత్వ నిధులతో నడిచే అరబిక్ భాషా విశ్వవిద్యాలయం ఒక్కటి కూడా లేదు.

యూదులు, అరబ్బులకు చట్టపరంగా సమాన హక్కులు ఉన్నాయా?

ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనికి 'అవును' అని బదులిస్తుంది. కానీ ఇజ్రాయెల్-అరబ్ హక్కుల సంఘాలు దీనిని అంగీకరించవు.

మొస్సావా సెంటర్ ప్రకారం, ఇక్కడ కనీసం 20 చట్టాలు బహిరంగంగా అరబ్బుల పట్ల వివక్ష చూపుతున్నాయి. ఇజ్రాయెల్ అరబ్బులకు అధికారికంగా మైనారిటీ హోదా లేదు.

అరబిక్ ఒక అధికారిక భాషే అయినప్పటికీ, దానికి హిబ్రూ భాషతో సమానమైన హోదా లేదు. యూదుల పండుగలకు జాతీయ సెలవులు ఇస్తారు కానీ, ముస్లిం, క్రైస్తవ పండుగలకు ఇవ్వరు.

అత్యంత వివాదాస్పదమైన చట్టాల్లో 2003 నాటి పౌరసత్వ చట్టం ఒకటి. దీని ప్రకారం, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లేదా గాజాకు చెందిన పాలస్తీనియన్లు ఎవరైనా ఇజ్రాయెలీలను వివాహం చేసుకుంటే, వారు ఇజ్రాయెల్‌కు వలస రావడానికి సాధారణంగా అనుమతించరు.

ఈ నిషేధం 25 ఏళ్ల లోపు వయస్సు ఉన్న మహిళలకు, 35 ఏళ్ల లోపు పురుషులకు వర్తిస్తుంది.

ఆ వయసు దాటిన పాలస్తీనియన్లు ఇక్కడ తాత్కాలికంగా ఉండేందుకు మాత్రమే అనుమతిస్తారు.

భద్రతా కారణాల దృష్ట్యా ఈ చట్టం అవసరమని ఇజ్రాయెల్ వాదిస్తుండగా, ఇది తమ పట్ల చూపే వివక్షేనని అరబ్బులు వాదిస్తున్నారు.

ఇజ్రాయెల్‌లో భూమి మరో వివాదాస్పద అంశం. దేశంలోని దాదాపు 93 శాతం భూమి ప్రభుత్వ లేదా పాక్షిక-ప్రభుత్వ సంస్థల ఆధీనంలో ఉంది.

దీనిని పౌరులకు లీజుకు ఇస్తారు. ఇందులో 13 శాతం జ్యూయిష్ నేషనల్ ఫండ్ యాజమాన్యంలో ఉంది. దీనిని ముఖ్యంగా యూదుల మాతృభూమి కోసం భూమిని కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేశారు.

వాస్తవానికి, నేటికీ ఇజ్రాయెలీ అరబ్బులు ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకోవడం చాలా కష్టమని హక్కుల సంఘాలు చెబుతున్నాయి.

రాజకీయాల్లో అరబ్బుల పాత్ర ఏమిటి?

ఇజ్రాయెల్ అరబ్బులు 1966 వరకు సైనిక పాలనలోనే ఉన్నారు. 1980లు, 90ల వరకు స్వతంత్ర అరబ్ రాజకీయ పార్టీలు ఏర్పడలేదు.

ప్రస్తుతం 120 స్థానాలున్న ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో అరబ్ పార్టీల తరఫున గెలిచిన వారు 13 మంది సభ్యులు ఉన్నారు.

ఇజ్రాయెల్‌లో అరబ్బులను తరచుగా దేశంలోని "ఫిఫ్త్ కాలమ్" (లోపలి శత్రువులు) అని పిలుస్తుంటారు, ముఖ్యంగా పాలస్తీనియన్లతో ఉద్రిక్తతలు తీవ్రమైనప్పుడు వీరికి ఈ ముద్ర ఎక్కువగా వేస్తుంటారు.

కొంతమంది ఇజ్రాయెల్ అరబ్బులు జాతీయ ఎన్నికలలో అసలు పాల్గొనరు. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి, తమ ఓటు వల్ల వ్యవస్థలో ఏదీ మారదని వారి నమ్మకం. రెండవది, వారు ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తించడానికి ఇష్టపడకపోవడం.

ఇస్లామిక్ మూవ్‌మెంట్ సంస్థ ఈ రెండో కారణాన్ని సమర్థిస్తుంది. అయితే వీరు స్థానిక ఎన్నికల్లో మాత్రం పాల్గొంటారు.

అరబ్ ప్రజల పట్ల ఇజ్రాయెల్ ప్రభుత్వ వైఖరి ఏమిటి?

ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి అరబ్బుల కోసం విద్య, వైద్యం, మహిళల హక్కుల వంటి రంగాల్లో తాము ఎంతో కృషి చేశామని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతోంది.

అరబ్బుల సామాజిక-ఆర్థిక పరిస్థితి దిగజారడానికి వెనుక ఇతర కారణాలు ఉన్నాయని ప్రభుత్వం అంటోంది. ఉదాహరణకు, వారిలో కుటుంబాలు పెద్దవి కావడం, మహిళలకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం లాంటివి.

2000 సంవత్సరంలో జరిగిన అల్లర్ల తర్వాత ఓర్ కమీషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ అల్లర్లకు పోలీసుల నిర్లక్ష్యం, వివక్ష, అరబ్ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణమని ఆ విచారణలో తేలింది.

ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గత రైట్ వింగ్ ప్రభుత్వంలో ఒక మైనారిటీ మంత్రి కూడా ఉన్నారు.

మైనారిటీ వ్యాపారాల్లో పబ్లిక్-ప్రైవేట్ జాయింట్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం ప్రభుత్వం 40 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.380 కోట్ల) నిధిని కూడా ప్రకటించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)