మీరు ఈ వెబ్సైట్ యొక్క టెక్స్ట్-ఓన్లీ వెర్షన్‌ను చూస్తున్నారు, ఇది తక్కువ డేటాను వినియోగిస్తుంది. అన్ని చిత్రాలు మరియు వీడియోలతో కూడిన వెబ్సైట్ యొక్క ప్రధాన వెర్షన్‌ను చూడండి.
కువైట్‌ను ఆక్రమించుకుని సద్దాం హుస్సేన్ 'కొత్త దేశాన్ని' సృష్టించారు, కానీ అది 4 రోజులే ఎందుకు కొనసాగింది?
- రచయిత, వలీద్ బద్రన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
1990 ఆగస్టు 2న ఇరాక్ దళాలు ఒక్కసారిగా కువైట్‌లోకి ప్రవేశించాయి.
ఈ సైనిక చర్యకు అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఆదేశించారు. ఇది గల్ఫ్ ప్రాంతంలో ఒక అతిపెద్ద సంక్షోభానికి దారితీసి, ఆ తర్వాత రెండో గల్ఫ్ యుద్ధానికి కారణమైంది.
అయితే ఇరాక్, కువైట్ల మధ్య సంబంధాలు క్షీణించడం అకస్మాత్తుగా జరగలేదు. దీని వెనుక రాజకీయ, ఆర్థిక కారణాలతో సహా అనేక కారణాలు ఉన్నాయి.
1988లో ఇరాన్, ఇరాక్‌ల మధ్య యుద్ధం ముగిసిన తర్వాత, ఇరాక్ తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయింది.
యుద్ధ సమయంలో గల్ఫ్ దేశాలు ఇరాక్‌కు ఆర్థిక సహాయం అందించాయి. ఇందులో కువైట్, సౌదీ అరేబియాలు ముందున్నాయి. యుద్ధం ముగిసిన తర్వాత, ఇరాక్ తన అప్పును తిరిగి చెల్లించాలని కువైట్ డిమాండ్ చేసింది. దీని తర్వాతే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముదిరాయి.
ఈ నేపథ్యంలోనే, చమురు ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్ నిర్దేశించిన పరిమితి కంటే కువైట్ ఎక్కువ చమురును వెలికితీస్తోందని ఇరాక్ ఆరోపించింది. దీనివల్ల ప్రపంచ చమురు ధరలు పడిపోయాయని, దాంతో పాటు తమ ఆదాయాలు కూడా తగ్గాయని ఇరాక్ పేర్కొంది.
ఇరు దేశాల మధ్యనున్న రుమైలా చమురు క్షేత్రం నుంచి కువైట్ చమురును దొంగిలించిందని ఇరాక్ ఆరోపించింది. ఈ ఉద్రిక్తతల మధ్య సద్దాం హుస్సేన్ 1990 ఆగస్టు 2న కువైట్‌పై దాడి చేయాలని నిర్ణయించారు.
ఇరాక్ సైన్యం కువైట్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత, సద్దాం హుస్సేన్ బంధువైన అలీ హసన్ అల్-మజీద్‌ను అక్కడ సైనిక పాలకుడిగా నియమించారు.
ఆక్రమణను సమర్థించుకునే ప్రయత్నాలు
కువైట్‌ను ఆక్రమించుకున్న తర్వాత.. ఇరాక్ అధికారులు తమ చర్యలను చట్టబద్ధమైనవిగా, న్యాయబద్ధమైనవిగా చెప్పుకునేందుకు ప్రయత్నించారు.
ఈ ప్రయత్నంలో భాగంగానే.. స్వతంత్ర దేశమైన కువైట్ స్థానంలో ఒక కొత్త దేశాన్ని ప్రకటించారు. దానికి "రిపబ్లిక్ ఆఫ్ కువైట్" అని పేరు పెట్టారు.
1990 ఆగస్టు 4న కువైట్‌ను ఆక్రమించిన రెండు రోజుల తర్వాత, సద్దాం హుస్సేన్ "రిపబ్లిక్ ఆఫ్ కువైట్" ఏర్పాటును ప్రకటించారు.
