‘జ్ఞానేశ్ కుమార్ ఒక్కరే నిర్ణయాలు తీసుకోరు, ఫామ్-6లో ఎలాంటి మార్పులు చేయలేదు’.. సుప్రీంకోర్టుకు సమాధానం ఇచ్చిన ఎలక్షన్ కమిషన్

ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(సర్)కు సంబంధించి తీసుకున్న అన్ని నిర్ణయాలు ఉమ్మడిగా తీసుకున్నామని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

సుప్రీంకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్‌కు స్పందనగా ఈ అఫిడవిట్‌ సమర్పించింది.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పనితీరు, కమిషన్ తీసుకున్న నిర్ణయాలను సవాలు చేస్తూ చేసిన ఆరోపణలను ఈసీఐ ఖండించింది.

సర్‌ విషయంలో ఇద్దరు కమిషనర్లు అభ్యంతరాలను పట్టించుకోకుండా జ్ఞానేశ్ ఒక్కరే నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలను ఈసీఐ తోసిపుచ్చింది.

రాకేశ్ కుమార్ సింగ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌కు సమాధానంగా ఈ అఫిడవిట్‌ను ఈసీఐ సమర్పించింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... ఈసీఐ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తోపాటు ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది.

‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన ఒక కథనం ఆధారంగా ఈ పిటిషన్ దాఖలైంది. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు చెప్పినా సర్‌కు సంబంధించిన 14 కీలక నిర్ణయాలు ఎన్నికల సంఘం పేరుతో తీసుకున్నట్టు ఆ కథనంలో పేర్కొన్నారు.

ఈ ఆరోపణలను ఖండించిన ఎన్నికల సంఘం, సర్‌కు సంబంధించిన 2025 జూన్ 24, 2025 అక్టోబర్ 27, 2026 మే 14 తేదీల్లో జారీ చేసిన మూడు ఉత్తర్వులు ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాలని డిప్యూటీ ఎన్నికల కమిషనర్ భాను ప్రకాశ్ యెటూరు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఈసీఐ ఇతర వాదనలు ఏంటి?

ఈ పిటిషన్ పూర్తిగా ఒక వార్తాపత్రిక కథనంపైనే ఆధారపడి ఉందని ఈసీఐ తన వాదనలో పేర్కొంది. అందులో చేసిన ఆరోపణలు నిజమా కాదా అని పిటిషనర్ ధ్రువీకరించుకోలేదని వాదించింది. అందువల్ల ఈ పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని సుప్రీంకోర్టుకు తెలియజేసింది.

ఈసీఐకి సంబంధించిన అంతర్గత నోట్లు, ఫైళ్లు లేదా ఇతర అధికారిక పత్రాలను మీడియాకు ఎప్పుడూ విడుదల చేయలేదని అలాగే వాటిని ప్రచురించేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని పేర్కొంది.

ఫైళ్ల పరిశీలన ప్రక్రియలో ప్రధాన ఎన్నికల కమిషనర్ లేదా ఎన్నికల కమిషనర్లు చేసిన సూచనలు, వ్యాఖ్యలు, వేసిన ప్రశ్నలు తుది నిర్ణయాలుగా పరిగణించలేమని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. అలాంటివి నిర్ణయ ప్రక్రియలో భాగమే తప్ప, అవే కమిషన్ అధికారిక నిర్ణయాలు కావని పేర్కొంది.

నిర్ణయాలు ఎలా తీసుకుంటుందో కూడా తన అఫిడవిట్‌లో ఎలక్షన్ కమిషన్ వివరించింది. సాధారణంగా ఒక ఫైలు ముందుగా ఒక ఎన్నికల కమిషనర్ వద్దకు, ఆ తర్వాత మరో ఎన్నికల కమిషనర్ వద్దకు, చివరిగా ప్రధాన ఎన్నికల కమిషనర్ వద్దకు వెళ్తుందని తెలిపింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్లు(నియామకం,సర్వీస్ నిబంధనలు, పదవీకాలం) చట్టం -2023లోని సెక్షన్ 18 ప్రకారం నిర్దేశించిన విధానాన్నే అనుసరించి నిర్ణయాలు తీసుకున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొంది.

ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలను సాధ్యమైనంత వరకు ఏకగ్రీవంగా తీసుకోవాలని, ఏకాభిప్రాయం కుదరకపోతే, మెజారిటీ అభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని ఈ చట్టం పేర్కొందని ఈసీఐ తెలిపింది.

'ఫామ్ 6లో ఎలాంటి మార్పులు చేయలేదు'

ఎస్ఐఆర్ ఆదేశాల ద్వారా ఫామ్-6లో కూడా మార్పులు చేసిన ఆరోపణలను కూడా ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఓటర్ల నమోదు నియమాలు -1960 ప్రకారం, ఈ ఫామ్‌లో మార్పులు చేసే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని స్పష్టం చేసింది.

ఎస్ఐఆర్ ప్రక్రియోల భాగంగా ఓటర్ల నుంచి తీసుకుంటున్న డిక్లరేషన్ పత్రం ఒక ప్రత్యేక పత్రం మాత్రమేనని, దాన్ని ఫామ్-6లో చేసిన సవరణగా పరిగణించలేమని ఈసీఐ తెలిపింది.

ఆన్‌లైన్‌లో డిక్లరేషన్ పత్రాన్ని ఉంచడం వల్ల ఫామ్-6లో మార్పులు చేసినట్టు ప్రచారం జరిగిందని ఈసీఐ అంగీకరించింది.

ఓటర్ల జాబితాలను మ్యాపింగ్ చేయడంలో దరఖాస్తుదారులకు సహాయపడేందుకు మాత్రమే ఈ డిక్లరేషన్ పత్రాన్ని ప్రవేశపెట్టామని తెలిపింది.

ఓటర్ల నమోదు ప్రక్రియ మరింత సౌకర్యవంతంగా, అందుబాటులో ఉండేలా పలు నిర్ణయాలు తీసుకున్నామని అఫిడవిట్‌లో పేర్కొంది.

పిటిషనర్లు ఎవరు?

సర్‌తోపాటు ఓటర్ల జాబితాలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు మొత్తం ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా తీసుకున్నారని ఆరోపిస్తూ దిల్లీకి చెందిన న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి, రాకేశ్ కుమార్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అక్టోబర్ 5న కేంద్ర ప్రభుత్వానికి, ఈసీఐకి, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తోపాటు ఇతర సంబంధిత పక్షాలకు నోటీసులు జారీ చేసింది.

అప్పటి వరకు జ్ఞానేశ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది.

దీని తర్వాత ప్రతిపక్ష కూటమి తరఫున మరిన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. అక్టోబర్ 15న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా 'ఇండియా' బ్లాక్‌కు చెందిన ఇతర నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అందులో కూడా ఇతర కమిషనర్లకు తెలియకుండానే జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)