‘2024 ఎన్నికలు అక్రమం’ - మాక్ పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ

ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌‌పై ‘ప్రజా అభిశంసన’ తీర్మానాన్ని ఇండియా కూటమి శనివారం దిల్లీలో నిర్వహించిన మాక్ పార్లమెంట్‌లో ఏకగ్రీవంగా ఆమోదించింది.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ 'మాక్‌ పార్లమెంట్‌' నిర్వహించారు.

ఈ తీర్మానంపై చర్చ ముగింపు సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ, "13.3 కోట్ల మంది ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు.

వీరంతా గత లోక్‌సభ ఎన్నికల్లో (2019) ఓటు వేశారు. 2024లో బీజేపీ మూడు శాతం ఓట్ల తేడాతో ఎన్నికల్లో గెలిచింది. ప్రతి ఏడుగురు ఓటర్లలో ఒకరి పేరును తొలగించడం ద్వారా 2024 లోక్‌సభ ఎన్నికలు చట్టవిరుద్ధంగా జరిగాయని ఎన్నికల కమిషనే అంగీకరించినట్లయింది" అని ఆరోపించారు.

జ్ఞానేశ్‌ కుమార్‌, ఆయనతో కలిసి కుట్రకు పాల్పడినవారు 'దేశద్రోహానికి' పాల్పడ్డారని, అందుకు వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని రాహుల్‌ గాంధీ అన్నారు.

జ్ఞానేశ్‌ కుమార్‌ ఇకపై ప్రధాన ఎన్నికల కమిషనర్‌ పదవిలో కొనసాగలేరని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

"ఈ పెద్దమనిషి ఇకపై ఆ పదవిలో ఉండరని నిర్థరించేందుకు మా వద్ద తగిన ఆధారాలు ఉన్నాయి. మాకు తెలిసిన విషయాలన్నీ బయటపడిన తర్వాత కూడా ఆయనను అదే పదవిలో కొనసాగించాలని బీజేపీ పట్టుబడితే, ఆ పార్టీ వ్యవహారమంతా బట్టబయలవుతుంది" అని రాహుల్‌ గాంధీ అన్నారు.

'ప్రజా అభిశంసన' కార్యక్రమంలో జరిగిన చర్చ సందర్భంగా రాహుల్‌ గాంధీ పలు ప్రశ్నలు లేవనెత్తారు.

"ఇప్పుడు సాయంత్రం 6:15 గంటలవుతోంది. పార్లమెంటుకు చెందిన 250 మంది సభ్యులు, పౌర సమాజ ప్రతినిధులు, సాధారణ పౌరులు, మీడియా ప్రతినిధులు ఖర్గే నివాసంలోని తోటలో కూర్చున్నారు. ఇక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై ప్రజా అభిశంసన కార్యక్రమం జరుగుతోంది.

"ఇది చాలా విచిత్రమైన విషయం. మనం ఖర్గే నివాసంలోని తోటలో ఎందుకు సమావేశమవుతున్నాం? ఈ ప్రశ్నను లేవనెత్తేందుకు మనకు మరో మార్గం లేదా? దేశంలోని ఇతర సంస్థలకు ఏమైంది? న్యాయవ్యవస్థకు ఏమైంది? ఎన్నికల కమిషన్‌కు ఏమైంది?

"మనం వెళ్లేందుకు మరో చోటు లేకపోవడమే దీనికి కారణం. మనకు మరో ప్రత్యామ్నాయం లేదు. ప్రతి సంస్థను ఆశ్రయించే మార్గాలూ మనకు మూసుకుపోయాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇలాంటి పరిస్థితి మరెక్కడైనా ఏర్పడి ఉంటుందని అనుకోవడం లేదు. రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో కూడిన ప్రతిపక్షమంతా ఒక తోటలో కూర్చుని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించే అంశంపై చర్చిస్తోంది" అని రాహుల్‌ గాంధీ అన్నారు

"ఇక్కడ సమావేశమైనవారు ప్రపంచంలోని జ్ఞానేశ్‌ కుమార్‌లందరికీ ఒక సందేశం ఇస్తున్నారు. మీరు రక్షిస్తామని ప్రమాణం చేసిన సంస్థనే అడ్డుపెట్టుకుని దాని వెనుక దాక్కుంటున్నారు.ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు ఎప్పటికీ దాని వెనుక దాక్కోలేరు. ఏదో ఒక రోజు ఈ దేశ ప్రజాప్రతినిధులను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది."