ఇది ఒక స్వతంత్ర దేశమని, ఇక్కడ 'ప్రజా విప్లవం' జరగడంతో ఇది ఏర్పడిందని ఆయన చెప్పారు. ఈ విషయం రజా హసన్ మినావి రాసిన 'కువైట్, అటాక్, ఫ్రీడమ్' అనే పుస్తకంలో ప్రస్తావించారు.
అక్కడి అసలు పరిస్థితిని పట్టించుకోనివ్వకుండా ప్రపంచం దృష్టిని మళ్లించడమే సద్దాం హుస్సేన్ చేసిన ఈ ప్రకటన వెనుక ఉద్దేశ్యమని నిపుణులు, చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.
కువైట్‌ను ఇరాక్‌లో విలీనం చేస్తున్నట్లు సద్దాం హుస్సేన్ నేరుగా మొదటి రోజే ప్రకటించలేదు. బదులుగా, కువైట్ ప్రజలు తమ సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని చిత్రీకరించడానికి ఇరాక్ ప్రభుత్వం ప్రయత్నించింది.
విదేశీ శక్తుల ఆదేశాల మేరకు పనిచేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కువైట్ ప్రజలు "ఇంటర్నల్ రివల్యూషన్"కు (అంతర్గత విప్లవానికి) దిగారని ఇరాక్ ప్రభుత్వం పేర్కొంది.
అరబ్ దేశాల ముందు, ప్రపంచం ముందు ఆ దాడిని సమర్థించుకోవడానికి ఆ సమయంలో ఇరాక్ మీడియా ఇలాంటి విషయాలనే చెప్పింది.
తొమ్మిది మందితో తాత్కాలిక ప్రభుత్వం
ఈ కొత్త దేశం 'స్వతంత్ర కువైట్ తాత్కాలిక ప్రభుత్వం' ఏర్పాటుతో ప్రారంభమైంది.
ఈ ప్రభుత్వంలో ఇరాక్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లు చెబుతున్న తొమ్మిది మంది కువైట్ మాజీ సైనికాధికారులు ఉన్నారు.
కల్నల్ అలా హుస్సేన్ అలీ అల్-ఖఫాజీ అల్-జాబెర్ ప్రధానమంత్రిగా, సైన్యాధిపతిగా నియమితులయ్యారు. ఆయనకే రక్షణ, హోంశాఖ బాధ్యతలను కూడా అప్పగించారు.
లెఫ్టినెంట్ కల్నల్ వలీద్ సౌద్ మహమ్మద్ అబ్దుల్లా విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు.
ఆర్థిక, చమురు శాఖ మంత్రిగా లెఫ్టినెంట్ కల్నల్ ఫువాద్ హుస్సేన్ అహ్మద్, సమాచార, రవాణా శాఖ మంత్రిగా మేజర్ ఫాదిల్ హైదర్ అల్-వాఫిఖీ, సామాజిక వ్యవహారాల మంత్రిగా లెఫ్టినెంట్ కల్నల్ హుస్సేన్ దహైమాన్ అల్-షమ్మరి నియమితులయ్యారు.
రజా హసన్ మినావి రాసిన 'కువైట్, అటాక్, ఫ్రీడమ్' ప్రకారం.. అలా హుస్సేన్ 1948లో కువైట్‌లో పుట్టారు.
బాగ్దాద్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు, ఆయన ఇరాకీ బాత్ పార్టీలో చేరారు. ఆయన కువైట్ సైన్యంలో అధికారిగా కూడా పనిచేశారు.
కువైట్ ప్రభుత్వ టెలివిజన్‌ను కూడా ఇరాకీ సైన్యం స్వాధీనం చేసుకుంది.
అదే టెలివిజన్‌లో అలా హుస్సేన్ చేసిన ఒక వీడియో ప్రకటనను ప్రసారం చేశారు.
