మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
ఆకాశాన్ని శాసించిన ‘రాకాసి పక్షుల’ కథ.. ఒకప్పుడు మనుషులూ వాటికి ఆహారమే
- రచయిత, క్యాథరిన్ లాథమ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
దాదాపు 28 లక్షల ఏళ్ల క్రితం.. దక్షిణాఫ్రికాలోని పచ్చిక మైదానాల్లో ఓ చిన్నారి ఒంటరిగా తిరుగుతోంది. ఆ చిన్నారి వయసు కేవలం మూడేళ్లు. ఇంకా దంతాలు కూడా పూర్తిగా రాలేదు. మన ప్రాచీన మానవ పూర్వీకుల్లో ఒకరైన ఆస్ట్రాలోపిథెకస్ ఆఫ్రికానస్ జాతికి చెందిన చిన్నారి.
ఆకాశం నుంచి ఓ ప్రమాదం పొంచి ఉందన్న విషయం ఆ చిన్నారికి తెలియదు. ఓ భారీ డేగ లాంటి పక్షి వేగంగా కిందికి దూసుకొచ్చి, ఆ చిన్నారిని తన గోళ్లతో పట్టుకుని, చంపేసింది.
(హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని వివరాలు పాఠకులను కలవరపెట్టవచ్చు).
ఆ చిన్నారిని వేటాడి చంపింది ఏ జాతి పక్షి అనేది కచ్చితంగా తెలియదు. అయితే, ఆ చిన్నారి కళ్ల కింది భాగంలో కనిపించిన గాట్లు డేగ గోళ్ల గుర్తులను పోలి ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
డేగలు సాధారణంగా తమ ఆహారాన్ని వేటాడిన తర్వాత కొంత భాగాన్ని చెట్లపై దాచిపెట్టి, మిగిలినది గూటికి తీసుకెళ్తుంటాయి.
రాతియుగంలో జీవితం అంత సులభం కాదు. ఆ కాలంలో భూమిపై భారీ జంతువులదే ఆధిపత్యం. మామోత్‌లు, మాస్టోడాన్‌లు, భారీ స్లాత్‌లు, సాబర్ టూత్ పులులతో పాటు.. చిన్నారులను వేటాడే భారీ పక్షులు కూడా ఉండేవి.
ఎగరలేని డైనోసార్లు అంతరించిపోయిన తర్వాత.. మహా మంచుయుగం ప్రారంభమయ్యే వరకు కోట్ల ఏళ్ల పాటు ఈ భారీ పక్షులు ఆకాశాన్ని ఏలాయి.
మానవ పరిణామ క్రమంపై కూడా ఇవి గణనీయమైన ప్రభావం చూపి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
పిల్లలను ఎత్తుకెళ్లే భారీ పక్షుల గురించి ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతుల్లో ఇప్పటికీ వినిపించే పురాణ గాథలకు కూడా ఈ పక్షులే ప్రేరణ అయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
'రాకాసి పక్షులు' ఎలా పుట్టుకొచ్చాయి?
ఎగరలేని డైనోసార్లు భూమిపై అంతరించిపోయినప్పుడు.. ఆకాశమంతా దుమ్ముతో నిండిపోయింది. చాలా మొక్కలు చనిపోయాయి. జంతువులకు ఆహారంగా మిగిలింది ప్రధానంగా విత్తనాలే. అయితే, ఇవి పక్షులకు అనుకూలంగా మారాయి.
వేటాడే జంతువులు లేకపోవడంతో.. నేలపై నివసించే చిన్న ముక్కు పక్షుల్లో కొన్ని క్రమంగా భారీ పరిమాణానికి పరిణామం చెందాయి.
వాటిలో కొన్ని శాకాహారులుగా మారాయి. ఆస్ట్రేలియాలో నివసించిన డ్రోమోర్నిథిడే జాతి పక్షులు ఇందుకు ఉదాహరణ. వీటిని 'డెమన్ డక్స్ ఆఫ్ డూమ్' అని పిలిచేవారు. చూడటానికి నేటి బాతుల్లాగే ఉన్నా.. వాటి పరిమాణం, బరువు నేటి ఆవుల కంటే దాదాపు 100 రెట్లు ఎక్కువగా ఉండేవి.
