మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
‘పాతికేళ్ల కుర్రాళ్లకూ పక్షవాతం రావొచ్చు’.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి
- రచయిత, ఓంకార్ కరంబేల్కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
పక్షవాతం అనేది వృద్ధులకు మాత్రమే వచ్చే వ్యాధి అని చాలా మంది ఇప్పటికీ నమ్ముతారు. అయితే, యుక్తవయసులో ఉన్నవారు అకస్మాత్తుగా తల తిరగడం, చేయి లేదా కాలు మొద్దుబారడం, మాట్లాడటంలో ఇబ్బంది, లేదా ఒక్క క్షణం చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే, దానిని వారు తరచూ నిర్లక్ష్యం చేస్తారు. కానీ, అలా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కాగలదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా, పక్షవాతం కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చే వ్యాధిగా లేదు. 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసు గల వారు కూడా పక్షవాతానికి గురయ్యే అవకాశం ఉందని ప్రపంచ గణాంకాల్లో తెలిసింది. ఈ వయసు వారిలో పక్షవాతం వచ్చే ఘటనలు వేగంగా పెరుగుతున్నాయి.
అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, ధూమపానం, మద్యపానం, నిద్రలేమి, ఒత్తిడి, నిశ్చల జీవనశైలి కూడా యువత మెదడుపై భారం చూపుతున్నాయి. పక్షవాతం ప్రాణాంతకం మాత్రమే కాదు, అది జీవితకాల వైకల్యానికి, జ్ఞాపకశక్తి కోల్పోవడానికి, మాటల తడబడటానికి, మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయవచ్చు.
అత్యంత తీవ్రమైన సమస్య ఏమిటంటే.. పక్షవాతం లక్షణాలు మొదలైన తర్వాత చికిత్సలో జరిగే ప్రతి నిమిషం ఆలస్యం కొన్ని లక్షల మెదడు కణాలను దెబ్బతీస్తుంది. అందుకే, పక్షవాతం చికిత్సలో 'సమయమే మెదడు (టైమ్ ఈజ్ బ్రెయిన్)' అనే భావనను చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.
యువతలో పెరుగుతున్న స్ట్రోక్ ప్రమాదం, తరచుగా నిర్లక్ష్యం చేసే తొలి లక్షణాలు, వేగవంతమైన చికిత్సకున్న ప్రాముఖ్యత, ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచే అలవర్చుకోవాల్సిన అలవాట్ల గురించి తెలుసుకుందాం.
అసలు పక్షవాతం అంటే ఏంటి?
మన మెదడుకు నిరంతరం ఆక్సిజన్, పోషకాలు అవసరం. ఇది రక్తనాళాల ద్వారా మెదడుకు చేరుతాయి. రక్తం గడ్డకట్టడం వల్ల రక్తనాళం మూసుకుపోయినా లేదా చిట్లినా.. మెదడులోని ఒక భాగానికి తగినంత రక్త సరఫరా అందదు. ఈ పరిస్థితిని పక్షవాతం లేదా స్ట్రోక్ అంటారు .
రక్తం, ఆక్సిజన్ సరఫరాకు నిరంతరం అంతరాయం కలగడం వల్ల, మెదడు కణాలు నిమిషాల వ్యవధిలోనే చనిపోవడం మొదలవుతాయి. ఇది శరీరంలోని వివిధ పనులను ప్రభావితం చేస్తుంది.
స్ట్రోక్‌లు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్, దీనిలో రక్తం గడ్డకట్టడం వల్ల రక్తనాళం మూసుకుపోతుంది. రెండవది హెమరేజిక్ స్ట్రోక్, దీనిలో రక్తనాళం చిట్లిపోయి, మెదడులోకి రక్తస్రావం అవుతుంది. ఈ రెండు పరిస్థితులూ ప్రమాదకరమైనవే. వీటికి తక్షణమే వైద్య చికిత్స అందించాలి.
లక్షణాలు ఏమిటి, చికిత్స ఎప్పుడు చేయాలి?
