మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
తుపాన్లు ఎక్కువవుతున్నాయా, లేక వాటి తీవ్రత పెరుగుతోందా? తుపాను, హరికేన్, టైఫూన్ మధ్య తేడా ఏమిటి?
ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి వందలాది చెట్లు నేలకొరిగాయి. వరిపొలాలు వాలిపోయాయి.
కోస్తా జిల్లాల్లోని ప్రధాన పంటలైన వరి, కోనసీమ కొబ్బరి, గోదావరి లంకల్లో అరటి, ఆక్వా సాగుపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలు, తీవ్ర గాలులు, వరద ముంపుతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
అర్నబ్ తుపానుతో ఏపీ చాలా నష్టపోయిందని, నష్టంపై అంచనాల కోసం కేంద్ర బృందాలను పంపాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తుపాను సహాయక చర్యల్లో 14 జిల్లాల్లో 16 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నియమించినట్టు ఆ లేఖలో వెల్లడించారు
ఈ క్రమంలో అసలు తుపాను (సైక్లోన్) అంటే ఏమిటి? ఇది హరికేన్ కంటే భిన్నమైనదా? టైఫూన్ లేదా సూపర్ టైఫూన్ అని దేనిని అంటారో తెలుసుకుందాం.
సూపర్ టైఫూన్ అంటే..?
నిజానికి ఇవన్నీ ఉష్ణమండల తుపానులే (ట్రాపికల్ స్ట్రామ్స్). కానీ ఇవి ఏర్పడే భౌగోళిక ప్రాంతాలను బట్టి వీటిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు.
- తుపాన్లు: దక్షిణ పసిఫిక్, హిందూ మహాసముద్రంలో (భారత్ పరిసరాల్లో) ఏర్పడే తుపాన్లు.
- హరికేన్లు (హరికేన్స్): ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, ఈశాన్య పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే తుపాన్లు.
- టైఫూన్లు (టైఫూన్స్): వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే తుపాన్లు.
- సూపర్ టైఫూన్: ఫిలిప్పీన్స్ వాతావరణ శాఖ (పీఏజీఏఎస్ఏ) ప్రకారం.. ఉష్ణమండల తుపానులో గాలుల వేగం గంటకు 185 కిలోమీటర్లు (గంటకు 115 మైళ్లు) దాటితే దానిని 'సూపర్ టైఫూన్' అని పిలుస్తారు.
తుపాన్ల తీవ్రతను ఎలా నిర్ణయిస్తారు?
వాతావరణ శాస్త్రవేత్తలు సాధారణంగా 'ఉష్ణమండల తుపాను (ట్రోపికల్ సైక్లోన్). అనే పదం ఉపయోగిస్తుంటారు. అంటే ఉష్ణమండల లేదా ఉపఉష్ణమండల సముద్ర జలాలపై ఒక క్రమపద్ధతిలో తిరుగుతూ కదిలే మేఘాలు ఉరుములతో కూడిన భ్రమణ వ్యవస్థను తుపావ్యవస్థను అమెరికా వాతావరణ సంస్థ (ఎన్ఓఏఏ) ఇలా వివరిస్తుంటుంది.
ఈ ఉష్ణమండల తుపానులో గాలుల వేగం గంటకు 119 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ స్థాయికి చేరుకుంటే.. అది ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఏర్పడిందన్న దానిని బట్టి హరికేన్, టైఫూన్ లేదా సైక్లోన్‌గా వర్గీకరిస్తారు.
హరికేన్లను గాలుల వేగం ఆధారంగా ఒకటి నుంచి ఐదు స్థాయులుగా వర్గీకరిస్తారు. ఇందుకోసం 'సాఫిర్–సింప్సన్ హరికేన్ విండ్ స్కేల్' అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తారు.
తుపాన్లు ఏ సమయంలో ఏర్పడతాయి?
అట్లాంటిక్ మహాసముద్రంలో జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు హరికేన్ల సీజన్ కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో ఉష్ణమండల తుపానులు 95 శాతానికి పైగా ఈ కాలంలోనే సంభవిస్తాయి.
దక్షిణ పసిఫిక్‌లో నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్య సైక్లోన్ల సీజన్.
వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో టైఫూన్లు మే నుంచి అక్టోబర్ మధ్య ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఇక్కడ ఏడాది పొడవునా ఇవి ఏర్పడే అవకాశం ఉంటుంది.
వీటికి పేర్లు ఎలా పెడతారు?
ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఉష్ణమండల తుపాన్లకు పేర్లు పెట్టడానికి ఒక జాబితాను నిర్వహిస్తుంది.
సాధారణంగా ప్రతి ఆరేళ్లకు ఒకసారి పాత పేర్లనే మళ్లీ వాడుతారు.
అయితే భారీ ప్రాణనష్టం కలిగించిన టైఫూన్ హైయాన్, హరికేన్ కత్రినా వంటి తుపానుల పేర్లను మళ్లీ ఉపయోగించరు. ఈ తుపాను బాధితుల మనోభావాలను గాయపరచకూడదనే ఉద్దేశంతో శాశ్వతంగా జాబితా నుంచి తొలగించి, వాటి స్థానంలో కొత్త పేర్లను చేరుస్తారు.
