'రామాయణ' సినిమాలో సీతగా నటించిన సాయిపల్లవిపై ఆన్‌లైన్‌లో విమర్శలేంటి?

    • రచయిత, నందిని వెళ్లసామి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రామాయణ' సినిమా.. ప్రారంభోత్సవం నుంచి నటీనటుల ఎంపిక, భారీ బడ్జెట్.. ఇలా ప్రతి అంశం వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యశ్, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు.

అయితే, సీత పాత్రకు సాయిపల్లవిని ఎంపిక చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమెను ఈ పాత్రలో తీసుకోవడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు.

ఎక్స్ సహా సామాజిక మాధ్యమాల్లో పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సీత పాత్రకు సాయిపల్లవి సరిపోరని, ఆమెకు బదులుగా మరో నటిని ఎంపిక చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో రామాయణం ఆధారంగా వచ్చిన సీరియళ్లు, సినిమాల్లో నటించిన వారే సీత పాత్రకు మరింతగా సరిపోయేవారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ విమర్శల నేపథ్యంలో సాయిపల్లవి గత సినిమాలు, నటన, మేకప్‌కు దూరంగా ఉండటంపై ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి.

అసలు సాయిపల్లవి సినీ ప్రయాణం ఎలా మొదలైంది? ఆమె మేకప్ ఎందుకు వేసుకోరు, సీత పాత్రను ఆమె ఎలా చూస్తున్నారు?

మొటిమలతోనే తెరపైకి సాయిపల్లవి

సాయిపల్లవి అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ఆమె సహజమైన అందం, నృత్యం, విభిన్నమైన పాత్రల ఎంపిక. తెరపై మేకప్‌కు ప్రాధాన్యం ఇవ్వకుండా సహజంగా కనిపించడమే ఆమె ప్రత్యేకత.

కోయంబత్తూరులో పుట్టి పెరిగిన సాయిపల్లవి.. నటిగా మారకముందు వైద్య విద్యను అభ్యసించారు. జార్జియాలో మెడిసిన్ చదివారు. తన తండ్రి బడగ తెగకు చెందినవారని, ఆయన బడగ భాష మాట్లాడతారని, తల్లి తమిళం మాట్లాడతారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చాలామంది తనను మలయాళీ అని పొరబడుతుంటారని కూడా చెప్పారు.

2008లో ఓ ప్రైవేటు తమిళ టెలివిజన్ చానెల్‌లో ప్రసారమైన డ్యాన్స్ షోలో సాయిపల్లవి పాల్గొని తొలిసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత తెలుగు డ్యాన్స్ షోలోనూ మెరిశారు. పలు ఇంటర్వ్యూల్లోనూ నృత్యంపై తనకున్న ఇష్టాన్ని ఆమె వెల్లడించారు. ఇప్పటికీ ఆమె నటించిన పలు సినిమాలు తన డ్యాన్స్ కారణంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి.

ముఖ్యంగా 'మారి 2' సినిమాలో ధనుష్‌తో కలిసి చేసిన 'రౌడీ బేబీ' పాట చాలా ఆదరణ పొందింది. అలాగే 'శ్యామ్ సింగరాయ్‌'లో దేవదాసి పాత్రలో నటించారు సాయిపల్లవి. ఆ చిత్రంలోని ఆమెకు సంబంధించిన చాలా సన్నివేశాలు నృత్య ప్రధానంగా సాగుతాయి.

అయితే, సాయిపల్లవిని ప్రత్యేకంగా నిలబెట్టింది కేవలం నృత్యం మాత్రమే కాదు. ఆమె ఎంచుకునే పాత్రలు కూడా సాధారణ కథానాయిక పాత్రలకు భిన్నంగా ఉంటాయి.

కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించినప్పటికీ.. 2015లో అల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ చిత్రం 'ప్రేమమ్' సాయిపల్లవి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో 'మలర్' పాత్రలో సాయిపల్లవి కనిపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖంపై మొటిమలతో, ఎలాంటి హంగులూ లేకుండా సహజంగా తెరపై కనిపించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

ఈ సినిమా చెన్నైలో దాదాపు 300 రోజులు ప్రదర్శితమైందని సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

"ప్రేమమ్ విడుదలైనప్పుడు నేను సిమ్రన్, త్రిషలా లేనని విమర్శిస్తారేమోనని భయపడ్డా. కానీ ప్రేక్షకులు నన్ను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం సంతోషాన్నిచ్చింది. మలయాళ సినిమా కావడంతో నా జుట్టు, ముఖం ఎలా ఉన్నాయో అలాగే ఉండనివ్వాలని దర్శకులు చెప్పారు" అని ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖా దత్‌తో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో సాయిపల్లవి వెల్లడించారు.