సాధారణంగా, యువతలో పక్షవాతం లక్షణాలు పెద్దవారిలో కనిపించే లక్షణాల మాదిరిగానే ఉంటాయి. పెద్దగా ఏమీ తేడా ఉండదు. అయితే, చిన్న పిల్లలలో కొన్ని విభిన్న లక్షణాలు కనిపించవచ్చు. ఇవి యువతీయువకులు లేదా పెద్ద వారిలో కనిపించే లక్షణాలకు భిన్నంగా ఉంటాయి.
అత్యంత ఆందోళనకర విషయం ఏంటంటే.. స్ట్రోక్‌ను తొలుత నిర్లక్ష్యం చేయడమే.
దీనిలో శరీరంలో ఒకవైపు మెల్లగా బలహీనత మొదలవుతుంది, మాటల సరిగ్గా రావు, దృష్టి సమస్యలు నెలకొంటాయి, లేదా అకస్మాత్తుగా పట్టు కోల్పోవడం వంటివి ఉంటాయి. తరచూ, ప్రజలు కండరాల నొప్పులు వంటి ఇతర కారణాలతో ఇలా జరుగుతుందని భావించి, ఈ లక్షణాలను పక్కనపెడతారు.
అయితే, ఈ లక్షణాలు తీవ్రమైనవని ఎప్పుడు గుర్తించాలనే దానిపై మరింత తెలుసుకోవడానికి మేం ముంబయిలోని మహిమ్లో పి. డి. హిందూజ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్లోని కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ దర్శన్ దోషితో మాట్లాడాం.
"తల తిరగడం, నడవడంలో ఇబ్బంది, నడవలేకపోవడం లేదా పట్టు కోల్పోవడం వంటి ఏవైనా ఆకస్మిక లేదా తీవ్రమైన లక్షణాలు మీకు కనిపిస్తే, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. చూపులో ఆకస్మిక మార్పులు, ఒక కంటి చూపు కోల్పోవడం లేదా పాక్షికంగా దృష్టి కోల్పోవడం వంటివి ఎదురైతే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అలాగే, శరీరంలో ఒక వైపు తిమ్మిరిగా అనిపించినా, లేదా ఒక వైపు కంటే మరో వైపు సెన్సిటివ్ తక్కువగా ఉన్నట్లు అనిపించినా, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి" అని బీబీసీతో అన్నారు.
మొత్తం వ్యాధి తీవ్రతను గుర్తించడానికి ఫాస్ట్ (FAST) పరీక్షను తరచుగా సిఫార్సు చేస్తారు. ఆ పరీక్ష గురించి ప్రతి ఒక్కరూ ఎందుకు తెలుసుకోవాలి? అనే దాని గురించి డాక్టర్ దర్శన్ దోషిని మేం అడిగాం.
"నిజానికి దీన్ని బీఈ ఫాస్ట్(FAST) అని పిలవాలి" అని అన్నారు.
'బీ' అంటే బ్యాలెన్స్ (పట్టు) - ఒక వ్యక్తి అకస్మాత్తుగా తన పట్టును కోల్పోవచ్చు.
'ఈ' అంటే ఐస్ (కళ్లు) - ఒక కంటిలో లేదా రెండు కళ్లలోని కొంత భాగంలో అకస్మాత్తుగా దృష్టి కోల్పోవచ్చు.
'ఎఫ్' అంటే ఫేస్ (ముఖం) - ముఖం ఒక వైపుకు తిరిగినట్లుగా లేదా వంగి ఉన్నట్లుగా అనిపించవచ్చు.
'ఏ' అంటే ఆర్మ్ - అంటే ఒక వైపు చేయి లేదా కాలు బలహీనంగా ఉండవచ్చు.
'ఎస్' అంటే స్పీచ్ (మాటలు) - అంటే మాట తడబడటం, పదాలు వాడేటప్పుడు గందరగోళం, ఇతరులు చెప్పేది అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, లేదా అర్థం లేని మాటలు.
'టీ' అంటే టైమ్ (సమయం) - ఈ లక్షణాలలో ఏవైనా కనిపించిన వెంటనే, ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలి.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.