అందులో ఆయన కొత్త ప్రభుత్వం ఏర్పాటును ప్రకటించి, దానికి మద్దతు ఇవ్వాలని కువైట్ ప్రజలను కోరారు.
కొత్త ప్రభుత్వం చేసిన ప్రకటనలేంటి?
కొత్త ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలను ప్రకటించింది. వాటిని ''విప్లవాత్మక నిర్ణయాలు''గా అభివర్ణించింది.
పాశ్చాత్య కంపెనీలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవడం, కువైట్ పాలక కుటుంబాల ఆస్తులను జప్తు చేయడం వంటివి ఇందులో ఉన్నాయి.
కువైట్ పార్లమెంటును రద్దు చేసి, కువైట్ రాచరికాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చనున్నట్లు కూడా ప్రకటించారు.
ఆ సమయంలో, కువైట్‌లో నివసిస్తున్న అరబ్ పౌరులందరికీ పౌరసత్వం ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించారు.
కానీ, ఈ ప్రభుత్వానికి నిజానికి ఎలాంటి అధికారం లేదు. అది కేవలం ఒక నామమాత్రపు ప్రభుత్వం. కువైట్‌ను విలీనం చేసుకోవాలనే తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి ఇరాక్ ప్రభుత్వమే దీన్ని ఏర్పాటు చేసిందని కొందరు వాదించారు.
కువైట్ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అంగీకరించలేదు. కువైట్ ప్రతిపక్షం కూడా దీనికి మద్దతు ఇవ్వడానికి నిరాకరించింది.
నాలుగు రోజుల్లోనే కుప్పకూలిన రిపబ్లిక్ ఆఫ్ కువైట్
ఈ తాత్కాలిక ప్రభుత్వం కేవలం నాలుగు రోజులే నిలిచింది. 1990 ఆగస్టు 8న సద్దాం హుస్సేన్ కువైట్‌ను అధికారికంగా ఇరాక్‌లో విలీనం చేశారు. కువైట్ తాత్కాలిక ప్రభుత్వం తనను అలా చేయమని కోరిందని ఆయన పేర్కొన్నారు.
దీని తర్వాత, ఈ తాత్కాలిక ప్రభుత్వానికి ఇకపై ఎలాంటి చట్టపరమైన అర్థం లేకుండా పోయింది.
1990 ఆగస్టు 28న "కువైట్ ప్రావిన్స్"ను ఏర్పాటు చేస్తూ ఒక ఉత్తర్వు జారీ చేశారు.
దీన్ని ఇరాక్ 19వ ప్రావిన్స్‌గా ప్రకటించి, మూడు ప్రాంతాలుగా విభజించారు.
వీటిలో కువైట్ రాజధాని అయిన కజిమా, అల్-జహ్రా, అల్-అహ్మదీ రాజధాని అల్-నిదా ఉన్నాయి.
తాత్కాలిక ప్రభుత్వాన్ని రద్దు అయిన తర్వాత.. అలా హుస్సేన్ అలీని ఇరాక్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్‌గా సద్దాం హుస్సేన్ నియమించారు.
తాత్కాలిక ప్రభుత్వంలోని మిగిలిన మంత్రులను అధ్యక్ష కార్యాలయంలో మంత్రి హోదాతో సలహాదారులుగా నియమించారు.
ఇరాకీ ప్రావిన్స్‌గా మారిన కువైట్
ప్రావిన్స్‌గా మార్చిన తర్వాత ఇరాకీ సైన్యం కువైట్ అంతటా తమ దేశ చట్టాలను అమలు చేయడం ప్రారంభించింది.
పాఠ్యపుస్తకాలు, పాఠ్యాంశాలు మార్చారు. కువైట్ కరెన్సీ స్థానంలో మరొకటి ప్రవేశపెట్టారు. స్థానిక వార్తాపత్రికలు నిషేధించారు.
కువైట్‌లోని విదేశీ రాయబార కార్యాలయాలను మూసివేసి, చాలామంది దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరించారు. స్థానిక ప్రజలపై కఠినమైన ఆంక్షలు విధించారు.