మరికొన్ని పక్షులు సముద్రాలపై విహరించే భారీ వేట పక్షులుగా పరిణామం చెందాయి. ఇప్పటివరకు జీవించిన అతిపెద్ద ఎగిరే పక్షిగా గుర్తింపు పొందిన దక్షిణ కరోలినాకు చెందిన పెలాగోర్నిస్ శాండెర్సీ ఇందుకు ఉదాహరణ. దీని రెక్కల విస్తీర్ణం ఏకంగా 7 మీటర్లు (24 అడుగులు) ఉండేది.
భూమిపై ఆధిపత్యం చెలాయించిన భారీ మాంసాహార డైనోసార్లు( టైరనోసారస్) అంతరించిపోవడంతో ఏర్పడిన ఖాళీని ఇంకొన్ని పక్షులు భర్తీ చేశాయి. పెద్ద ఎర అందుబాటులో ఉన్నచోట, అంతకంటే పెద్ద మాంసాహారులు పుట్టుకొస్తాయి. మన పూర్వీకులు పోరాడాల్సి వచ్చింది ఇలాంటి భారీ పక్షులతోనే.
ప్రాచీన, ఆధునిక ఆధారాలు
"ప్రైమేట్స్(కోతి జాతి) ఆవిర్భవించినప్పటి నుంచి వేటాడే పక్షులు కూడా ఉన్నాయి. అవి ఎప్పటినుంచో ప్రైమేట్స్‌ను వేటాడుతున్నాయి. ఇందులో మన పూర్వీకులూ ఉన్నారు" అని అమెరికాలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రైమటాలజిస్ట్ స్కాట్ మెక్‌గ్రా చెబుతున్నారు.
మన పూర్వీకులకు, భారీ పక్షులకు మధ్య జరిగిన పోరాటానికి సంబంధించిన ఆనవాళ్లు నేటి అడవుల్లోనూ కనిపిస్తున్నాయి. ఐవరీ కోస్ట్‌లోని తాయ్ అడవుల్లో డేగలతో సహా వేటాడే పక్షుల చేతిలో చనిపోయిన 600కు పైగా ప్రైమేట్స్ కళేబరాలను మెక్‌గ్రా పరిశీలించారు. వాటిలో కనిపించిన గోళ్ల గుర్తులు.. టౌంగ్ చిన్నారి అవశేషాలపై ఉన్న గుర్తులతో ఆశ్చర్యకరంగా సరిపోలాయి.
కొన్ని కోతుల పుర్రెల్లో కంటి గూడులోని కింది భాగం దెబ్బతిన్నట్లు గుర్తించారు. "డేగలు తమ ముక్కుతో కళ్లను పెకిలించి ఉండవచ్చు. లేదంటే గోళ్లతో బయటకు లాగి ఉండవచ్చు" అని మెక్‌గ్రా వివరించారు.
"మా పరిశోధనను సమీక్షించిన వారిలో ఒకరు శిలాజాలు భద్రపరిచే కేంద్రానికి వెళ్లి టౌంగ్ చిన్నారి అవశేషాలను పరిశీలించారు. వాటిపై ఉన్న గాయాలు కూడా సరిగ్గా ఇలాగే ఉన్నాయని గుర్తించారు" అని ఆయన తెలిపారు.
వేట పక్షులు మన మానవ పూర్వీకులను తరచూ తినేవని మెక్‌గ్రా నమ్ముతున్నారు. ప్రైమేట్స్ పరిణామ క్రమంలో, ముఖ్యంగా మానవ పరిణామంలో, పక్షుల నుంచి ఎదురైన వేట ప్రమాదం కీలకమైన ప్రభావాన్ని చూపి ఉండవచ్చని ఆయన అంటున్నారు.