"మొదటి నాలుగున్నర గంటలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే, ఈ సమయంలో రక్తం గడ్డలను కరిగించే మందులు ఇవ్వవచ్చు. దీనివల్ల రోగి పరిస్థితి మెరుగుపడే అవకాశాలు పెరుగుతాయి" అని డాక్టర్ దర్శన్ దోషి అన్నారు.
అయితే, నాలుగున్నర గంటల తర్వాత లక్షణాలు కనిపిస్తే, ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని దీని అర్థం కాదు. అటువంటి పరిస్థితిలో కూడా మీరు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. ఎందుకంటే నాలుగున్నర గంటల తర్వాత కూడా అనేక ప్రభావవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
యువతకు పక్షవాతం వస్తుందా?
కేవలం వృద్ధులు మాత్రమే పక్షవాతం బారిన పడతారని, యువత దీని బారిన పడరనేది ఒక అపోహ. వయసు పెరిగే కొద్ది పక్షవాతం ముప్పు పెరుగుతుందనేది నిజమే అయినప్పటికీ.. ఎవరికైనా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది.
వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్‌కు చెందిన 'గ్లోబల్ స్ట్రోక్ ఫ్యాక్ట్ షీట్ 2025' ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా వచ్చే స్ట్రోక్‌లలో సుమారు 15 శాతం కేసులు 15 నుంచి 49 సంవత్సరాల వయసు గలవారిలో వస్తున్నాయి.
యువతలో పక్షవాతం వచ్చినప్పుడు దాని పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయి. ఈ సమయంలో, ఆ వ్యక్తి తన కెరీర్‌ను ప్రారంభించి, కుటుంబ బాధ్యతలు చేపడుతుంటారు లేదా భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవడం వంటివి చేస్తుండవచ్చు. పక్షవాతం వచ్చి అకస్మాత్తుగా ఆ వ్యక్తి పని చేసే సామర్థ్యాన్ని, స్వతంత్రంగా జీవించడాన్ని, కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది.
యువత తమకున్న ప్రమాద కారకాలపై అవగాహన కలిగి ఉండి, ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
దీని గురించి మరింత తెలుసుకునేందుకు, జస్లోక్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్లోని కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, న్యూరోమస్క్యూలర్ డిజార్డర్స్, స్ట్రోక్ స్పెషలిస్ట్ డాక్టర్ వినయ భండారితో మాట్లాడాం.
ప్రశ్న: పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు ముప్పై, నలభై ఏళ్ల వయసున్న పక్షవాత రోగులు ఎక్కువగా ఉన్నారా?
డాక్టర్ వినయ భండారి: ఒక ప్రపంచ అధ్యయనం ప్రకారం..1990-2021 మధ్య 15 నుంచి 49 సంవత్సరాల వయసు గల వారిలో కొత్తగా పక్షవాతం వచ్చే ఘటనలు సుమారు 36 శాతం పెరిగాయి. సులభంగా చెప్పాలంటే.. 1990లో ఈ వయసు వారిలో 100 కొత్త కేసులు ఉంటే, 2021 నాటికి ఆ సంఖ్య సుమారు 136కి పెరిగి ఉండేది.
భారత్‌లో పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవడానికి మరింత సమాచారం అవసరం. అయితే, ముప్పై లేదా నలభై ఏళ్ల వయసులో ఉన్నవారికి కూడా పక్షవాతం రావచ్చు.
శరీరంలో ఒకవైపు అకస్మాత్తుగా నీరసించడం, మాట్లాడటంలో ఇబ్బంది, లేదా చూపు కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని మేం సూచిస్తాం.
ప్రశ్న: యువతలో పక్షపాతం రావడానికి అత్యంత సాధారణ కారణాలేంటి?
