మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
అమెరికన్లు మార్పు కోరుకుంటున్నారా?
- రచయిత, సారా స్మిత్
- హోదా, ఉత్తర అమెరికా సంపాదకుడు
- ప్రచురణ
- చదివే సమయం: 9 నిమిషాలు
డోనల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవీకాలం ముగియడానికి ఇంకా రెండేళ్లు ఉండగానే, ఇప్పుడు అత్యంత కీలకమైన ఎన్నికలు ఎదురయ్యాయి.
కాంగ్రెస్‌పై ఎవరి ఆధిపత్యం ఉంటుందో మంగళవారం జరగనున్న మధ్యంతర ఎన్నికలు నిర్ణయించనున్నాయి.
అయితే ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ ఒక క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.
జీవన వ్యయం పెరగడంపైనే ఎక్కువగా ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ విధించిన కఠిన సుంకాలు, ఇరాన్‌తో సాగుతున్న యుద్ధం కారణంగా ఆహారం, ఇంధన ధరలు భారీగా పెరిగాయి. అందువల్ల ఓటు వేయడానికి వెళ్లే ప్రజల మనసుల్లో ఇదే ప్రధాన అంశంగా ఉంది.
ఇటీవలి నెలల్లో ట్రంప్ ఆమోదయోగ్యత రికార్డు స్థాయిలో తగ్గింది.
దీంతో ఆయన అమెరికా వ్యాప్తంగా డజన్ల కొద్దీ బహిరంగ సభల్లో పాల్గొంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
అయితే ధరల పెరుగుదల అన్ని వర్గాల ఓటర్లను ప్రభావితం చేస్తోంది. అందుకే సాధారణంగా రిపబ్లికన్ పార్టీకి బలమైన మద్దతు ఉన్న రాష్ట్రాల్లో కూడా ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ప్రచార చివరి వారాంతంలో ఆయన అయోవా, కాన్సాస్ రాష్ట్రాల్లో సభలు నిర్వహించారు.
అలాగే కాన్సాస్ సెనేట్ ఎన్నికల వంటి సంప్రదాయంగా సురక్షితంగా భావించే పోటీల్లో కూడా రిపబ్లికన్లు వందల మిలియన్ల డాలర్లు ప్రకటనల కోసం ఖర్చు చేస్తున్నారు.
"సాధారణంగా గెలవాల్సిన రాష్ట్రంలోనే భారీగా రాజకీయ ప్రకటనల కోసం డబ్బు ఖర్చు చేయడం చూస్తే, వారు ఇబ్బందుల్లో ఉన్నారని అర్థమవుతుంది" అని ఎన్నికలు, ప్రచారాలపై విశ్లేషణలు చేసే 'కుక్ పొలిటికల్ రిపోర్ట్' మేనేజింగ్ ఎడిటర్ క్యారీ డాన్ బీబీసీతో మాట్లాడుతూ అన్నారు.
"కాన్సాస్‌లో జరుగుతున్న ఖర్చు రిపబ్లికన్లు ముందుగా ఊహించిన దానికంటే చాలా ఎక్కువ. ఇది ఈ ఎన్నికలను ఆ పార్టీ ఆత్మరక్షణ ధోరణితో ఎదుర్కొంటోందనే విషయాన్ని సూచిస్తోంది" అని వ్యాఖ్యానించారు.
నేనే పోటీలో ఉన్నానని అనుకోండి: ట్రంప్
"ఈ ఎన్నికల్లో నేను పోటీలో ఉన్నట్టే భావించి ఓటు వేయండి. దయచేసి అలా ఊహించండి" అని గత నెలలో ఎన్నికల సభల్లో ఓటర్లకు ట్రంప్ విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆదివారం అయోవాలో జరిగిన సభలో కూడా ఆయన ఇదే మాట మళ్లీ చెప్పారు.
నిజానికి ఈ ఎన్నికల్లో ట్రంప్ స్వయంగా పోటీ చేయడం లేదు. అయినప్పటికీ ఆయన చేసిన ఈ విజ్ఞప్తి ఒక కీలక ప్రశ్నను ముందుకు తెస్తోంది. అదే, రిపబ్లికన్ పార్టీకి ట్రంప్ ఇప్పటికీ ఎన్నికల్లో ఓట్లను రాబట్టగల బలమైన నాయకుడేనా?
