మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
బైడెన్‌ను అధికారానికి దూరం చేసిన ‘ఆర్థిక’ ఇబ్బందే ఇప్పుడు ట్రంప్‌కూ ఎదురవుతోంది, మరి ఆయనేం చేస్తారు?
- రచయిత, మిషెల్ ఫ్లేరీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
వైట్‌హౌస్ ముందు ఇప్పుడు మళ్లీ పాత సమస్యే నిలిచింది. అమెరికా ఆర్థిక గణాంకాలు పెద్దగా ప్రతికూలంగా కనిపించడం లేదు. కానీ అక్కడి ప్రజల అభిప్రాయం మాత్రం మరో కథ చెబుతోంది.
2024లో జో బైడెన్‌కు ఇలాంటి పరిస్థితే పెద్ద సవాలుగా మారింది. ఆ సమయంలో అమెరికా ఆర్థిక గణాంకాలు చాలావరకు బలంగానే ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థ తమ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తోందనే నమ్మకాన్ని ఓటర్లలో కల్పించడంలో ఆయన విఫలమయ్యారు.
ఇప్పుడు డోనల్డ్ ట్రంప్ కూడా ఇలాంటి సవాలునే ఎదుర్కొంటున్నారు.
2024 ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్.. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు ఉపశమనం కల్పిస్తానని హామీ ఇచ్చారు. "అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన వెంటనే ధరలను తగ్గిస్తాను" అని ఆయన ప్రకటించారు.
కానీ, ఈ హామీని నెరవేర్చడం అనుకున్నదానికంటే చాలా కష్టంగా మారింది.
అమెరికా ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉంది. నిరుద్యోగం తక్కువగానే ఉంది. స్టాక్ మార్కెట్ కూడా రికార్డు స్థాయికి దగ్గరగా ఉంది.
అయితే మధ్యంతర ఎన్నికలకు ముందు విడుదలైన తాజా ద్రవ్యోల్బణ నివేదిక.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను మరోసారి బయటపెట్టింది. నిత్యావసర వస్తువుల ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి.
కానీ బైడెన్, ట్రంప్ ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలు వేర్వేరుగా ఉన్నాయి.
కోవిడ్ మహమ్మారి తర్వాత ఏర్పడిన ఆర్థిక పరిస్థితులను బైడెన్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
ట్రంప్ మాత్రం పెరుగుతున్న ఇంధన ధరల సమస్యను ఎదుర్కొంటున్నారు.
అమెరికా, ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌తో చేస్తున్న ఘర్షణ కూడా ఇందుకు ఓ కారణం. అలాగే ట్రంప్ వాణిజ్య, వలస విధానాల ప్రభావం కూడా కనిపిస్తోంది.
అయితే రాజకీయంగా ఇద్దరికీ ఎదురవుతున్న పరిస్థితి దాదాపు ఒకేలా ఉంది.
ప్రజలు దేశ ఆర్థిక పరిస్థితిని జీడీపీ గణాంకాలు లేదా స్టాక్ మార్కెట్ రికార్డులను చూసి అంచనా వేయరు.
సూపర్ మార్కెట్‌లో సరుకులు కొనడానికి ఎంత ఖర్చవుతోంది? పెట్రోల్ ధర ఎంత ఉంది? రోజువారీ ఖర్చులకు డబ్బు సరిపోతోందా? అనే విషయాలనే చూస్తారు.
గణాంకాలతో పూర్తి వాస్తవం తెలియదు
అమెరికా ఆర్థిక వ్యవస్థ 2.2 శాతం వృద్ధి సాధించడం అనేది ఇతర సంపన్న దేశాలతో పోలిస్తే మంచి విషయమే.
ఉదాహరణకు జర్మనీ వేగంగా ఆర్థిక వృద్ధిని సాధించడానికి ఇబ్బంది పడుతోంది.
మరోవైపు అమెరికాలో నిరుద్యోగ రేటు 4.2 శాతంగా స్థిరంగా ఉంది. దీన్ని చూస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా పడిపోతోందని అనిపించడం లేదు.
దిగజారిన ఆర్థిక పరిస్థితులు బైడెన్ నుంచి తనకు వారసత్వంగా వచ్చాయని ట్రంప్ చెబుతున్నారు.