డాక్టర్ వినయ భండారి: అత్యధిక రక్తపోటు, మధుమేహం, ఎక్కువగా కొలెస్ట్రాల్, ధూమపానం, గుండె జబ్బులు వంటివి యువతలో ఎక్కువగా పక్షవాతం వచ్చే ముఖ్యమైన కారకాలు. అయితే, ఒక యువకుడికి పక్షవాతం వచ్చినప్పుడు, మేం ఇతర కారకాలు ఏంటనేది కూడా చూస్తాం. వీటిలో మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు చిట్లడం, కొన్ని రకాల గుండె సంబంధిత సమస్యలు, రక్తం గడ్డకట్టే డిజార్డర్లు, మెదడు నుంచి రక్తాన్ని బయటకు పంపే సిరలలో అడ్డంకులు వంటివి ఉంటాయి. కొంతమంది రోగులలో, వాపు సంబంధిత లేదా జన్యుపరమైన కారకాలు కూడా కారణం కావచ్చు.
మహిళలలో గర్భధారణ, ప్రసవానంతర కాలం కూడా ముఖ్యమైన అంశాలు.
యువతలో వచ్చే ప్రతి పక్షవాతం కేవలం జీవనశైలి కారకాల వల్ల మాత్రమే రాదని అర్థం చేసుకోవడం ముఖ్యం. దాని మూల కారణాన్ని గుర్తించాలి. ఎందుకంటే అది చికిత్సను, భవిష్యత్తులో పక్షవాతాలు వచ్చే ప్రమాదాన్ని నిర్ధరిస్తుంది.
ప్రశ్న: నియంత్రిత రక్తపోటు, యువతలో పక్షవాత ముప్పుకు ఎలా కారణమవుతుంది?
డాక్టర్ వినయ భండారి : పక్షవాతానికి అత్యంత ముఖ్యమైన ప్రమాద కారకం అత్యధిక రక్తపోటు. అయితే, తరచూ అత్యధిక రక్తపోటుకు పెద్దగా లక్షణాలుండవు. యువత చూడటానికి చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. వారి రోజువారీ కార్యకలాపాలు నిర్వహిస్తుంటారు. కానీ, వారి రక్తపోటు నిరంతరం ఎక్కువగా ఉండొచ్చు. కాలక్రమేణా అది రక్తనాళాలకు దెబ్బతీస్తుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది, మెదడులో రక్తస్రావమయ్యేలా చేస్తుంది.
అందుకే, మీ రక్తపోటును చెక్ చేయించుకునేందుకు వేచిచూడొద్దు. క్రమంగా మీ రక్తపోటును చెక్ చేయించుకుంటూ ఉండాలి. మీ రక్తపోటు ఎంతుందో తెలుసుకుంటూ, అవసరమైతే సరైన చికిత్స తీసుకోవడం మీ దీర్ఘకాలిక ఆరోగ్యానికి అత్యంత అవసరం.
ప్రశ్న: పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని మధుమేహం, ఊబకాయం ఎలా పెంచుతాయి?
డాక్టర్ వినయ భండారి: మధుమేహం, ఊబకాయం, ముఖ్యంగా అధిక రక్తపోటు, అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలతో కలిసి ఉన్నప్పుడు, పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.
మధుమేహం కాలక్రమేణా రక్తనాళాలను దెబ్బతీస్తుంది. అధిక కొవ్వు, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు, ఇన్సులిన్ నిరోధకత, అధిక రక్తపోటు, ఇతర జీవక్రియ సమస్యలతో ముడిపడి ఉంటుంది.
ఈ సమస్యలు జీవితంలో తొలిదశలోనే ప్రారంభమై, చాలా సంవత్సరాల పాటు నిర్ధరణ కాకుండానే ఉండిపోవడం ఆందోళన కలిగించే విషయం.
సమతుల్య ఆహారం, క్రమమైన వ్యాయామం, ఆరోగ్యకరమైన బరువు అనేవి ఈ వ్యాధిని నియంత్రించుకునే ముఖ్యమైన నివారణ చర్యలు. అలాగే, మధుమేహాన్ని ముందుగానే గుర్తించడం, దానితో సంబంధం ఉన్న రక్తపోటు లేదా కొలెస్ట్రాల్ సమస్యలకు సరైన చికిత్స అందించడం కూడా అంతే ముఖ్యం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)