దీనికి ఒకప్పుడు ఉన్నంత స్పష్టమైన సమాధానం ఇప్పుడు లేదు.
2024 అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయం సాధించి వైట్ హౌస్‌కు తిరిగి వచ్చిన తర్వాత ట్రంప్ ప్రభావవంతమైన రాజకీయ నాయకుడిగా నిలిచారు. అప్పట్లో ఆయన ప్రజాదరణ కూడా బలంగా ఉండేది. 2022 మధ్యంతర ఎన్నికల సమయంలో అయితే ట్రంప్ మద్దతు పొందేందుకు రిపబ్లికన్ అభ్యర్థులు ఆసక్తి చూపేవారు. ఆయన మద్దతు విజయానికి కీలకమని భావించేవారు.
అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతుండటం, దాని ప్రభావం అమెరికన్ల జేబులపై పడటం వల్ల ట్రంప్ ప్రజాదరణ గణనీయంగా పడిపోయింది.
యుద్ధం ప్రారంభానికి ముందు, ఫిబ్రవరిలో ఒక గ్యాలన్ డీజిల్ ధర 3.75 డాలర్లు ఉండగా, సెప్టెంబర్ నాటికి అది రికార్డు స్థాయిలో 6.52 డాలర్లకు చేరుకుంది.
"నా కుమారుడు ఇటీవల అమెరికా అంతా కారు నడుపుకుంటూ వెళ్లాడు. ప్రతి రాష్ట్రం నుంచి ఫోన్ చేసి అక్కడ పెట్రోల్ ధర ఎంత ఉందో చెప్పేవాడు. వినగానే 'అయ్యో, పరిస్థితి ఇంత దారుణంగా ఉందా!' అనిపించింది" అని అయోవాలోని ఓ ఓటరు తెలిపారు.
అమెరికాలో ద్రవ్యోల్బణం కూడా పెరిగింది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు అది 3 శాతంగా ఉండగా, ప్రస్తుతం 3.7 శాతానికి చేరింది. ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు లేకపోయి ఉంటే ద్రవ్యోల్బణం ఇంకా తక్కువగా ఉండేదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
జీవన వ్యయం, ఆర్థిక సమస్యలే ప్రధాన అజెండా
రిపబ్లికన్ పార్టీలో ఇప్పుడు మరో ఆందోళన నెలకొంది. పెరుగుతున్న జీవన వ్యయం, ఆర్థిక సమస్యలు వల్ల సాధారణంగా తమకు సురక్షితంగా భావించే టెక్సాస్, ఒహియో, కాన్సాస్ వంటి రాష్ట్రాల్లో కూడా పార్టీ బలహీనపడే పరిస్థితి ఏర్పడిందని వారు భావిస్తున్నారు.
"దక్షిణాది రాష్ట్రాలు, మధ్య పశ్చిమ రాష్ట్రాలు, అమెరికా హార్ట్ ల్యాండ్‌గా పిలిచే ప్రాంతాలు సాధారణంగా రిపబ్లికన్లకు బలమైన కోటలు" అని పోలింగ్ సంస్థ 'మోర్ ఇన్ కామన్' గ్లోబల్ రీసెర్చ్ డైరెక్టర్ స్టీఫెన్ హాకిన్స్ అన్నారు.
"కానీ ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారిన సెనేట్ పోటీలు కూడా ఇదే ప్రాంతాల్లో జరుగుతున్నాయి" అని ఆయన పేర్కొన్నారు.
"కేవలం రెండేళ్ల క్రితం అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ 10, 12, 15 శాతం ఓట్ల తేడాతో గెలిచిన రాష్ట్రాల్లోనే ఇప్పుడు డెమోక్రాట్లకు సెనేట్ సీట్లు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి" అని హాకిన్స్ అన్నారు.
నిరసనలకు సిద్ధమైన ఓటర్లు
2024లో ట్రంప్ గెలిచిన అయోవా రాష్ట్రంలో ఇంధనం, ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. అక్కడి ఓటర్లను నేను, "ట్రంప్ కారణంగా ప్రజలు రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చే అవకాశాలు పెరుగుతాయా? తగ్గుతాయా?" అని అడిగితే, వారి సమాధానం ఆసక్తికరంగా అనిపించింది.