"ఇప్పటివరకు సేకరించిన మానవ శిలాజాలను మరోసారి నిశితంగా పరిశీలిస్తే.. వేటాడే పక్షుల దాడులకు సంబంధించిన మరిన్ని గుర్తులు లభించే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఏం వెతకాలో తెలుసుకున్నాం. తాయ్ అడవుల్లో కనిపించిన ఆధారాలే ప్రామాణికమైతే.. ఇలాంటి దాడులు సాధారణంగానే జరిగి ఉండవచ్చు" అని మెక్‌గ్రా తెలిపారు.
మానవ పరిణామ క్రమాన్ని ఎలా ప్రభావితం చేశాయి?
ప్రాచీన మానవులు ఇతర జంతువులకు ఆహారంగా మారేవారనడానికి పాలియోఆంత్రోపాలజీ పరిశోధనల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయని బ్రిటన్‌లోని బ్రైటన్ యూనివర్సిటీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్త జేమ్స్ కోల్ చెబుతున్నారు.
"ముఖ్యంగా తొలి మానవ జాతులకు చెందిన వారు వేటకు బలయ్యేవారు. డేగ చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆస్ట్రాలోపిథెకస్ ఆఫ్రికానస్ జాతికి చెందిన చిన్నారి ఇందుకు ఉదాహరణ" అని ఆయన వివరించారు.
"మన పూర్వీకులు అనేక మాంసాహార జంతువులకు ఆహారంగా మారారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు" అని కోల్ తెలిపారు.
డేగల నుంచి చిరుతలు, హైనాలు, భారీ మొసళ్ల వరకు ఎన్నో జంతువుల నుంచి తప్పించుకోవాల్సిన అవసరం మన పూర్వీకుల పరిణామ క్రమంపై ప్రభావం చూపి ఉండవచ్చు. భారీ పక్షులకు ఆహారంగా మారే ప్రమాదం మన శరీర నిర్మాణంతో పాటు ఆలోచనా విధానాన్ని కూడా ప్రభావితం చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఉదాహరణకు.. రెండు కాళ్లపై నడిచే సామర్థ్యం వల్ల మన పూర్వీకులకు దూరం నుంచే వేటగాళ్లను గుర్తించడం సులభమైంది. పరస్పర సహకారం, ఇతరుల పట్ల శ్రద్ధ, ఒకరిపై మరొకరు ఆధారపడటం, సమూహంగా ఉండటం కూడా రక్షణ కల్పించి ఉండవచ్చు.
"సమూహంగా ఉంటే ప్రమాదాల నుంచి రక్షణ పొందే అవకాశాలు ఎక్కువ. అందుకే సమూహ పరిమాణం చాలా కీలకంగా మారింది" అని కోల్ చెప్పారు.
వేటాడే పక్షుల నుంచి తప్పించుకోవాలంటే పెద్ద సమూహాలుగా ఉండటమే మంచిదని మెక్‌గ్రా అన్నారు.
సింహాలు, తోడేళ్ల వంటి జంతువులు తమ ఆహారాన్ని వెంబడించి వేటాడతాయి. కానీ, డేగలు మాత్రం ఆకస్మికంగా దాడి చేసే పక్షులు. ఇవి నిశ్శబ్దంగా చెట్లపై మాటువేసి, సరైన సమయం కోసం ఎదురుచూస్తాయి. క్రౌన్డ్ ఈగిల్స్ కూడా ఇలాగే చెట్లపై దాక్కుంటాయి.
అందువల్ల, ఆకస్మిక దాడుల నుంచి తప్పించుకోవడానికి మనుషులు సమూహాలుగా జీవించే స్వభావాన్ని అలవర్చుకుని ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఒకరు ప్రమాదాన్ని గుర్తించకపోయినా.. మరొకరు గమనించే అవకాశం ఉంటుంది. దీన్నే 'మెనీ ఐస్ ఎఫెక్ట్' (అనేక కళ్లు ఒకేసారి నిఘా ఉంచడం) అంటారు.