ప్రజలను భయపెట్టడానికి కొట్టడం, అరెస్టులు, మరణశిక్ష వంటి పద్ధతులను అవలంబించారు.
అలా ఇరాకీ సైన్యం కువైటీ ప్రజల జీవితాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంది.
"కువైట్ తన మాతృభూమికి తిరిగి వచ్చింది" అని సద్దాం హుస్సేన్ అన్నారు.
''రిపబ్లిక్ ఆఫ్ కువైట్'' ప్రకటన అనేది ''ఇరాక్ చేపట్టిన ఒక రాజకీయ డ్రామా, ఉద్దేశపూర్వక ఎత్తుగడ'' అని చాలామంది చరిత్రకారులు, రాజకీయ నిపుణులు భావించారు.
తొలిరోజే ఇరాక్ నేరుగా కువైట్‌ను విలీనం చేసుకున్నట్లు ప్రకటిస్తే.. ప్రపంచం నుంచి తీవ్ర ప్రతిస్పందన వస్తుందని ఇరాకీ నాయకత్వానికి తెలుసు.
అందుకే, ముందు ఇదంతా కువైట్ ప్రజల అంతర్గత విప్లవమని పేర్కొని, ఆ తర్వాత అదే ప్రభుత్వం ఇరాక్‌లో చేరేందుకు డిమాండ్ చేసిందని తెలిపింది.
ఆంక్షలు విధించిన ఐక్యరాజ్యసమితి
కువైట్‌ను ఇరాక్ ఆక్రమించుకోవడాన్ని ఐక్యరాజ్యసమితి ఖండించింది. 1990 ఆగస్టు 6న ఇరాక్‌పై ఆంక్షలు ప్రారంభించింది. ఆ తర్వాత.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రిజల్యూషన్ నెంబర్.678పై నవంబర్ 29న ఓటింగ్ జరిగింది.
ఈ తీర్మానం ఇరాక్‌పై సైనిక చర్యకు ఆమోదం తెలిపింది. కువైట్ నుంచి వైదొలగడానికి 1991 జనవరి 15 అర్ధరాత్రి వరకు ఇరాక్‌కు గడువు ఇచ్చారు.
1991 జనవరి ప్రారంభంలో, యుద్ధం లేకుండా సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కానీ, రోజులు గడిచేకొద్దీ యుద్ధ భయం పెరిగింది.
ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అరబ్ దేశాలు చేపట్టిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సద్దాం హుస్సేన్‌తో అప్పటి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ జేవియర్ పెరెజ్ డి క్యూల్లార్ సమావేశమయ్యారు.
అయితే, కువైట్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి సద్దాం హుస్సేన్‌ను జేవియర్ ఒప్పించలేకపోయారు. కనీసం వారి ఉపసంహరణపై చర్చలు కూడా జరపలేకపోయారు.
1991 జనవరి 9న, అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి జేమ్స్ బేకర్, ఇరాక్ విదేశాంగ మంత్రి తారిఖ్ అజీజ్ మధ్య చర్చలు జరిగాయి.
అయితే ఈ చర్చలు కూడా విఫలమయ్యాయి.
జనవరి 12న ఇరాక్‌పై యుద్ధం మొదలు పెట్టే తీర్మానాన్ని అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది.
34 దేశాల కూటమి దాడి
కువైట్‌ను ఇరాక్ కొన్ని నెలల పాటు ఆక్రమించుకుంది. దీని తర్వాత, అమెరికా నేతృత్వంలోని 34 దేశాల కూటమి ఇరాక్ ఆక్రమణ నుంచి కువైట్‌ను విడిపించడానికి సైనిక చర్య చేపట్టాలని నిర్ణయించింది.
ఈ ఆపరేషన్ 1991 జనవరి 16న 'ఆపరేషన్ డజర్ట్ స్టార్మ్' అనే పేరుతో మొదలైంది.