"ప్రస్తుత పరిస్థితులను చూస్తే, నమ్మండి లేదా నమ్మకపోయినా, ట్రంప్ వల్ల రిపబ్లికన్లకు మద్దతు తగ్గే అవకాశమే ఎక్కువగా ఉందని నేను భావిస్తున్నాను" అని ఓ కళాశాల ఫుట్‌బాల్ మ్యాచ్ వెలుపల మాట్లాడిన పాల్ రాస్ అనే ఓటరు చెప్పారు.
"నేను స్వయంగా రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుడినే. అయినప్పటికీ ప్రస్తుతం ట్రంప్ ప్రభావం పార్టీకి ప్రయోజనం కంటే నష్టమే కలిగించవచ్చని అనిపిస్తోంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
"ట్రంప్ కారణంగా కొంతమంది ఓటర్లు వెనక్కి తగ్గుతున్నారనడంలో సందేహమే లేదు. అంతేకాదు, డెమోక్రాట్లకు కూడా ఇది మద్దతు ఇస్తుంది. దీనికి కారణం ఒక్కటే, అది డోనల్డ్ ట్రంప్" అని జాక్ షింప్ అన్నారు.
"మనల్ని యుద్ధంలోకి తీసుకెళ్లింది ఆయనే. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇంధన ధరలు కూడా అలాగే ఉన్నాయి" అని మరో ఓటరు రోజ్ హెమింగ్ అన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల వాస్తవ చిత్రం ఇదే. రిపబ్లికన్లకు బలమైన మద్దతు ఉన్న రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఓటర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అసంతృప్తిని మంగళవారం జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ బాక్స్ వద్ద వ్యక్తం చేయాలని వారు భావిస్తున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి.
'ట్రంప్‌పై అసంతృప్తి అంటే డెమోక్రాట్లకు అనుకూలమని కాదు'
అయితే యుద్ధం, సుంకాల విధానం, పెరుగుతున్న ధరల ప్రభావం కారణంగా డెమోక్రాట్లు ప్రతినిధుల సభ, సెనేట్, గవర్నర్ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారనుకోవడం కూడా అతిసరళమైన విశ్లేషణే అవుతుంది.
చాలామంది రిపబ్లికన్ ఓటర్లు అధ్యక్షుడు ట్రంప్‌పై అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే. కానీ ఆ అసంతృప్తి కారణంగా వారు డెమోక్రాట్లకు ఓటు వేస్తారని భావించడం పొరపాటే.
ట్రంప్ అప్రూవల్ రేటింగ్ తగ్గడం అంటే ప్రత్యర్థి డెమోక్రాట్ల ప్రజాదరణ పెరుగుతోందని అర్థం కాదు.
ఎన్నికలకు ముందు నిర్వహించిన తుది సర్వేలు ట్రంప్ ఆమోదయోగ్యత సుమారు 38 శాతంగా ఉందని సూచిస్తున్నాయి. అది తక్కువే. అయితే అదే సర్వేలు, ముఖ్యంగా ఆదివారం విడుదలైన ఎన్బీసీ జాతీయ సర్వే ప్రకారం, డెమోక్రాటిక్ పార్టీని సానుకూలంగా చూసే ఓటర్ల శాతం కేవలం 29 మాత్రమే.
అంటే ప్రస్తుతం ఉన్న అసంతృప్తి ఓటర్లను తప్పనిసరిగా మరో పార్టీ వైపు మళ్లిస్తుందని చెప్పలేం. ధరల పెరుగుదల, ఆర్థిక ఇబ్బందులపై ఉన్న ఆగ్రహాన్ని ప్రజలు బ్యాలెట్ బాక్స్ వద్ద వ్యక్తం చేయొచ్చు. కానీ అది తప్పనిసరిగా డెమోక్రాట్లకు మద్దతుగా మారుతుందని హామీ లేదు.
ట్రంప్‌కు 2024లో ఓటు వేసిన అయోవాకు చెందిన రిపబ్లికన్ ఓటరు టిమ్ మెకిన్నన్ గత నెలలో నాతో మాట్లాడుతూ, "మేం సాధారణంగా ఇతరుల వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని ఇష్టపడము. కానీ ట్రంప్ వరుసగా అంతర్జాతీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అంతగా నచ్చడం లేదు" అని అన్నారు.
