మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
ఇండియా కూటమి ర్యాలీ : ‘ఓటు దొంగలను ఎక్కడికీ పోనివ్వం, చట్టం ముందు నిలబెడతాం’
దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ "ఈ దేశంలో చాలా సంవత్సరాలుగా ఓట్ల దొంగతనం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటకలో 2024 లోక్‌సభ ఎన్నికలలో ఓట్ల దొంగతనం జరిగింది. ఈవీఎంల ద్వారా ఓట్ల దొంగతనం జరిగింది, ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించి, చాలా మంది పేర్లను చేర్చడం ద్వారా ఓట్లను దొంగిలించారు." అన్నారు.
ఓటర్ల జాబితా నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత 13 కోట్లకు పైగా ఓటర్లను తొలగించారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ఓటర్ల పేర్లను తొలగించడమే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమికి కారణమని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.
ఈ ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, సీపీఐఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ ఏమన్నారు?
రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన ర్యాలీనుద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ "దేశాన్ని తిరిగి సరైన మార్గంలోకి తీసుకురావడానికి మొదటి అడుగు జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించడమే. నరేంద్ర మోదీ ఎక్కడికీ వెళ్లడం లేదని అమిత్ షా అంటున్నారు. మిమ్మల్ని, నరేంద్ర మోదీని ఎక్కడికీ వెళ్లనివ్వం అని నేను చెబుతున్నా'' అన్నారు రాహుల్ గాంధీ.
''జ్ఞానేశ్ కుమార్ తర్వాత, మీ దగ్గరకు వస్తాం. మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం'' అన్నారు.
"మీరు శివుడి వివాహ ఊరేగింపు గురించి వినే ఉంటారు. అందులో ఎవరైనా చేరవచ్చు. ఆ తాండవంలో ఎవరైనా నృత్యం చేయవచ్చు. ఎవరైనా స్వేచ్ఛగా వెళ్లగలిగే భారతదేశాన్ని మేం కోరుకుంటున్నాం."
''ఒక రైతు కష్టపడితే, తన కలలను సాకారం చేసుకునే అవకాశం ఉండాలి. ఒక విద్యార్థి 18 గంటలు చదివితే, అతనికి ప్రతిఫలం లభించాలి. ఈ దేశం కొద్దిమంది కోసమే ఉండకూడదు అన్నారు. ఓట్ల దొంగతనం సాధారణమైనది కాదని, అది దేశద్రోహమని, జ్ఞానేశ్ కుమార్ లేకుండా నరేంద్ర మోదీ ప్రధాని, అమిత్ షా హోం మంత్రి అయ్యేవారు కారని'' రాహుల్ అన్నారు.
''ప్రజాస్వామ్యాన్ని కాపుకాస్తాం. ప్రజాగళం వినిపిస్తాం. రాజ్యాంగం కంటే మీరు గొప్పవారు కాదు'' అని రాహుల్ చెప్పారు.
రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, "రామలీలా మైదాన్‌లో రామాయణం నిర్వహిస్తారని, , కానీ మేమిక్కడ ఓటు దొంగల కోసం 'మహాభారతం' నిర్వహించాం.భారతంలో శకుని ఏ ఆట ఆడాడో మీ అందరికీ తెలుసు. శకుని పాచికలు వేసినప్పుడు, అవి ఆయన చెప్పినట్టే పడ్డాయి. అంటే అక్కడ మోసం జరిగింది. కాబట్టి మహాభారత యుద్ధం తప్పలేదు'' అన్నారు.
ర్యాలీకి హాజరైన ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ, "పశ్చిమ బెంగాల్ ఎన్నికలను వారు చోరీ చేశారని దేశంలో అందరికీ తెలుసు. బెంగాల్ ఎన్నికల చిత్రాలను ఎవరూ మర్చిపోలేరు, అక్కడ వారు లక్షలాది సైనిక బలగాలను మోహరించి, ఎన్నికలకు ముందే సర్ ద్వారా ఓట్లను తగ్గించారు. మేం వారి దొంగతనాన్ని బయటపెట్టాం. మేం ఓటమిని అంగీకరించబోము."
ఈరోజు రామ్‌లీలా మైదానం ప్రజాస్వామ్యపు హల్దీఘాటిగా మారిందన్నారు అఖిలేష్.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, "ఎస్ఐఆర్ సృష్టించిన పరిస్థితికి బెంగాల్ బలి అయింది. మేము దానిని వదిలిపెట్టం. పోరాడతాము. వారు బెంగాల్‌ను దోచుకున్నారు, మేము దిల్లీ నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకువస్తాం." అన్నారు.
‘‘పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు ముందు కోటికి పైగా ఓట్లను తొలగించారని, తాను ఎన్నికల్లో ఓడిపోలేదని, కేవలం పరాజయం పాలయ్యానని’’ మమత చెప్పారు.
"బీహార్‌లో వీళ్ళు ఎస్ఐఆర్ ప్రారంభించినప్పటి నుండి యావత్ దేశం దానిని చూసి, బాధపడింది. ఇది ప్రజాస్వామ్యంపై అధికార పార్టీ చేసిన సర్జికల్ స్ట్రైక్. సామాన్య ప్రజల ఓట్లను లాక్కోవడానికి ఎస్ఐఆర్ ఒక సాధనమని ఇప్పుడు దేశం మొత్తం అర్థం చేసుకుంది," అని సీపీఐఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య అన్నారు.
అంతకుముందు, శనివారం దిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన మాక్ పార్లమెంటులో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై 'ప్రజా అభిశంసన' తీర్మానాన్ని ఇండియా అలయన్స్ ఆమోదించింది.
మరోపక్క ఆదివారం నాటి ప్రతిపక్షాల ర్యాలీకి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడువేలకుపైగా పోలీసులను, 10వేలమంది పారామిలటరీ సిబ్బందిని మోహరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)