ఆర్థిక వృద్ధి, పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ మంచి పనితీరును కనబరచడం తన విధానాలు పనిచేస్తున్నాయనడానికి నిదర్శనమని ఆయన పేర్కొంటున్నారు.
"ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధి విధానాలు బైడెన్ హయాంలో ఏర్పడిన ద్రవ్యోల్బణ సంక్షోభ ప్రభావాన్ని తగ్గించాయి" అని తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలైన తర్వాత వైట్‌హౌస్ ప్రతినిధి మాథ్యూ మిడిల్టన్ అన్నారు.
ప్రస్తుత ఆర్థిక వృద్ధిని ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పరిణామంగా ట్రంప్‌కు సన్నిహితుడు, ఆర్థిక వ్యవహారాల విశ్లేషకుడు లారీ కుడ్లో అభివర్ణించారు. అంతేకాకుండా "ఎవరి ఉద్యోగం పోయే పరిస్థితి లేదు" అని అన్నారు.
కానీ ఓటర్లు మాత్రం ఈ పరిస్థితిని మరోలా చూస్తున్నారు. ద్రవ్యోల్బణం, రోజువారీ ఖర్చుల భారం తగ్గిస్తానని హామీ ఇచ్చి ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. కానీ ఇప్పటికీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
దీనికి ఒక కారణం.. పెరిగిన ధరల స్థాయిలో వేతనాలు పెరగకపోవడం.
గతేడాది సగటున గంటకు వేతనం 3 శాతం పెరిగితే, వినియోగ వస్తువుల ధరలు మాత్రం 3.7 శాతం పెరిగాయి.
అందుకే సర్వేల్లో ఆర్థిక వ్యవస్థను ట్రంప్ నిర్వహిస్తున్న తీరుపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
పదం ఒకటే.. కానీ అర్థాలు వేరు
డెమొక్రటిక్ పార్టీకి ఈ పరిస్థితి కొత్తేమీ కాదు.
ఆర్థికవేత్తలు, సామాన్య ప్రజలు ఒకే పదాన్ని వేర్వేరు అర్థాల్లో ఉపయోగించడం వల్లే సమస్య మొదలవుతోందని ఆ పార్టీకి చెందిన ఎన్నికల సర్వే నిపుణురాలు సెలిండా లేక్ అన్నారు.
"ద్రవ్యోల్బణం తగ్గిందని ఆర్థికవేత్తలు చెప్పినప్పుడు.. ధరలు పెరిగే వేగం తగ్గిందని వారి అర్థం" అని ఆమె వివరించారు.
"కానీ ద్రవ్యోల్బణం తగ్గిందని ఓటర్లకు చెప్పినప్పుడు.. ధరలు గతంలో ఉన్న స్థాయికి తగ్గాయని భావిస్తారు. కానీ వాస్తవానికి అలా ఎప్పుడూ జరగదు" అని ఆమె వివరించారు.
బైడెన్ ప్రభుత్వం 2024లో నిరుద్యోగం తక్కువగా ఉండడం, బలమైన ఆర్థిక వృద్ధి, తగ్గిన ద్రవ్యోల్బణం వంటి అంశాలను తమ విజయాలుగా చెప్పుకోవడంలోనే ఎక్కువ సమయం గడిపింది.
అయితే రోజువారీ జీవితంలో పెరుగుతున్న ధరలతో చాలామంది ఓటర్లు ఇబ్బంది పడుతూనే ఉన్నారు.
2020 అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ ప్రచార బృందానికి సలహాదారుగా పనిచేసిన సెలిండా లేక్.. 2024 ఎన్నికల్లో మాత్రం ప్రచారంలో పాల్గొనలేదు. ఆర్థిక గణాంకాల ఆధారంగా కాకుండా, తమ వ్యక్తిగత అనుభవాల ఆధారంగా ఓటర్లు ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తారని ఆమె చెప్పారు.
"ప్రజలను వారి జీవితాల్లో ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యల గురించి వాదించి ఒప్పించ లేరు" అని ఆమె అన్నారు.
