రామ్‌లీలా: కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇక్కడ చేస్తున్న ఆందోళన లక్ష్యం ఏంటి? బీజేపీ ఏం చేస్తోంది?

    • రచయిత, దుష్యంత కుమార్
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం జరగనున్న ఇండియా కూటమి ర్యాలీకి పది లక్షల మంది వస్తారని నిర్వాహకులు చెబుతున్నారు.

అయితే, ఈ కార్యక్రమం నేపథ్యంలో కాంగ్రెస్, రాహుల్ గాంధీ ముందున్న ప్రధాన రాజకీయ ప్రశ్న ఒకటే. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలోకి సామాన్య ప్రజలను ఎంతవరకు భాగస్వాములను చేయగలరు?

ర్యాలీకి ఒక రోజు ముందు, అక్టోబర్ 31న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో 'మాక్ పార్లమెంట్' నిర్వహించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఇందులో తీర్మానం ఆమోదించారు. ప్రజల గొంతుకను పార్లమెంట్‌లో వినిపించేందుకు అవకాశం ఇవ్వడం లేదని, అందుకే ప్రతిపక్షాలు బయటకు వచ్చి సమావేశం కావాల్సి వచ్చిందని రాహుల్ గాంధీ అన్నారు.

పార్లమెంట్‌ లోపల తమ డిమాండ్లను ముందుకు తీసుకెళ్లలేకపోయిన ప్రతిపక్షాలు ఇప్పుడు బయట ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రతిపక్షాల ఆందోళనలకు వ్యతిరేకంగా బీజేపీ కూడా పోటీ ఆందోళనను హరియాణాలోని రోహ్‌తక్‌లో నిర్వహిస్తోంది. లోక్‌తంత్ర్ బచావో, అరాజక్తా హటావో పేరుతో పాదయయాత్ర మొదలుపెడుతోంది.

ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నాయి?

ఈ ర్యాలీ కోసం వివిధ రాష్ట్రాల నుంచి కార్యకర్తలను దిల్లీకి తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు, సామాజిక సంస్థల ప్రతినిధులు సహా పలువురు ర్యాలీలో పాల్గొనాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

పార్లమెంట్‌లో తమ డిమాండ్లను ముందుకు తీసుకెళ్లలేకపోవడంతో ఇప్పుడు ప్రజల మద్దతు కోరుతున్నామని ప్రతిపక్షాలు తెలియజేయాలనుకుంటున్నాయని, తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయని సీనియర్ జర్నలిస్ట్ శరద్ గుప్తా అభిప్రాయపడ్డారు.

'మాక్ పార్లమెంట్', ర్యాలీ రెండింటినీ కలిపి చూడాల్సిన అవసరం ఉందని గుప్తా అన్నారు. ఎస్ఐఆర్, ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని నిరంతరం చర్చలో ఉంచడమే ఈ రెండు కార్యక్రమాల ఉద్దేశమని పేర్కొన్నారు.

పండుగల సమయంలోనూ ఈ ఉద్యమాన్ని కొనసాగించడం ప్రతిపక్షాల వ్యూహంలో భాగమేనని శరద్ గుప్తా విశ్లేషించారు. పండుగల సమయంలో ప్రజల దృష్టి ఇతర అంశాలపైకి మళ్లుతుందని, దీపావళి వరకు ఉద్యమాన్ని నిలిపివేస్తే మళ్లీ ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి సమయం పడుతుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని చెప్పారు.

ఇదిలా ఉండగా, ర్యాలీని వాయిదా వేయాలని వ్యాపార సంస్థల సమాఖ్య చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సోనియా గాంధీని కోరింది. ఈ కార్యక్రమం వల్ల రూ.12,000 కోట్ల వ్యాపారంపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

అయితే, ర్యాలీ నిర్వహణకు దిల్లీ పోలీసులు ఇప్పటికే అనుమతి ఇచ్చారు. రామ్‌లీలా మైదానంలో కార్యక్రమం నిర్వహించేందుకు నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీ చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' వెల్లడించింది. ఏర్పాట్ల విషయంలో నిర్వాహకులు, సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

కాంగ్రెస్ తన వాదనను ఎవరికి చేరవేయాలనుకుంటోంది?

ఈ ర్యాలీ నిర్వహణలో కాంగ్రెస్ ముందు రెండు రకాల సవాళ్లు ఉన్నాయని శరద్ గుప్తా చెప్పారు.

మొదటిది.. పార్టీ కార్యకర్తలు, మిత్రపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావడం. రెండోది.. వారి భాగస్వామ్యంతో లేవనెత్తుతున్న ప్రశ్నలను పార్టీ సమావేశాలు, నిరసన కార్యక్రమాలకు హాజరుకాని ప్రజలకు కూడా చేరవేయడం.

ర్యాలీ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు దిల్లీ కాంగ్రెస్ 20 కమిటీలను ఏర్పాటు చేసింది.

అక్టోబర్ 30న, రామ్‌లీలా మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ మాట్లాడారు. ఈ ర్యాలీకి పది లక్షల మంది హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఇది నిర్వాహక పక్షానికి చెందిన నాయకుడు చేసిన అంచనా మాత్రమే. ఈ నేపథ్యంలో ప్రజలకు తమ సందేశాన్ని చేరవేయడం కూడా కాంగ్రెస్ ముందున్న రాజకీయ సవాలుగా మారింది.

మరోవైపు దిల్లీలో ‘ఇండియా’ కూటమి ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో.. దానికి పోటీగా హరియాణాలోని రోహ్‌తక్‌లో బీజేపీ పాదయాత్ర చేపట్టనుందని ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.

'లోక్‌తంత్ర బచావో, అరజక్తా హటావో' (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని తొలగించండి) పేరుతో పార్టీ చేపట్టిన దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా ఆదివారం జరిగే ఈ పాదయాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నాయకత్వం వహించనున్నారు.

ఏఎన్ఐ కథనం ప్రకారం, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్)పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, నిరసనలకు సమాధానంగా బీజేపీ ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. రోహ్‌తక్‌లోని ఛోటూ రామ్ పాలిటెక్నిక్ మైదానం నుంచి ఉదయం 11 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. మోడల్ టౌన్‌లోని డీ-పార్క్ వద్ద ముగుస్తుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ, ఎన్నికల విధానాలపై తమ పార్టీ వైఖరిని నేరుగా ప్రజలకు తెలియజేయడమే ఈ ప్రచారం ఉద్దేశమని బీజేపీ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)