ఆ సినిమా తర్వాత మేకప్ లేకుండా నటించడం, సహజమైన రూపంతో తెరపై కనిపించడం గురించి సాయిపల్లవి పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడారు.

మేకప్ ఎందుకు వేసుకోరు?

2022లో ఓ డిజిటల్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేకప్ గురించి సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"నా మేకప్ గురించి ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు. నేను కూడా ఒక సాధారణ అమ్మాయినే. నా ముఖంపై మొటిమలు ఉంటాయి. నాకు కూడా వ్యక్తిగత భయాలు ఉంటాయి. ప్రేమమ్ సినిమా తర్వాత కొంతమంది దర్శకులు కొద్దిగా మేకప్ వేసుకోవాలని సూచించారు. కానీ మేకప్ వేసుకున్నప్పుడు కంటే అది లేకుండా నటించినప్పుడే నా ముఖంలోని భావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా నాకు కోపం వచ్చినప్పుడు బుగ్గలు ఎర్రబడతాయి. అది వారికి నచ్చింది. ఒకరి బాహ్య రూపాన్ని బట్టి అందాన్ని నిర్వచించలేం. మనిషిలోని అంతర్గత సౌందర్యమే ముఖ్యం" అని చెప్పారు.

తన కళ్లు పెద్దగా కనిపిస్తాయనే కారణంతో వీలైనంత వరకు ఐలైనర్ మాత్రమే ఉపయోగించడానికి ఇష్టపడతానని సాయిపల్లవి తెలిపారు.

'విరాట పర్వం' సినిమాలో ఐలైనర్ కూడా వేసుకోలేదని, ముఖం కడుక్కుని మాత్రమే కెమెరా ముందుకు వచ్చానని చెప్పారు. అలా నటించడం తనకు ఎంతో స్వేచ్ఛను ఇచ్చిందని పేర్కొన్నారు.

"ప్రేమమ్ తర్వాతే అందం, నేను వేసుకునే దుస్తుల కంటే పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తెలుసుకున్నాను. ప్రేక్షకులపై ఎక్కువ ప్రభావం చూపించేది పాత్రే" అని మరో ఇంటర్వ్యూలో వెల్లడించారు.

పాత్రల ఎంపికలో ప్రత్యేకత

గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండటంపై కూడా సాయిపల్లవి గతంలో పలు ప్రశ్నలు ఎదుర్కొన్నారు.

"నన్ను నేను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టుకుంటానో లేదో నాకు తెలియదు" అని ఆమె చెప్పారు.

నటి శ్రీదేవి జీవిత కథ ఆధారంగా సినిమా తీస్తే అందులో గ్లామరస్ దుస్తులు ధరించాల్సి రావచ్చు కదా? అలాంటప్పుడు ఆ అవకాశాన్ని తిరస్కరిస్తారా? అని ఓ యాంకర్ ప్రశ్నించారు.

దీనికి సాయిపల్లవి స్పందిస్తూ.. "ఆ అవకాశాన్ని తిరస్కరిస్తానో లేదో నాకు తెలియదు. అయితే శ్రీదేవి తన హుందాతనం, నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటప్పుడు ఆ పాత్రకు తగిన దుస్తులను ఎంచుకునే స్వేచ్ఛ నాకు ఉంటుంది" అని చెప్పారు.

అందం, సౌందర్య సాధనాల విషయంలోనూ ఆమె తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తుంటారు.

"సినిమాల్లోకి రాకముందు చాలామంది నా ముఖంపై ఉన్న మొటిమల గురించే మాట్లాడేవారు. నా సోదరి చర్మం రంగు బాగుండాలని నచ్చని కూరగాయలు, పండ్లు కూడా తినేది. అసలు రంగు కోసం అంతలా ఎందుకు కష్టపడాలి? ఆరోగ్యం కోసం ఆహారం తీసుకోవడం మంచిదే. కానీ, చర్మం రంగు పెరగాలనే కారణంతో నచ్చని ఆహారం కూడా తింటోందంటే ఆ విషయం ఆమె మనసును ఎంతగా ప్రభావితం చేసిందో అర్థమవుతుంది. అలాంటి సమయంలో ఆమెకు అండగా నిలవాలని అనుకున్నాను. ప్రేమమ్ తర్వాతే ప్రేక్షకులు నన్ను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించారు. అదే నాకు సౌకర్యంగా అనిపిస్తుంది. ఇది పూర్తిగా నా పర్సనల్ చాయిస్" అని సాయిపల్లవి పేర్కొన్నారు.