"ట్రంప్ ఎలాంటి తప్పులూ చేయని ఆదర్శ వ్యక్తి అవుతారని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన వ్యక్తిత్వం కంటే, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న విలువలు, విధానాలకే మద్దతు ఇచ్చాం" అని టిమ్ మెకిన్నన్ భార్య మిషెల్ మెకిన్నన్ చెప్పారు.
ట్రంప్ తాజా విధానాల్లో కొన్ని అంశాలపై అసంతృప్తి ఉన్నప్పటికీ, మెకిన్నన్ దంపతులలాంటి ఓటర్లు తమకు మద్దతుగా మారతారని డెమోక్రాటిక్ పార్టీ భావించలేరు. ఎందుకంటే తమ క్రైస్తవ, సంప్రదాయవాద విలువలకు డెమోక్రాట్లు ఎప్పటికీ ప్రతినిధ్యం వహించరని వారు నమ్ముతున్నారు.
"పెట్రోల్ ధర గ్యాలన్‌కు ఒక డాలర్ పెరిగినంత మాత్రాన నమ్మే సిద్ధాంతాలు మారిపోవు" అని టిమ్ మెకిన్నన్ స్పష్టం చేశారు.
ఫోకస్ అంతా 2028 ఎన్నికలపైనే
ఒకవేళ మంగళవారం రాత్రి డెమోక్రాట్లు పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకున్నా, అది ప్రజలు వారిపై అపారమైన ప్రేమ చూపిస్తున్నారని అర్థం కాదు. రిపబ్లికన్లతో పోలిస్తే వారిపట్ల అసంతృప్తి కొంచెం తక్కువగా ఉండటమే కారణం కావచ్చు.
అయితే డెమోక్రాటిక్ పార్టీ ఇప్పటికే 2028 అధ్యక్ష ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. ఆ ఎన్నికల్లో పార్టీ మొత్తం ఒకే అభ్యర్థి వెనుక ఏకమవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం పార్టీలో ఉన్న విభేదాలను చూసినప్పుడు అది అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఎన్నికల ప్రచారం సమయంలో ఆ అంతర్గత విభేదాలు బహిరంగంగానూ కనిపించాయి. వారాంతంలో మిచిగన్ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
2028 ఎన్నికలకు ముందు మార్గదర్శకంగా ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలను డెమోక్రాట్లు నిశితంగా పరిశీలించనున్నారు. టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో నిజంగా గెలవగలరా? రిపబ్లికన్లకు బలమైన పట్టున్న గ్రామీణ ప్రాంతాల ఓటర్లను ఆకర్షించగలరా? అలాగే జార్జియాకు చెందిన జాన్ ఓసాఫ్, టెక్సాస్‌కు చెందిన జేమ్స్ టలారికో వంటి పార్టీ యువ నాయకులు తమపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా రాణించగలరా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతారు.
ఈ ఎన్నికల ఫలితాలు కేవలం కాంగ్రెస్‌లో అధికార సమీకరణాలనే కాదు, 2028 అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రాట్ల భవిష్యత్ వ్యూహాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
ఒకవేళ ఈ ప్రశ్నల్లో కొన్నింటికైనా సమాధానం 'కాదు'గా వస్తే, రాబోయే ఏడాదిలో రిపబ్లికన్ పార్టీ తన పరిస్థితిపై లోతుగా విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే విశ్లేషణ కూడా వారికి అంత సానుకూలంగా ఉండకపోవచ్చు.
"డెమోక్రాట్లు తమ బలాన్ని మరింతగా విస్తరించుకునే అవకాశంగా మారవచ్చు. కేవలం సీట్ల సంఖ్య పెరగడమే కాదు, ఏ రాష్ట్రాల్లో, ఏ ప్రాంతాల్లో పోటీ పడగలమనే ప్రజల అభిప్రాయాన్ని కూడా మార్చుకునే అవకాశం వారికి లభిస్తుంది" అని పోలింగ్ సంస్థ 'మోర్ ఇన్ కామన్'కు చెందిన స్టీఫెన్ హాకిన్స్ అన్నారు.
"ఇప్పటి వరకు రిపబ్లికన్లకు అజేయ కోటలుగా భావించిన ప్రాంతాల్లో కూడా డెమోక్రాట్లు పోటీ ఇవ్వగలరనే భావన బలపడితే, అది పార్టీ భవిష్యత్ వ్యూహాలకు ఎంతో కీలకంగా మారుతుంది" అని ఆయన పేర్కొన్నారు.