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదేశాల మేరకే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నేరుగా ఎన్నికల కమిషన్‌ను నడుపుతున్నారని ఆరోపించారు.

ఖర్గే నివాసంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పార్లమెంటు అధికారిక కార్యకలాపాల్లో భాగం కాదు. రాజ్యాంగబద్ధమైన అభిశంసన ప్రక్రియకు ప్రత్యామ్నాయం కూడా కాదు.

ఇది కేవలం ప్రతిపక్షం తన ఆరోపణలను ప్రముఖంగా ప్రస్తావించడానికి ఎంచుకున్న ప్రతీకాత్మక రాజకీయ నిరసన.

"ఏడు నెలల క్రితం 193 మంది ఎంపీలు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపాదన చేశారు. కానీ ఆ ఎంపీలు ఇచ్చిన నోటీసులను తిరస్కరించారు. వాటిని పరిగణనలోకి తీసుకోలేదు" అని ఖర్గే అన్నారు.

"ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో మాకు వ్యక్తిగత వైరం ఏమీ లేదు. ఆయన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేయాలన్నదే మా ఉద్దేశం. సామాన్య ప్రజలకు ఆయనపై నమ్మకం కొనసాగాలి. యువత, మహిళలు, బలహీన వర్గాలకు ఎన్నికల కమిషన్‌పై విశ్వాసం ఉండాలి" అని చెప్పారు.

"దిల్లీలో కూర్చుని కంప్యూటర్‌ ద్వారా ప్రజల ఓటు హక్కును ఎవరూ తొలగించలేని విధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ పనిచేయాలి" అని ఖర్గే అన్నారు.

దేశంలో జరుగుతోందని తాము ఆరోపిస్తున్న 'ఓట్ల చోరీ'ని అడ్డుకునేందుకు ఇక్కడికి వచ్చిన ఇండియా కూటమి ఎంపీలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.

మల్లికార్జున ఖర్గే నివాసంలో నిర్వహించిన ఈ 'మాక్‌ పార్లమెంట్‌' కోసం పార్లమెంటును పోలిన ఏర్పాట్లు చేశారు.

ఖర్గే మాట్లాడుతూ, "ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా 2023 డిసెంబర్‌లో తమ ప్రభుత్వం ద్వారా జ్ఞానేశ్‌ కుమార్‌కు జీవితకాల న్యాయపరమైన రక్షణ కల్పించారు. దేశానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జ్ఞానేశ్‌ కుమార్‌ చేసిన నేరపూరిత చర్యలను కప్పిపుచ్చేందుకే ఇదంతా చేశారు. అందువల్ల జ్ఞానేశ్‌ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలి" అన్నారు.

"బిహార్‌లో ఎస్‌ఐఆర్‌ ద్వారా ఓట్ల చోరీకి సంబంధించిన తొలి ప్రయోగం జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ఓటర్ల పేర్లను తొలగించేందుకు దీన్ని అమలు చేశారు" అని ఖర్గే ఆరోపించారు.

"చనిపోయిన వారి పేర్లను ఓటర్ల జాబితాలో కొనసాగించాలని మేం కోరడం లేదు. వారి పేర్లను తప్పకుండా తొలగించాలి. కానీ మోదీ ప్రభుత్వం చొరబాటుదారుల పేరుతో పదేపదే సాకులు చెబుతూ తన తప్పులను కప్పిపుచ్చుకుంటోంది'' అన్నారు.

"అంటే, దొంగతనానికి పాల్పడుతున్నవారే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నవారిని దూషిస్తున్నారు'' అన్నారు.

