మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
అర్నబ్: 24 నుంచి 48 గంటల్లో ఏపీలోని 13 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం- వాతావరణ శాఖ హెచ్చరిక
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
'అర్నబ్' అతి తీవ్ర తుపాను తీరం వైపు దూసుకొస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
తుపాను ప్రభావంతో రాబోయే 24 నుండి 48 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
తుపాను తీరం దాటే సమయంలో కురిసే అసాధారణ వర్షాల వల్ల వాగులు, వంకలు ఉధృతంగా పొంగిపొర్లే ప్రమాదం ఉందని, పట్టణ, లోతట్టు ప్రాంతాలు క్షణాల్లో జలమయం కావచ్చని వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది.
నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు లేదా ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించింది.
ఉధృతంగా ప్రవహించే కాజ్‌వేలు, వాగులను దాటే ప్రయత్నం అస్సలు చేయవద్దని విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్లోపలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, అక్టోబర్ 27, 28 తేదీల్లో 53 రైళ్లను రద్దు చేశారు. ప్రభావిత జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యగా దాదాలు 1800 తుపాను సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తుపాను తీరం దాటే సమయంలో భారీగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న వేళ అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు ప్రజలు కూడా తుపాను నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం కనిపించింది.
విశాఖ నగరంలోని రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లన్నీ రద్దీగా కనిపించాయి. ప్రజలు పెద్దఎత్తున నిత్యవసర వస్తువులు కొనుగోెలు చేయడం కనిపించింది.
తీరానికి దగ్గరలో అర్నబ్ తుపాన్
ఈ 12 గంటలు అత్యంత అప్రమత్తత అవసరమని, తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో రేపు ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ఈ సమయంలో గంటకు 100-140 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందనీ, పూరిళ్లు, రేకుల షెడ్లలో నివసించే వారు దగ్గరలోని పునరావాస కేంద్రాలకు వెంటనే వెళ్లాలని ప్రఖర్ జైన్ సూచించారు.
విశాఖకు 170 కిలోమీటర్ల దూరంలో తుపాను…
గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిమీ వేగంతో కదిలిన అతి తీవ్ర తుపాన్ ప్రస్తుతానికి విశాఖపట్నంకు 170కి.మీ., కాకినాడకు 140 కి.మీ., మచిలీపట్నంకు 230 కి.మీ., బాపట్లకు 300 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని, రేపు ఉదయానికి బాపట్ల- విశాఖ మధ్య యానాంకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
మరోవైపు తుపాను తీరానికి దగ్గరవుతున్న కొద్దీ దాని ప్రభావం పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
పాఠశాలలకు సెలవులు
తుపాను ప్రభావంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
అక్టోబర్ 27, 28 తేదీల్లో తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, అనకాపల్లి, పోలవరం జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
అవసరమైతే పాఠశాల భవనాలను తుపాను పునరావాస కేంద్రాలుగా వినియోగించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, సెలవుల తేదీలు జిల్లాలవారీగా మారే అవకాశం ఉన్నందున విద్యార్థులు, తల్లిదండ్రులు సంబంధిత జిల్లా అధికారుల ప్రకటనలను గమనించాలి.
( ఈ కథనం అప్డేట్ అవుతోంది)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)