'ప్రజలు మార్పు కోరుకుంటున్నారు'
డెమోక్రాట్లను ప్రమాదకరమైన కమ్యూనిస్టులుగా చిత్రీకరించేందుకు రిపబ్లికన్లు, ముఖ్యంగా ట్రంప్ చేసిన ప్రయత్నాలన్ని ఓటర్లను ప్రభావితం చేయలేకపోయాయి.
మిచిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ నగరంలో సొంతంగా హెయిర్‌డ్రెస్సింగ్ సెలూన్ నిర్వహిస్తున్న నికోల్ విలియమ్స్ వ్యాఖ్యలు ఓటర్ల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తోంది. "ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కంటే ఏదైనా మెరుగ్గానే ఉంటుంది. సోషలిస్టులా, వేరే వాళ్లా అనేది నాకు ముఖ్యం కాదు. నా జీవన వ్యయాన్ని తగ్గిస్తే చాలు" అని అన్నారు.
"అమెరికన్ల పట్ల కొనసాగుతున్న అవమానకర వైఖరితో ప్రజలు విసిగిపోయారు. ఆయన కూడా ఒక అమెరికనే" అని మిచిగన్ ఓటరు గ్వెన్ జాక్సన్ అన్నారు. మిచిగన్ నుంచి పోటీ చేస్తున్న డెమోక్రాటిక్ పార్టీ వామపక్ష సెనేట్ అభ్యర్థి అబ్దుల్ ఎల్-సయెద్ను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనపై ట్రంప్ పలుమార్లు విమర్శలు గుప్పించారు.
"ప్రజలు నిజంగానే అలసిపోయారు. ఇప్పుడు వారు మార్పును కోరుకుంటున్నారు" అని జాక్సన్ అన్నారు.
ప్రస్తుతం ట్రంప్ కంటే ఎక్కువ ప్రజాదరణ ఉన్న అధ్యక్షుల హయాంలో కూడా వారి పార్టీలు మధ్యంతర ఎన్నికల్లో సీట్లు కోల్పోయాయి. ఈ చరిత్రతో పాటు తాజా సర్వేలను పరిగణనలోకి తీసుకుంటే, కనీసం ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్)పై తమకు ఆధిపత్యం వస్తుందనే నమ్మకం డెమోక్రాట్లలో కనిపిస్తోంది.
"జీవన వ్యయం పెరగడం, అధికారికంగా ప్రకటించని యుద్ధం ఈ ఎన్నికల ప్రధాన అంశాలు" అని డెమోక్రాటిక్ వ్యూహకర్త మేరీ ఆన్ మార్ష్ అన్నారు.
ఒకవేళ డెమోక్రాట్లు ప్రతినిధుల సభను గెలుచుకుంటే, ట్రంప్ తీసుకురావాలనుకునే చట్టాలను అడ్డుకునే ప్రయత్నం చేయవచ్చు. అయితే అది ట్రంప్‌ను పెద్దగా ఆందోళనకు గురిచేయకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పటికే వీలైనంత వరకు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి, వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్ నుంచి కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేస్తూ పాలన నడపడానికి ప్రయత్నించారు.
అయితే హౌస్‌పై డెమోక్రాట్లకు నియంత్రణ లభిస్తే, వారు చేపట్టగల విచారణలే ట్రంప్‌కు ఎక్కువ ఆందోళన కలిగించే అంశంగా మారవచ్చు.
అలాగే ట్రంప్ మంత్రివర్గంలోని కొందరిపై అభిశంసన చర్యలకు కూడా డెమోక్రాట్లు ప్రయత్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై అలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా దిశను డిసైడ్ చేయనున్న ఎన్నికలు
డెమోక్రాట్లకు మంగళవారం జరిగే ఎన్నికల్లో సెనేట్‌పై ఆధిపత్యం సాధించడం మాత్రం అంత తేలికైన పని కాదు.