పెద్ద సమూహాలుగా జీవించడం వల్ల భాష ఆవిర్భావానికి కూడా మార్గం ఏర్పడి ఉండవచ్చని కోల్ చెబుతున్నారు.
"పెద్ద సమూహాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కో బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. కొందరు ఒక పని చేస్తుంటే.. మరికొందరు మరో పని చేస్తుంటారు. ఇందుకు సమన్వయం అవసరం. సమూహంలోని వ్యక్తులు వేర్వేరు పనుల్లో నిమగ్నమైనప్పుడు.. ఒకరినొకరు నేరుగా చూసుకుంటూ మాత్రమే సమాచారాన్ని చేరవేయడం సాధ్యం కాదు" అన్నారాయన.
సైగల ద్వారా సమాచారాన్ని తెలియజేయాలంటే ఒకరినొకరు చూడగలగాలి. కానీ, దూరంగా ఉన్నవారిని సమన్వయం చేయాల్సి వచ్చినప్పుడు, ముఖ్యంగా వేటగాడు వస్తున్నాడని హెచ్చరించాల్సిన సందర్భాల్లో భాష కీలకంగా మారిందని కోల్ అభిప్రాయపడ్డారు.
ఆకాశం నుంచి వచ్చే ప్రమాదాలను తప్పించుకోవాల్సిన అవసరమే భాష పరిణామానికి పునాది వేసి ఉండవచ్చని మెక్‌గ్రా సూచిస్తున్నారు.
సింహం లేదా చిరుతపులి వస్తే ఒకే రకమైన అరుపులతో ప్రైమేట్స్ హెచ్చరించుకునేవని ఆధారాలు చెబుతున్నాయి. కానీ, వేటాడే పక్షులను గుర్తించినప్పుడు మాత్రం ప్రత్యేకమైన శబ్దాలతో హెచ్చరిస్తాయి. ఇలాంటి సంకేతాలివ్వడం మానవ భాషకు ముందస్తు రూపం అయి ఉండవచ్చని ఆయన భావిస్తున్నారు.
20 అడుగుల పొడవున్న రెక్కలు
భారీ వేట పక్షులు, మన పూర్వీకులు ఎక్కువగా ఎదురుపడిన ప్రాంతం అమెరికా ఖండాలేనని భావిస్తున్నారు.
ప్రాచీన అమెరికా ప్రజలకు 'టెరటార్న్' అనే భారీ మాంసాహార పక్షులు ఎదురయ్యేవి. ఇవి తమ ఆహారాన్ని పూర్తిగా మింగేయగలిగేవి. రాబందులను పోలి ఉండే ఈ పక్షులు తమ రెండు రెక్కలు చాపితే ఆ రెక్కల చివర్ల మధ్య దూరం(వింగ్ స్పాన్) 20 అడుగులు ఉండేది. ఇవి చనిపోయిన జంతువుల మాంసాన్ని తినడంతో పాటు.. బతికున్న జంతువులను కూడా వేటాడేవి.
లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో పక్షుల శరీర నిర్మాణ విభాగానికి చెందిన సీనియర్ క్యూరేటర్ జోన్నే కూపర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పక్షులు ఎంత భారీగా ఉండేవంటే వాటి రెక్కలు విప్పితే చాలు గాలి వాలుకు ఆకాశంలోకి ఎగిరిపోయేవని వివరించారు.
దాదాపు 2.5 కోట్ల ఏళ్ల పాటు టెరటార్న్‌లు ఆకాశాన్ని ఏలాయి. సుమారు 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయాయి. అయితే, అప్పటికే ఆది మానవులు అమెరికా ఖండాలకు చేరుకున్నారు.