హరికేన్లు, టైఫూన్లు, సైక్లోన్లు ఏర్పడే ప్రాంతాల్లోని దేశాలు తుపానుల పేర్ల కోసం తమ సూచనలను ప్రపంచ వాతావరణ సంస్థకు పంపిస్తాయి.
"బంగాళాఖాతం, అరేబియా సముద్రం పరిధిలోని మా ప్రాంతానికి చెందిన ఎనిమిది దేశాలు 2000వ దశకం ప్రారంభంలో ప్రపంచ వాతావరణ సంస్థకు పేర్ల జాబితాను పంపించాయి.ఆ జాబితాలోని దాదాపు 50 శాతం పేర్లను ఇప్పటికే ఉపయోగించేశారు. తుపానులకు పెట్టే పేర్లు మా దేశాల్లోని ప్రజల మతపరమైన మనోభావాలను దెబ్బతీయకూడదని అప్పట్లో ఈ ప్రాంత దేశాల మధ్య అంగీకారం కుదిరింది’’ అని భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త ఒకరు బీబీసీకి తెలిపారు.
తుపాన్లు ఎలా ఏర్పడతాయి? వాతావరణ మార్పుల ప్రభావం ఉందా?
సముద్రంలోని వెచ్చని నీటి వల్ల దాని పైనున్న గాలి వేడెక్కి వేగంగా పైకి లేస్తుంది.ఆ గాలి పైకి వెళ్లి చల్లబడినప్పుడు, కింద నుంచి మరింత వెచ్చని గాలి పైకి వస్తుంది. దీంతో చల్లబడిన గాలి పక్కకు కదులుతుంది. దీనివల్ల సముద్ర ఉపరితలం దగ్గర గాలిపీడనం తగ్గుతుంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగడం వల్ల గాలి పీడనం మరింతగ్గి బలమైన గాలుల వీయడం మొదలవుతుంది. ఇటువంటి వాతావరణం ఉష్ణమండల తుపానుగా మారే అవకాశం ఉంటుంది. సముద్రంపై ఉష్ణమండల తుపాను ఏర్పడినప్పుడు భారీ అలలు ఎగసిపడవచ్చు.
ఆ అలలు తీరాన్ని తాకినప్పుడు నగరాలు, పట్టణాలు నీట మునుగుతాయి.
భూమిపైకి వచ్చిన తర్వాత తుపానుతో కూడిన బలమైన గాలులు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. ఇళ్లు నేలమట్టం కావచ్చు. చెట్లు కూలిపోవచ్చు. గాలుల తీవ్రతకు కార్లు కూడా బోల్తా పడవచ్చు.
వాతావరణ మార్పుల ప్రభావం
ఒక్కో ఉష్ణమండల తుపానుపై వాతావరణ మార్పుల ప్రభావం ఎంత ఉందో కచ్చితంగా అంచనా వేయడం కష్టం.
ఎందుకంటే తుపానులు ఏర్పడే, అభివృద్ధి చెందే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉంటుంది.
వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా తుపాన్ల సంఖ్య పెరుగుతుందని చెప్పలేము కానీ, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఈ తుపాన్ల తీవ్రతను మాత్రం పెంచుతున్నాయి.
సముద్ర జలాల ఉష్ణోగ్రత పెరిగితే, తుపానులు మరింత శక్తిని పొందుతాయి. దీంతో గాలుల వేగం పెరుగుతుంది.
వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, గాలి మరింత ఎక్కువ తేమను నిల్వ ఉంచుకోగలదు. దీనివల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం పెరుగుతుంది.
అలాగే సముద్ర మట్టాలు కూడా పెరుగుతున్నాయి. ప్రధానంగా హిమానీనదాలు, భారీ మంచు పొరలు కరగడం, సముద్ర జలాలు వేడెక్కినప్పుడు వ్యాకోచించి ఎక్కువ స్థలాన్ని ఆక్రమించడం ఇందుకు కారణాలు.
స్థానిక పరిస్థితులు కూడా సముద్ర మట్టాల పెరుగుదలపై ప్రభావం చూపవచ్చు.
దీంతో ఇప్పటికే పెరిగిన సముద్ర మట్టానికి తోడు తుపానుల సమయంలో సముద్రపు నీరు మరింత ఎత్తుకు ఎగసి తీరప్రాంతాల్లోకి చొచ్చుకొస్తుంది. ఫలితంగా తీరప్రాంత వరదల తీవ్రత పెరుగుతుంది.
మొత్తంగా చూస్తే, ఐక్యరాజ్యసమితికి చెందిన వాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ (ఐపీసీసీ) రెండు ముఖ్యమైన నిర్థరణలకు వచ్చింది.
1. ఉష్ణమండల తుపానులతో కూడిన వర్షపాతం పెరగడానికి మానవ కార్యకలాపాలు దోహదపడుతున్నాయని తాము విశ్వసిస్తున్నామని పేర్కొంది.
2. ఉష్ణమండల తుపానులు మరింత తీవ్రంగా మారే అవకాశాలు పెరగడానికి కూడా మానవ కార్యకలాపాలు దోహదపడుతున్నాయని చెప్పేందుకు తమకు కొంతమేర విశ్వాసం ఉందని తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)