1991 ఫిబ్రవరిలో ఇరాక్ ఆక్రమణ నుంచి కువైట్ పూర్తిగా విముక్తి పొందింది.
తీవ్రమైన సైనిక ఒత్తిడి అనంతరం ఇరాకీ సైన్యం కువైట్ నుంచి వైదొలిగింది.
కానీ అది వెళ్లేదారిలో, చమురు బావులకు నిప్పంటించి, కీలకమైన మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తూ, తీవ్రమైన విధ్వంసాన్ని సృష్టించింది.
1991 మార్చి 14న, కువైట్ అమీర్ షేక్ జాబెర్ అల్-అహ్మద్ అల్-సబా తన దేశానికి తిరిగి వచ్చారు.
అప్పట్లో ఆయన కొన్ని నెలలపాటు సౌదీ అరేబియా నుంచి తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపారు.
కువైట్ స్వాతంత్య్రం పొందిన తర్వాత.. ఇరాక్‌కు మద్దతు ఇచ్చిన తాత్కాలిక ప్రభుత్వ సభ్యులందరూ తిరిగి వచ్చారు.
అలా హుస్సేన్ తప్ప.. మిగిలిన సభ్యులందరూ 1991 ఏప్రిల్ 27న కువైట్‌కు వచ్చారు.
తాత్కాలిక ప్రభుత్వానికి అధినేతగా వ్యవహరించిన అలా హుస్సేన్ అలీ.. 1998లో ఇరాక్ నుంచి తుర్కియే పారిపోయారు. ఆ తర్వాత నార్వే చేరుకున్నారు. 2000లో తిరిగి కువైట్ వచ్చి, అథారిటీల ముందు లొంగిపోయారు.
ఇరాక్‌కు మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణ నుంచి తాను నిర్దోషినని నిరూపించుకోవాలనుకుంటున్నానని ఆయన అన్నారు.
దేశద్రోహం ఆరోపణలపై ఆయనపై విచారణ జరిపి, మరణశిక్ష విధించారు.
అయితే, ఆ తర్వాత ఆయన శిక్షను యావజ్జీవ కారాగార శిక్షకు తగ్గించారు.
అలా హుస్సేన్ కోర్టు ముందు మాట్లాడుతూ, "మరొక దేశం ఆదేశాల మేరకు" ఒక ప్రభుత్వానికి అధిపతిగా మారమని ఇరాక్ అధికారులు తనను బలవంతం చేశారని చెప్పారు.
అప్పగించిన బాధ్యతను నెరవేర్చకపోతే, తన కుటుంబాన్ని నిర్బంధించి చంపేస్తామని ఇరాకీ అధికారులు బెదిరించారని ఆయన తెలిపారు.
వందలమంది యుద్ధ ఖైదీలలోంచి ఇరాక్ అధికారులు తనను కువైట్ ప్రభుత్వానికి అధిపతిగా ఎందుకు ఎంచుకున్నారో ఇప్పటికీ తనకు తెలియదని ఆయన అన్నారు.
యుద్ధం తర్వాత 1998 వరకు ఇరాక్‌లోనే ఉండాలని ఇరాక్ అధికారులు తనను బలవంతం చేశారని కూడా ఆయన చెప్పారు.
"స్వతంత్ర కువైట్ తాత్కాలిక ప్రభుత్వం" ఎలాంటి చట్టాలను రూపొందించలేదు.
అది ప్రభుత్వాన్ని నిర్వహించలేదు. ఇతర దేశాలతో సంబంధాలు కూడా ఏర్పరచుకోలేదు. దానికి ఇతర దేశాలతో గానీ, అంతర్జాతీయ సంస్థలతో గానీ ఎలాంటి సంబంధాలు లేవు.
ఈ ప్రభుత్వం కేవలం నాలుగు రోజులు మాత్రమే కొనసాగినప్పటికీ, దానితో ముడిపడి ఉన్న చేదు జ్ఞాపకాలు కువైట్ ప్రజల మనసుల్లో నిలిచిపోయాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)