బైడెన్ ఎదుర్కొన్న ఇలాంటి సవాలునే ఇప్పుడు ట్రంప్ కూడా ఎందుకు ఎదుర్కొంటున్నారో అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
ట్రంప్ విధానాల ప్రభావం
బైడెన్‌పై విమర్శలు చేసినవారందరూ ద్రవ్యోల్బణానికి ఆయనే కారణమని ఆరోపించారు.
అయితే కరోనా మహమ్మారి, దాని వల్ల సరఫరా వ్యవస్థలో ఏర్పడిన సమస్యలు తన నియంత్రణలో లేవని బైడెన్ చెప్పుకునే అవకాశం ఉంది.
కానీ ట్రంప్‌కు ఆ అవకాశం లేదు.
ప్రస్తుతం ధరలు పెరగడానికి ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఒక కారణమని, ఇందులో దిగుమతులపై విధిస్తున్న సుంకాలతో పాటు, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల కలుగుతున్న ఆర్థిక ప్రభావాలు కూడా ఉన్నాయని కొంతమంది ఆర్థికవేత్తల అభిప్రాయపడుతున్నారు.
"ద్రవ్యోల్బణానికి స్పష్టంగా డోనల్డ్ ట్రంపే కారణం" అని పబ్లికన్ భావజాలానికి మద్దతు ఇచ్చే యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఆర్థికవేత్త పీటర్ మోరిసీ అన్నారు.
"ఆయన విధించిన దిగుమతి సుంకాలు, యుద్ధం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ప్రజలకు ఈ విషయం తెలుసు. వారు దాన్ని గమనిస్తున్నారు" అని మోరిసీ చెప్పారు.
ఏప్రిల్ 2025లో ట్రంప్ ప్రకటించిన 'లిబరేషన్ డే' దిగుమతి సుంకాల వల్ల వినియోగదారులకు వస్తువుల ధరలు పెరిగాయి.
ఈ సుంకాల వల్ల వినియోగ వస్తువుల ధరలు సుమారు 2.9 శాతం పెరిగాయని న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అధ్యయనం పేర్కొంది.
తర్వాత మరో ఎదురు దెబ్బ తగిలింది.
ఇరాన్‌తో యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగాయి. దీంతో పెట్రోల్ ధరలు కూడా పెరిగి, కుటుంబాల ఖర్చుల భారం మరింత ఎక్కువైంది.
పన్నుల తగ్గింపు, ఉద్యోగాల పెరుగుదల, మందుల ధరల తగ్గింపుతో అమెరికా కుటుంబాలకు తమ ప్రభుత్వం మేలు చేస్తోందని వైట్‌హౌస్ చెబుతోంది.
అంతేకాకుండా ప్రజలపై ఆర్థిక భారం తగ్గించే విధానాలపై ప్రభుత్వం ఇప్పుడు ఎక్కువగా దృష్టి పెడుతోంది.
క్రెడిట్ కార్డుల వడ్డీ రేట్లపై గరిష్ఠ పరిమితి విధించాలని ట్రంప్ కోరుతున్నారు.
రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తే, ప్రతి అమెరికన్ వయోజనుడికి 5,000 డాలర్లు ఇవ్వవచ్చనే ప్రతిపాదనను కూడా ఆయన ముందుకు తెచ్చారు.
ఈ చర్యలు రెండు పార్టీలకు తెలిసిన ఓ రాజకీయ వాస్తవాన్ని తెలియజేస్తున్నాయి.
ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు.. ఆర్థిక వృద్ధి బాగుంది, నిరుద్యోగం తక్కువగా ఉందనే వాదనలు వారికి సరిపోవు.
ఆర్థిక పరిస్థితి బాగున్నా, ప్రజల్లో నమ్మకం లేకపోవడానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే మార్గాన్ని బైడెన్ కనుగొనలేకపోయారు.
ఇప్పుడు మధ్యంతర ఎన్నికల ముందు ట్రంప్ ముందున్న ప్రశ్న ఒక్కటే.. ఆయన ఈ పరిస్థితిని మార్చగలరా?
ఇటీవలి రాజకీయ చరిత్రను చూస్తే.. ఆర్థిక గణాంకాల కంటే ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు ఉన్న అభిప్రాయమే ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)