ఈసారి మొత్తం 35 సెనేట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సెనేట్‌పై నియంత్రణ సాధించాలంటే డెమోక్రాట్లు కనీసం నాలుగు అదనపు సీట్లు గెలవాలి. ప్రస్తుతం తమ వద్ద ఉన్న కీలక పోటీ రాష్ట్రం మిచిగన్‌లో ఓడిపోతే, నియంత్రణ కోసం వారికి ఐదు అదనపు సీట్లు అవసరం అవుతాయి.
పోటీ ఉన్న చాలా రాష్ట్రాల్లో ఇరు పార్టీల అభ్యర్థుల మధ్య తేడా చాలా స్వల్పంగా ఉంది. అనేక చోట్ల తాజా సర్వేలు కూడా గెలుపోటములను స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఫలితాలు సర్వేల మార్జిన్ ఆఫ్ ఎరర్లోనే ఉన్నాయి.
అందువల్ల ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా గమనించాల్సిన సెనేట్ పోటీలు మిచిగన్, టెక్సాస్, ఒహియో, అయోవా, మైన్, అలాస్కా, నార్త్ కరోలైనా రాష్ట్రాల్లో జరుగుతున్నవే.
ఈ రాష్ట్రాల్లో వచ్చే ఫలితాలే సెనేట్‌లో ఆధిపత్యం ఎవరి చేతికి వెళ్తుందో నిర్ణయించే అవకాశముంది. డెమోక్రాట్లు మెజారిటీ సాధిస్తారా, లేక రిపబ్లికన్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు సమాధానం ఈ రాష్ట్రాల ఓటర్ల చేతుల్లో ఉంది.
గతంలో అనేక సందర్భాల్లో సర్వేలు డెమోక్రాట్ల మద్దతును ఎక్కువగా అంచనా వేయగా, ట్రంప్‌కు లభించిన మద్దతును తక్కువగా అంచనా వేశాయి. ఈసారి కూడా తాను మరోసారి సర్వేల అంచనాలను తలకిందులు చేయగలనని ట్రంప్ విశ్వసిస్తున్నట్లు కనిపిస్తోంది.
కానీ డెమోక్రాట్లకు మద్దతు పెరుగుతోందని చెబుతున్న సర్వేలు దాదాపు సరైనవే అనుకుంటే, దశాబ్దాలుగా రిపబ్లికన్లకు కంచుకోటలుగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ట్రంప్ పార్టీకి చేదు ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఒకవేళ అలాంటి పరాజయాలు ఎదురైతే ట్రంప్ ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. ఎన్నికల భద్రత, విశ్వసనీయతపై ఆయన ఇప్పటికే పలుమార్లు సందేహాలు వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సమయంలో లేదా ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ఆయన మళ్లీ అదే ఆరోపణలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికన్లకు ఈ ఎన్నికలు ఎంతో ప్రాధాన్యమైన ఘట్టంగా నిలుస్తున్నాయి. రాబోయే రెండేళ్లలో దేశంలో నిజమైన మార్పులు చూడాలని కోరుకునే ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
అలాగే 2028 అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగే చివరి పెద్ద ఎన్నికల పరీక్ష కూడా ఇదే. ట్రంప్ అనంతర అమెరికా రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో నిర్ణయించే దిశగా ఈ ఎన్నికల ఫలితాలు కీలక సంకేతాలను ఇవ్వనున్నాయి.
ట్రంప్‌కు కూడా ఇవి ఒక విధంగా ప్రజా తీర్పు లాంటివే. ఆయన పాలన, ఆయన పార్టీ పనితీరు గురించి ఓటర్లు ఏమనుకుంటున్నారో ఈ ఫలితాలు స్పష్టం చేయనున్నాయి.
ఇక తన రాజకీయ వారసత్వాన్ని మలచుకునేందుకు మిగిలిన రెండేళ్లపై ట్రంప్ దృష్టి పెట్టిన వేళ, కాంగ్రెస్‌పై నియంత్రణ మారితే ఆయన అధికారానికి నిజంగా అడ్డుకట్ట పడుతుందా లేదా అన్నది మరో కీలక ప్రశ్నగా నిలిచింది. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు కాంగ్రెస్‌ను పెద్దగా పట్టించుకోకుండా కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా పాలన సాగించడానికి ప్రయత్నించారు. కాబట్టి కాంగ్రెస్‌లో మెజారిటీ మారినా, ట్రంప్ పాలనా శైలిపై దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందన్నది చూడాల్సి ఉంది.