స్థానిక అమెరికన్ తెగల పురాణాల్లో కనిపించే 'థండర్‌బర్డ్' కథలకు టెరటార్న్‌లే ప్రేరణ అయి ఉండవచ్చని కూపర్ అంటున్నారు. ఈ గాథల్లో థండర్‌బర్డ్‌కు భారీ రెక్కలు ఉంటాయి. ఉరుములు, మెరుపులను నియంత్రించే శక్తి దానికి ఉందని నమ్ముతారు.
ఐయోలోర్నిస్ ఇన్‌క్రెడిబిలిస్ అనే జాతిని 'ఇన్‌క్రెడిబుల్ టెరటార్న్' అని కూడా పిలుస్తారు. ఇవి దక్షిణ కాలిఫోర్నియా, నెవాడా ప్రాంతాల్లో సంచరించేవి. వీటి రెక్కల విస్తీర్ణం 5.5 మీటర్లు (18 అడుగులు) వరకు ఉండేది.
ఇక ఉత్తరాన ఒరెగాన్ ప్రాంతంలో నివసించిన టెరటార్నిస్ వుడ్‌బర్నెన్సిస్ అనే మరో జాతి పక్షి రెక్కల విస్తీర్ణం 4 మీటర్లు (14 అడుగులు) ఉండేది. సుమారు 12 వేల ఏళ్ల క్రితం జీవించిన ఈ భారీ పక్షి అవశేషాలు.. మమ్మోత్‌లు, మాస్టోడాన్‌లు, నేలపై నివసించే భారీ స్లాత్‌లతో పాటు ఆది మానవుల అవశేషాలు లభించిన ప్రాంతంలోనే బయటపడ్డాయి.
ప్రపంచానికి మరోవైపు ఉన్న న్యూజీలాండ్‌లోనూ ఇలాంటి భారీ పక్షుల గురించి కథలు ప్రచారంలో ఉన్నాయి. పిల్లలను ఎత్తుకెళ్లే భారీ డేగ 'టె హోకియోయి' గురించి మావోరీ ప్రజల్లో ఓ పురాణ గాథ ఉంది. ఈ కథకు అంతరించిపోయిన భారీ హాస్ట్ డేగే ఆధారం అయి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
హాస్ట్ డేగ "ఎగిరే పులి" లాంటిదని కూపర్ అభివర్ణించారు. ప్రస్తుతం జీవించి ఉన్న అతిపెద్ద డేగ జాతుల్లో ఒకటైన హార్పీ ఈగిల్ కంటే హాస్ట్ డేగ బరువు దాదాపు రెండింతలు ఉండేది.
ఈ భారీ డేగలు నేలపై నివసించే మరో పెద్ద పక్షి 'మోవా'ను వేటాడేవి. మోవా పక్షులు సుమారు 4 మీటర్ల (13 అడుగుల) ఎత్తు ఉండేవి. హాస్ట్ డేగలు వేగంగా కిందికి దూసుకొచ్చి.. తమ 10 సెంటీమీటర్ల పొడవైన గోళ్లతో మోవా వీపుపై బలంగా దాడి చేసేవి. ఆ దెబ్బకు అవి నేలకూలిపోయేవి.
"కొన్ని మోవా పక్షుల ఎముకలపై భారీ గోళ్ల గుర్తులు కనిపించాయి. హాస్ట్ డేగలు మనుషులపైనా దాడి చేయగలిగేవి. ముఖ్యంగా చిన్నారులకు వాటి నుంచి ప్రమాదం పొంచి ఉండేది" అని కూపర్ చెప్పారు.
మావోరీ, ఉత్తర అమెరికా సంస్కృతులతో పాటు గ్రీకు పురాణాల్లోనూ పిల్లలను ఎత్తుకెళ్లే పక్షుల గురించి కథలు ఉండటానికి ఇదే కారణం అయి ఉండవచ్చని భావిస్తున్నారు. గ్రీకు పురాణాల్లో పిల్లలను తీసుకొచ్చే కొంగల గురించి కాకుండా.. పిల్లలను ఎత్తుకెళ్లే పక్షుల ప్రస్తావన కూడా కనిపిస్తుంది.