'గార్గి', 'శ్యామ్ సింగరాయ్' వంటి మహిళా ప్రాధాన్య చిత్రాలతో పాటు కమర్షియల్ సినిమాల్లోనూ సాయిపల్లవి తనదైన ముద్ర వేశారు. ఫిదా, మారి 2, శ్యామ్ సింగరాయ్, అమరన్‌ వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం 'రామాయణ'లో సీతగా కనిపించనున్నారు.

ముఖ్యంగా 'గార్గి' సినిమాలో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడింది తన తండ్రేనని తెలుసుకున్నప్పుడు కథానాయిక తీసుకునే నిర్ణయాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. ఈ పాత్రలో సాయిపల్లవి నటనకు మంచి గుర్తింపు లభించింది.

సీత పాత్రలో సాయిపల్లవి.. ఎందుకంటే?

నటన, పాత్రల ఎంపిక గురించి సాయిపల్లవి మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ముందస్తు ప్రణాళిక లేకుండా నటించడానికే ఎక్కువగా ఇష్టపడతానని చెప్పారు. ఎదురుగా ఉన్న నటీనటులు ఇచ్చే హావభావాలకు అనుగుణంగా తన నటన సాగుతుందని వివరించారు.

ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడే వ్యక్తినని, కొంత బిడియం ఉన్న వ్యక్తినని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు.

ఇక సీత పాత్రలో నటించే అవకాశం రావడంపై ఆమె ప్రత్యేకంగా స్పందించారు.

"ఇలాంటి పాత్రలు అందరు నటీమణులకూ దక్కవు. దేవత పాత్రలో నటించడం అంత సులభం కాదు. ఎందుకంటే అది చరిత్రలో నిలిచిపోతుంది. ఈ పాత్రను పోషించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా ఆలోచనల పరంగా వీలైనంత స్వచ్ఛంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను" అని ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో సాయిపల్లవి చెప్పారు.

అమితాబ్ బచ్చన్‌తో జరిగిన ఓ సంభాషణలోనూ ఈ పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"ఇతర సినిమాల్లో నటించినప్పుడు ఆ పాత్రగా ఎలా మారాలనే దాని గురించే ఎక్కువగా ఆలోచించేదాన్ని. కానీ, ఈ పాత్ర విషయంలో మాత్రం దీని నుంచి నేను ఏం నేర్చుకోగలను? నాకేం లభిస్తుంది? అనే విషయాల గురించి ఆలోచించాను" అని చెప్పారు.

రచయిత్రి దీపా జానకీరామన్ 'స్టోరీ టు స్క్రీన్', 'ఒళి వితగర్లు' వంటి సినిమా సంబంధిత పలు పుస్తకాలను రచించారు.

సీత పాత్రపై వస్తున్న విమర్శల గురించి ఆమె మాట్లాడుతూ.. "సీత ఒక పురాణ పాత్ర. ఆమె ఇలాగే ఉండాలి, ఇలాగే కనిపించాలి అని ఎవరూ నిర్దేశించలేరు. అందరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదు. రాముడి పాత్రలో నటించే వారికి ఎప్పుడూ ఇలాంటి సమస్యలు ఎదురుకాలేదు. కానీ, సీత పాత్రలో నటించే నటీమణులే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒక నటీమణి ఆ పాత్రను ఎంత బాగా పోషించారనే విషయాన్ని మాత్రమే చూడాలి" అని అన్నారు.

సాయిపల్లవి మంచి నటి అని, తనకు అప్పగించిన పాత్రలకు న్యాయం చేయగల ప్రతిభ ఆమెకు ఉందని దీపా జానకీరామన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే భారతీయ చిత్ర పరిశ్రమలో మంచి నటిగా ఆమె గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పారు.

సీనియర్ ఎంటర్‌టైన్‌మెంట్ జర్నలిస్ట్, సినీ విమర్శకుడు రోహిత్ గిలానీ కూడా సాయిపల్లవికి మద్దతుగా నిలిచారు.

"సీత పాత్రలో సాయిపల్లవిని చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. సినిమా చూసిన తర్వాతే దానిపై విమర్శలు చేయాలా? ప్రశంసించాలా? అనేది నిర్ణయించుకోవాలి. ఒకరు ప్రముఖ వ్యక్తి అయినా, సామాన్యులైనా వారి శారీరక రూపాన్ని ఎగతాళి చేయడం ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు. సాయిపల్లవి ఎంతో ప్రతిభావంతమైన నటి. ఆమె నటన ఆధారంగానే ప్రేక్షకులు ఆమెను అంచనా వేయాలి. తన ప్రతిభను నిరూపించుకునేందుకు ఆమెకు న్యాయమైన అవకాశం ఇవ్వాలి" అని రోహిత్ గిలానీ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)