"మేం ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లాం. ఆ తర్వాత రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పించాం. సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించి పిటిషన్‌ దాఖలు చేశాం'' అన్నారు.

"ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను కాపాడేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. అందుకోసం వీధుల్లోకి కూడా రావాల్సి వచ్చింది" అని ఖర్గే అన్నారు.

ప్రజా అభిశంసనలో సీఈసీపై అభియోగాలు

ఈ కార్యక్రమంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై ప్రతిపక్షం పలు ఆరోపణలు చేసింది. అవి:

  • ఓట్ల చోరీకి కుట్ర పన్నడం.
  • 13.2 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించారు.
  • పార్లమెంటు పర్యవేక్షణ లేకుండానే ఫారం-6లో మార్పులు చేశారు.
  • ఈసీఐనెట్‌ ద్వారా ఓటర్ల జాబితాలను తమ నియంత్రణలోకి తీసుకున్నారు.
  • మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను మాట్లాడనివ్వలేదు.
  • ప్రధాని మోదీ, అమిత్‌ షా ఆదేశాల మేరకు పనిచేశారని.

ఈ ప్రతీకాత్మక విచారణకు లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ అధ్యక్షత వహిస్తున్నారు.

పార్లమెంటులో ఏవిధంగా కూర్చుంటారో ఇండియా కూటమి ఎంపీలుకూడా అలానే కూర్చునే ఏర్పాట్లు చేశారు.

ఇండియా కూటమితో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌పై ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నాయి.

ఈ ప్రక్రియ కారణంగా దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. ఇది ప్రజల ప్రజాస్వామిక హక్కులపై నేరుగా జరిగిన దాడిగా ఆరోపిస్తున్నాయి.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్షం డిమాండ్‌ చేస్తోంది.

ఓటర్ల జాబితాలో జరిగాయని చెబుతున్న అవకతవకలు, ఎన్నికలకు సంబంధించిన అక్రమాలపై ప్రతిపక్షం ఈ నిరసనకు దిగింది.

ఈ కార్యక్రమాన్ని మొదట శుక్రవారం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే దిల్లీలో భారీ వర్షాలు కురవడంతో దాన్ని వాయిదా వేశారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో జరిగాయని ఆరోపిస్తున్న అవకతవకలు, 'ఓట్ల చోరీ'కి వ్యతిరేకంగా నవంబర్‌ 1న రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి ధర్నాకు దిగనుంది.

బీజేపీ విమర్శలు

ఇండియా కూటమి నిర్వహించిన 'ప్రజా అభిశంసన' కార్యక్రమంపై బీజేపీ స్పందిస్తూ రాహుల్‌ గాంధీని విమర్శించింది.

బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది మాట్లాడుతూ, "భారత్‌లో అరాచకం సృష్టించేందుకు పదేపదే చేసిన ప్రయత్నాలు విఫలమైన తర్వాత, కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు తన ప్రత్యేక నాయకుడు రాహుల్‌ గాంధీని సంతృప్తిపరిచేందుకు 'మాక్‌ పార్లమెంట్‌' నిర్వహిస్తోంది. తద్వారా ఆయనకు తనకు నచ్చిన పార్లమెంటు దొరికిందనే భ్రమను కల్పిస్తోంది" అని అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన 'మాక్‌ పార్లమెంట్‌' అనే ఆలోచనను దేశ సరిహద్దులకు ఆవల కూడా ఎగతాళి చేశారని సుధాంశు త్రివేది అన్నారు.

"ప్రపంచ బ్యాంకు తన 2025 నివేదికలో భారత్‌ను ప్రశంసించింది. ఆ నివేదిక ప్రకారం, 2012 నుంచి 2023 మధ్య భారత్‌లో 27.6 శాతం మంది తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారు. ఇప్పుడు దేశ జనాభాలో 2.6 శాతం మంది మాత్రమే తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారు" అని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ ఎలా ముందుకు సాగుతోందో ఈ గణాంకాలు చూపిస్తున్నాయని సుధాంశు త్రివేది అన్నారు.

బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)