"ఈ భారీ పక్షులు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు వాటి నీడ నేలపై పడేది. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతుల్లోనూ వాటి ప్రభావం చాలా కాలం కొనసాగింది" అని కూపర్ చెప్పారు.
పిల్లలను వేటాడిన డేగలు
పిల్లలను ఎత్తుకెళ్లే డేగల గురించి కథలు కేవలం ప్రాచీన చరిత్రకే పరిమితం కాలేదు. 19వ శతాబ్దంలో అమెరికాలోని టెన్నెసీ నుంచి వెలువడిన ఓ వార్తలోనూ ఇలాంటి ఘటన ప్రస్తావనకు వచ్చింది.
ఆ కథనం ప్రకారం, ఓ భారీ బూడిద రంగు డేగ ఒక్కసారిగా కిందికి దూసుకొచ్చి.. ఓ బాలుడి దుస్తులను తన బలమైన గోళ్లతో పట్టుకుని ఎత్తుకెళ్లినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ పనిమనిషి ఆ పక్షిని వెంబడించారు.
దాదాపు రెండు మైళ్ల దూరం వెళ్లిన తర్వాత ఆ పక్షి బాలుడిని కాసేపు కిందకు దించింది. సమీపంలో ఉన్న ఓ వేటగాడు పెద్దగా అరవడంతో ఆ పక్షి అక్కడి నుంచి ఎగిరిపోయింది. అదృష్టవశాత్తూ ఆ పిల్లాడికి ఎలాంటి గాయాలు కాలేదు. ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నాడు.
భారీ పక్షుల నుంచి మనుషులు ఎలా బయటపడ్డారు?
భారీ వేట పక్షులు మొత్తంగా దాదాపు 5 కోట్ల ఏళ్ల పాటు ఆకాశంపై ఆధిపత్యం చెలాయించాయి. ఆ తర్వాత, 26 లక్షల ఏళ్ల క్రితం భూమిపై ప్లీస్టోసీన్ మహా మంచుయుగం ప్రారంభమైంది. ఈ కాలంలో వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవి మానవ పరిణామ క్రమాన్ని ముందుకు నడిపించాయని భావిస్తున్నారు.
అయితే, ఈ యుగం ముగిసే సమయానికి అంటే సుమారు 11,700 ఏళ్ల కిందట.. భారీ క్షీరదాలతో పాటు అతిపెద్ద వేట పక్షులు కూడా దాదాపుగా అంతరించిపోయాయి.
ఈ భారీ జంతువులు అంతరించిపోవడానికి వాతావరణ మార్పులా? మానవుల వేటనా? అనే విషయంలో నిపుణులకు ఇంకా స్పష్టత లేదు. అయితే, మనుషుల సంఖ్య పెరగడం, పర్యావరణ వ్యవస్థలో వారు తీసుకొచ్చిన మార్పులతో ప్రపంచంలోని భారీ జంతువుల్లో దాదాపు 95 శాతం అంతరించిపోయాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
"మనం వాటిని ఆహారంగా తీసుకోవడానికి ప్రయత్నించాం. లేదంటే వాటితో ఆహారం కోసం పోటీపడ్డాం" అని కూపర్ అన్నారు. మనుషులు, వేటాడే పక్షులకు మధ్య ఇప్పటికీ కనిపించే ఆసక్తి, అప్రమత్తతకు ఇదే కారణం కావచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
"ఆ పక్షులంటే మనకు ఎంతో ఆసక్తి. వాటిని గౌరవిస్తాం. అయితే, వాటితో కలిసి జీవించడానికి మాత్రం అంతగా ఇష్టపడం" అని ఆమె పేర్కొన్నారు.
ప్లీస్టోసీన్ యుగం ముగిసే సమయానికి వాతావరణం క్రమంగా స్థిరపడటం ప్రారంభమైంది. హిమానీనదాలు వెనక్కి తగ్గాయి. మనుషులు వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. అలా మానవ యుగానికి నాంది పలికింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)